3, సెప్టెంబర్ 2026, గురువారం

శ్రీమద్భాగవతం - 39/42*🙏

  *


*శ్రీమద్భాగవతం - 39/42*🙏 


*నరకాసుర వధ, పారిజాతాపహరణం & ద్వారకా గృహస్థ లీలలు*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


ఈరోజు భాగవతం లోనే అత్యంత విచిత్రమైన లీల ఒకేసారి 16 వేల రూపాల్లో శ్రీకృష్ణ దర్శనం చేసుకుని తరిద్దాం రండి.


1. ఇంద్రుని విన్నపం & నరకాసురుని దురాగతాలు 


ఒకసారి దేవేంద్రుడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుని శరణువేడి మొరపెట్టుకున్నాడు:


"స్వామీ!నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని ముల్లోకాలను పీడిస్తున్నాడు.


* దేవతల తల్లియైన అదితీదేవి కర్ణాభరణాలను (కుండలాలను), వరుణుని ఛత్రాన్ని, మణి పర్వత శిఖరాన్ని అపహరించాడు.


* లోకంలోని రాజులను ఓడించి వారి అంతఃపురాల నుండి పదహారు వేల నూట మంది (16,100) రాజకన్యలను బలవంతంగా అపహరించి తన కారాగారంలో బంధించాడు. అతన్ని సంహరించి లోకాలను రక్షించు!"అన్నాడు.


దేవేంద్రుని ప్రార్థనను మన్నించి, శ్రీకృష్ణుడు తన ప్రియసఖి సత్యభామాదేవితో కలిసి గరుడారూఢుడై ప్రాగ్జ్యోతిషపురంపై దండెత్తాడు.


#2. మురాసుర సంహారం 


ప్రాగ్జ్యోతిషపురం దుర్భేద్యమైన నగరం. దాని చుట్టూ గిరి దుర్గం, శస్త్ర దుర్గం, జల దుర్గం, అగ్ని దుర్గం మరియు వాయు దుర్గాలు ఉన్నాయి. అంతేకాక 'మురుడు'అనే ఐదు తలల రాక్షసుడు పన్నిన పదివేల భయంకరమైన విద్యుత్/పాశ వలయాలు కాపలాగా ఉన్నాయి.


అలాంటి పురాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో గిరి దుర్గాలు,బాణాలతో ఆయుధ వలయాలను(శస్త్ర దుర్గాలు), సుదర్శన చక్రంతో అగ్ని-జల-వాయు దుర్గాలను నందకం అనే ఖడ్గం తో మురసురుని పాశ వలయాలు క్షణంలో ధ్వంసం చేశాడు.


ఆ తరువాత తన పాంచజన్య శంఖా నాదంతో మురాసురుడు మొదలైన వైరుల యంత్రాలను, హృదయాలను బద్దలు చేశాడు, తన బలమైన గదతో ఆ పురం యొక్క ప్రాకారాలు బద్దలు కొట్టాడు.


ఆ సమయంలో జలములయందు నిద్రించి ఉన్న ఐదు శిరస్సుల మురాసురుడు ఒక్కసారిగా శ్రీకృష్ణునీ మీదకు వచ్చాడు,వాడు తన త్రిశూలాన్ని వేగంగా త్రిప్పుతూ గరుత్మంతునీ మీదకు వేయగా స్వామి రెండు బాణాలతో ఆ త్రిశూలాన్ని ఖండించి, సుదర్శన చక్రంతో వాడి ఐదు తలలను నరికివేశాడు. (మురాసురుడిని సంహరించినందువల్ల భగవంతునికి **'మురారి'** అనే నామం సార్థకమైంది). 


వెంటనే మురుని ఏడుగురు కుమారులు శ్రీకృష్ణునిపై ప్రతీకారం తీర్చుకొనుటకు సర్వసన్నద్ధులైరి. మురాసురుని కుమారులైన తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసువు, నభస్వంతుడు, అరుణుడు వీరు పీఠుడు అనే సేనాధిపతి నీ ముందు పెట్టుకుని నరకాసురునీ ప్రేరణ తో యుద్ధానికి వస్తె వారిని కూడా పరమాత్మ యమసదనానికి పంపాడు.


3. నరకాసుర వధ & భూదేవి స్తుతి 


వరసగా తన సేనా నాయకుల మరణవార్తలు విని నరకాసురుడు అసహనంతో  వేలాది మదపుటేనుగుల సైన్యంతో యుద్ధరంగానికి వచ్చాడు. శ్రీకృష్ణునిపై శతఘ్నులు, శక్తులు, బాణవర్షం కురిపించాడు.


అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిత్రవిచిత్రమైన రెక్కలు గల బాణాలతో నరకాసుర పక్షం లో ఉన్న సైనికుల కాళ్ళు,చేతులు,తొడలు, కంఠాలు ఖండించి, వాడి అశ్వ, గజ బలాలను నశింపచేశాడు.


తనపై సత్యభామ, శ్రీకృష్ణ పరమాత్మ ఆసీనులు ఉండగా గరుత్మంతుడు తన రెక్కలు,గోర్లు, ముక్కుతో వాడి గజబలం మీద దాడి చేశాడు. గరుడుని దాటికి తట్టుకోలేక సైన్యం మొత్తం పారిపోతుంటే నరకాసురుడు ఒక్కడే యుద్ధరంగం నిలిచి పోరాడాడు.


నరకాసురుడు వజ్రాయుధమును సైతము నిరోధింపగల తన బల్లెముతో గరుత్మంతునిపై దెబ్బతీసెను. ఐన ఆ వైనతేయుడు పూలమాలచే కొట్టబడిన ఏనుగువలె ఏమాత్రమూ చలింపలేదు. 


గరుత్మంతునిపై ప్రయోగించిన బల్లెము వమ్మైపోవుటతో నరకాసురుడు శ్రీకృష్ణుని చంపుటకై ఒక శూలము పట్టుకున్నాడు. నరకాసురుడు ఆ శూలమును ప్రయోగింపకముందే శ్రీహరి (శ్రీకృష్ణుడు) గజారూఢుడై యున్న నరకునియొక్క శిరస్సును పదునైన అంచులుగల తన చక్రాయుధముతో ఛేదించెను. 


 కర్ణకుండలములతో, మనోహరమైన కిరీటముతో కాంతులీనుచున్న ఆ నరకాసురుని శిరస్సు నేలపాలయ్యెను. అప్పుడు అతని బంధువులందఱును హాహాకారములు చేశారు. ఋషులు, ఇంద్రాది దేవతలు 'భళీ! భళీ!' అని పలుకుచు పూలమాలలను వర్షించుచు, సంతోషముతో శ్రీకృష్ణుని స్తుతించిరి.


అనంతరము భూదేవి పుటముపెట్టిన బంగారముతో, రత్నములతో ఒప్పుచు తేజరిల్లుచున్న కుండములను, వైజయంతియను పేరుతో అలరారుచున్న వనమాలను శ్రీకృష్ణునకు సమర్పించెను.అలాగే  వరుణుని ఛత్రమును, మేరుపర్వతముయొక్క మణిశిఖరమును ఆ స్వామికి అర్పించెను. (వీటిని నరకాసురుడు అపహరించియుండెను తిరిగి ఇచ్చింది)

 

నరకాసురుని కుమారుడైన 'భగదత్తుడిని' కాపాడు"* అని భూదేవి ప్రార్థించగా, శ్రీకృష్ణుడు భగదత్తునికి అభయం ఇచ్చాడు.(ఇతడు ధర్మాత్ముడు)


#4. 16,100 మంది కన్యల విముక్తి & పారిజాతాపహరణం


ఆ తరువాత సకల సంపదలకు నెలవైన నరకాసురుని అంతఃపురం లోకి ప్రవేశించి అక్కడ కారాగారంలో బంధింపబడిన **16,100 మంది రాజకన్యలను** శ్రీకృష్ణుడు విడుదల చేశాడు.


ఆ భవనమున ప్రవేశించిన, పురుషోత్తముని చూచినంతనే రాజకన్యలు మోహపరవశలైరి.దైవానుగ్రహమున తమ కడకు వచ్చిన ఆ కృష్ణపరమాత్మను తాము కోరిన పతిగా తమ మనస్సులలోనే వరించిరి. 


ఆ రాజకన్యలు అందఱు “ఈ స్వామి నాకు పతియగునట్లు విధాత అనుగ్రహించుగాక!” అని ఎవరికివారు భావించుచు ఆ కృష్ణభగవానునకు తమ హృదయములను అర్పించిరి. భక్తవాంఛాకల్పతరువగు శ్రీకృష్ణభగవానుడు ఆ రాజకన్యల కోరికను మన్నించెను.


అప్పుడు సుస్నాతలై నిర్మలములైన వస్త్రములను, ఆభరణములను ధరించియున్న ఆ రాజకన్యలను శ్రీకృష్ణుడు పల్లకీలలో ద్వారకకు పంపెను. అంతేగాక వారితోపాటు సంపదలను, రథములను, హయములను, అమూల్యములైన వస్తువులను పంపెను.(శ్రీకృష్ణుడు వారందరినీ ఒకేసారి 16 వేల రూపాలు ధరించి వివాహం చేసుకున్నాడు 16 వేల కృష్ణులు 16 వేల కన్యలు ఒక్క కృష్ణుడు కాదు గమనించాలి)

 **పారిజాతాపహరణం:** 

అదితీ కుండలాలను ఇవ్వడానికి ఇంద్రలోకానికి వెళ్లినప్పుడు, సత్యభామ కోరిక మేరకు దేవలోకంలోని దివ్యమైన **'పారిజాత వృక్షాన్ని'** గరుత్మంతునిపై ఉంచి ద్వారకకు తీసుకువచ్చాడు. ఇంద్రుడు అడ్డుపడగా ఆయనను ఓడించి, సత్యభామ భవన ప్రాంగణంలో ఆ వృక్షాన్ని నాటించాడు.


#5. నారదుని ద్వారకా దర్శనం – 16,108 రూపాల విస్మయం


శ్రీకృష్ణుడు ఒక్కడే 16,108 మంది భార్యలతో ద్వారకలో ఎలా జీవిస్తున్నాడో చూడాలని కుతూహలంతో నారద మహర్షి ద్వారకా నగరానికి వచ్చాడు.(నారదునికి కూడా తెలుసు ఒక్క కృష్ణుడు కాదు 16 వేల కృష్ణులు అని కానీ మనం లాంటి వారి అనుమానాలు తొలగించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు)


అలా వచ్చిన నారదుడు ఒక్కొక్క భవనంలోకి ప్రవేశించి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు:


1. ఒక భవనంలో రుక్మిణీదేవి వింజామర వీస్తుండగా కృష్ణుడు సేదతీరుతున్నాడు.


2. మరొక భవనంలో సత్యభామతో కలిసి భోజనం చేస్తున్నాడు.


3. వేరొక భవనంలో పిల్లలతో ఆడుకుంటున్నాడు; ఇంకొక చోట బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు.


4. ఒక అంతఃపురంలో యజ్ఞం చేస్తుండగా, మరొక చోట మంత్రులతో రాజ్యపాలనా వ్యవహారాలు చర్చిస్తున్నాడు; ఇంకోచోట వేదాంత ధ్యానంలో ఉన్నాడు.


* **పరమాత్మ తత్త్వం:** ఇలా ఏకకాలంలో **16,108 మంది భార్యల భవనాలలో విడివిడిగా 16,108 రూపాలతో** శ్రీకృష్ణుడు పరిపూర్ణ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ దర్శనమిచ్చాడు!


ఆశ్చర్యానికి లోనైన నారదునితో శ్రీకృష్ణభగవానుడు అన్నాడు – “నారదమహర్షీ! నేను

లోకమునకు ధర్మమును ఉపదేశింతును, ఆచరింతును,

దానిని అనుష్ఠించువానిని ప్రోత్సహింతును. కనుక లోకములు నా ధర్మమార్గములను అనుసరించుటకే (ఆచరించుటకే) ఈ లీలలను ప్రదర్శించుచున్నాను. నాయనా! నా ఈ యోగమాయను జూచి నీవు ఆందోళన చెందవద్దు”. అన్నాడు


నారదుడు స్వామి పాదాలపై పడి: *"స్వామీ! యోగీశ్వరులైన బ్రహ్మాదులకు కూడా అందని నీ యోగమాయా వైభవాన్ని ఈరోజు కనులారా చూసి ధన్యుడనయ్యాను"* అని స్తుతించి నిష్క్రమించాడు.

(పాఠకుల సౌకర్యం, స్పష్టత కోసం 16 వేల కన్యల వివాహం, గృహస్థ జీవితం పక్క పక్కనే ఇచ్చాను భాగవతం లో ఈ మధ్యలో 9 అధ్యాయాల కథ ఉంటుంది ఇది ఒకేసారి జరిగిన లీల కాదు గమనించగలరు) 


ఇక్కడ వదిలి వేసిన అధ్యాయాలు  కూడా మన షెడ్యూల్ లో లేవు రేపటితో దశమ స్కంధం పూర్తి చేయాలి, బుధవారం ఏకాదశ స్కంధం, గురువారం ద్వాదశ స్కందాలు ప్రస్తావన చేసుకుని ముగించడం ఈ ప్రణాళిక, ఇప్పటి వరకు దశమ స్కంధం లో ఏ అధ్యాయంలో, లీల కూడా వదల లేదు,ఈ 8 అధ్యాయాలలో  ప్రధానంగా శ్రీకృష్ణ పుత్రుల గురించి ఉంటుంది. చూస్తాను వీలైతే రేపు ఆ లీలలే పోస్ట్ చేసి ఎల్లుండి తదుపరి లీలలు చదువుకుందాం స్వామి ఎలా అనుగ్రహిస్తే అలా.


ఇప్పటి వరకు పూర్తిగా ఏ విషయం వదలలేదు,పంచమ స్కంధంలో భూగోళ వర్ణన, నవమ స్కంధం లో అన్ని విషయాలు కూడా క్లుప్తంగా అయినా సరే చెప్పాను


మొత్తం భాగవతం అందించడం కొద్దిగా కష్టం అసాధ్యం కాదు కానీ సుదీర్ఘ కాలం పోస్ట్  చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమో స్వామి అనుగ్రహిస్తే అది కూడా జరగవచ్చు. ఇప్పటికి ఇలా అనుగ్రహించాడు.


కానీ ఇప్పుడు ఈ వేదిక మీద,మనం అనుకున్న సమయంలో ఎంత అందించ గలనో అంత నా చేత మీకు ఈశ్వరుడు అందిస్తూ ఉన్నాడు,రాసేది, రాయించేది అన్ని శ్రీకృష్ణుడే నేను నిమిత్త మాత్రుణ్ణి. రేపు కలుసుకుందాం శ్రీ కృష్ణ శరణం మమ 🙏


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **దీపావళి పర్వదిన విశిష్టత:** నరకాసుర సంహారం జరిగి లోకాలకు చీకటి తొలగి వెలుగు వచ్చిన రోజే 'నరక చతుర్దశి' మరియు 'దీపావళి' పండుగగా లోకమంతా జరుపుకుంటుంది.(ఈ విషయం ఇక్కడ చెప్పలేదు వేరొక చోట ఉన్నది)


2. **స్త్రీ గౌరవం – ఆశ్రయం:** రాక్షసుని చెరలో ఉన్న 16,100 మంది కన్యలను సమాజం బహిష్కరించకుండా, వారికి పట్టపురాణుల హోదాను ఇచ్చి రక్షించిన పరమ దయామయుడు శ్రీకృష్ణుడు.


3. **సర్వవ్యాపక గృహస్థ ధర్మం:** నారదునికి 16,108 రూపాలలో దర్శనమివ్వడం ద్వారా... భగవంతుడు ఏకకాలంలో ప్రతి భక్తుని హృదయంలో, ప్రతి ఇంటా నివసిస్తున్నాడనే అనంత తత్త్వాన్ని భాగవతం నిరూపించింది.


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

భాగవతం వింటే

  *"భాగవతం వింటే బాగవుతాం"*

_శ్రీ పోతన భాగవత మధురిమలు_ 


(8-590-శా)

కారేరాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై

యీరేకోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!


*భావము:-* శుక్రాచార్యా! పూర్వ కాలంలో కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించునవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.


శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనతో శుభోదయం 


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

భగవద్గీతలోని

 భగవద్గీతలోని ఏఅధ్యాయం చదివితే ఏఏ ప్రయోజనాలు, ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..........!!


1.అర్జున విషాదయోగం.!

ఈఅధ్యాయం చదవడంవలన చదివినవారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. (పూర్వజన్మపాపాలు తొలగుతాయి)


2.సాంఖ్య యోగం.!

ఈఆధ్యాయం చదవడంవలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది.అలౌకిక శక్తి లభిస్తుంది. 

(సుఖశాంతులు కలుగుతాయి)


3.కర్మయోగం.!

ఈఅధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యలవలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది. (తనవారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది)


4, 5.జ్ఞానయోగం, కర్మ సన్యాసయోగం.!

ఈఅధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమగతిని పొందుతాయి. 

నాల్గవ అధ్యాయంవలన భయద్వేషాలు, 

ఐదవ అధ్యాయంవలన మహాపాపాలు తొలగిపోతాయి.


6.ఆత్మ సంయమయోగం.!

ఈఅధ్యాయం చదివినవారికి అన్నదాన, గోదాన, విద్యాదాన ఇలా సమస్తదానాల ఫలితం లభించి విష్ణుసాయుజ్యం పొందుతారు. 

(జ్ఞానసిద్ధి కలుగుతుంది)


7.జ్ఞాన విజ్ఞానయోగం.!

జన్మరాహిత్యం కావాలనుకునేవారు 

ఈఅధ్యాయాన్ని చదివితేచాలు ఉత్తమోత్తమైన 

జన్మ కలుగుతుంది)


8.అక్షర పరబ్రహ్మయోగం.!

ఈఅధ్యాయం చదివినా, విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి. (ముక్తికలుగుతుంది)


9.రాజవిద్యా రాజగుహ్యయోగం.!

ఈఅధ్యాయం చదివితే ఇతరులదగ్గరనుంచి మనం ఏనాడైన ఏదైన వస్తువు ఉచితంగా దొంగతనంగా తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం/ఋణం నశిస్తుంది. (యజ్ఞం చేసినఫలం లభిస్తుంది)


10.విభూతి యోగం.!

ఈఅధ్యాయం చదవడంవలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏవిధమైన పుణ్యం వస్తుందో ఆపుణ్యం వస్తుంది.జ్ఞానం వృద్ధి అవుతుంది. 

(మహా ఐశ్వర్యం లభిస్తుంది) 


11.విశ్వరూప సందర్శనయోగం.!

ఈఅధ్యాయం నిష్టగా పఠించడంవలన భూత, ప్రేత పీడలు తొలగుతాయి.


12.భక్తియోగం.!

ఈఅధ్యాయం శ్రద్ధగా పారాయణచేస్తే మన ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది. 

జ్ఞానదృష్టి కలుగుతుంది. 

(ఏకాగ్రత, భగవంతుని ప్రీతి కలుగుతుంది)


13.క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం.!

ఈఅధ్యాయం చదవడంవలన చండాలత్వం నశిస్తుంది. (కోరిన ఫలము లభిస్తుంది)


14.గుణత్రయ విభాగయోగం.!

ఈ అధ్యాయం చదివితే వ్యభిచారదోషం, స్త్రీహత్యాపాతకం తొలగిపోతాయి. 

(మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది)


15.పురుషోత్తము యోగం.!

ఈఅధ్యాయాన్ని భోజనం చేసేముందు పఠించాలి. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. 

జీర్ణశక్తి పెరుగుతుంది. మోక్షంసిద్ధిస్తుంది. (మహాతపస్సుచేసిన ఫలం లభిస్తుంది)


16.దైవాసుర సంపద్విభాగయోగం.!

ఈఅధ్యాయం చదివినచో చదివినవారితో పాటు విన్నవారికి సైతం బలపరాక్రమాలు సిద్ధిస్తాయి. 

ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. (రాజాధిరాజులా వెలిగిపోతారు)


17.శ్రద్ధాత్రయ విభాగయోగం.!

తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు 

ఈఆధ్యాయాన్ని పఠిస్తే మంచిది. 

సత్వరం ఫలితం కనిపిస్తుంది. 

(అనేక వ్యాధులు దూరం అవుతాయి)


18.మోక్ష సన్యాసయోగం.!

నిరుద్యోగులు ఈఅధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం ఉపాధి లభిస్తాయి. 

అంతేకాదు యజ్ఞంచేసిన ఫలితంకూడా ఈఅధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది. 

(దాన, ధర్మ, యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది).

ఆనెకాయలు , పులిపిరులు

 ఆనెకాయలు , పులిపిరులు , కాలిపగుళ్ళు హరించుటకు సులభ చిట్కాలు -


• ఉత్తరేణి చెట్టు సమూలం తెచ్చి ఎండబెట్టి దానిని భస్మం చేసి దానికి సమానంగా హరిదళం కలిపి నూనెతో నూరి లేపనం చేయుచుండిన యొడల ఆనెకాయలు , కాళ్ళు , చేతులు పగుళ్లు హరించును. కలిపేప్పుడు ఏ నూనెని అయినను వాడవచ్చు.


• దాల్చినచెక్క బూడిద , సున్నం సమానంగా నూనెతో కలిపి నూరి రాయుచుండిన యొడల ఆనెలు , కాళ్లు , చేతులు పగుళ్లు హరించును.


• గుగ్గిలముని వెన్నపూసతో కలిపి మర్దించి లేపనం చేసిన యెడల కాళ్లు , చేతుల పగుళ్లు హరించును.