20, డిసెంబర్ 2022, మంగళవారం

కర్కోటకుడు - మంచివాడు

 కర్కోటకుడు - మంచివాడు


శ్రీమఠంతో చిరకాలంగా సంబంధం ఉన్న ఒక భక్తుడు. ఒకసారి పరమాచార్య స్వామివారితో మాట్లాడుతుండగా మరొక వ్యక్తి గురించి నింద చేస్తూ సంభాషించే అవకాశం లభించింది. “ఆ వ్యక్తి పరమ కర్కోటకుడు!” అని అన్నాడు.


ఒక నిముషం తరువాత స్వామివారు, “అతను మంచివాడు అని అంటున్నావా?” అని అడిగారు.


స్వామివారి మాటలు ఆ భక్తునికి అర్థం కాలేదు. “అతణ్ణి నేను భయంకరమైన విషం కలిగిన కర్కోటకుడు అని అన్నాను. . .”


“నీకు ప్రాతఃస్మరణ శ్లోకం తెలుసా?” అని అడిగారు స్వామివారు.


కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ,

ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనమ్.


“కర్కోటక నాగుడు, దమయంతి, నల, ఋతుపర్ణుడు - వీరిని తలచినంతనే పాపాలు పోతాయి. వారందరూ అంతటి పుణ్యవంతులు”


అప్పటిదాకా దూషించిన ఆ భక్తుడు ఇప్పుడు సంకటంలో పడ్డాడు. అంటే ఇప్పటిదాకా అతని గురించి చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ చెడుగా మాట్లాడలేదు అన్నమాట.


“నువ్వే అతడు మంచివాడు అని చెబుతున్నావు. అవును కదా?”

పరమాచార్య స్వామివారి దృష్టిలో అందరూ మంచివారే. అద్వైత ప్రతిష్టాపనాచార్యులైన శంకరులు అధిష్టించిన పీఠానికి పీఠాధిపతులు కదా మన స్వామివారు!


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: