16, ఫిబ్రవరి 2026, సోమవారం

నుదుట వ్రాసిన ధనం

 శ్రీరామ (84)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


శ్లో// యద్ధాత్రా నిజ ఫాలపట్ట లిఖితం స్తోకం మహద్వా ధనమ్/

తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం, మేరౌచ నాతోధికం/

తద్ధీరో భవ, విత్తవత్సు కృపణాం వృత్తిం వృథా మాకృథాః/

కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలమ్//


(బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన ధనం కొద్దియైనను, గొప్పయైనను నీవు ఎడారిలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.

బంగారంతో నిండిన మేరు పర్వతానికి వెళ్లినా అంతకంటే ఎక్కువ ధనం నీవు పొందలేవు.

కుండను బావిలో ముంచితే తక్కువ నీరు, సముద్రంలో ముంచితే ఎక్కువ నీరు రావుగదా! 

దానికి సరిపడే నీటినే అది గ్రహించగలుగుతుంది.

ఈ విషయం దృష్టిలో పెట్టుకొ.

ధనవంతులను చూచి వారి ‌సహాయాన్ని ఆశిస్తూ దైన్యవృత్తి నవలంబించవద్దు).


దీనినే శ్రీ ఏనుగు లక్ష్మణకవి ఇలా తెలుగులో అనువదించారు.


చ//వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబొ కొంచెమో/

విను మరుభూమికేగిన లభించును, మేరువు జేరబోయినన్/

ధనమధికంబు రాదు,కడు దైన్యము మాను ధనాఢ్యులందు న/

వ్వననిధి, నూత, దుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా//


పురుషుడు ఎప్పుడూ దీనంగా బ్రతక కూడదు.

తగు పురుష ప్రయత్నంతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.

నీటిని గ్రహించే కుండ యొక్క ఉపాధి పరిమితమైనది.

మానవుడు తన ఉపాధి యొక్క శక్తి, సామర్ధ్యాలను,వేదోక్త ఉపాయములద్వారా,తపశ్చర్యాదులద్వారా వృద్ధి చేసుకోవచ్చు.

అగస్త్య మహర్షి సముద్రమును త్రాగటం, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయడం, అలాంటివే.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

16-2-'26.

కామెంట్‌లు లేవు: