🙏వివాహం గురించి సంక్షిప్త వ్యాసం 🙏
వివాహ శబ్ద నిర్వచనము వివాహ శబ్దములో 'వి' అనియు, 'వాహః' అనియు రెండు భాగములున్నవి. 'వి' అనుదానికి విశిష్టత అని యర్థము. 'వాహః' అనుదానికి పొందించుట అని యర్ధము.
ఈ విషయము వీరమిత్రోదయము - సంస్కార కాండలో ఇటుల విస్తరించి చెప్పబడినది.
“వివాహః | వహ ప్రాపణే ఇత్యస్మాద్దాతోః, భావే ఘజీ కృతే వహనం వాహః | విశిష్టో వాహః వివాహః | వైశిష్ట్యం చ ప్రతిగ్రహాద్యష్టవిధో పాయాన్యతమోపాయేన హోమాది సప్తపద నయనాంత కర్మాభి సంస్కృతత్వమ్ | తథా చ వివాహ పదార్డో (ద్విదల) ద్విఫల స్సిద్ధ్యతి | స్వత్వోత్పాదనం సంస్కారాధానం చేతి | తదేతత్ స్పష్టీకృతం పారస్కరేణ | పిత్రి ప్రత్తా మాదాయ గృహీత్వా ని మతి వరం దదాతీత్యంతేన |
అనువఱకు ప్రతిగ్రహము మొదలుకొని చెప్పబడిన బ్రాహ్మాది పైశాచాన్త వివాహము లెనిమిదింటిలో నేవిధముగానైనను స్వీకరించిన కన్యతో హోమము మొదలుకొని సప్తపదివఱకు గల సంస్కారములచే సంస్కరింపబడుట అని వివాహశబ్దమున కర్థము. ఇది వివాహములో ప్రధానమని తాత్పర్యము.
యాజ్ఞవల్క్య స్మృతి ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి
1 బ్రాహ్మ :- విద్య మరియు ఆచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
2 దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
3 ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం
4 ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం
ఇంతవరకు చెప్పిన వివాహాలు మాత్రమే ధర్మ శాస్త్రం సమ్మతించినది.
5 ఆసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం
6 గాంధర్వ :- ప్రేమ వివాహం ఇది క్షత్రీయులకు మాత్రమే చెప్పబడింది దుష్యంతుడు -- శకుంతల వివాహం ఇది కేవలం క్షత్రీయులకు ధర్మ సమ్మతమే.
7 రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం
8 పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం
(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)
వివాహము స్త్రీ పురుషులలోని అపూర్ణత్వమును తొలగించి, వారికి పూర్ణత్వ మొసగజాలిన యొక పవిత్ర సంస్కారము, స్త్రీపురుషులిర్వురు దానికి రెండు పక్షములు. ఈ రెంటిని కలిపి - అనగా ఈ యుభయ శక్తులను సమన్విత మొనర్చి, ఈ సమన్వితశక్తిని ఏకలక్ష్యోన్ముఖము సేయుటయే ఈ సంస్కారముయొక్క ముఖ్యోద్దేశ్యము. ఈ సంస్కార ప్రయోజనము కేవలము ఇహలోకమునకే పరిమితముకాక, పరలోకమునకు గూడ ప్రాప్తమై యున్నది. కేవలము శారీర - ఐంద్రియ పరితోషము మాత్రము వివాహమునకు గమ్యముగాక, కర్తవ్యపాలనము, దైవారాధనము, అతిథిపూజ, సంతానప్రాప్తి, అధ్యాత్మికోన్నతి, పారివారిక, సామాజిక శ్రేయము నిశ్రేయము దీనికి గమ్యములు కావుననే ఇది సర్వసంస్కారములలో నుత్తమ మయినదిగాను పవిత్రమయినదిగాను ఋషులు ప్రతిపాదించినారు.
“విశేషణ వాహయతీతి వివాహః” అనగా వివాహితులయిన దంపతులకు విశేషముగా గృహస్థ ధర్మములను వహింపఁజేయు సంస్కార విశేషమునకు వివాహము అని పేరు (చెప్పినారు). దీనికి పాణిగ్రహణమని వ్యవహారము గలదు. ఈ సంస్కార విశేషము ప్రత్యక్ష ప్రయోజనము, పరోక్ష ప్రయోజనము ఉభయప్రయోజనము నయి యున్నది. ఇట్టి ప్రయోజనములతోగూడిన సంస్కార జనక క్రియా కలాపము వివాహమని సారాంశము.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది
వివాహం కానివారు, వివాహానంతరం అనేక కారణాలతో విడిపోయిన స్త్రీ, పురుషులు సంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హులని హిందూ ధర్మశాస్త్రం వివరిస్తుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కాబట్టి హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కల్యాణం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించాలంటే గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే సాగుతాయి.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ