🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
*మనసు లేని మనుషులు (మంచి నీతికథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
***************************
ఒక రైతు దగ్గర ఒక కుక్క వుండేది. అది చానా ముసలిదైపోయింది. గమ్మున పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుకొని నిద్ర పోయేది. చురుకుదనం బాగా తగ్గిపోయింది. అది చూసి ఆ రైతు పెళ్ళాంతో "ఏమే... ఈ కుక్క చానా ముసలిదై పోయింది. కాపలా కూడా సరిగా కాయడం లేదు. ఇది వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక దీనికి తిండి పెట్టడం పెద్ద దండగ. కాబట్టి తీసుకపోయి ఎక్కడైనా దూరంగా పక్కనున్న అడవిలో వదిలేసి వస్తా" అన్నాడు. ఆమె 'సరే' అని తలూపింది.
ఆ మాటలు ఆ కుక్క వినింది. దానికి చానా బాధ వేసింది. అది చిన్న పిల్లగా వున్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి విడదీసి ఎత్తుకొచ్చి, బైటికి పోకుండా ఇంట్లో కట్టేశారు. అమ్మ కనపడక, ఎక్కడ వుందో తెలియక కొద్ది రోజులు కళ్ళ నీళ్లు పెట్టుకున్నా... చివరికి ఇక వీళ్ళనే అమ్మానాన్నలనుకొని వాళ్లు పెట్టింది తింటూ, రాత్రింబవళ్ళూ ఇంటికి కాపలా కాసింది. మాంసం మొత్తం వాళ్ళు తిని ఉత్త ఎముకలు వేసినా ఏమీ అనుకోలేదు. ఉడుకుడుకు అన్నం వాళ్లు తిని చద్దన్నం, పాసిపోయిన అన్నం పెట్టినా బాధ పడలేదు. చల్లని చలికాలం వాళ్లంతా ఇండ్లలో తలుపులు మూసుకొని రగ్గుల మీద రగ్గులు కప్పుకొని పడుకున్నా... వణుకుతూనే ఇంటికి కాపలా కాసింది గానీ ఒక్కమాటా తిట్టుకోలేదు. పొలంలోకి పశువులు రాకుండా, పంటను దొంగలు ఎత్తుకుపోకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాసింది. అలాంటిదాన్ని పట్టుకొని అంత మాట అనడంతో దాని మనసు కలుక్కుమంది.
"ఛ... ఛ... ఇలాంటి యజమాని దగ్గర ఉండడం కన్నా ఏ పాడుబడిన బావిలోనో పడి చావడం మేలు. నన్ను వీళ్లు వదిలేయడమేంది నేనే వీళ్లను వదిలేసి వెళ్ళిపోతా" అనుకుంటా అది పక్కనే వున్న అడవిలోకి బయలుదేరింది. అక్కడ తనలాగే ఇంటిలోంచి గెంటివేయబడ్డ ఇంకో ముసలికుక్క తోడైంది. రెండూ కలసి దొరికినప్పుడు తింటూ, దొరకనప్పుడు ఉత్త నీళ్లు తాగుతూ... ఎప్పుడు ఏ క్రూర జంతువు మీదపడి చంపుతుందో అని బెదపడుతూ భయంభయంగా బతకసాగాయి.
ఆ రైతుకు ఒక పాప వుంది. ఆ పాప పెళ్లి వయసుకు వచ్చింది. దాంతో ఈడు జోడు సరిపోయే ప్రాయం పిల్లోని కోసం చుట్టుపక్కలంతా వెతుకుతా వుంటే ఒక మంచి సంబంధం ఎదురుపడింది. అబ్బాయి చానా మంచోడు. ఎటువంటి చెడు అలవాట్లు లేనోడు. పెద్దలంటే భయభక్తులు వున్నోడు. బాగా చదువుకున్నోడు. ఎలాంటి గలాటాలకు పోనోడు. ఎవ్వరిని అనవసరంగా నోరెత్తి ఒక్క మాట అననోడు. 'అలాంటి వాని చేతిలో కూతురిని పెడితే కలకాలం పిల్లాపాపలతో చల్లగా పెదాలపై చిరునవ్వు తొలగిపోకుండా బ్రతుకుతుంది కదా' అని ఆశపడ్డాడు. ఇద్దరినీ కిందికి మీదికి ఒకటికి పదిసార్లు చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు "ఈ జంట చేతికి వచ్చిన పచ్చని పంటలా వుంది. నుదిటికి తిలకంలా, ముక్కుకు ముక్కెరలా ముచ్చటగా ఉన్నారు. సంబంధం వదులుకోకండి" అన్నారు. పెళ్ళికొడుకు వాళ్లు కూడా ఆ పాపను చూసి "అబ్బ... ఇంటి ముందేసిన చక్కని చుక్కల ముగ్గులా ఎంత పొందిగ్గా వుందీ పిళ్ళ" అని సంబరపడ్డారు. రైతుతో "మేమేమీ కోటలు కోరం. వాటాలు అడగం. పాపకు పది తులాల బంగారు పెట్టి పంపించండి చాలు. పెళ్లి ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుని చుట్టుపక్కల పద్నాలుగు ఊర్లలో వున్న బంధువులనంతా పిలుచుకొని బ్రహ్మాండంగా అరవయ్యారు వంటలతో పెళ్ళి చేస్తాం" అన్నారు.
రైతు ఆ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక 'సరే' అన్నాడు. కానీ పది తులాలు అంటే మాటలు కాదు కదా. అలా అని చెప్పి కన్న కూతురి పెదాలపై చిరునవ్వు కంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఎవరికీ ఏదీ లేదు కదా... అందుకని తనకున్న పది ఎకరాల్లో సగం అమ్మేశాడు. ఆ డబ్బు తీసుకొని కూతురిని పిలుచుకొని నగలు కొందామని అడవికి పక్కనుండే నగరానికి చేరుకున్నాడు.
ఆ నగల దుకాణానికి కొంచెం దూరంలో ఒక దొంగ కాపు కాసి వచ్చీపోయే వాళ్ళని గమనించసాగాడు. వాని కన్ను వీళ్ళ పైన పడింది. రైతుకు ఇది తెలియదు కదా... దాంతో వున్న సొమ్మంతా ఇచ్చి, కూతురికి నచ్చిన నగలు కొనుక్కొన్నాడు. వాటిని శుభ్రంగా ఒక పాత సంచీలో చుట్టి, ఎవరికీ కనపడకుండా అంగీ లోపలి జేబులో భద్రంగా దాచిపెట్టుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దొంగ అది గమనించాడు. దూరం నుంచే వాళ్లను వెంటాడుతా అదను కోసం ఎదురు చూడసాగాడు.
అట్లా ఒక గంట గడిచాక దారిలో జనం బాగా పలుచనయ్యారు. ముందూ వెనుక కనుచూపుమేరలో ఎవరూ కనబడ్డం లేదు. ఇదే సమయం అనుకోని కత్తి తీసుకొని ఎగిరి వాళ్ళ ముందుకు దూకాడు. "నీ లోపలి జేబులో వున్న బంగారు నగలు వెంటనే తీసివ్వు. లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను కసుక్కున పొడిచి పాడేస్తా" అంటూ గట్టిగా అరిచాడు. దొంగను చూస్తానే రైతు కూతురు భయపడి "కాపాడండి... కాపాడండి..." అంటూ గట్టిగా అరిచింది. అది చూసి దొంగ కోపంతో కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోయాడు. రైతు అదిరిపడి చేయి అడ్డం పెట్టాడు. కత్తి చేతికి గుచ్చుకొని రక్తం కారసాగింది. "బాబూ... నీకు కావాల్సింది నగలే కదా. తీసుకో. చిన్నపిల్ల దానినేమీ చేయకు" అంటూ నగలు తీసి వాని ముందు పెట్టాడు.
ఆ పాప గట్టిగా 'కాపాడండి... కాపాడండి...' అంటూ అరిచింది కదా. ఆ అరుపు అడవిలో దూరంగా ఒక చెట్టు కింద పడుకున్న ముసలి కుక్కకు వినిపించింది. అదిరిపడి లేచి కూర్చుంది. ఆ గొంతు తన యజమాని కూతురుది. వెంటనే మిత్రునితో "అడవిలో రైతు కూతురికి ఏదో ఆపద కలిగినట్లుంది దా పోదాం" అంది. దానికి ఆ రెండవ కుక్క "నీ యజమాని ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నాడో అప్పుడే నీకూ వానికీ బంధం తెగిపోయింది. ఎవరు ఎట్లా చస్తే మనకేమి. హాయిగా పడుకో. అసలే ముసలిదానివి. ఎందుకొచ్చిన గొడవ. వాళ్ళ సంగతేదో వాళ్లే చూసుకుంటారులే" అంది.
కానీ ఆ ముసలి కుక్కకి మనసు ఒప్పుకోలేదు. చిన్నప్పటినుంచి తన ముందు తిరిగి పెరిగిన పిల్ల... తనతో పాటు ఆడుకుంటూ అన్నం తిన్న పిల్ల... అది గుర్తుకు వచ్చి రెండవ కుక్కతో "తిట్టినా కొట్టినా వెళ్ళగొట్టినా బంధం బంధమే. అది ఎప్పటికీ తెగిపోదు. మనుషులకు బుద్ధీ జ్ఞానం లేకపోయినా కనీసం జంతువులం మనకన్నా వుండాల కదా. ఆపదలు వచ్చినప్పుడు అనవసరమైన ఆలోచనలు, చర్చలు, వాదోపవాదాలు చేస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. పద పద" అంటూ లేచి అరుపులు వినబడిన వైపు ఉరికింది.
అప్పటికే దొంగ రైతు దగ్గర నగలు తీసుకొని ఆ అమ్మాయి మెడలోని గొలుసు కూడా లాక్కుంటున్నాడు. వాని చేతిలో కత్తి తళతళ మెరుస్తా వుంది. కుక్క అదేమీ పట్టించుకోలేదు. రైతు చేతినుండి కారుతున్న రక్తం, అమ్మాయి కళ్ళలోంచి కారుతున్న కన్నీరు చూడగానే దాని హృదయం బద్దలైంది. ఆవేశంతో ఎగిరి ఆ దొంగ మీదికి దుంకింది. వాడు తిరిగి చూసేలోగా కాలిపిక్క పట్టుకొని కండ వూడి వచ్చేలా గట్టిగా ఒక పెరుకు పెరికింది. దొంగ ఆ నొప్పికి తట్టుకోలేక చేతిలోని కత్తితో దాని కడుపులో కసుక్కున పొడిచాడు. రక్తం సర్రున ఎగజిమ్మింది. అయినా అది వెనుకడుగు వేయలేదు. ఆగలేదు. వాన్ని కొరికినచోట కొరకకుండా ఎక్కడబడితే అక్కడ పెరకసాగింది.
రెండవ కుక్క తన స్నేహితుని కడుపులో రక్తం కారుతుంటే చూడలేకపోయింది. ఒక్కసారిగా ఎగిరి కత్తి పట్టుకున్న ఆ దొంగ చేయి పట్టుకొని గట్టిగా కొరికింది. దాంతో వాని చేతిలోని కత్తి జారి కింద పడిపోయింది. అది చూసి రైతుకు ధైర్యం వచ్చింది. వెంటనే పక్కనే వున్న కట్టె తీసుకొని ఎగిరి వాని తల మీద ఒక్కటి వేశాడు. ఒక వైపు కుక్కలు మరొకవైపు రైతు దాడి చేసేసరికి దొంగకు దిక్కు తోచలేదు. ఎక్కడి నగలు అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటా పారిపోయాడు.
కుక్క కొద్ది రోజులుగా సరైన తిండి లేక చానా బలహీనంగా వుంది. అదీగాక శరీరంలో అప్పటికే రక్తం చానా కారిపోయింది. దాంతో అడుగు ముందుకు వేయలేక ఒకవైపుకు తూలి పడిపోయింది. దాన్ని చూడగానే రైతు కళ్ళల్లో నీరు కారాయి. ఒక్కుదుటన వచ్చి దాన్ని పైకి ఎత్తుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వైద్యుని కోసం పరుగులాంటి నడకతో ఊరి వైపుకు బయలుదేరాడు. కానీ కొంచెం దూరం పోయాడో లేదో పాపం అది అతని ఒడిలోనే ప్రాణాలను కోల్పోయింది. రైతు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. "ముసలిదానివి అయిపోయావు. నీకు తిండి దండగ అని వదిలించుకోవాలనుకున్నాను. కానీ నీవు నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కోసమే బ్రతికావు. విశ్వాసం లేనిది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేది నాలాంటి మనుషులే గాని మీలాంటి జంతువులు కాదు. నీ పట్ల జాలీ దయా చూపకపోయినా ఈరోజు నా కూతురి జీవితం నిలబెట్టావు" అనుకుంటూ దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. కన్న కొడుకులాగా దానికి గౌరవంగా అంత్యక్రియలు చేసి తన ఇంటి ముందే సమాధి నిర్మించాడు. అడవిలోని రెండవ ముసలి కుక్కను ఇంటికి తీసుకువచ్చి సొంత మనిషిలా చివరి వరకూ చూసుకున్నాడు.
డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212