*సముద్రానికి జ్వరమే ఎల్ నినో!!*
పగలు, రాత్రి భరించలేని వేడి, చెమటలు, ఒకటే ఉక్కపోత. దాహం దాహం.. మనుషులు, జంతువులు, మొక్కల బతుకులు తల్లడిల్లుతున్నాయి. రైతు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు.. ఇప్పుడు వర్షం వస్తుందా అని. ఎండాకాలంలో ఉన్నట్లే ఉష్ణోగ్రత ఉంటుంది. దీనికి కారణం ఒకే ఒక మాట - ఎల్ నినో.
ఇది వాతావరణ మార్పు. ఎల్ నినోగా మొదలై, సూపర్ ఎల్ నినోగా మారి, తర్వాత గాడ్జిల్లా ఎల్ నినోగా పరిణామం చెంది వణికిస్తుంది. ఈ మార్పుతో రోజువారీ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
*ఎల్ నినో అంటే ఏమిటి?*
పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వేడెక్కిన వాతావరణ పరిస్థితే ఎల్ నినో. ఇది సముద్రానికి వచ్చే జ్వరం లాంటిది. స్పానిష్ భాషలో El Niño అంటే "చిన్న బాలుడు" అని అర్థం.
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో గాలి తూర్పు నుండి పడమరకు వీస్తుంది. వేడినీటిని ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపుకు తోస్తుంది. చల్లని నీళ్లు పెరూ దగ్గర పైకి వస్తాయి. ఎల్ నినో వచ్చినప్పుడు ఈ గాలి బలహీనమై ఆగిపోతుంది. వేడి నీళ్లన్నీ పెరూ వైపే ఉండిపోతాయి. సముద్రం 2 నుండి 4 డిగ్రీలు వేడెక్కుతుంది.
వేద పరంగా చెబితే - ప్రకృతిలో అగ్ని పెరిగితే ఎల్ నినో, నీరు ఎక్కువైతే లా నినా. సమతుల్యం తప్పడమే వైపరీత్యం.
*ప్రకృతిలో మార్పులు ఎందుకు వస్తాయి?*
వేదాలలో చెప్పిన మాట - *"ఋతం తప్పడం"*. ఋతం అంటే - సూర్యుడు సమయానికి రావడం, వర్షం సమయానికి పడటం, సముద్రం చల్లగా ఉండడం. ఇవేమీ జరగడం లేదు. ఎందుకంటే సముద్రం ఋతం తప్పింది.
> _ఋతస్య హి శురుధః సంతి పూర్వీః - ఋగ్వేదం (1.105)_
సముద్రం ఋతుభంగం కావడమే ఎల్ నినో. ఉపనిషత్తుల ప్రకారం ఇది పంచభూతాల అసమతుల్యత.
> _పృథివీ, ఆపః, తేజః, వాయుః, ఆకాశః - తైత్తిరీయ ఉపనిషత్తు_
ఆపః (నీరు) వేడెక్కడం, వాయుః (గాలి) దారి తప్పడం, తేజః (వేడి) పెరగడం - అంటే పంచభూతాల సమతుల్యత తప్పింది. దీన్నే *భూతక్షోభం* అంటుంది ఉపనిషత్తు.
మోడరన్ సైన్స్ చెప్పేది, వేదం చెప్పేది కలిపితే అర్థం ఒకటే - *మనిషి ధర్మం తప్పడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి.*
> _మాతా భూమిః పుత్రో అహం పృథివ్యాః - అథర్వణ వేదం (12.1) భూమి సూక్తం_
భూమిని తల్లిగా పిలుచుకున్నాం, కానీ ఆ తల్లిని బాధపెడుతున్నాం. చెట్లను నరకడం, ప్రపంచాన్ని ప్లాస్టిక్ తో నింపడం, ఫ్యాక్టరీ వ్యర్థాలను గాలిలోకి, నీటిలోకి వదలడం వల్లే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది.
*ఎలా పుడుతుంది?*
సాధారణంగా పసిఫిక్ మీద తూర్పు నుండి పడమరకు బలమైన గాలులు వీస్తాయి. వీటినే Trade Winds - వ్యాపార పవనాలు అంటారు. ఇవి వేడి నీటిని ఆసియా వైపుకు తోస్తాయి. ఆసియాలో గాలి ఒత్తిడి తగ్గడం, పెరూ దగ్గర ఒత్తిడి పెరగడం వల్ల ఈ గాలులు బలహీనపడతాయి. ఈ ఒత్తిడి తేడానే *Southern Oscillation* అంటారు. ఈ తేడా తగ్గితే గాలులు ఆగిపోతాయి. ఆసియా వైపు వెళ్లాల్సిన వేడి నీళ్లు మధ్యలోనే ఆగి పెరూ వైపుకు వస్తాయి. అప్పుడే ఎల్ నినో మొదలవుతుంది.
అలా వేడి నీరు వెనక్కి వచ్చినప్పుడు, సముద్రంలో 100 మీటర్ల లోతున పెద్ద వేడి అలలు ప్రయాణిస్తాయి. దీన్నే *Kelvin Wave* అంటారు. ఈ వేడి వల్ల చల్లని నీళ్లు పైకి రావడం ఆగిపోతుంది. అప్పుడే ఎల్ నినో తన పని ప్రారంభిస్తుంది.
*ఎల్ నినో వల్ల నష్టాలు*
వ్యవసాయ రంగం, ఆర్థిక రంగం దెబ్బతింటుంది. తాగునీరు, సాగునీటికి ఇబ్బంది. వేడి వల్ల మనుషులు రోగాల బారిన పడతారు. చిన్న కీటకాలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని. ఇండోనేషియా, ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు, మనకు కరువులు, ఆకలి బాధలు. శాస్త్రవేత్తల హెచ్చరిక ప్రకారం భయంకర పరిణామాలు ఉంటాయి.
*ఏం చేద్దాం?*
ఎల్ నినో ఇప్పటిది కాదు, వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. కానీ తీవ్రతను మనం తగ్గించవచ్చు.
1. చెట్లను నరకడం ఆపి మొక్కలు నాటుదాం.
2. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. పాఠశాలలు, ఆధ్యాత్మిక సంస్థలను ప్లాస్టిక్ రహితంగా ప్రకటిద్దాం.
3. నీటిని పొదుపుగా వాడుదాం. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల ద్వారా నీటిని ఒడిసి పట్టుదాం. టాప్ లు, పైపుల లీకేజీలు అరికడదాం.
4. ఒక ఇంట్లో నాలుగు వాహనాలు ఉంటే రెండు మాత్రమే వాడుదాం. వీలైనంతవరకు ప్రజా రవాణా వాడుకుందాం.
5. విద్యుత్తు ఆదా చేద్దాం. అక్కర్లేని చోట ఫ్యాన్లు, లైట్లు ఆపేద్దాం.
6. ప్రతి కమ్యూనిటీ సమావేశంలో, పాఠశాల ప్రార్థనలో ఎల్ నినో ప్రభావం గురించి తప్పనిసరిగా చర్చిద్దాం.
*పొదుపు పాఠశాలలో ప్రారంభమై, గ్రామపంచాయతీల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి. ప్రకృతిని కాపాడుదాం... ప్రకోపాన్ని తగ్గిద్దాం.*