🔱*అరుణాచలుని ఆవిర్భావము* 🔱
లింగోద్భవ సమయంలో.... తమిళనాడులోని అరుణాచలంలో....
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అగ్ని లింగోద్భవం ( అగ్ని లింగం గా.. బ్రహ్మ.,విష్ణువుల మధ్య ఆవిర్భవించిన పుణ్య ప్రదేశం అరుణాచలము )
శివరాత్రి అర్ధరాత్రి సమయం లో...
అరుణాచలం లో అరుణచలేశ్వరుడిగర్భ ఆలయం..
వెనక వైపున మహ శివరాత్రి రోజున....
లింగోద్భవ సమయంలో...
అగ్ని లింగం ఆవిర్భావానికి సంబంధించిన పూజలు ఇక్కడ నిర్వహిస్తారు.
అరుణాచల సన్నిధిలో అంతరాలయం వెనక భాగంలో ఉండే ఈ లింగోద్భవ మూర్తికి ప్రత్యెక అభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ మూర్తిని మనం పరిశీలిస్తే... అగ్ని స్తంభ రుపంలో పరమేశ్వరుడు మరియు దాని యొక్క ఆద్యంతాలను గమనించడం కోసం ఊర్ధ్వ దిశలో హంస రూపంలో వెళ్లిన బ్రహ్మ అధో దిశలో వరాహ రూపంలో వెళ్ళిన విష్ణు మూర్తి యొక్క రూపాలను గమనించ వచ్చు. ఇటువంటి మూర్తిని గురించి దర్శించి ఇతరులకు ఈ విషయాన్ని తెలియ జేయండి.
ఆ పరమేశ్వరుని అగ్ని లింగోద్భవానికి ప్రత్యక్ష సాక్షి అరుణాచల మే... నేటికీ మన కనుల ఎదుట ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది *లింగోద్భవ కాలం*
శివుడు లింగ రూపంలో ఉద్భవించిన కాలాన్ని లింగోద్భావకాలం అంటారు . శంకరుడు శివరాత్రి పర్వదినము రోజున లింగరూపంలో ఉద్భవించాడు .
అభిషేక ప్రియః శివః అని పెద్దలు అంటారు . అనగా శివుడు అభిషేక ప్రియుడు అని అర్ధం .
ఇది వరకే మనం చాలాసార్లు చెప్పుకున్న విధముగా శివుడు బోలా శంకరుడు . తెలిసో,తెలీకో వుద్దరినుడు నీటిని లింగం మీద పోస్తే చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు . అదే శివుడికి ఇష్టమైన సోమవారం రోజునో లేక ఆయన జన్మ నక్షిత్రం రోజునో అభిషేకం చేయించుకున్నా లేక వారే స్వయం గా ఇంట్లో అభిషేకం చేసుకున్నా ఫలితం అద్వితీయం గా వుంటుంది . అదే లింగోద్భవ కాలంలో కనుక అభిషేకం చేయించుకున్నా,చేసుకున్నా మామూలు రోజులలో చేసే అభిషేకానికి కొన్ని వేల రెట్లు అధికంగా ఫలితము,పుణ్యము లభిస్తాయి అనడంలో మాత్రం ఏమి సందేహం లేదు .
🔱*అరుణాచలుని ఆవిర్భావము*✨
ఏకమై, అద్వితీయమై విరాజిల్లే "కురుణా సముద్రుడగు పరమేశ్వరునకు ఒకమారు తాను అనేకము కావాలనే సంకల్పము కలిగింది. ఆ సంకల్పానుసారం పరమాత్మనుండి బ్రహ్మవిష్ణువులు పుట్టారు. బ్రహ్మదేవుడు లోకాలను సృజించుటకు, విష్ణువు వాటిని రక్షించుటకు పరమేశ్వరునిచే నియమితులయ్యారు. ఐతే, పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణువులు తమవిధులను నిర్వహించుటకు బదులుగా ఒకమారు అహంకారపూరితులై "నేను గొప్పయంటే, నేను గొప్ప" యని పరస్పరము పోట్లాడుకోసాగారు. వారి తగువును సాక్షీస్వరూపుడైన పరమేశ్వరుడు చూశాడు. ఇట్లను కొన్నాడు "నేను వెంటనే వీరి తగువును మాన్పాలి. లేనియెడల సృష్టికార్యమునకు ఆటంకము కలుగును. నాశక్తి అంతటా నిండియున్నది. ఈశక్తియే సృష్టికి మూలము. దీనిని మించినది లేనేలేదు. ఇది వేదసమ్మతమైన వైదిక సత్యము. ఈ ధర్మాన్ని బ్రహ్మవిష్ణువులు అహంకారము చేత ఆవేశపూరితులై మరచి పోయారు. తామే అధికులమన్నట్లు భావించి పరస్పరము పోట్లాడుకొంటున్నారు. ఇది తగనిపని. ఈసృష్టిలో ప్రతిపాణి అణుకువ కలిగియుండాలి. తమకంటే శ్రేష్టతమములైనవి ఎన్నియో వున్నాయని సమ్మతించాలి. ఇతరుల సమానత్వమును గానీ, ఆధిఖ్యతనుగానీ సమ్మతింపనివాడు నిజముగా అజ్ఞాని. అట్టివాడు తప్పక ఆపదలలో చిక్కుకొనును. పరాభవమును పొందును. పతనమౌను. ఈ ధర్మసూక్ష్మాన్ని బ్రహ్మవిష్ణువుల మూలంగా లోకాలకు తెలియజేయాలి. నన్ను తలచినంత మాత్రాన అల్పులను కూడా తరింపజేస్తూ ఈవిశ్వములో ఏదోయొకచోట ప్రత్యేకరూపాన్ని ధరించి వుండిపోవాలనే కోరిక నాకుండేది. ఇప్పుడు అందుకు తగిన సమయము వచ్చింది” అని పరమశివుడు నిశ్చయించుకొని తేజోవంతమైన జ్యోతిస్పంభముగా కలహించుకొనే చూచి బ్రహ్మవిష్ణువుల మధ్యనిలిచాడు.
అనంతమైన ఆదివ్య తేజస్తంభాన్ని బ్రహ్మవిష్ణువులు చూశారు. భయకంపితులై ఊరక చూస్తూవుండిపోయారు. ఇంతలో అందుండి దేవవాణి వినిపించింది. “ఓ కుమారులారా! ఎందుకు ఈ బుద్ధిమాలిన తగవు? మీ బలాబలాలు పరమేశ్వరునకు తెలుసు. మీయెదుట తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతిస్త్సంభము ఏదోకాదు. ఇది పరమశివుని యొక్క స్వరూపము. దీని ఆద్యంతములను మీలో ఎవరు కనుగొందురో వారే గొప్పవారు" అన్న పరమేశ్వరుని పలుకులు విని బ్రహ్మ విష్ణువులు కలహమును మాని నీటిలో కనిపించే చంద్రబింబమును పట్టుకొనుటకు ప్రయత్నించే మూఢుల్లాగా ఆ స్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు సిద్ధమయ్యారు. తమ బలాబలాలను నిరూపించుకొనుటకు పూనుకొన్నారు. అంతేగానీ! పరమేశ్వరుని స్తుతించాలను తలంపే వారికి కలుగలేదు. ఇక వారు భూమిని కేంద్రంగా తీసుకొన్నారు. విష్ణువు తేజస్సంభము యొక్క అంతమును కనుగొనుటకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఆయన వరాహరూపమును ధరించాడు. భూమిని త్రవ్వుకుంటూ దాని వెంట పోయాడు. పోవుకొలది ఆజ్యోతిస్త్సంభము క్రిందకు అనంతంగా వ్యాపించిపోతూనే వుంది. లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయత్నించాడు. చివరకు బలము తగ్గింది. అలసట హెచ్చింది. శరీరము పూర్తిగా డస్సింది. వెనుకకు తిరిగి వచ్చుటకు కూడా శక్తిలేదు. ఈవిధంగా విష్ణువు ఆపదలో చిక్కుకొన్నాడు. ఇప్పుడు ఆహంభావనంతా పోయింది. వెంటనే పరమేశ్వరుని ఎఱుక విష్ణువునకు కలిగింది. అప్పుడు తనలోతాను ఇట్లనుకొన్నాడు. "ఆహా! ఏమి ఈయహముయొక్క మాయ. దీనిచేత ఆదిదైవతమై, ద్రష్టగా నాలో వెలిగే పరమేశ్వరున్నే మరచిపోయాను. ఈసృష్టినంతా నేనే రక్షిస్తున్నాను. దీనికి కర్తను నేనే నాకంటే అధికుడు లేడని గర్వించాను. “నేను, నాది” అనే అహంతత్వముతో పరమేశ్వరున్ని పూర్తిగా మరచి పోయాను. నిజంగా దేవతలకు, వేదాలకు, సమస్తవిశ్వానికి ఆధారము ఆపరమాత్మ ఒక్కడే. ఆపరమేశ్వరుడే ఆదిదైవము. నేను అజ్ఞానము చేత అసహ్యమైన పందిరూపమును ధరించి అనంతుడైన ప్రేమ శివుని అంతము కనుగొనుటకు ప్రయత్నించానే! ఇది సాధ్యమా! ఇది కేవలం పరమేశ్వరుని అనుగ్రహము చేతనే సాధ్యము. ఇప్పుడు సత్యము తెలియవచ్చినది. పరమశివుడు తనభక్తున్ని రక్షించాలని తలచినంత మాత్రాన ఆభక్తునిలోని అహము పారిపోతుంది. ముక్తి లభిస్తుంది. ఇది ముమ్మాటికీ సత్యము ఇప్పుడు ఈతేజస్తంభమును పూజించాలంటే నాకు తగిన శక్తిగానీ, సమయంగానీ లేదు. ఆయనకు శరణుజొచ్చుటే తగిన పని” అని నిశ్చయించుకొని తనలో తాను మునిగి పరమేశ్వరున్ని ధ్యానించాడు. శరణుజొచ్చాడు. అంత కరుణా సముద్రమైన పరమేశ్వరుడు విష్ణువును అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు.
ఇక బ్రహ్మ హంసరూపమును ధరించి తేజస్తంభము యొక్క మొదలును కనుగొనుటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు. కానీ ప్రయోజనము లేదు. ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయాయి. ఆయాసము హెచ్చింది. ఇంద్రియాల బలము బాగా తగ్గింది. చూపు కనిపించడం లేదు. తాను ఎత్తుకు పోవుకొలది ఆతేజము ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే వున్నది. ఇంత జరిగినా బ్రహ్మ మాత్రము తన ప్రయత్నాన్ని మానలేదు. గగనానయున్న సిద్ధ పురుషులు, బ్రహ్మయవస్థను, పట్టుదలను చూశారు. విస్తుపోయారు. వారు ఈవిధంగా అనుకొన్నారు. “ఏమి ఈ బ్రహ్మఅహంకారపు వ్యర్ధపు ప్రయత్నము! శరీరము పడిపోవుటకు సిద్ధంగా వున్నది. ఐతే, ఆయనలోని అహంకాము చావలేదు. అందుకే ప్రయత్నము మానలేదు. నిజంగా శివస్వరూపానికి ఆద్యంతములు లేవు. అందుచేత దానిని కొలవడానికి ఎవరికినీ సాధ్మము కాదు. కానీ, అహంకారము తొలగినపుడు ఆయన అనంతమైన తత్త్వము తెలియవస్తుంది. పరమేశ్వరుని స్వరూపమైన ఈ తేజోరాశి ఆద్యంతములు తెలియాలంటే మొదట తనలో తాను మునిగి పరమేశ్వరుని ధ్యానించాలి. ఆయన కరుణతో అహం అంతమౌతుంది. అప్పుడు ఆత్మస్వరూపము తెలియవస్తుంది. ఆస్వరూపము ఏదోకాదు అది పరమేశ్వరుని స్వరూపమే. అప్పుడు మాత్రమే తేజస్తంభము యొక్క అవధులను తెలుసుకొన్నవాడౌతాడు." అని సిద్ధపురుషులు చర్చించుకొనుచుండగా వారి పలుకులను బ్రహ్మ విన్నాడు. వెంటనే జ్రాగ్రత్త కలిగింది. తన జన్మకు మరియు సృష్టికి కారణమైన పరమేశ్వరుని ఎఱుక కలిగింది. తనపొరబాటునకు వగచి ఇట్లనుకొన్నాడు. "ఆహా! ఏమివింత! పరమేశ్వరుని సంకల్పము వలన మేము పుట్టాము. ఆయన కరుణచేతనే ఈవిశ్వాన్ని సృష్టించి రక్షిస్తున్నాము. ఇదంతా పరమేశ్వరుని లీలావిలాసమనీ, ఆయనే సమస్తానికి ఆధారమని మరచి అహంకారముతో ఏకమై మేమే కర్తలమన్నట్లు భావించి పోట్లాడుకొన్నాము. మా అహంకారమును పోగొట్టి పరమాత్మసమ్మతమైన విధేయతను కలింగించుటకే ఈశ్వరుడు జ్యోతిస్తంభముగా మాయేదుట నిలిచాడు. నిజంగా మా జన్మలు ధన్యమయ్యాయి" అని గ్రహించి బ్రహ్మ వేదమంత్రాలతో పరమశివున్ని స్తుతించాడు. తరువాత ఆత్మనిష్ఠతో పరమేశ్వరుని శరణంది ఆయన కరుణకు పాత్రుడై తిరిగి భూకేంద్రాన్ని చేరుకొన్నాడు.
ఇదంతా స్కాందపురాణ పూర్వభాగమందు వివరింపబడెను. నందికేశ్వరుడు లింగపురాణములో మాత్రము బ్రహ్మ ప్రయత్నమును గూర్చి కొంచెము విభిన్నంగా వివరించాడు. అదేమనగా :- బ్రహ్మ తేజస్సంభపు అంతమును కనుగొనలేక నీరసించి పోయాడు. ఇంతలో గగనతలము నుండి వస్తున్న మొగలిరేకు మరియు కపిలగోవు బ్రహ్మకు కనిపించాయి. వారిని చూచి బ్రహ్మ, “మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు?" అని ప్రశ్నించెను. నేను మొగలిపూవును సుగంధ సంభరితమైన దానిని. ఇదేమో గోవు. మేమిరువురము శివుని ఆజ్ఞానుసారము చాలా కాలము నుండి శివస్వరూపమైన తేజస్తంభము తలమీద వుండేవారము. ప్రపంచాన్ని చూడాలని ఆశపడి అటనుండి క్రిందకు వస్తున్నాము.." అని కేతకి సమాధాన మిచ్చెను. “ఐతే, ఈ స్తంభపు అంతము ఇచ్చటకు ఎంత దూరమున వుండును." అని బ్రహ్మ అడిగెను. అంత మొగలి వూవు నవ్వి, "నీవెవరవు? ఏమీ తెలియనట్లున్నావు. ఈ శివస్వరూపానికి ఆదిగాని, అంతముగాని లేదు. బ్రహాండములన్నీ ఇందులో వున్నాయి. దీని స్వరూపము అనంతము. లెక్కింప సాధ్యము కాదు. మేము క్రిందకు బయలు దేరి ఇప్పటికి కొన్నివేల చాతుర్యుగాలు గడచి పోయాయి. కానీ భూకేంద్రాన్ని చేరలేకున్నాము” అనెను. అంత బ్రహ్మసంతోషించి వారికి నమస్కరించి ఇట్లనెను. “ఓదివ్య స్వరూపులారా! నేను బ్రహ్మను. సృష్టికర్తను. అహంకారముతో విష్ణువునకు, నాకు తగవు ఏర్పడింది. అందుచే పరమేశ్వరుని మహిమను మరచిపోయాము. మా బలాలాలను నిరూపించుకొనుటకు ఈ తేజస్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు పూనుకొన్నాము. విష్ణువైతే వరాహరూపము ధరించాడు. నేను హంసరూపం ధరించాను. విష్ణువు సంగతి ఏమియోగాని, నేను మాత్రం తేజస్సంభపు అంతమును కనుగొనుటకు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ప్రయాణము సాగిస్తున్నాను. ఫలితము శూన్యము. శక్తి పూర్తిగా చచ్చిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితిలో మీతో కలవడం సంభవించింది. నేను నిస్సహాయుడను. నాకు దిక్కెవరూ లేరు. మీరే నాకు రక్ష. నాకోరికను మన్నించండి. విష్ణువు స్తంభపు అంతమును కనుగొనెనా నేను ఓడిపోవుదును. కనుగొనలేక పోయెనా మేమిద్దరమూ సమాన మగుదుము. ఈరెండూ నాకు ఇష్టము కాదు. అందుచేత మీరిద్దరూ నాకు సాయం చేయాలి. మీరు శివుని శిరముపై వుండేవారు కదా! ఈ తేస్తంభపు శిఖరమును నేను చూచినట్లుగా మీరు సాక్ష్యమివ్వండి దాని చేత నేను విష్ణువు కంటే అధికుడనగుదును” అని వారిని ప్రార్ధించి సమ్మతింపజేసెను.
బ్రహ్మదేవుడు వారితో కలసి వెనుదిరిగి వచ్చెను. విష్ణువు జ్యోతిస్సంభవు ఆదిని కనలేక పోయానని తన ఓటమిని అంగీకరించెను. ఐతే బ్రహ్మ మాత్రము తాను అంతమును చూడగలిగితినని అసత్యము పల్కెను. అందుకు మొగలిపూవు ఔను అని మరియు కపిల నోటితో ఔనంచూ తోకెత్తి కాదని అడ్డముగా కదల్చినది. అప్పుడు సదాశివుడు జ్యోతిస్సంభము నుండి ప్రత్యక్షమై అసత్యము పల్కినందులకు నీకు పూజలుండవని బ్రహ్మను శాసించెను. నా పూజకు పనికి రావని మొగలి పూవును నిరసించెను. గోవు అబద్దమాడినందులకు పూర్వభాగము అపావనమని మరియు మొదటి పూజకు అనర్హమనీ, ఐతే సత్యమును సూచించిన వెనుక భాగము పూజార్హమని, అందలి యోని సంచితము. గోమయము పావనులని కరుణించి వల్కెను. విష్ణువు యొక్క సత్యవాక్కునకు మెచ్చి పరమశివుడు తన సుదర్శన చక్రమును విష్ణువునకు బహూకరించెను ఇక బ్రహ్మవిష్ణువులు ఇరువురు శివపరమాత్మకు శణాగతులైరి.
ఇప్పుడు బ్రహ్మవిష్ణువులు ఇద్దరూ కలసి పరమశివున్ని ఈవిధంగా ప్రార్ధించారు. “ఓ తేజోమూర్తి! పరమశివా! భూమ్యాకాశములు మరియు పాతాళములందు అనంతంగా వ్యాపించే తమ తోజోరాశిని మేము చూడలేము. కావున దయచేసి తమ తేజోమయశక్తిని భూమిపైకి మరల్చి పరిమితము చేయండి” అని ప్రార్ధింపగా దయామయుడు భక్తసులభుడైన సదాశివుడు వారి ప్రార్ధనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనుకకు మరల్చి పరిమితమైన తేజస్తంభముగా భూమిమీద అవతరించాడు.
మార్గశిరమాసంలో (డిశెంబరు-జనవరి) ఆరుద్ర నక్షత్రమునాడు పరమేశ్వరుడు ఆజ్యోతిస్త్సంభముగా ధరలో వెలశాడు, బ్రహ్మవిష్ణువులు సర్వదేవతలు, సిద్ధులు, మునీశ్వరులు మున్నగువారందరు ఆకాంతిసంభాన్ని వేదోచితంగా ప్రస్తుతించారు. వైభవంగా పూజలు చేశారు. వారి పూజలను మన్నించి పరమశివుడు మాఘమాసంలో (ఫిబ్రవరి-మార్చి) చతుర్దశినాడు (పున్నము పోయిన తరువాత 14వ దినము) అందుండి వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆరూపము చాలా మనోహరమైనది. ప్రకాశవంతమైన తెల్లని శరీరచ్ఛాయ, జడలు మరియు రుద్రాక్షమాలలను ధరించి, ఫాలమందు మూడు విభూతి రేఖలు మరియు వాటి మీద సుగంధ పరిమళమైన కస్తూరికా బొట్టు, మెడలో సత్త్వసంపన్నమైన సర్పాభరణము, ఒక చేతిలో త్రిశూల ఢమరకాలు, దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణను సూచించే అభయహస్తం, సిగలో నెలవంక మరియు పలుచని వస్త్రమును ధరించి మురిపాల ముక్కంటి వారికి దర్శనమిచ్చాడు. వరములు కోరుకోమన్నాడు. అప్పుడు బ్రహ్మవిష్ణువులు పరమశివున్ని ఈ విధంగా ప్రార్ధించారు “ఓ ప్రభు! సర్వవ్యాపకా! పరమేశ్వరా! ఈ తేజస్తంభము యొక్క ప్రకాశము అమితమైనది. ఈదివ్యతేజోకాంతిని లోకాలు చూడలేవు. ఈతేజస్సును చూడటానికి భౌతిక నేత్రాలు పనికి రావు. అందుచే ఓవిశ్వరూపా! పరమశిమా! మమ్ము కరుణించి లోక కళ్యాణము కోసము ఈకాంతికి మారుగా మనోహరమైన లింగాకృతి గల కదలని కొండగా “అరుణాచలము” అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి. మీనన్నిధి మాత్రాననే అందరి భవరోగాలను తొలగించండి. కోరికలను తీర్చండి. సుఖాలనివ్వండి. కావలసిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి" అని. అంత శివపరమాత్మ ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి తన తేజస్తంభాన్ని అరుణాచలంగా మార్చుకొని ఈభూమి యందు ప్రాదుర్భవించాడు.
ఇక పరమేశ్వరుడు ప్రేమతో బ్రహ్మవిష్ణువులను చూచి, “ఓ కుమారులారా! మీకోసము నాచే అనుగ్రహించబడిన ఈ అరుణాచలము కడుపవిత్రమైనది. ఇది తేజోవంతమైన స్వయంభూనగము. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. "అరుణాచలము" అని స్మరిస్తే చాలు సమస్త పాపాలు సమసిపోగలవు. ఈనా అరుణాచల నివాసం చేత ఈస్థలము పవిత్రపుణ్యక్షేత్రమౌతుంది. ఈక్షేత్రము చుట్టూ మూడు యోజనాల దూరమున (48 కి.మీ) నివసించే వారందరూ ఎట్టి సాధనగానీ, ఆచార వ్యవహారములుగానీ లేకయే తరించగలరు. సులభంగా నాలో ఒకరై పోగలరు. స్థావరజంగమాలు అనగా కదిలేవి మరియు కదలనివి అన్నీకూడా ఇక్కడున్నంత మాత్రముననే ముక్తిని పొందగలవు. దూరము నుండియే నన్ను చూచేవారు లేదా తలంచేవారు నమస్త వేదాంతసారమును సులభంగా తెలుసుకోగలరు. నాతేజోవంతమైన కాంతి ఈ అరుణాచల మందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, అనుగ్రహిస్తూ ఉంటుంది అరుణాచాలాన్ని నీరు ముంచలేదు. అగ్ని కాల్చలేదు. దేవతా శరీరాలన్నీ ఈ తేజోపర్వతము చుట్టు ఎల్లప్పుడు తిరుగుతూ వుంటాయి. దూరము నుండియో లేక దగ్గర నుండియో తలవంచి నమస్కరిస్కే చాలు ముక్తిని పొందగలరు. అన్నిటికంటే “గిరిప్రదక్షిణ” నాకు చాలా ఇష్టము. గిరిప్రదక్షిణ చేస్తే చాలు సుఖశాంతులు లభిస్తాయి.” అని అభియమిచ్చాడు.
బ్రహ్మవిష్ణువులు పరమశివుని పలుకులు విని సంతోషించి నమ్రతతో ఆయనకు తలవంచి నమస్కరించి మరలా ఇట్లు విన్నవించుకొన్నారు. 'ఓ లోకనాధా! పరంధామా! పరమేశ్వరా! భూలోకవాసులు క్షేమము కోసము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోకృత్తికా నక్షత్రము ప్రధానముగా గల పౌర్ణమి నాటి సంధ్యాసమయమున ఈ పర్వతము నుండి తేజోవంతమైన దీపంగా దర్శనమివ్వండి. ఆజ్యోతిని చూచిన వారిని ధన్యలను చేయండి". అంత పరమశివుడు వారి కోర్కెల మన్నించి, "అట్లేకానిమ్ము” అని అభయమిచ్చాడు.
అందుకు బ్రహ్మవిష్ణువులు సంతోషించి మరలా ఇట్లు విన్నవించుకున్నారు. “ఓ ప్రణవస్వరూపా! మహేశ్వరా! ఇంత పెద్దదైన అరుణాచలాన్ని సాధారణ మానవులు ఏ విధంగా పూజించగలరు? ప్రకృతి మరియు దేవతలైతే పూజించగలరు. వరుణుడు మేఘాల రూపములో వచ్చి నిన్ను అభిషేకించగలడు. నీ కొండచరియల్లో ఉండే వృక్షాలైతే సుగంధ పరిమళ పుష్పాలతో నిన్న అర్చించగలవు. సూర్య చంద్రులు దీపారాధన మరియు హారతులతో నిన్ను పూజించగలరు. మందమారుత పవనాలు వింజామరులుగా నీకు వీచి ఉపచారములు చేయగలవు. ఇదంతా సాధారణ మానవులకు సాధ్యమా! అందుచేత ఓ ప్రభూ! పరమేశ్వరా ఈ అరుణాచలానికి తూర్పున వేద సమ్మతంగా నిన్ను మంత్రాలతో అభిషేకించి పూజించడానికి తేజోలింగముగా అవతరించండి. ఆ శివలింగానికి మేము చేసే పూజలు గైకొని మమ్ము ధన్యులను చేయండి. మమ్మేకాదు. మిమ్ములను పూజించే వారినందరినీ కరుణించి అభీప్సితములను తీర్చండి." బ్రహ్మవిష్ణువుల అభిమతాన్ని పరమశివుడు మన్నించాడు. తననుండి మంగళప్రదమైన శివలింగాన్ని కల్పించాడు. బ్రహ్మాది దేవతలకు, మునులకు, గంధర్వులకు, విశ్వకర్మ మున్నగు వారలకు పూజావిధానాన్ని మరియు ఆలయ నిర్మాణాన్ని వివరించాడు. దేవతలందరూ దేవతా శిల్పియైన విశ్వకర్మచే ఆ స్వయంభూతేజోలింగానికి ఆయలాన్ని కట్టించారు. పరమేశ్వరుడ చెప్పిన ప్రకారము బ్రహ్మవిష్ణువులు, అష్టదిక్పాలురు, దేవతలు, సిద్ధపురుషులు, మునీశ్వరులు మున్నగు మహితాత్ములందరూ ఆతేజోలింగాన్ని పూజించారు. ఇదంతా జరిగిన పిదప పరమేశ్వరుడు సంతసించి మానవరూపధారియై కౌపీనమును ధరించి అరుణగిరియోగిగా ఒక మఱివృక్షము క్రింద ఆశీనుడై ధ్యాన నిష్ఠలో ఉండుటకు అరుణాచలమునకు వెళ్ళిపోయాడు.
ఈ విధంగా సర్వవ్యాపకుడు, తేజోస్వరూపుడైన పరమేశ్వరుడు భక్తులు మనసారా పూజించుటకు, అభిషేకించుటకు, ఆరాధించుటకు మరియు వారి పూజలను గైకొని ఆనందించుటకు అరుణాచలముగాను, జ్యోతిర్లింగముగాను, అరుణగిరియోగిగాను భూమిపై అవతరించాడు. ఇదే అరుణాచలుని అద్వితీయమైన ఆవిర్భావము. ఇదంతా మన ప్రసిద్ధ పురాణాలైన సూతసంహిత, స్కాందపురాణము, అరుణాచలపురాణము, లింగపురాణము మున్నగు ప్రసిద్ధ శివపురాణాలన్నీ మనోహరంగా వర్ణించి వివరించాయి.
ఏదిఏమైనా పరమేశ్వరుని అవతారమే ఈ అరుణాచలమని శివపురాణాలన్నీ చెబుతున్నాయి. అంతేకాదు చాలామంది సాధువులు, కవులు తేజస్తంభము యొక్క ఆధ్యంతములను కనుగొనుటకు బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించిన విధమును మనోహరంగా తమ కవితల్లో నుతించారు, పాడారు. అందుచే అరుణాచల ప్రాదుర్భావము కల్పితమని ఊహించుటకు వీలుకాదు. ఇది సర్వులూనమ్మదగిన విషయము. సత్యమైన సంఘటన.
అందుచేత ఈ సృష్టిలో అరుణాచలముతో సమానమైనది మరేదియునూ లేదు. ఈ లోకములో ఎందరో జ్ఞానులు, అవధూతలు, సిద్ధపురుషులు ఉండవచ్చు. కానీ వారు ఆయనతో సమానమని చెప్పవీలులేదు. అట్లు చెప్పడము శుద్ధతప్పు. అరుణాచలునితో సమానమని తలంచడమే గొప్ప అజ్ఞానము. ఆయన నిరంతరము ప్రకాశించే అవధులులేని జ్యోతిస్తంభము. అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలము. అరుణాచల శివ, ...🙏 🕉️🪷