శ్రీ శర్మద

సీస పద్యం



విశ్వ మందు జనులు వివిధ భాషలు పల్క

తెలివి నేర్పు మనది తెలుగు గొప్ప

పరభాష జ్ఞాన పాకులాటలుమాను

తెలుగు దనము లెస్స తెలుగు గొప్ప

అమ్మ భాష యిపుడు అధికమైతే చాలు

తెలుగు రాష్ట్రలలో తెగువ గొప్ప

భాష మరచిపోతె బతుకు దెరువు లేదు

తెలిసి మెలుగవయ్య తెలుగు గొప్ప



పలుకు తేనె భాష పతనమే కోరొద్దు

సంబరాల భాష సభలు మెచ్చు

తీపి లోన గుడుము తీయనైన తెలుగు

నీకు నాకు బలము నిజము గాను

***************************


శ్రీవిఘ్నేశ్వరస్తుతి

ఉ.

శ్రీకరసన్ముఖాంబురుహజృంభదపాంగకటాక్షవీక్షణా!

భీకరవిఘ్ననివారణ! అపేక్షితకామ్యవిచారణ! శత్రుదూషణా!

వ్యాకులచిత్తసంజనితపాశవిదారణ! పార్వతీసుతా!

శోకవిదూరణా! బవశోకవిమోచన! నౌమి పావనా!

🖋శ్రీశర్మద.

+91 9110380150

*************************

 నేటి సూక్తి🌸

తే.గీ.

క్షణమున నపార్థమొందగా సాధ్యమౌను

దిద్దబోవగ సరిగాదు తెగువమీఱ

నర్థముంగొన సరిపోదు నర్థవంత

జీవితము; జనులాఱసి చెలగవలయు

✍️శ్రీశర్మద.

 సీ.

పదములూనినచోట పండుదాడిమవర్ణ

          శోభచే తుహినమ్ము సొంపులీను

తనుమధ్యమునుజూడ తా గగనము దల్పు

          నుద్ధతులకు మధ్య నుండలేక

కేలుదమ్ములు జూడ కెంపుతామరతూళ్ళు

          సుకుమార సుమబాల సోకుదెల్పు

కంఠసీమయు యేమొ కంబుధిక్కృతి జేయు

          దంతపంక్తులు యేమొ తళుకులీను

కలకూజితారావ గమకమ్ము తోగూడి

          భాసించు నాపెకు పలుకు లన్ని

తే.గీ.

నాగిరితనయ జూడగా నతులమతియ

నచ్చటిచ్చట ముచ్చటై యలరుచుండు

మంచుకొండలఱేనికి మమతరాశి

బ్రోచు జగమంత నెల్లెడ ఫుల్లహృదయ

 చం.

మనమున నిన్ను దల్చి సుమమాలల నర్పణసేసి నిత్యమై

ఘనముగ నింపుకొందు నిను కాంక్షలుదీరగ కామదాయినీ!

తనువొక కోవెలై చెలగ ధారణసేసెద మాత! శాంకరీ!

అనువగు భక్తినిచ్చి నను నర్చనలందున ముంచి తేల్చుమా! ✍️శ్రీశర్మద.

********************


శాకంబరీదేవి-దుర్గమాసురవధ
దేవీభాగవతాంతర్గత కథనం

రచన: శ్రీశర్మద.
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు. 
+91 9118380150


పూర్వం హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడి కుమారుడు దుర్గముడు. ఇతడు మహాకఠినాత్ముడు, పరమనీచుడు, ఖలాత్ముడు కూడా. ఒకసారి ఇతడు లోకాలనన్నిటినీ తన వశం చేసుకోవాలని ఆలోచించాడు. ఆవిధంగా లోకాలనన్నిటినీ వశం చేసుకోవాలంటే, ముందు దేవతలను ఓడించితే సరిపోతుందని, ఆ దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉన్నదని, వాటిని గనుక నాశనం చేయగలిగితే ఆ తరువాత లోకాలను వశం చేసుకోవటం సులభమైపోతుందని తలచాడు. అలా తలచిందే తడవుగా హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుని గురించి సుదీర్ఘకాలం ఘోరతపస్సు చేశాడు. అలా వెయ్యిసంవత్సరాలపాటు జరిగిన అతడి తపస్సు చేత తపశ్శక్తి జనించి దాని వలన ఉద్భవించిన అగ్నికీలల వలన లోకాలన్నీ గడగడా వణకిపోసాగాయి. దానితో బ్రహ్మదేవుడు దుర్గముడికి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, అతడు వెంటనే వేదాలను, ముల్లోకాలలో ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలను తనకు స్వాధీనం చేయమని వరం కోరుకొన్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు! అని అంతర్థానమయ్యాడు. 
ఆ క్షణం నుండి ముల్లోకాలలో ఉన్న విప్రులందరికీ ఏ మంత్రమూ స్ఫురించటం లేదు. వారి నిత్య సంధ్యావందనాది కర్మలు సైతం ఆగిపోయాయి. ఇక యజ్ఞయాగాది క్రతువుల సంగతి చెప్పేదేముంది? యజ్ఞయాగాది క్రతువులు లేక వర్షాలు కురవటం ఆగిపోయాయి. దానితో పంటలు లేవు. ఆహారకొరత ఏర్పడింది. చివరకు నీరు లేక ప్రజలందరూ నానా అవస్థలు పడసాగారు. ఎక్కడ చూచినా హాహాకారాలే తప్ప స్వాహాకారాలు లేవు. హవిస్సులు లేక నిర్జరులైన దేవతలకు జరత్వం ఆవరిస్తోంది. ఈ అదను చూచుకొని దుర్గముడు దేవతల నగరమైన అమరావతిని ముట్టడించి దేవతలను ఓడించి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. 
భూసురులందరూ కలసి ఆలోచించి హిమాలయాలకు వెళ్లి అక్కడ జగన్మాత అయిన పరాశక్తిని ఆరాధించారు. నిరాహారులై ఆ జగన్మాతను శరణువేడారు. ఆ తల్లి కరుణాసముద్రురాలు కదా! వారిని కరుణించి కోటిసూర్యప్రభలతో అత్యంత లావణ్యమూర్తిగా దర్శనమిచ్చింది. ఏమి కావాలో చెప్పమన్నది. భూసురులంతా ముక్తకంఠంతో తమ సమస్యలన్నీ ఆ తల్లికి చెప్పుకొని తక్షణం దుర్గముడి బారినుండి లోకాలను ఆదుకోమని ప్రార్థించారు. 

మోచయామాస లోకేషు వారిధారాః సహస్రశః ।
నవరాత్రం మహావృష్టిరభూన్నేత్రోద్భవైర్జలైః ॥
*దుఃఖితాన్ వీక్ష్య సకలాన్నేత్రాశ్రూణి విముంచతీ ।
తర్పితాస్తేన తే లోకా ఓషధ్యస్సకలా అపి ॥

"వెంటనే ఆ కరుణామూర్తి అయిన పరాశక్తి యొక్క అనుగ్రహంతో లోకాలన్నిటా తొమ్మిదిరోజులపాటు కుంభవృష్టి కురుస్తూ నీరు ధారలై, ఏరులై ప్రవహించింది. దానితో లోకాలు పంటలతో సస్యశ్యామలమై ప్రజల కష్టాలు తీరిపోయాయి. అంతవరకూ దుర్గముడికి భయపడి కొండకోనల్లో దాగిన దేవతలందఱూ వెలుపలికి వచ్చారు." ఆ దేవతలందఱూ భూసురులతో కలసి ఆ జగన్మాతను ఈ విధంగా స్తుతించారు. 

నమో వేదాంతవేద్యే తే నమో బ్రహ్మస్వరూపిణి ।
స్వమాయయా సర్వజగద్విధాత్ర్యై నమోనమః ॥
భక్తకల్పదృమే దేవి భక్తార్థం దేహధారిణి ।
నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరి తే నమః ॥
అస్మచ్ఛాంత్యర్థమతులం లోచనానాం సహస్రకమ్ ।
త్వయా యతో ధృతం దేవి శతాక్షీ త్వం తతోభవ ॥
క్షుధయా పీడితా మాతః స్తోతుం శక్తిర్నచాస్తి నః ।
కృపాం కురు మహేశాని వేదానప్యాహరాంబికే ॥*


"ఓ వేదాంతవేద్యవైన పరబ్రహ్మస్వరూపిణీ! (ఇక్కడ పరబ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ కాదు. అంతకన్నా మించిన పరబ్రహ్మ) నీయొక్క మాయావిలాసం చేత జగత్తును సృష్టించావు. నీవు భక్తుల పాలిటి కల్పవృక్షానివి. భక్తులకోసమే ఎప్పుడూ ఏదో ఒక శరీరాన్ని ధరిస్తూ ఉంటావు. నిత్యతృప్తితో విలసిల్లే నీకు సమానమైనది ఎక్కడా లేదు. ఓ భువనేశ్వరీ! ఇప్పుడు మా కష్టాలను నశింపజేయటానికి నీవు ఆవిర్భవించావు. కనుక నిన్ను ఈరోజు నుండి "శతాక్షి" అని స్తుతించుకుంటూ ఉంటాము. నిజానికి ఇంతవరకూ ఆకలితో పీడించబడిన మాకు నిన్ను స్తుతించే ఓపిక కూడా లేదు. ఆ దుర్గముడనే రాక్షసుడి నుండి వేదాలను రక్షించి మాయందు దయను చూపు తల్లీ!"
ఆ వెంటనే దయామయి అయిన పరమేశ్వరి వారందఱికీ, పశుపక్ష్యాదులకూ అవసరమైన అనేక పండ్లతో కూడిన ఆహారాన్ని అందించింది. అప్పటి నుండి జగన్న్మాతకు "శాకంబరి" అను పేరు సుస్థిరమైంది. 
ఈ విషయాలను వేగులద్వారా తెలుసుకున్న దుర్గముడు సాయుధుడై దైవసేనల పైనను, భూసురుల పైనను తన ఆయుధాలతో విజృంభించాడు. విప్రులు దేవతలు కూడా యథాశక్తిగా దుర్గముడి సేనలతో పోరాడారు. ఆయుధాల పరస్పర తాకిడుల వలన నిప్పురవ్వలు చిమ్ముతున్నాయి. రాక్షసుల ధాటికి దేవసమూహాలు నిలువలేకపోతున్నాయి. ఈ విషయం అమ్మవారు గమనించి వారి చుట్టూ తేజోమయమైన ఒక వలయాన్ని ఏర్పాటు చేసింది. దానితో రాక్షసులు ప్రయోగించే బాణాలు, ఆయుధాలు దేవమానవ సమూహాలవరకు వచ్చి అమ్మవారు కల్పించిన తేజోమయమైన రక్షణవలయాన్ని తాకి క్రింద పడిపోతున్నాయి. ఆ సమయంలో జగన్మాత స్వయంగా యుద్ధానికి పూనుకొని అతిత్వరలో రాక్షసులను అనేకమందిని మట్టుపెట్టింది. జగన్మాతకు దుర్గముడికి మధ్య ద్వంద్వయుద్ధం అతి భీకరంగా సాగింది. వారి బాణపరంపరలతో సూర్యబింబం కప్పబడిపోయింది. ఆయుధాల పరస్పర తాకిడులతో నిప్పులవర్షం కురుస్తోంది. దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. 

అంతలో అమ్మవారి శరీరం నుండి ఒకేసారి తొమ్మిది శక్తిస్వరూపాలు ఉద్భవించాయి. అవేకాక, కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, ఛిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక మొదలైన అనంతశక్తులు జగన్మాత నుండి ఆవిర్భవించాయి. వారి అందరి చేతులలోనూ అనేక భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. అమ్మవారి ఆదేశంతో ఈ అనంతశక్తిరూపాలు అన్నీ కలసి ఆ రాక్షససమూహాలన్నిటినీ క్షణంలో మట్టుబెట్టాయి. ఇక దుర్గముడు ఒంటరివాడయ్యాడు. అతడు ఈ అనంతశక్తులందరితోనూ ఏకకాలంలోనే వీరోచితంగా పోరాడుతున్నాడు. ఆవిధంగా భీకరయుద్ధం పదిరోజులపాటు సాగింది. పదకొండవరోజున దుర్గముడు రక్తమాల్యధారుడై, రక్తచందనాన్ని శరీరం నిండా పూసుకొని మహోత్సవంతో యుద్ధరంగానికి వచ్చాడు. అతడు ఈ అనంతశక్తులతో చండప్రచండంగా పోరాడి వారందరినీ గెలిచాడు. తరువాత జగన్మాత యొక్క రథానికి తన రథాన్ని ఎదురుగా నిలిపాడు. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఇకపై జగన్మాత ఉపేక్షించదలుచుకోలేదు. అతి తీవ్రమైన బాణాలను దుర్గముడి పైకి ఏకకాలంలో విడిచి వాడి కన్నులను, చేతులను, గుండెను చీల్చటంతోబాటు వాడి రథసారథిని కూడా చిటికెలో సంహరించించిది. దానితో దుర్గముడి ప్రాణాలు అనంతవాయువులలో కలసిపోగా, అతడి శరీరం నుండి ఒక తేజస్సు జగన్మాతలో కలసిపొయింది. దానితో ఈ జగత్తుకు దుర్గముడి పీడ విరగడ అయ్యింది. 

((())) ***********************

కాలమె నీవయై నిలచి కామితసృష్టికి కారణాత్మవై 
వీలుగ లోకముల్ నెఱపి పెన్నిధి వయ్యెడు తల్లివీవెగా! 
కాలుడు సైతమేమియు విఘాతమొనర్చగ లేడు నీ యను 

జ్ఞాలవలేశమొంద కిల జ్ఞాననిధీ! మము బ్రోచు మాతవే!
*****************
































6 కామెంట్‌లు:

SRI SARMADA చెప్పారు...

విశ్వనాథుని 125వ జయంతి Dt:09-09-2020


సీ.
తెలుగుభాషామతల్లి తీర్చిదిద్దినయట్టి
ముద్దుబిడ్డడతండు స్ఫూర్తియుతుడు
నవలలెన్నియొ వ్రాసి నవ్యమార్గణమేసి
దివ్యచరిత నిల్పె ధీమతుండు
కల్పవృక్షపునీడ క్రమ్మగాజేసియు
జ్ఞానపీఠమునెక్కె జ్ఞానఖనుడు
వేయిపడగలెత్తి విశ్వరూపము జూపి
కిన్నెరరాగాల క్రీడలాడి
తే.గీ.
తెలుగువిభవమ్ము జగమెల్ల తేజరిల్ల
తెలుగుభాషామతల్లికి తేరుబట్టి
విశ్వవీథిని విహరించె విశ్వనాథ
భరతఖండమ్ము కన్నట్టి పసిడిబిడ్డ

శా.
ఉల్లేఖింపగజాలునే? యతడి పద్యోక్తప్రభారీతులన్
సల్లాలిత్యపదార్థనిర్మితవిలాసాలంకృతాప్రౌఢులన్
కల్లోలంబులులేని కావ్యరచనాగాంభీర్యతాశోభలన్
సల్లాక్షిణ్యపువిశ్వనాథకవితాసంశోభితామార్గమున్
✍️శ్రీశర్మద. 9110380150

SRI SARMADA చెప్పారు...

ధరణికి నేమియయ్యెనొ? సతమ్ము నిపీడితమౌచుఁ ద్రెళ్ళెడున్
కరమరుదౌ గ్రహస్థితులు కక్షలు బూనెనొ? కాలుడల్గెనో?
కొరకొరలాడు తాపమున కుంభిని కిన్కవహించెనో?
పొరిపొరి రోగజాలములు, పొంగునదమ్ములు, భూప్రకంపముల్,
మరులు వెలార్చి జీవుల నమానుషపద్ధతి మట్టడించెడున్

ధరణికి=ధరణియందలి జీవులకు అనే అర్థంలో వాడబడింది.
✍️శ్రీశర్మద. +91 9110380150

SRI SARMADA చెప్పారు...

శా.
స్వార్థంబన్నది లేనినాడు పదిలంబైయుండు సంబంధముల్
స్వార్థంబొక్కటి గూల్చుచుండె మనుజవ్రాతస్థ సౌహార్దమున్
స్వార్థంబెంతటి దుష్టయోచనొ గదా! ప్రారబ్దమై త్రెళ్ళెడిన్
అర్థంబొప్పగ జింతజేసి మనగా నానందమే క్రాలదే
🖋శ్రీశర్మద. 9110380150

SRI SARMADA చెప్పారు...

చంపకమాలిక:
కనులకు గోచరించునది కమ్మనిభావన లిచ్చి నిల్చు, నీ
మనమున బుట్టు గోర్కెలకు మద్దతు బల్కుట నైజమై చనున్
అనయము లౌకికంబుల విహారముసేయు విధంబు జెల్లగా
తనువులు శాశ్వతంబులని తప్పుడు నమ్మిక బుట్టజేసి నిన్
కనదగు వాస్తవమ్ములను కానగనీయని మాయ గాంచుమా!
✍️శ్రీశర్మద- +91 9110380150

SRI SARMADA చెప్పారు...

చంపకమాలిక:
కనులకు గోచరించునది కమ్మనిభావన లిచ్చి నిల్చు, నీ
మనమున బుట్టు గోర్కెలకు మద్దతు బల్కుట నైజమై చనున్
అనయము లౌకికంబుల విహారముసేయు విధంబు జెల్లగా
తనువులు శాశ్వతంబులని తప్పుడు నమ్మిక బుట్టజేసి నిన్
కనదగు వాస్తవమ్ములను కానగనీయని మాయ గాంచుమా!
✍️శ్రీశర్మద - +91 9110380150

SRI SARMADA చెప్పారు...

లుబ్ధానాం యాచకః శత్రుర్మూర్ఖానాం బోధకో రిపుః
జారస్త్రీణాం పతిః శత్రుశ్చౌరాణాం చంద్రమా రిపుః .

లోభులకు యాచకుడు శత్రువు. మూర్ఖులకు మంచిని బోధించేవాడు శత్రువు. వ్యభిచారిణులైన స్త్రీలకు భర్తయే శత్రువు. దొంగలకు చంద్రుడు శత్రువు.

**

యేషాం న విద్యా న తపో న దానం
జ్ఞానం న శీలాం న గుణో న ధర్మః
తే మర్త్యలోకే భువి భారభూతా
మనుష్యరూపేణ మృగాశ్చరంతి .

ఎవరికి విద్యగానీ, తపస్సుగానీ, దానగుణంగానీ, జ్ఞానంగానీ, శీలం గానీ, సద్గుణాలుగానీ, ధర్మవర్తనం గానీ లేవో,వారు భూమికి భారమౌతారు. వారు మనుష్యరూపంలో తిరుగుతున్న మృగాలే.
✍️శ్రీశర్మద - +91 9110380150