4, ఆగస్టు 2026, మంగళవారం

ధ్రువోపాఖ్యానం

 🌺 *శ్రీమద్భాగవతం - 10: ధ్రువోపాఖ్యానం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో భాగంగా 

నిన్నటి రోజున దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మాహుతి, వీరభద్రుని ఉగ్రరూపం మరియు దక్షునికి మేక ముఖం అమర్చడం గురించిన విశేషాలు గల వీరభద్ర విజయం గురించి తెలుసుకున్నాం. ఈరోజు **చతుర్థ స్కంధం – అధ్యాయాలు 8 నుండి 12**ఆధారంగా పరమ భాగావతుడైన **ధ్రువుని బాల్యం, చిన్నమ్మ సురుచి పరుషోక్తులు, నారద మంత్రోపదేశం, సుమధుర తపస్సు మరియు అచలమైన ధ్రువ పదాన్ని పొందడం** గురించిన వివరాలు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన మేరకు తెలుసుకుందాం.


---


1. **సురుచి పరుషోక్తులు & ధ్రువుని సంవేదన*


స్వాయంభువ మనువుకు ఇద్దరు కుమారులు వారు ప్రియవ్రతుడు, ఉత్థానపాదుడు.అందులో **ఉత్తానపాదుడికి** ఇద్దరు భార్యలు — సునీతి, సురుచి. పెద్ద భార్య సునీతి కుమారుడు **ధ్రువుడు**, చిన్న భార్య సురుచి కుమారుడు **ఉత్తముడు**. ఉత్తానపాదుడికి చిన్న భార్య సురుచి అంటే మిక్కిలి ప్రేమ.


ఒకరోజు ఐదేళ్ల పసిబాలుడైన ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చోవడానికి వెళ్లాడు. అక్కడ ఉన్న సురుచి ధ్రువుడిని పక్కకు తోసివేసి, రాజాస్థానం ముందు(రాజుగారి ఎదుటే)గర్వంతో ఇలా అంది:


 "బాలా! నువ్వు రాజు తొడపై కూర్చోవడానికి అర్హుడివి కావు. నువ్వు నా కడుపున జన్మించలేదు. అంతగా సింహాసనంపై కూర్చోవాలనుకుంటే, అడవులకు వెళ్లి ఆ శ్రీహరిని గూర్చి తపస్సు చేసి, ఆయన అనుగ్రహంతో నా గర్భాన జన్మించు!"


ఆ మాటలు విన్నా కూడా ఉత్తానపాడుడుసురుచి పై ప్రేమతో మౌనంగా ఉండిపోయాడు. తీవ్రంగా గాయపడిన మనస్సుతో ధ్రువుడు వెక్కి వెక్కి ఏడుస్తూ తన తల్లి సునీతి వద్దకు వెళ్లాడు. సునీతి పిల్లవాణ్ణి ఒడిలోకి తీసుకుని, పిల్లవాణ్ణి సురుచి అన్న మాటలు అప్పటికే అంతఃపుర స్త్రీల ద్వారా విని ఎంతో బాధపడింది.అమాయకురాలైన సునీతి కూడా దీర్ఘముగా నిట్టూర్చుచు, కన్నీరుమున్నీరుగా ఏడువసాగెను. ఆమె దుఃఖమునకు అంతులేకుండెను. 


కొంతసేపడికి నిబ్బరపడి ఆమె తన కుమారునితో ఇలా అన్నది – “నాయనా! ధ్రువా! నీకు తీవ్రమైన బాధయే కలిగినది. ఐనను,


 **నీవు ఇతరులకు అశుభమును కోరుకొనకుము. ఏలయన పరులకు దుఃఖమును కలిగించినవారు ఎన్నటికైనను తామే ఆ దుఃఖమును అనుభవింపవలసి యుండును**. 


 "నాయనా! నీకు బాధయే కలిగిన

నీ చిన్నమ్మ చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఆ శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించడం తప్ప మన దుఃఖాన్ని పోగొట్టే దిక్కు మరొకటి లేదు. ఆయనను ప్రసన్నం చేసుకో" నీవు కోరుకున్నది లబిస్తుంది అని ధైర్యం చెప్పింది.(ఎంత గొప్ప మాటలు అండి ఇది ఈ దైర్యం ఈ భక్తి మన వారసత్వ సంపద)


---


2. *నారద మహర్షి ఆగమనం & మంత్రోపదేశం**


తల్లి అయిన సునీతి చెప్పిన మాటలను ధ్రువుడు శ్రద్ధగా విన్నాడు. అవి ఆయనకు ఎంతో ప్రయోజనకరములుగా అనిపించి. తన అభీష్టము సఫలమగుటకు అదియే సరియైన మార్గమని అతడు నిశ్చయించుకొనెను. అతడు మనస్సును నిగ్రహించుకొని, తన తండ్రియొక్క పురమునుండి వనములకు బయలుదేరెను.


అప్పుడు ధ్రువునియొక్క అభీష్టమును, దానిని సాధించుటకై అతడు వనములకు బయలుదేరిన విషయమును దేవర్షియగు నారదుడు గ్రహించి, అతని దగ్గరకు వచ్చి ఆశ్చర్య పోయి , పవిత్రమైన తన చేతితో అతని శిరస్సును స్పృశించుచు ఇట్లు అనుకున్నాడు.


'ఆహా! ఇదెంతటి ఆశ్చర్యము. ఇసుమంత అవమానమును గూడ సహింపజాలని క్షత్రియులయొక్క స్వాభిమానము అత్యద్భుతము కదా! బాలుడే ఐనప్పటికిని సవతితల్లి దురుసు మాటలకు ఇతడు ఎంతగానో నొచ్చుకొనెను. వాటిని ఇతడు తన మనస్సులో పెట్టుకొని, భగవంతుని ఆరాధించుటకు పూనుకొనెను?'


* **నారదుని పరీక్ష:** "నాయనా ధ్రువా! నువ్వు ఇంకా పసివాడివి. మానవమానాలు, గెలుపోటములు ఈ వయస్సులో పట్టించుకోకూడదు. ఇంటికి తిరిగి వెళ్లు" అని నారదుడు చెప్పాడు.


* **ధ్రువుని పట్టుదల:** ధ్రువుడు ప్రాంజలియై: "మహర్షీ! నా క్షత్రియ హృదయం చిన్నమ్మ బాణాల వంటి మాటలతో గాయపడింది. నా పూర్వీకులు ఎవరూ పొందని అత్యున్నత పదవిని సాధించాలనుకుంటున్నాను. నాకు ఆ మార్గాన్ని చూపండి" అని వేడుకున్నాడు.


ధ్రువుని దృఢ సంకల్పానికి నారదుడు సంతోషించి, యమునా తీరంలో ఉన్న **'మధువనం'** కు వెళ్లమని చెప్పి, భగవంతుని రూప ధ్యానాన్ని మరియు **"ఓం నమో భగవతే వాసుదేవాయ"** అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు.


---


ఉపదేశం చేసాక అంతఃపురానికి వెళ్ళి కుమారుడు వెళ్లిపోయిన బాధలో ఉన్న ఉత్తానపాదున్ని ఓదార్చి దిగులు చెందకు, అతడు దైవానుగ్రహం కలవాడు, అతడు విశ్వవిఖ్యాతుడు, లోకపాలకుడు అవుతాడు. అసాధ్యమైన కార్యాన్ని సాధించి త్వరలోనే నీ దగ్గరకు వస్తాడా అని చెప్పే వెళ్ళిపోయాడు.


---


3. **మధువనంలో ఘోర తపస్సు**

ఇక

మధువనానికి చేరుకున్న ధ్రువుడు నారదుడు చెప్పినట్లు ఆచమనం చేసి, వాసుదేవుని హృదయంలో నిలిపి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు:


* **1వ నెల:** ప్రతి మూడు రోజులకు ఒకసారి వెలగకాయలు, రేగుకాయలు తింటూ తపస్సు చేశాడు.


* **2వ నెల:** ప్రతి ఆరు రోజులకు ఒకసారి ఎండిన ఆకులు, గడ్డి తింటూ తపస్సు చేశాడు.


* **3వ నెల:** ప్రతి తొమ్మిది రోజులకు ఒకసారి కేవలం నీరు మాత్రమే తాగుతూ తపస్సు చేశాడు.


* **4వ నెల:** ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి కేవలం వాయువును (గాలిని) మాత్రమే పీలుస్తూ ఏకపాదంతో నిలబడి తపస్సు చేశాడు.


* **5వ నెల:** శ్వాసను కూడా నిరోధించి (ప్రాణాయామంతో), మనస్సును భగవంతుని యందు సంపూర్ణంగా లగ్నం చేశాడు.


ధ్రువుడు తన శ్వాసను నిరోధించడంతో, సమస్త బ్రహ్మాండంలోని ప్రాణుల శ్వాస ఆగిపోయింది. లోకాలు తలకిందులయ్యాయి. దేవతలందరూ భయపడి శ్రీహరిని శరణుకోరారు.

(తపశ్శక్తి గొప్పతనం అది)

---


4. *శ్రీహరి దివ్య దర్శనం & ధ్రువ పదం*


భక్తుని తపస్సుకు ప్రసన్నుడై శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మధువనంలో ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.


తన హృదయంలో ధ్యానిస్తున్న దివ్యరూపం బయట కనిపిస్తుండటంతో ధ్రువుడు మైమరచిపోయాడు. ఏమి మాట్లాడాలో తెలియక నిలబడిపోగా, పరమాత్మ తన **దివ్య శంఖంతో (పాంచజన్యంతో)** ధ్రువుని చెంపను తాకించాడు. భగవంతుని స్పర్శతో ధ్రువునికి సమస్త వేద విజ్ఞానం, స్తుతిబలం ఆవిర్భవించాయి. ధ్రువుడు అత్యద్భుతంగా భగవంతుని స్తుతించాడు.(ధృవ స్తుతి లోక విఖ్యాతము అత్యంత శక్తివంతమైనది, వైకల్యాలు ఉన్నవారు నిత్యం పారాయణ చేస్తే అవి సరి అవుతాయి అని ప్రతీతి)


**శ్రీహరి అనుగ్రహం:** "ధ్రువా! నీ సంకల్పాన్ని నేను ఎరుగుదును. నువ్వు ముప్పై ఆరు వేల (36,000) సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తావు. అనంతరం సమస్త గ్రహ నక్షత్రాలకు ఆధారామై, ప్రళయ కాలంలో కూడా నశించనిది సప్తర్షి మండలం కన్నా పైన ఉండేది అయిన పరమోన్నత**'ధ్రువ మండలాన్ని' (ధ్రువ నక్షత్ర పదాన్ని)** పొందుతావు" అని వరమిచ్చాడు.


---


5. స్వగృహ ప్రవేశం & సన్మానం (10, 11, 12 అధ్యాయాలు)


భగవద్దర్శనం పొందిన ధ్రువుడు తన కోరికల పట్ల పశ్చాత్తాపపడ్డాడు. "భగవంతుని దర్శనం పొంది కూడా తుచ్ఛమైన రాజ్యాన్ని కోరుకున్నాను కదా" అని అనుకున్నాడు. అయినా భగవదాజ్ఞ ప్రకారం రాజధానికి తిరిగొచ్చాడు.


తండ్రి ఉత్తానపాడుడు, చిన్నమ్మ సురుచి, తల్లి సునీతి, సోదరుడు ఉత్తముడు ధృవుడు వస్తున్న వార్త తెలుసుకుని ఎదురెళ్లి ధ్రువుడిని అమితమైన ప్రేమతో ఆహ్వానించారు.ప్రజలు అందరూ ఆ చిన్నారి ధ్రువుని ఎంతో ఆత్మీయతతో లాలింపసాగిరి. అప్పుడు ఉత్తానపాదమహారాజు ధ్రువుని, అతని సోదరుడైన ఉత్తముని ఏనుగుపై అధిష్ఠింపజేసి, వారితోగూడి మిగుల సంతోషముతో తన రాజధానిలో ప్రవేశించెను. 


ఆ సమయమున సకలజనులును మహారాజుయొక్క భాగ్యమును కొనియాడసాగిరి.నగరమునందు అక్కడక్కడ ద్వారములు మకర తోరణములతో అలంకరింపబడియుండెను. ద్వారములకు ఇరుప్రక్కల పండ్లగెలలు, పూలగుత్తులుగల అరటి స్తంభములు, పోకమొక్కలు ఏర్పరచబడియుండెను. రాజర్షియైన ఉత్తానపాదుడు అత్యద్భుతమైన ధ్రువకుమారుని ప్రభావమును విని, చూచి ఆశ్చర్యచకితుడయ్యెను.


 ధ్రువుడు క్రమంగా పెరిగి తరుణ(యువకుడు) వయస్కుడయ్యెను. అతని తెలివితేటలకును, ఉత్తమ లక్షణములకు మంత్రులు అబ్బురపడుచుండిరి. అతడు ప్రజల ప్రేమానురాగములకు పాత్రుడగుచుండెను. 


తన తనయునియొక్క ఈ శుభలక్షణములను గాంచి మహారాజు ఒక శుభముహూర్తమున భూమండలమునకు అతనిని పట్టాభిషిక్తుని గావించెను. భూపతి తాను వయోవృద్ధుడగుచున్న విషయమును గమనించెను. ఐహిక విషయములయెడ విరక్తుడై ఆత్మస్వరూపమును గూర్చి ' చింతించుచూ వనములకు వెళ్లెను. 


----


* **యక్షుల యుద్ధం & స్వాయంభువ మనువు హితవు:** కాలక్రమేణా ఉత్తముడు ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో యక్షుల చేతిలో మరణించగా, ధ్రువుడు కోపంతో యక్షులపై యుద్ధం ప్రకటించాడు. అప్పుడు తాతగారైన స్వాయంభువ మనువు వచ్చి: "ధ్రువా! కోపం తమోగుణ లక్షణం. సాధువులకు, విష్ణుభక్తులకు అగ్రహం తగదు" అని బోధించగా ధ్రువుడు యుద్ధాన్ని నిలిపివేశాడు. కుబేరుడు ప్రసన్నుడై ధ్రువునికి నిశ్చల విష్ణుభక్తిని వరంగా ఇచ్చాడు.


ధ్రువుడు చక్కని శీలస్వభావముగలవాడు, బ్రాహ్మణ సేవా పరాయణుడు, దీనులయెడ వాత్సల్యభావము గలవాడు, ధర్మమర్యాదలను రక్షించువాడు (తాను పాటించుచు, ఇతరులచే పాటింపజేయువాడు). అట్టి ధ్రువుని ప్రజలెల్లరును పితృతుల్యునిగా భావించుచుండిరి. 


ధ్రువుడు వివిధములగు రాజభోగములను అనుభవించుట వలన తన పుణ్యము క్షీణించునట్లుగను, భోగములపట్ల అనాసక్తుడై యజ్ఞయాగములద్వారా తన పాపములు నశించునట్లుగను జీవించెను. అంటే పాపం పుణ్యం రెండు లేని విదంగా ఆయన జీవించాడు.


ఈవిధముగా అతడు తన రాజ్యమును ముప్పది ఆరువేల సంవత్సరములు పాలించెను. ఈరీతిగా మహాత్ముడైన ధ్రువుడు జితేంద్రియుడై ధర్మార్థకామ పురుషార్థములను పొందుచు పెక్కు సంవత్సరములు తన జీవితమును గడిపి, కడకు తన కుమారుడైన ఉత్కళునకు రాజ్యాధికారమును అప్పగించెను. 


 'ఈ సమస్త దృశ్యప్రపంచము అవిద్యారచితము (ప్రకృతినుండి ఏర్పడినది). 'స్వప్నమున గాంచు గంధర్వనగరమువలె ఈ విశ్వము అంతయు మనఃకల్పితమే' అని ధ్రువుడు భావించి బదరికాశ్రమానికి వెళ్లి దేహ స్పృహను వీడి భగవంతుని విరాట్ స్వరూప ధ్యానంలో మునిగిపోయాడు.కడకు ధ్యానించేవాడు, ధ్యానం అనేది అద్వైత స్తితికి సమాధి స్థితిలో నిలిచి పోయాడు. నేను ధ్రువుడు అనే భావన వారిలో తొలగిపోయింది.అప్పుడు


సాక్షాత్తు విష్ణుదూతలు దివ్య విమానంతో వచ్చి ధ్రువుడిని తీసుకువెళ్లారు. మృత్యు దేవత తన ముందు నిలబడితే, దాని తలపై కాలు పెట్టి దివ్య విమానమెక్కి శాశ్వతమైన **'ధ్రువ పదాన్ని'** చేరుకున్నాడు!


ఆ విమానం లో ఉండగా తల్లిగారైన సునీతి గుర్తుకు వచ్చింది అయ్యో ఉత్తము రాలైన తల్లిని వదిలి ఒక్కడినే పరమ పదం వెళ్ళుట ధర్మమేనా అనుకుంటూ ఉండగా, విష్ణు దూతలు అతనికి అతని ముందు ఉన్న విమానం చూపించారు, అందులో ధృవునికన్నా ముందే సునీతి విష్ణులోకం వెళ్తుంది.


క్రమముగా అతడు ముందునకు పయనించుచు విమానములయందు పయనించుచున్న దేవతలు అతనిని ప్రశంసించుచు పుష్పములను చల్లుచుండిరి. ఆ సూర్యాదిగ్రహములను చూచెను. మార్గమున అచ్చటచ్చట


దివ్యవిమానమునందు ఆసీనుడై యున్న ధ్రువుడు ముల్లోకములను, సప్తర్షిమండలమును గూడ దాటి,ఉన్నతోన్నతమైన విష్ణుభగవానునియొక్కనిత్యనివాసమగు వైకుంఠమునకు చేరెను. ఈవిధముగా అతడు శాశ్వతమగు స్థానమును పొందెను.


ఆహా ధ్రువుడు ఐదారు సంవత్సరముల వయస్సునందే తపస్సుద్వారానే భగవంతుని ప్రసన్నునిగా జేసికొని, పరమపదమును పొందగల్గెను. కాని, అతడు సాధించిన పరమధామమును ఈ భూమండలమునగల ఏ రాజైనను ఎన్ని సంవత్సరములలో నైనను పొంగలడా? (పొందజాలడు)" 


---


ధ్రువుని చరిత్రము మహిమాన్వితము. దానిని విన్నవారును, ప్రవచించిన వారును సంపన్నులగుదురు. అది యశస్కరము. ఆయుర్వృద్ధిని గూర్చునట్టిది, పవిత్రమైనది, మిగుల శుభప్రదమైనది. స్వర్గప్రాప్తికరము. ధ్రువమండలమునకు చేర్చునది. మనస్తాపములను తొలగించునది. ప్రశస్తిని గూర్చునది. పాపములను రూపుమాపునది. భగవద్భక్తుడైన ధ్రువునియొక్క చరితము పదేపదే శ్రద్ధగా వినుచుండువారికి పరమాత్మునియెడ అనన్యభక్తి కుదురుకొనును. తత్ప్రభావమున వారి తాపత్రయములు అన్నియు నశించును. శ్రద్ధాళువులైన శ్రోతలకు అన్నివిధములుగా ఔన్నత్యమును ప్రసాదించును.


సద్గుణములను, సౌశీల్యమును ప్రాప్తింపజేయును. దివ్యతేజస్సును కలిగించును. మనస్వులకు గౌరవమును ఇనుమడింప జేయును. యశోమూర్తియగు ధ్రువుని వృత్తాంతము మహత్త్వపూర్ణమైనది. దీనిని ప్రాతఃకాలము నందును, సాయంసమయమునందును, బ్రాహ్మణాది ద్విజుల సభలలో ఏకాగ్రచిత్తముతో కీర్తింపవలెను. భగవత్పాదారవిందములను సేవించుటయందు నిరతిగలవాడు పూర్ణిమనాడు, చంద్రకళతో గూడిన అమావాస్యనాడు, ద్వాదశినాడు, శ్రవణానక్షత్ర సహితదినమునందు, సాయంసమయమునందు, వ్యతీపాత యోగముగల రోజునను” సూర్యసంక్రమణము నాడును లేదా ఆదివారమునందును శ్రద్ధాళువులైన వారికి వినిపిస్తే భగవంతుడు సంతుష్టుడు అయి అతనికి సిద్ధి కలుగును.


ఈరోజు మన అదృష్టం కొద్ది ఆదివారం కలిసి వచ్చింది మనకు భగవత్ అనుగ్రహ సిద్ది కలిగింది. హరే కృష్ణ 


📝 *నేటి ముఖ్య విషయాలు* 


1. **నిశ్చల సంకల్పం:** వయస్సుతో సంబంధం లేదు; గాఢమైన భక్తి, నిశ్చల సంకల్పం ఉంటే ఐదేళ్ల బాలుడైనా, వందేళ్ల వృద్ధుడు అయినా పరమాత్మను సాధించగలడు.


2. **అపకారికి ఉపకారం:** చిన్నమ్మ సురుచి పరుషోక్తులే తనను భగవంతుని వైపు నడిపించాయని ధ్రువుడు ఆమె పట్ల ఎలాంటి ద్వేషం పెంచుకోలేదు.


3. **ధ్రువ పదం:** లౌకిక రాజ్యాలు నశిస్తాయి, కానీ భగవదనుగ్రహంతో పొందే స్థానం (ధ్రువ పదం) శాశ్వతంగా నిలిచిపోతుంది.


---


...సశేషం

✍️ఇరువంటి కార్తీక్ శర్మ (సనాతన ధర్మ ప్రచార వేదిక)


ఈ పోస్ట్ మీకు నచ్చితే like చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరిన్ని విషయాల కోసం మన page follow అవ్వండి,ఈ పోస్ట్ share మాత్రమే చేయండి.. హరేకృష్ణ