31, మార్చి 2025, సోమవారం

జీవితం

 '' ఈ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ? '' 


ఒక ఉదయం కొంతమంది శిష్యులతో కలిసి భగవాన్ రమణమహర్షి అరుణాచలం కొండ మీదకి వెళుతుంటే ఒక అమెరికన్ పౌరుడు మహర్షిని '' భగవాన్ , పుట్టుక , కాస్త చదువు , యవ్వనం , ఉద్యోగం లేదా వ్యాపారం , పెళ్లి , పిల్లలు , వ్యాధులు , వృద్ధాప్యం , మరణం ... ఇంతేనా ఈ జీవితం ? దీనికంటూ వేరే ఉద్దేశ్యం ఏదైనా వుందా ? '' అని అడిగితే , మహర్షి ఏమీ మాట్లాడలేదు. [ రమణమహర్షి అంత తక్కువ మాట్లాడిన మనిషి కానీ , లక్షలమందిని ప్రభావితం చేసిన మహర్షి కానీ , ఈ మధ్య కాలం నాటి ప్రపంచ చరిత్రలో మరొకరు లేరు] 


మహర్షి ఏమి చెబుతారా అని వాళ్ళంతా ఎదురుచూస్తున్నారు. కానీ మహర్షి ఏమీ మాట్లాడకుండా అక్కడ పడివున్న ఒక చెట్టు కొమ్మను తీసుకొని దానికి వున్న ముళ్ళలాంటి వాటిని , బుడిపెలను తీసేస్తూ , ఒక బండ రాయి మీద దాన్ని జువిరినట్టు చేస్తూ , చక్కగా తయారుచేసారు. అందరూ ఆయన్ని గమనిస్తున్నారు. కాస్తా ముందుకెళ్ళాక ఆవులు , గొర్రెలు కాచే ఒక పిల్లవాడు , మహర్షి చేతిలో వున్న ఆ కట్టెను చూసి , ముచ్చట పడి '' స్వామీ , ఆ కట్టెను నాకు ఇస్తారా ? '' అని అడిగాడు. మహర్షి ఇచ్చేసారు. తరువాత అమెరికన్ శిష్యుడివైపు చూసారట. అపుడు అతను '' నా ప్రశ్నకు సమాధానం దొరికింది , భగవాన్ ! '' అన్నాడట. 


ఏమిటా సమాధానం ? అని తెలుసుకోవాలంటే ఒక ఆంగ్ల రచయిత వ్రాసిన క్రింది వాక్యాన్ని చదవండి : 


'' The meaning of Life is to find your gift. The purpose of Life is to give it to others.''

కామెంట్‌లు లేవు: