30, అక్టోబర్ 2026, శుక్రవారం

వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల

 మానవ శరీరంలోని వ్యర్ధాలను బహిష్కరించు అవయవాల గురించి వివరణ  - 


      మానవ శరీరం ఒక సజీవమైన యంత్రం శరీరము నందు ఎలాంటి అన్యపదార్ధము చేరినను దానిని బయటకి బహిష్కరింప చేయుటకు శరీరము పనిచేస్తుంది . ఉదాహరణకు కాలుకు ముల్లుగాని , కొయ్యగాని గుచ్చుకొని విరిగిన దానిని శరీరము నుంచి బయటకి పంపుటకు చీముపట్టి ఆ తరువాత సులభముగా బయటకి వచ్చును. ఇదే విధముగా శరీరంలోని అంతరావయవములలో ఏదేని మలపదార్దము ( అన్య పదార్థము లేదా రోగ పదార్థము ) చేరినచో అది బయటకి పంపుటకు శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు పనిచేయును . ఇప్పుడు వాటి గురించి మీకు వివరిస్తాను .  అవి 


     *  ప్రేవులు . 

     *  మూత్రపిండములు . 

     *  ఉపిరితిత్తులు . 

     *  చర్మము . 


  *  ప్రేవులు  - 


        మల పదార్థము మొదట ప్రేవులలో నిలువచేరి వివిధ వ్యాధులను కలుగచేస్తుంది . అందువలనే      " సర్వరోగా మలాశయః " అన్నారు. ఈ మల పదార్థం మలబద్ధక సమస్య వలన బయటకి వెళ్లక ప్రేవులలో నిలువ ఉండి అచ్చట కొంతకాలానికి మురిగిపోయి విషవాయువులు తయారైయ్యి రక్తములో కలిసి ప్రవహించి ఇతర అంతర అవయవములకు అవరోధము కలిగించి రోగములను కలుగచేయును . 


                మలబద్ధకం వలన మొదట అజీర్ణము చేయును . అజీర్ణము వలన విరేచనములు ఆ తరువాత బంక విరేచనాలు , రక్తవిరేచనాలు , అమీబియాసిస్ , అసిడిటీ , అల్సర్ ఇలా ఒకదాని తరువాత ఒకటి వచ్చును. ఇవన్నియు జీర్ణకోశ సంబంధ వ్యాదులు. ఈ వ్యాధులన్నింటికి మలబద్ధకమే కారణం . ఈ సమస్య ప్రారంభములోనే జాగ్రత్తవహించని యెడల దీర్ఘకాలిక వ్యాధిగా మారి తరువాత తీవ్ర సమస్యలు తెచ్చును . 


*  మూత్రపిండములు  - 


 ప్రేవులు పూర్తిగా పనిచేయని స్థితిలో శరీరంలోని మాలిన్యములు బయటకి పంపుటకు మూత్రపిండములు బాగుగా పనిచేయవలసి ఉంటుంది. అందుకే మలబద్దకం సమస్య ఉన్నవారికి మూత్రం అధికంగా వచ్చును. కొంతకాలమునకు మూత్రపిండములు కూడా అలసిపోయి చెడిపోవును . కావున మూత్రపిండములలో రాళ్లు , మూత్రనాళములో రాళ్లు , మూత్రకోశములో రాళ్లు మొదలగు వ్యాధులు సంభవించును . దీనివల్ల రక్తములో మూత్రము కలియుట , రక్తపోటు మొదలగు సమస్యలు కలుగును. 


 *  ఊపిరితిత్తులు  - 


     మూత్రపిండ వ్యాధులకు మందులు వాడిన శరీరంలోని మురికిని బయటకి పంపుటకు ఉపిరితిత్తులు ప్రయత్నించును. దగ్గు , జలుబు , అలర్జీ , దమ్ము  ద్వారా శరీరంలోని తెమడను బయటకి పంపుటకు ప్రయత్నించును. ఈ సమస్యను కూడా అణుచుటకు మందులు వాడుచున్న శరీరం నందలి మలిన పదార్థము చర్మము క్రిందికి వెళ్లి చర్మవ్యాధులను కలగచేయును . 


 *  చర్మము  - 


     రక్తములో ఉన్న మాలిన్యాలను చర్మము ద్వారా బహిష్కరించుటకు ప్రయత్నించునప్పుడు గజ్జి , తామర , పుండ్లు , గడ్డల రూపములో కనిపించును. దీనిని మనం మందులతో అణిచివేయుచుండిన చర్మవ్యాధి , కుష్టు మొదలగు వ్యాధులు వచ్చును . 


       పైన వివరించిన నాలుగు బహిష్కరణ అవయవాలు చక్కగా పనిచేసినంత కాలం ఏ రోగము దరిచేరదు . ఇందులో ఏ ఒక్కటి తన విధిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా శరీరము అంతా రోగగ్రస్తం అవుతుంది. అంతేకాని శరీరంలో వివిధ అవయవములకు సంబంధం లేదు అనుకోకూడదు. 


             ఈవిధముగా శరీరంలోని నాలుగు బహిష్కరణ అవయవాలు మందుల వలన దోషపూరితమై ఒకదాని పని ఇంకొకటి చేసి రోగగ్రస్తము అగును. కావున సమస్య మొదలగు క్రమము నందే సరైన జాగ్రత్తలు పాటించి ఎప్పటికప్పుడు శరీరంలోని మాలిన్యాలను బయటకి పంపవలెను. 


            ఈ మధ్యకాలంలో చాలా మంది ఉదయాన్నే లేవగానే మలవిసర్జనకు వెళుతున్నాము .మలబద్ధక సమస్య లేదనుకుంటున్నారు. నిజానికి రోజుకు రెండుసార్లు మలవిసర్జన చేయుట అత్యుత్తమ పద్దతి. అదేవిధముగా ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధములు తీసుకుని ఉదరమును మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలెను. ఉదయాన్నే మలవిసర్జన చేసినప్పుడు బయటకి వెళ్లునది కేవలం 60 % మాత్రమే . మిగిలిన 40 % ప్రేవులకు పట్టి ఉండును. అది అలా మురిగిపొయి విషవాయువులు వెలువడి రక్తములో కలిసి శరీరంలోని మిగతా అవయవాలకు చేరుకుని ఆయా అవయవ సంబంధ రోగాలను కలుగ చేయును . కావున ఋతువు మారినప్పుడల్లా విరేచనౌషధాలను తీసుకుని ఉదరము మరియు ప్రేవులను శుభ్రపర్చుకోవలసిందిగా ముఖ్య సూచన . 


                          సమాప్తం 


        

దేవుని ముందు

  *దేవుని ముందు కళ్ళు మూసుకుని ప్రార్థించడం ఎందుకు?*



గుడికి వెళ్లినప్పుడు లేదా పూజ చేసేటప్పుడు విగ్రహం ఎదురుగా నిలబడి కూడా చాలామంది కళ్లు మూసుకుని నమస్కరిస్తారు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు తాత్విక కారణాలు ఉన్నాయి


☘️🌻🌻🌻🌻🌹🌻🌻🌻🌻☘️


1. బాహ్య దృష్టి నుండి అంతర్దృష్టి వైపు (అంతర్ముఖం కావడం)

కళ్లు తెరిచి ఉన్నంతసేపు మన దృష్టి చుట్టూ ఉన్న వాతావరణం, తోటి భక్తులు, ధరించిన వస్త్రాలు, ఆభరణాలు వంటి భౌతిక విషయాలపై పడుతుంది. దీనివల్ల మనస్సు సులభంగా చలిస్తుంది (Distract అవుతుంది). కళ్లు మూసుకోగానే బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయి, మనస్సు అంతర్ముఖమై పరమాత్మ వైపు నిశ్చలంగా కేంద్రీకృతమవుతుంది.


☘️🌻🌻🌻🌻🌹🌻🌻🌻🌻☘️


2. బింబ-ప్రతిబింబ భావన (హృదయ మందిరంలో దైవ దర్శనం)

విగ్రహాన్ని కళ్లతో చూడటం ఒక భాగమైతే, చూసిన ఆ దివ్య రూపాన్ని కళ్ల మూసుకుని హృదయ పీఠంపై నిలుపుకోవడం అసలైన ఆరాధన.


విగ్రహం అనేది కేవలం ఒక మాధ్యమం (ప్రతిమ).


కళ్లు మూసుకున్నప్పుడు, మనం చూసిన ఆ దివ్య స్వరూపాన్ని మన అంతరాత్మలోనే సాక్షాత్కరించుకుంటాం. "సర్వవ్యాపి అయిన భగవంతుడు నాలోనే ఉన్నాడు" (అహం బ్రహ్మాస్మి / ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి) అనే అద్వైత భావనకు ఇది ప్రతీక.


☘️🌻🌻🌻🌻🌹🌻🌻🌻🌻☘️


3. ఇంద్రియ నిగ్రహం & ఏకాగ్రత

మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన జ్ఞానేంద్రియం కన్ను. మెదడు స్వీకరించే సమాచారంలో 80% పైగా కళ్ల ద్వారానే వెళ్తుంది. కళ్లు మూయడం ద్వారా మనస్సులోని ఆలోచనల ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది. ఆ నిశ్శబ్దంలోనే దైవ ప్రార్థనలో లీనమయ్యే గాఢమైన ఏకాగ్రత (Dhyana) లభిస్తుంది.


☘️🌻🌻🌻🌻🌹🌻🌻🌻🌻☘️


4. అనుభూతి అనేది కనిపించే రూపం కంటే గొప్పది

జీవితంలో అత్యంత మధురమైన, పరమ పవిత్రమైన అనుభూతులను మనం కళ్లు మూసుకునే ఆస్వాదిస్తాం


గాఢమైన ఆనందం వచ్చినప్పుడు


శాంతిని అనుభవించేటప్పుడు


తల్లి లేదా పిల్లలను ఆలింగనం చేసుకున్నప్పుడు


సంగీతంలో లీనమైనప్పుడు

అలాగే భగవత్తత్త్వం అనేది కేవలం చూసే వస్తువు కాదు; అది అనుభవించాల్సిన అమృత భావన. ఆ దివ్య అనుభూతిని పొందడానికే ప్రార్థనలో కళ్లు మూసుకుంటారు


 *సరియైన పూజా విధానం*


> శాస్త్రం ప్రకారం, ముందుగా స్వామివారి దివ్య మంగళ రూపాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు కనులారా దర్శించాలి (పాద సేవ నుంచి ముఖారవిందం వరకు). ఆ రూపాన్ని మనసులో ముద్రించుకున్న తర్వాత, కళ్లు మూసుకుని హృదయంలో ఆ రూపాన్ని ధ్యానిస్తూ ప్రార్థించాలి.

A Best Collection from Brahmana Samaakya

ఆఖరి ప్రయాణం*

  *ఆఖరి ప్రయాణం*


ఓ అర్ధరాత్రి, తెల్లటి లాల్చీ-ధోవతి ధరించిన ఓ వృద్ధుడు నా క్యాబ్‌ ఎక్కి, ఐదు చోట్లకు తీసుకెళ్లమని నా చేతిలో 5000 రూపాయలు పెట్టారు. ఆ రాత్రి ఆయన నన్ను తీసుకెళ్లింది రోడ్ల మీద కాదు… తన ఎనభై ఒక్క ఏళ్ల జ్ఞాపకాల లోతుల్లోకి. పిల్లలను పెంచిన పాత ఇల్లు, నలభై ఏళ్లు పాఠాలు చెప్పిన బడి, ప్రాణంగా ప్రేమించిన భార్యను తొలిసారి కలిసిన కాఫీ హౌస్, ఆమే బూడిదైన శ్మశానం… చివరగా ఆయన ఆగిన చోటు క్యాన్సర్ వార్డు. ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లే ముందు, తన జీవితాన్ని చివరిసారి చూసుకోవడానికి వచ్చిన ప్రయాణమది.


ఆయన్ని అలా ఒంటరిగా వదిలేసి నా మనసు ఊరుకోలేదు. మరుసటి ఉదయం పూలతో ఆసుపత్రి గది తలుపు తట్టాను; ఆపై ప్రతిరోజూ ఆయన వద్దే గడిపాను. రక్తసంబంధాలు ముఖం చాటేసిన ఆ వేళ, కాసేపు కబుర్లు, వేడి టీ, చేతి స్పర్శతో ఆ ఒంటరి గుండెకు తోడయ్యాను. మంగళవారం వేకువజామున 3:17 నిమిషాలకు మానిటర్ చప్పుడు మూగబోయే క్షణాన… ఆయన చెయ్యి పట్టుకుని నేనున్నాను.


ఆయన ఇచ్చిన ఆ ఐదు వేల రూపాయలు నా కారులోని చిన్న అరలోనే ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఎందుకంటే, ఆ రాత్రి ఆయన నాకు నేర్పింది ప్రయాణపు విలువ కాదు, మనుషుల విలువ. ఇప్పుడు నా కారు ఎక్కే ప్రతి అపరిచితుడిలో కేవలం ఒక ప్రయాణికుడే కాదు… చూడబడాలని, ఓదార్పు కోరుకునే ఒక నిండు జీవితం కనిపిస్తుంది.


*ప్రతి అపరిచితుడి వెనుకా ఒక నిండు జీవితం ఉంటుంది; కొన్నిసార్లు మనం ఇచ్చే చిన్నపాటి ఆప్యాయతే వారికి దక్కే ఏకైక ఆశ్రయం.*

కాశీలో నివాసం

  🌹మహాదేవ మహా నగరి 🌹


కాశీలో నివాసం - ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుమతిస్తే వచ్చేది*


కాశీలో ఇల్లు కొనడం తేలిక, కానీ కాశీలో ఉండటం చాలా కష్టం. కాశీలో ఉండటాన్ని "కాశీవాసం" అంటారు, అది ఒక యోగం. అది అద్దెకు ఉండటం కాదు, ఒక సాధన.


 ఎంతోమంది ఋషులు ఎందుకు ఉండలేకపోయారు?


పురాణం ప్రకారం కాశీలో ఉండాలంటే శివుడి పరీక్ష పాస్ కావాలి. కాశీ విశ్వనాథుడే స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు.


అతిపెద్ద ఉదాహరణ వ్యాస మహర్షి స్వయంగా.


వ్యాసుడు కాశీలో ఉంటూ భిక్ష కోసం తిరిగితే, కాశీలో ఎవరూ భిక్ష వేయలేదు. మూడు రోజులు ఆకలితో ఉన్న వ్యాసుడు కోపంతో "కాశీలో ఇక ఎవరికీ తిండి, చదువు, భక్తి దొరకకూడదు" అని కాశీని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణా దేవి స్వయంగా వచ్చి ఆయనకు భోజనం పెట్టి, "కాశీలో అహంకారంతో, కోపంతో ఉండలేవు, కేవలం శరణాగతితోనే ఉండగలవు" అని చెప్పింది. వ్యాసుడిని కూడా కాశీ 3 రోజులు బయటకు పంపించింది.


అంటే కాశీలో అహంకారం, నేను అనే భావం, డబ్బు గర్వం, కోపం ఉన్నవారు ఉండలేరు. కాశీ వారిని బయటకు విసిరేస్తుంది. ఏదో ఒక కారణంతో వారికి ఇక్కడ ఇబ్బందులు వచ్చి వాళ్ళే వెళ్ళిపోతారు.


అందుకే స్కాంద పురాణం చెబుతుంది - "కాశ్యాం మరణం ముక్తిః" అంటే కాశీలో చావు ముక్తి, కానీ "కాశ్యాం వాసః దుర్లభం" కాశీలో నివాసం దొరకడం దుర్లభం.


 మరి అక్కడే ఉండి మరణించిన మహాత్ములు ఎలా సాధన చేశారు?


కాశీలో ఉండి ముక్తి పొందిన వారు ఇల్లు కట్టుకోలేదు, వారు తమ అహంకారాన్ని కూల్చుకున్నారు.


1. తైలంగ స్వామి (160 సంవత్సరాలు కాశీలో ఉన్నారు):

ఆయనకు ఇల్లు లేదు, బట్టలు లేవు. అస్సీ ఘాట్ లోనే పడి ఉండేవారు. ఆయన సాధన ఏమిటంటే - "నేను లేను, అంతా శివుడే" . ఎవరు తిట్టినా, కొట్టినా, పూజించినా సమానంగా చూసేవారు. కాశీ ఆయనను తన బిడ్డలా చూసుకుంది.


2. కినారామ్ అఘోరీ:

శ్మశానంలోనే ఉండేవారు. ఆయన సాధన జుగుప్సాను జయించడం . మురికిలో కూడా శివుడిని చూడటం. కాశీలో పవిత్రం, అపవిత్రం అనే తేడా లేదు అని నిరూపించారు.


3. లహిరి మహాశయులు:

ఇంట్లో సంసారిగా ఉంటూనే సాధన చేశారు. ఉద్యోగం చేస్తూ, పిల్లలను పెంచుతూ కాశీలోనే క్రియా యోగాన్ని పంచారు. ఆయన సాధన "కర్మలోనే ముక్తి".


వీరి సాధనలో 3 సూత్రాలు కామన్ గా కనిపిస్తాయి:


అ) అన్నాన్ని గౌరవించడం: కాశీ అన్నపూర్ణది. అన్నాన్ని వృధా చేయకూడదు, ఎవరొచ్చినా అన్నం పెట్టడం.


ఆ) మణికర్ణికను గుర్తుంచుకోవడం: ప్రతిరోజూ శ్మశానం వైపు వెళ్ళి "నేను కూడా ఒకరోజు కాలిపోతాను" అని గుర్తు తెచ్చుకోవడం. అప్పుడు అహంకారం పోతుంది.


ఇ) శివోహం కాదు, దాసోహం: "నేను శివుడిని" అని కాశీలో అనకూడదు. "నేను శివుడి కుక్కని, శివుడి సేవకుడిని" అని ఉండాలి. అంత వినయంగా ఉంటేనే కాశీ మిమ్మల్ని ఉంచుకుంటుంది.


 కాశీలో నివాసం ఉండాలంటే ఏం చేయాలి?


1. మొదట 3 నెలలు అద్దెకు ఉండండి. ఇల్లు కొనకండి. కాశీ మిమ్మల్ని ఉండనిస్తుందో లేదో చూడండి.

2. రోజూ గంగాస్నానం, విశ్వనాథ దర్శనం, ఒక పేదవాడికి అన్నదానం - ఈ మూడు నియమం పెట్టుకోండి.

3. ఎవరితోనూ పోట్లాడకండి, ఎవరినీ మోసం చేయకండి. కాశీలో చేసిన కర్మకు వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది.


కాశీకి మీరు వెళ్లరు, కాశీ మిమ్మల్ని పిలుస్తుంది. పిలిచినప్పుడు మీ సంచులు కాదు, మీ అహంకారాన్ని వదిలి వెళ్ళండి, అప్పుడు కాశీ మిమ్మల్ని ఎప్పటికీ వదలదు.

                సదా మీ సేవ 🙏

త్వం త్రాతా తరణో చేత్యో భూః

  త్వం త్రాతా తరణో చేత్యో భూః

🟢🔴🔵🟡🙏🟡🔵🔴🟢


 పితా మాతా సదమిన్మానుషాణామ్


ఓ పరమేశ్వరా! నీవు రక్షకుడవు, దాటించువాడవు, జ్ఞేయమవు, ఉనికివి,ఎల్లవేళలా ఈ మనుష్యులకు తండ్రివి, తల్లివి (ఋగ్వేదం)


పరమేశ్వరునకు, మనకీ ఉన్న బంధాన్ని ఈ మంత్రం ద్వారా వేదమాత తెలియజేస్తోంది. ఈ పరమేశ్వరతత్త్వాన్ని ఎవరు ఏ సంప్రదాయంలో కొలిచినా ఈ

భావనను మనసులో ప్రతిష్ఠితం చేసుకుంటే చాలు.


1. త్రాతా:


రక్షకుడు. 'ఆర్తత్రాణ పరాయణుడు' వంటి భక్తి భావనలకు ఆధారమైన వైదిక మంత్ర ప్రతిపాదనలలో ఇది ఒకటి. జీవులకు ఆర్తిలో స్ఫురించవలసిన మహిమాన్విత

తత్త్వం భగవానుడే.


2. రణ


దాటించువాడు. దీనికి భౌతికస్థాయిలో 'కష్టాల నుండి గట్టెక్కించుట' అని

చెప్పుకోవచ్చు. కానీ అసలైన పారమార్థిక ప్రయోజనం 'అవిద్యారూప సంసారసముద్రము నుండి దాటించువాడు' అనే అర్థాన్ని స్వీకరించాలి.మోక్షయిష్యామి

మాశుచః' వంటి గీతావాక్యాలు ఇక్కడ స్ఫురణకు వస్తాయి.


3. చేత్య :


తెలుసుకోవలసినవాడు. విచారణ ద్వారా, ఉపాసన ద్వారా తెలియబడేవాడు.

ఈయనను తెలుసుకొనుటే జీవితానికి పరమార్థం. భగవదనుభవమే 'తెలుసుకొనుట'.భక్తి దృష్టితో 'ఈశ్వర సాక్షాత్కారం', వేదాంత పరిభాషలో 'బ్రహ్మజ్ఞానం'. ఈశ్వర స్పృహ, అనుభవం ప్రధానమని తాత్పర్యం. 'మధువైరి దవిలిన మనము

మనము-పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి' అనే భాగవత ధర్మం ఇందులో ధ్వనిస్తోంది.


4. భూః


సదా ఉండువాడు. అందరికీ ఆధారమై, అన్నిటినీ కలిగించు అధిష్ఠాన రూప పరమాత్ముడితడు. 'సత్' అనే మాటకి ఇదే అర్థం.


5. పితా, 6. మాతా


తల్లి, తండ్రి. ఈ శబ్దాలు కారణత్వాన్ని సూచిస్తున్నాయి. సర్వకారణుడైన సర్వేశ్వరుడు తలిదండ్రుల వలె కారణమై, పోషకమై, రక్షకమై ఉన్నవాడు.


ఈ రెండు మాటలతో పరమాత్మకు మనమెంతటి దగ్గరివారమో, ఆయనతో మనకుండవలసిన చనువు ఎంతటిదో అర్థమౌతుంది.


'మానుషాణామ్' అనే మాటకి 'ఆలోచన (జ్ఞానం) కలిగిన వారికి' అనే అర్థాన్ని స్వీకరించవచ్చు(మన అవబోధనే... అనే ధాతు అర్థాన్ని అనుసరించి). భారతీయ

సంస్కృతిలోని భక్తి భావనకు వైదికమైన ఇటువంటి మంత్రాలే ఆలంబన. 'నీవే తల్లివి తండ్రివి', 'త్వమేవ మాతా చ - పితా త్వమేవ' - వంటి భాగవతుల వచనాలకు

ఆలంబనమైన వైదిక సంప్రదాయమిది.


ఈ ఆరు బంధాలను భావన చేస్తుంటే క్రమంగా 'ఆ పరమాత్మయే సమస్తము'

అనే సిద్ధి లభిస్తుంది. 


మనకు శాశ్వతబంధం భగవంతునితోనే ఉంది. మిగిలినవన్నీ కర్మబంధాలు, పరిమితాలు. ఈ నిత్యబంధువుని విస్మరించనివాడే ధన్యుడు.


🔴🔵🟡🟢🙏🟢🟡🔵🔴


*నాహం కర్త*🙏*హరి కర్తా*


*కర్తను నేను కాదు,చేసేది చేయించేది అంతా శ్రీహరి*


🔴🟣🔵🟢🙏🟢🔵🟣🔴



*సమస్త దేవతల శుభాశీస్సులతో...*

*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*


*సర్వేజనాః సుఖినోభవంతు!*


*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*

*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*

*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*


*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*

*అందరికీ శుభమే జరుగుగాక!*


*సర్వేషాం శాన్తిర్భవతు!*

*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*


*సర్వేషాం పూర్ణంభవతు!*

*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*


*సర్వేషాం మంగళం భవతు!*

*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*

🙏🌹☘️🌹☘️🌹🙏


*వేదఆశీర్వచనము 👇*