అన్నకోశం – అష్టాదశ పురాణాలు
పరమాచార్య స్వామివారు చెన్నైలో కొన్ని నెలలపాటు మకాం చేసారు. అక్కడినుండి బయలుదేరి వారు పూనమల్లె రోడ్డులో ఉన్న నూమ్బల్ లో ని ఇటుక పెంకుల తయారి కర్మాగరంలో మకాం చేస్తున్నారు. ఒకరోజు సాయింత్రం నేను కలకత్తా నుండి వచ్చిన ఒక సేఠ్ తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు. మామూలుగా నేను స్వామివారికి సాష్టాంగం చేసాను. ఆ సేఠ్ కూడా అలాగే చేసాడు. ఇద్దరము స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్దాము.
స్వామివారు ఒక్కసారిగా మావైపు చూసి తలెత్తి నాతో, “అప్పుడు నాకు ఒకసారి చెప్పావు. . . అది ఇతని గురించేనా?” అని అడిగారు. జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వెయ్యడంలో స్వామివారి శక్తి అమోఘం. నేను వారు అడిగినదానికి ఏకీభవిస్తూ “చాలాకాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకుని వచ్చాను” అని వినయంగా బదులిచ్చాను.
ఇతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ సేఠ్ చాలా ధార్మికుడు. కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామయాణ, మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు. నేను హిందీలో కూడా వ్యాఖ్యానించడం వల్ల చాలామంది ఉపన్యాసాలకు వచ్చేవారు. ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ, వారి తపశ్శక్తి, వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడిని. తరువాతే అసలు ప్రవచనం చెప్పేవాడిని. ఇలా చాలా సంవత్సరాలనుండి పాటిస్తున్నాను.
భగవంతుడు ఆ సేఠ్ కు అన్నిరకాల భోగభాగ్యాలను ఇచ్చాడు కానిఇ వాటితో పాటు ఒక పెద్ద బాధను ఇచ్చాడు. అతడు నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడి దురదృష్టం. అతని అన్ననాళం (నోటి నుండి కడుపుకి ఆహారం వెళ్ళే మార్గం) పనిచెయ్యదు. కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి. ఎంతటి నరకం అది. దాన్ని అనుభవిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు.
ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు. వైద్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని కూడా కలిసాడు. వెళ్ళని దేవాలయం లేదు. మొక్కని దేవాలయం లేదు. ప్రార్థనలు, పూజలు, యంత్రాలు, తంత్రాలు అన్నిటిని చేసాడు. కాని ఏ ఒక్కదాని వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని చివరైకి వారైనా తనకు ఈ బాధనుండి విముక్తి కలిగిస్తారేమోనని అతని ఆశ.
ఒకసారి నాతో ఇద్దరము కలిసి చెన్నై వెళ్ళవలసిందే అని పట్టుబట్టాడు. కాని పరమాచార్య స్వామివారి అనుమతి లేకుండా అతణ్ణి తీసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది. నేను చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పాను. వెంటనే నాకు చెన్నైకి విమానం టికెట్ తిసిచ్చాడు. నేను చెన్నై వెళ్ళగానే పరమాచార్య స్వామి వారికి విషయమంతా చెప్పి అతణ్ణి తీసుకుని రావడానికి వారి అనుమతి కోరాను. నా ప్రవచనాల గురించి అడిగారు కాని దాని గురించి ఏ విషయము చెప్పలేదు. ఆ విషయం మళ్ళా గుర్తుచెయ్యగా ఖండితంగా “ఇప్పుడు కాదు” అని అన్నారు. ఈ విషయం ఆ సేఠ్ కి చెప్తే బాధపడతాడని నా ప్రవచనాలు అయిపోయాక తీసుకుని వెళ్తానని చెప్పాను.
స్వామివారి అనుమతి లేకున్న ఇప్పుడు అతణ్ణి తీసుకుని రావాడం నా తప్పే, కాని సేవాభావంతో అతణ్ణి తీసుకుని వచ్చాను. మనకు జరిగి ప్రతి మంచి చెడు మన పూర్వజన్మ పాప పుణ్యాల ఫలమే. ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే. వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది. అలా వరుస కష్టాలు అనుభవిస్తున్నమంటే మన పాపం అంతా పోతున్నట్టే. వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇటువంటి మంచిచెడ్డల విషయంలో పరమాచార్య స్వామివారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి.
మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు. అందుకే వారిని కలావడానికి స్వామివారు ఇష్టపడరు. నేను స్వామికి కొంచం దూరంగా నిలబడి వారికి పదే పదే గుర్తుచేస్తున్నాను. కాని స్వామివారు ఏమి చెప్పలేదు. రాత్రి అయ్యేటప్పటికి సెలవు తీసుకుని ఉదయం రావడానికి వారిని సమీపించాను. వారు నా భావన గ్రహించి “అతని విషయంలో ఏమి చెయ్యలేము. అతణ్ణి తీసుకుని వెళ్ళు. దేవునిపై భక్తితో, మంచి పనులు చేస్తూ ఉండమను. ఆ దైవమే అతణ్ణి రక్షించగలదు” అని చెప్పారు.
నేను కొంచం సాహసించి స్వామివారితో, “చలా ఏళ్ళుగా అతను ఎన్నో మంచిపనులు చేస్తున్నాడు. దీనికి పరిహారమే లేదా? ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా? శాపగ్రస్తులకి, పాపాత్ములకి మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా? భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా? మీరు దయతో అతణ్ణి అనుగ్రహించండి” అని ఆ సేఠ్ పరుపున వాదించాను.
పరమాచార్య స్వామివారు అంతావిని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు. “నేను ఏమి చెప్తే అది అతను చేస్తాడా?” అని అడిగారు.
”ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యమని నేను చెప్తాను”
“ఒకవేళ అతను చెయ్యకపోతే?”
“చేస్తే మంచి జరుగుతుంది, లేకపోతే అనుభవిస్తాడు” అన్నాను. ”నేను చెప్పేది చెయ్యలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చెయ్యగలడా?”
“అతను కోటీశ్వరుడు. మొత్తం ఆస్తి అంతా ఖర్చుపెడతాడు ఆరోగ్యం కోసం” అన్నాను నేను.
”సరే. అలాగైతే మన వేదశాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి పేపరుపై, మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చువేయించి, అన్ని భాగాలను అర్హులైన వేదపండితులకు ఉచితంగా ఇవ్వాలి. అతను చేస్తాడా? చెయ్యగలడా?” అని అడిగారు.
”చెయ్యగలడు. చెయ్యమని నేను చెప్తాను” అని అన్నాను.
”పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా? ఏవి పేర్లు చెప్పు”
నేను వాటిని “1.మత్స్య పురాణం, 2.మార్కండేయ పురాణం, 3.భవిష్య పురాణం, 4.భాగవత పురాణం, 5.బ్రహ్మాండ పురాణం, 6.బ్రహ్మ వైవర్త పురాణం, 7.బ్రహ్మ పురాణం, 8.వామన పురాణం, 9.వరాహ పురాణం, 10.విష్ణు పురాణం, 11.వాయు పురాణం, 12.అగ్ని పురాణం, 13.నారదీయ పురాణం, 14.పద్మ పురాణం, 15.లింగ పురాణం, 16.గరుడ పురాణం, 17.కూర్మ పురాణం, 18.స్కంద పురాణం” అని చెప్పి నా వాదన వల్ల మంచి జరిగినందుకు సాంతోషించాను.
నేను సేఠ్ ని పిలిచి విషయం అంతా వివరించాను. అతను చాలా సంతోషంతో “అవును నేను చేస్తాను” అని కన్నీళ్ళతో పరమాచార్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు. మహాస్వామి వారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు.
అతను తన స్వస్థానం చేరగానే మొదట ఈ పని మొదలుపెట్టాడు. అతని పెద్ద కార్యాలయ భవంతిలో ఒక అంతస్థు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు. చాలా రాష్ట్రాల నుండి వైదిక పండితులను, పురాణాలాలో నిష్ణాతులను పిలిపించాడు. అందరిని సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మంచి కాగితంపై, మంచి నాణ్యతతో పెద్ద పుస్తకాలను అచ్చువేయించి స్వామి వారి ఆజ్ఞమేరకు అర్హులైన పండితులకు పంచాడు. ధర వేసే చోట “ప్రేమతో” అని రాయించాడు.
అతని అనారోగ్యం తగ్గుతోందా? అసలు తగ్గుతుందా లేదా? అన్నది కూడా పట్టించుకోకుండా, కనీసం ఇసుమంతైనా అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంధాలుగా వచ్చాయి. కాని అతను అనారోగ్యం మాత్రం సరిపోలేదు. ఇంత మహత్కార్యం జరగుతున్నప్పుడు కూడా మునుపటి లానే ఆహారం తీసుకునేవాడు.
ఇక చివరగా స్కాంద పురాణం పని మొదలుపెట్టగానే హఠాత్తుగా అందరిలాగే నోటితో తినడం మొదలుపెట్టాడు. అతని నాలుకకు రుచి తెలుసుకునే శక్తి వచ్చింది. ఈ జన్మలో జరగదు అనుకున్న వింత జరిగింది. ప్రతిరోజూ ప్రతిక్షణం అనుభవించిన బాధ స్వామి వారి అనుగ్రహంతో పోయింది.
నాకు ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి, “స్వామివారి శక్తియే శక్తి. మీరు అనుగ్రహించిన వరం వల్ల సేఠ్ కి మళ్ళా పునర్జన్మ లభించింది. ఇది కేవలం మీ అనుగ్రహమే. మీరే అతణ్ణి కాపాడారు. మీరే భగవంతుడు” అని వారిముందు నిలబడి కన్నీళ్ళు కారుస్తున్నాను.
అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలు విని నాకు కళ్ళ ముందు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనిపించింది. "మన దేశ ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతణ్ణి కాపాడింది. కాదా?" అని అన్నారు.
నేను కాని, ఇంకెవ్వరూ కాని ఈ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్టు ఎవరూ వినలేదు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్నతరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.
[పద్దెనిమిది పురాణాలను సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఈ శ్లోకం
”మ” ద్వయం ”భ” ద్వయం చైవ “బ్ర” త్రయం “వ” చతుష్టయం |
“అ” “నా” “ప” “లిం” “గ” “కూ” “స్కా” ని పురాణాని ప్రచక్షతే ||
‘మ’ ద్వయం – ‘మ’ తో రెండు మత్స్య, మార్కండేయ
‘భ’ ద్వయం – ‘భ’ తో రెండు భవిష్య, భాగవతం
’బ్ర’ త్రయం – ‘బ్ర’ తో మూడు బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త
‘వ’ చతుష్టయం – ‘వ’ తో నాలుగు వాయు, విష్ణు, వామన, వరాహ
‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ ‘స్కా’ – ఒక్కొక్కటి అగ్ని, నారదీయ, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు]
--- ముక్కూర్ శ్రీనివాస వరదాచార్యర్ స్వామిగళ్, అష్టలక్ష్మి దేవస్థానం, చెన్నై. “పరమాచార్యర్” పుస్తకం నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం