15, ఏప్రిల్ 2026, బుధవారం

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు...

 తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు...............!!


తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. 

ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం) నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. 


ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. 


ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. 


నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)

ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు.


 ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.


ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)

ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.


శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)

13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.


కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)

గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 82*


*అధికాంచితమణికాంచనకాంచీ మధికాంచి కాంచిదద్రాక్షమ్।*

*అవనతజనానుకంపామనుకంపా కూలమస్మదనుకూలామ్॥*


*భావము :*


*అమ్మా! నీ బంగారు మొలనూలు, మణిమాణిక్యములతో కూర్చబడి అత్యంత సుందరముగా ఉన్నది. 'నీవే తప్ప ఇతఃపరంబెరుంగ' అని ప్రార్థించేవారిని రక్షిస్తూ, కంపా తీరములో విహరించే మాతను నేను కాంచీపురములో దర్శించాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః*🙏🙏 🙏

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


అర్జున ఉవాచ ।

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।



ప్రతిపదార్థ:



అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; అపరం — తరువాతిది; భవతః — మీ యొక్క; జన్మ — జన్మ (పుట్టుక); పరం — ఇంతకు ముందే; జన్మ — జన్మ (పుట్టుక); వివస్వతః — వివస్వతుడు (సూర్య దేవుడు); కథం — ఎట్లా; ఏతత్ — ఇది; విజానీయాం — నేను అర్థం చేసుకోవాలి; త్వం — నీవు; ఆదౌ — ప్రారంభంలో; ప్రోక్తవాన్ — ఉపదేశించుట; ఇతి — ఈ విధంగా.



తాత్పర్యము : 


అర్జునుడు ఇలా అన్నాడు : నీవు వివస్వానుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?



వివరణ:


శ్రీ కృష్ణుడి మాటల్లో, పైకి అగుపిస్తున్న పొంతనలేని ఘటనల వల్ల అర్జునుడు అయోమయానికి గురౌతున్నాడు. సూర్య భగవానుడు సుమారుగా సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాడు, కానీ, శ్రీ కృష్ణుడు ఈ మధ్యనే ఈ లోకంలో పుట్టాడు. ఒకవేళ శ్రీ కృష్ణుడు దేవకీవసుదేవుల తనయుడైతే, ఆయన చెప్పినట్టు, ఈ యొక్క యోగ విద్యని వివస్వానుడికి (సూర్య భగవానుడు) చెప్పాడనే విషయం అర్జునుడికి పొసగలేదు, అందుకే అతను ఇలా అడుగుతున్నాడు. అర్జునుడి ప్రశ్న, భగవంతుని దివ్య అవతార విషయం మీద వివరణని అడుగుతోంది, మరియు శ్రీ కృష్ణుడు దీనికి తదుపరి శ్లోకాలలో బదులిస్తున్నాడు.

15-04-2026 బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

15-04-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

---------------------------------------


మిధునం


ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------


కర్కాటకం


సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. 

---------------------------------------


సింహం


చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

---------------------------------------


కన్య


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

---------------------------------------


తుల


దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.  

---------------------------------------


వృశ్చికం


సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------


ధనస్సు


ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గంధరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

---------------------------------------


మకరం


సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి.

---------------------------------------


కుంభం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------


మీనం

 

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.

---------------------------------------

జలధారలు కనుగొను విధానం

 భూమియందు జలధారలు కనుగొను విధానం -

• బావిలో నీరు ఉప్పగా ఉండినను , బురదగా లేదా వగరుగా , దుర్గన్ధముగా ఉండినచో మద్దిచెట్టు బెరడు , తుంగ గడ్డలు , వట్టివేళ్లు , శొంఠి , బీర విత్తులు , ఉశిరిక పొట్టు , చిల్లగింజలు తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని బావినీటిలో కలిపిన ఆ బావినీరు తియ్యగా , శుభ్రముగా తయారగును. బావి వొడ్డున ఉశిరిక చెట్టు వేసినను బావినీరు తియ్యగా ఉండును.

• మనిషి శరీరమున సిరలు ఏవిధముగా రక్తమును తీసుకువెళ్లే విధముగా ఉండునో అదేవిధముగా జలనాడులు భుమియందు ఉండును. ఈ జలనాడులు పెద్దవి మరియు చిన్నవిగా ఉండును.

• పాతాళం నుండి పైకి వచ్చు జలనాడులను మహ సిరలు అనగా పెద్దగా జలతో కూడిన నాడులు అని అర్థం. దక్షిణదిశ , పశ్చిమ దిశ , ఉత్తరదిశ నుండి వచ్చు నాడులు శుభప్రధములు . ఆగ్నేయ , నైఋతి , వాయువ్య దిశల నుండి జలనాడులలో జల స్వల్పంగా ఉండును.

• నిర్జల ప్రదేశము నందు నీరు ప్రబ్బలి చెట్టు ఉన్న దానికి పడమర దిశలో మూడు మూరల దూరము నందు ఒకటిన్నర పురుష ప్రమాణం నందు పశ్చిమదిశ నుండి వచ్చు జలనాడి ఉండును. ముందుగా తెల్లటి కప్పు వచ్చును. ఆ తరువాత బండ వచ్చును. ఆ బండని చేధించిన పిమ్మట జలం ఉండును.

• పురుష ప్రమాణం అనగా 120 అంగుళములుగా లెక్కలోకి తీసికొనవలెను. మరికొన్ని గ్రంథాలలో పురుషుడు నీటిలోకి దుమికెప్పుడు తన చేతులను పైకి ఎత్తునప్పుడు 120 అంగుళములు ఉన్నచో దానిని పురుషప్రమాణముగా నిర్ధారించుకొనవలెను .

• నిర్జల ప్రదేశము నందు నేరేడు చెట్టు ఉన్నచో ఆ నేరేడు చెట్టుకు ఉత్తర దిశకు మూడు మూరలు దూరములో రెండు పురుష ప్రమాణంలో తవ్విన తూర్పు దిక్కు నుండి వెలువడు ఐంద్రి అను పేరుగల జలనాడి ఉండును. అందులో ఇనుపవాసన కలిగిన మృత్తిక ( మట్టి ) , తెల్లని కప్ప ఉండును.

• తోయరహిత ప్రదేశము నందలి నేరేడు చెట్టునకు తూర్పు దిశ యందు పుట్టయున్నచో దానికి సమీప దక్షిణ పార్శ్వమున రెండు పురుష ప్రమాణములు తవ్విన అందు మధుర జలం ఉండును. తవ్వు సమయమున అర్థ పురుష ప్రమాణం నందు ఒక చేప , పావురపు రంగు గల బండ , నల్లని మట్టి దాని క్రింద జలం ఉండును .

• జలహీన ప్రదేశము నందు అత్తిచెట్టు ఉన్నచో దానికి పడమట మూడు మూరల దూరంలో రెండున్నర పురుష ప్రమాణములు తవ్విన అందు ఒక పురుష ప్రమాణంబున తెల్లని సర్పము , నల్లని రాయి ఆ క్రింద తూర్పు దిశ నుండి మధురజలం స్రవించెడి జలనాడి ఉండును.

• నిర్జల ప్రదేశము నందలి నల్లవావిలి చెట్టుకు పుట్ట చుట్టుకుని ఉన్న దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరమున రెండుంబాతిక పురుష ప్రమాణము తవ్విన ఎన్నటికి ఎండిపోని జలనాడి ఉండును. అందు అర్థ పురుష ప్రమాణమున ఎర్రని చేప , దాని క్రింద కపిల వర్ణము గల మృత్తిక దాని క్రింద తెల్లని మృత్తిక దాని క్రింద ఇసుకయు ఆ క్రింద సున్నపు రాళ్ళను దాని క్రింద ఉదకము ( నీరు ) ఉండును .



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .




*సంపూర్ణ మహాభారతము

 

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           1️⃣9️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *195 వ రోజు*                   

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*అర్జునుని సమ్మోహన అస్త్రప్రయోగము*```


ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో భీష్మద్రోణ కృపాచార్యులను యుద్ధసన్నద్ధులను చేసి ఒక్కసారిగా అర్జునిని మీద దాడి చేసాడు. వారంతా సుయోధనుని రక్షిస్తూ అర్జునినితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు సారథిని కాపాడుకుంటూ వారందరితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు మనసులో "సుయోధనుని ఇప్పుడు చంపడం భావ్యం కాదు అది భీమసేనుని ప్రతిజ్ఞ. కుఱు వీరులందరితో యుద్ధం చేయడమైంది. ఇక వీరోచితంగా తప్పుకోవడం ఉచితం. ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు తీసుకు వెళ్ళాలి. కుఱు వీరుల తలపాగాలు పట్టుకెళ్ళడం అంటే వారందరిని జయించినట్లే. అందుకని కుబేరుడిచ్చిన సమ్మోహనాస్త్రాన్ని వీరిపై ప్రయోగిస్తాను" అనుకుని కుఱు సైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. 


అస్త్ర ప్రభావానికి కుఱు సైన్యమంతా నిస్తేజంగా పడి పోయింది. ఆ అస్త్రానికి అధి దేవత ఇంద్రుడు. అర్జునుడు "ఉత్తరకుమారా! కౌరవులంతా స్పృహతప్పి పడిపోయారు. నీవు పోయి సుయోధనుడు, అశ్వథ్థామ, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణాది వీరుల తపాగాలు తీసుకురా. భీష్ముని జోలికి మాత్రం పోవద్దు. అతడిని ఈ అస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయజాలదు అతడు నిద్ర నటిస్తున్నాడంతే" అన్నాడు. 


ఉత్తరకుమారుడు అర్జునుడు చెప్పినట్లే తపాగాలు తీసుకుని రథం ఎక్కాడు. ఉత్తరకుమారునితో చెప్పి అర్జునుడు రథాన్ని కొంచం దూరం యుద్ధరంగంలో నుండి తీసుకుపోయి ఆగాడు. 


ఇంతలో కుఱు వీరులందరికి తెలివి వచ్చింది. సుయోధనుడు అర్జునినితో యుద్ధానికి సిద్ధంఅయ్యాడు. 


భీష్ముడు "సుయోధనా! జరిగినది నీవు ఎరుగవు. మీరంతా అస్త్రప్రభావానికి తెలివి తప్పారు అర్జునుడు మీ తల పాగాలు మాత్రమే తీసుకు వెళ్ళాడు. మీ తలలు నరికి తీసుకు వెళితే ఏమయ్యేది అర్జునిని కరుణ నిన్ను రక్షించింది. తిరిగి యుద్ధానికి సిద్ధం అయితే పూర్ణాహుతి ఇప్పుడే జరుగుతుంది. విడిపించిన గోవులు విరాటనగరానికి చేరాయి. జరిగినది చాలు వెనుకకు మరలుము” అన్నాడు. 


ఆ మాటలకు సుయోధనుడు నిట్టూర్ఛాడు. అర్జునిని వదలాలని లేకున్నా తాతాగారి మాటకు తలవంచాడు. కుఱుసైన్యం కూడా సుయోధనిని అర్జునుని బారి నుండి రక్షించాలంటే యుద్ధ విరమణ మంచిది అనుకున్నారు. కుఱు సైన్యం వెనుతిరిగింది.```


*అర్జునుడు కురుసేనకు వీడ్కోలు పలుకుట*```


ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించాడు. ఒక్క బాణంతో సుయోధనుని కిరీటంలోని మణులను ఊడగొట్టాడు. ‘ఇక నేను పోయివస్తా’నని పెద్దగా అరచి చెప్పాడు. 

ఉత్తరకుమారుని చూసి "కుమారా ! మనం కుఱుసేనను జయించాము, గోవులను మరలించాము, ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు సేకరించాము ఇక రాజధానికి మరలి వెడతాము" అన్నాడు. 


ఉత్తరుడు రథాన్ని వెనుకకు మరల్చాడు. 


అర్జునుడు "కుమారా! కుఱుసేనలను నీవే జయించావని చెప్పు" అన్నాడు. 


ఊత్తరుడు నవ్వి "అర్జునా! కుఱుసేనలను నేను జయించలేనని అక్కడ వారందరికి తెలుసు. నిజం దాచడం కష్టం కాని నీ మాట కాదనలేను. నీవు చెప్పమన్నప్పుడే నిజం చెప్తాను" అన్నాడు. 


రథం శమీవృక్షాన్ని చేరుకుంది. గాండీవం మొదలైన ఆయుధాలను తిరిగి శమీవృక్షం మీద దాచారు. అర్జునుడు బృహన్నల వేషం ధరించి సారథ్యం చేపట్టాడు. ఉత్తరుడు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు --"కుమారా! మన విజయ వార్తను ముందుగా వెళ్ళి విరాటునికి తెలుపమని గోపాలురకు చెప్పు" అన్నాడు. 

వార్తాహరులు అలాగే వెళ్ళారు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

15ఏప్రిల్2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌷 *బుధవారం*🌷

 *🪷15ఏప్రిల్2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం*  

                

           *ఈనాటి పర్వం* 

     🕉️*మాస శివరాత్రి🕉️* 

    

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : త్రయోదశి* రా 10.31 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం  : పూర్వాభాద్ర* మ 03.22 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : బ్రహ్మ* మ 01.25 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : గరజి* ప 11.27 *వణజి* రా 10.31 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*               

అమృత కాలం  : *ఉ 07.37 - 09.10*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    : రా 12.25 - 01.55*

*దుర్ముహూర్తం : ప11.43- 12.33*

*రాహు కాలం   :మ12.08- 01.41*

గుళికకాళం      : *ఉ 10.34 - 12.08*

యమగండం    :*ఉ 07.26 - 09.00*

సూర్యరాశి : *మేషం*                      

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.00*

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.52- 08.22*

సంగవ కాలం     :*08.22 - 10.53*

మధ్యాహ్న కాలం  :*10.53 - 01.23*

అపరాహ్న కాలం   :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి: చైత్ర బహుళ త్రయోదశి*

సాయంకాలం    :*సా 03.53- 06.23*

ప్రదోష కాలం       :*సా 06.23- 08.41*

రాత్రి కాలం         :*రా 08.41 - 11.44*

నిశీధి కాలం        :*రా 11.44- 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     *🪷సరస్వతి శ్లోకం🪷*


*సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి*

*విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🪷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🙏*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

 `` *56వ భాగం*``


*వామనావతార కధ - శ్రీహరి వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి వద్దకు బయలుదేరి వెళ్ళుట!*```


శ్రీహరి దేవతలతో కలసి సాగర మధనం చేయాలని చెప్పాడని అన్న నారదుడి మాట విని ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి దానవుల అధిపతిగా క్షీర సాగర మధనంలో దేవతలతో కలసి పాల్గొన్నాడు. 

తాత ప్రహ్లాదుని వలె బలి చక్రవర్తి అసురుడైనా మహావిష్ణువు పై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు.


శ్రీహరి కూర్మావతారం ధరించి మంధర పర్వతము సముద్రంలో మునగకుండా సహకరించినందుకు బలి చక్రవర్తి సంతోషించారు. కానీ అమృతం పుట్టగానే జగన్మోహిని అవతారం ధరించి కేవలం దేవతలకే పంచి దానవులను మోసం చేయడంతో బాధపడ్డాడు. శ్రీహరిని "దేవ దానవులను సమానంగా చూడకుండా దేవతల పక్షపాతి అయినందుకు" నిందించాడు.


మహావిష్ణువు భక్తుడి నిందను భరిస్తూ చిరునవ్వుతో "బలి చక్రవర్తీ! నీవు నా ప్రియ భక్తుడివి. మీ తాతగారైన ప్రహ్లాదుని వలె నాకు అత్యంత ఇష్టుడివి. ఒక్క విషయం గమనించు. దానవులు, అసురులు నీ లాగే మంచివారు కాదు. అనుక్షణం దాయాదిద్వేషంతో దేవతలను అన్యాయంగా ఓడించడానికి ప్రయత్నిస్తుంటారు. అమృత కలశం వెలువడగానే దానవులు తీసుకుని పారిపోవటం ఎందుకు? అలా చేయకపోతే నేనే దేవదానవులకు సమంగా పంచి వుండేవాడిని.


ధర్మరక్షణ కోసం ఆనాడు మీ తాత ప్రహ్లాదునియొక్క తండ్రి హిరణ్య కశిపుని సంహరించక తప్పలేదు. ఈనాడు అదే ధర్మ రక్షణ కోసం అమృతం దానవులకు దక్కకుండా చేసాను. ధర్మ పరిరక్షణలో నేను తన పర భేదం చూడను. అందరూ నాకు సమానులే. ధర్మం పాటించే నిన్ను త్వరలో ఉద్ధరిస్తాను" అని అదృశ్యమయ్యాడు.


దేవతల చేతిలో ఓడి పాతాళానికి పరిమితమైన బలి చక్రవర్తికి విజయం చేకూర్చడం కోసం రాక్షస గురువు శుక్రచార్యుడు బలి చక్రవర్తి చేత విశ్వజిత్యాగం చేయించాడు. యాగసమాప్తిలో అగ్ని భట్టారకుడు ప్రత్యక్షమై బలికి సూర్యుని గుర్రాలు వంటి గుర్రాలు కలిగిన దివ్య రథం, అక్షయ తూణీరం కల దివ్య ధనుస్సు, దివ్య కవచం ఇచ్చాడు.


ధర్మ పరిపాలన చేసే బలి చక్రవర్తి దివ్య ఆయుధాలతో అమిత బలసంపన్నుడైనాడు. శుక్రాచార్యుడి ఆశీస్సులు, మార్గదర్శనంతో అపార సైన్యంతో అమరావతి పై దండయాత్ర చేసాడు. 


దేవగురువు బృహస్పతి బలిచక్రవర్తి అపార శక్తి, దైవానుగ్రహం కలిగివున్నాడని, అతనిని ఓడించటం ఆసాధ్యం అని గ్రహించి ఇంద్రాది దేవతలను స్వర్గం వదలి 

పారిపోమన్నాడు. సమయం వచ్చేవరకు భూలోకపు అడవులలో దాక్కుని ఉండమన్నాడు.


ఇంద్రాది దేవతలు పారిపోవడంతో స్వర్గం బలిచక్రవర్తి హస్తగతమైంది. పాతాళం, భూమండలం, స్వర్గం జయించి బలిచక్రవర్తి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. భూమి పైరాజ్యం, రాజధాని ఏర్పరచుకుని ముల్లోకాలను ధర్మబద్దంగా పరిపాలించ సాగాడు. దానవులు, అసురులు ఎవరు దుష్కర్మలు చేయకుండా జాగ్రత్త వహించాడు. యజ్ఞయాగాదులు చేస్తూ దేవాధిదేవులైన త్రిమూర్తులను సంతృప్తి పరిచాడు.


ఇంద్రాది దేవతలకు తమ స్వర్గం తిరిగి పొందే అవకాశం కనిపించక తల్లి అదితికి తమ బాధ చెప్పు కున్నారు. దేవతలు దీనులై అడవుల్లో జీవించడం చూసి అదితి దుఖ పడింది. భర్త కశ్యపునితో తన కుమారులు పడుతున్న కష్టాలు చెప్పి వారికి తిరిగి స్వర్గం, పూర్వ వైభవం లభించే ఉపాయం చెప్పమంది.


కశ్యపుడు "ఆనాడు దానవులను మోసం చేసినందుకు ఈనాడు దేవతలు అనుభవిస్తున్నది కర్మఫలం. పుత్ర వ్యామోహం విడిచి పెట్టుము. ఇదంతా విష్ణు మాయా విలాసం." అని చెప్పాడు. 


అదితి వదలకుండా దేవతలకు స్వర్గం లభించే మార్గం చెప్పమని ప్రాధేయ పడటంతో కశ్యపుడు "అదితీ! శ్రీహరిని భక్తితో పూజించు! ఆయనే నీ కుమారుల కష్టాలు తీర్చగలడు. ఇందుకు కేవలం వాయుభక్షణ చేస్తూ నారాయణ వ్రతం చేయమని" మార్గదర్శనం చేశాడు.


అదితి భర్త కశ్యపుడు చెప్పినట్లు నియమ నిష్టలతో నారాయణ వ్రతం చేసింది. 


శ్రీహరి ప్రత్యక్షమై "అదితి మాతా! నీ కుమారుల కష్టాలు తీర్చడానికి వారికి సోదరుడిగా నీ కడుపున జన్మించి 

నీ కోరిక తీరుస్తాను" అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. 


అన్నట్టే కశ్యప మహర్షి తేజస్సుతో అదితి గర్భవతి అయ్యింది.


నవమాసాలు పూర్తి అయిన తరువాత భాద్రపద శుక్ల ద్వాదశి రోజున శ్రవణా నక్షత్రంలో అభిజిన్ముహుర్తంలో వామన రూపంలో విష్ణువు అదితికి జన్మించాడు. బాలునిగా పుట్టిన నారాయణుని చూసి సకల జగత్తు ఆనందించింది ప్రకృతి పరవశించింది. దేవతలు, మహర్షులు, దేవర్షులు విచ్చేసారు.


ఉపనయన వయస్సులో ఉన్న వామనునికి బృహస్పతి యజ్ఞోపవీతం ధరింపచేశాడు. సూర్యుడు గాయత్రీ మంత్రం ఉపదేశించాడు. తండ్రి కశ్యపుడు మేంజిని, మొల త్రాడు, తల్లి అదితి కౌపీనం ధరింపచేశారు. భూదేవి జింకచర్మం, చంద్రుడు దండం, ఆకాశదేవత ఛత్రము, బ్రహ్మ కమండలం, సరస్వతి జపమాల, సప్త ఋషులు దర్భలు, పవిత్రాలు ఇచ్చారు.


కుబేరుడు భిక్షాపాత్ర ఇవ్వగా అన్నపూర్ణ భవానీదేవి పూర్ణ భిక్ష పెట్టింది. వామనుడు అందరికి నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. వచ్చిన మహర్షులు బలి చక్రవర్తి నర్మదానది ఉత్తర తీరంలో గురువు శుక్రా చార్యుడి ఆదేశంతో, ఆధ్వర్యంలో మహాయాగం చేస్తున్నాడని వామనునికి చెప్పారు.

వామనుడు తల్లిదండ్రులకు నమస్కరించి, తల్లి కోరిక తీర్చడానికి బలి చక్రవర్తి వద్దకు వెళ్లి వస్తానని అనుమతి, ఆశీర్వాదం తీసు కున్నాడు. దేవతలు, మహర్షులు సంభ్రమాశ్చర్యాలతోచూస్తుండగానే వామనుడు బలి చక్రవర్తి వద్దకు బయలుదేరాడు.


*తరువాత కధ రేపటి భాగంలోో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏