31, మార్చి 2025, సోమవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(91వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

       *చిన్ని కృష్ణుడి లీలలు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*బ్రహ్మమాయను విష్ణుమాయ ఎదుర్కొంది. అన్నిటినీ, అందరినీ కృష్ణమయం చేసేశాడు కృష్ణుడు. ఆలమందల్నీ, మిత్రబృందాన్నీ వెంటబెట్టుకుని ఇంటిదారిపట్టాడు. మార్గమధ్యంలోనే ఎదురొచ్చి ఎవరి ఆవుల్ని వారు, ఎవరి బిడ్డల్ని వారు తీసుకుని వెళ్ళిపోయారు పెద్దలు. చేరదీసిన పిల్లలంతా కృష్ణుడే! పరుగుదీస్తున్న ఆవులన్నీ కృష్ణుడే! ఆ సంగతి ఎవరికీ తెలియదు. మా పిల్లలంటూ, మా ఆవులంటూ ముచ్చటపడ్డారంతా. అలా ఏడాది గడచిపోయింది.*


*ఈ ఏడాదీ బ్రహ్మమానంలో తృటికాలం మాత్రమే! గోవులనూ, గోపాలురనూ దాచిపెట్టేశాను కదా! ఎవరూ లేని బృందావనం ఎలా ఉన్నదో చూద్దామనుకున్నాడు బ్రహ్మ. వచ్చి చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. బృందావనంలో గోవులు ఉన్నాయి. గోపాలురు ఉన్నారు. అంతా అందరూ సంతోషంగా ఉన్నారు. అల్లరి కృష్ణుడి ఆటలు సాగుతూనే ఉన్నాయి. ఏదీ జరగనట్టుగానే ప్రవర్తిస్తున్నాడతను. ఆలమందలనూ, గోపాలురనూ తేరిపారజూశాడు బ్రహ్మ. చూస్తే ఆవుల్లోనూ, అందరిలోనూ శంఖ చక్రాలతో శ్రీమహావిష్ణువు కనిపించాడు. అంతా అందరూ మహావిష్ణువు అవతారాలనిపించారు. ఆశ్చర్యానికి లోనయినాడు బ్రహ్మ. ఏదీ అంతుచిక్కలేదతనికి.*


*కాస్సేపటికి మాయ తొలగింది. బ్రహ్మకు జ్ఞానోదయం కలిగింది. తన మాయతో విష్ణువును అల్లరిపెట్టాలనుకున్నాడు కాని, తానే అల్లరిపాలయినాడని గ్రహించాడు బ్రహ్మ. విష్ణుమాయను ఎదుర్కోవడం సులభం కాదనుకున్నాడు. కృష్ణుణ్ణి సమీపించాడు. చేసిన తప్పును మన్నించమని వేడుకున్నాడు. వేదగానంతో ఆ దేవదేవుణ్ణి స్తుతించాడు. మాయం చేసిన ఆలమందలనూ, గోపాలురనూ ప్రత్యక్షం చేసి, అనుగ్రహించమని చేతులు జోడించి నమస్కరించాడు. అనుగ్రహించాడు కృష్ణుడు.*


*తన తత్త్వాన్ని బోధించాడతనికి. కృష్ణతత్త్వాన్ని తెలుసుకున్న బ్రహ్మ, ఆత్మానందాన్ని అనుభవించి, అక్కణ్ణుంచి నిష్క్రమించాడు.*


*ఎప్పుడయితే బ్రహ్మ దాచిపెట్టిన గోవులూ, గోపాలురూ ప్రత్యక్షమయ్యారో అప్పుడు తన మాయను ఉపసంహరించాడు కృష్ణుడు. దాంతో అతను సృష్టించిన గోవులూ, గోపాలురూ అదృశ్యమయినారు. బ్రహ్మ దాచిపెట్టిన గోపాలురు, కృష్ణుణ్ణి పరుగున సమీపించారు.* 


*బ్రహ్మమానం ప్రకారం క్షణకాలం వారు కృష్ణునికి దూరమయినారు. ఆ క్షణకాలం కూడా వారు కృష్ణవియోగాన్ని తట్టుకోలేకపోయారు. కృష్ణుణ్ణి సమీపించి, ఒకరు తర్వాత ఒకరుగా అతన్ని కౌగించుకున్నారు.‘‘ఎక్కడకి వెళ్ళావు కృష్ణా! నిన్ను చూడక క్షణకాలం కూడా ఉండలేం.’’ అన్నారు.*


*‘‘ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. మీతోనే ఉన్నాను, మీలోనే ఉన్నాను.’’ అన్నాడు కృష్ణుడు. వేణుగానం ఆలపించాడు. ఆ గానానికి గోవులూ, గోపాలురూ తన్మయత్వంగా తలలాడించారు.*


*ధేనుకాసురుడు:~*


*అక్కచెల్లెళ్ళలా రోహిణి, యశోద ప్రవర్తించేవారు. వారిలాగానే బలరామకృష్ణులు కూడా మెలగేవారు. క్షణం కూడా ఒకరిని విడచి ఒకరు ఉండేవారు కాదు. కృష్ణుడికన్నా రాముడు పెద్దవాడు. అతను ఆదిశేషుని అవతారం. మహాబలాఢ్యుడు కావడంతో రాముణ్ణి బలుడనీ, బలరాముడనీ వ్యవహరించేవారు. కృష్ణుడులాగానే బలరాముడు కూడా చిన్నతనంలో అనేక గొప్ప పనులు చేశాడు. గోకులానికి దగ్గరగా ఓ తాళవనం ఉన్నది. ఆ వనం నిండా తాటిచెట్లే! ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టుగా, ఒకదానిమీద ఒకటి పడి ఉన్నట్టుగా చెట్లు చిక్కగా ఉంటాయక్కడ. ఆ చెట్లకి గుత్తులు గుత్తులుగా తాటిపళ్ళు వేలాడుతూ ఉంటాయి. వాటిని కొట్టుకుని తినాలని గోపాలురకు ఎప్పటినుంచో కోరిగ్గా ఉంది.*


*అయితే ఆ వనంలో అడుగుపెట్టాలంటేనే భయం. అక్కడ ఓ రాక్షసుడు ఉన్నాడు. వాడి పేరు ధేనుకాసురుడు. గాడిద ఆకారంలో ఉంటాడతను.*


*బంధుమిత్రాదులతో నివసిస్తున్నాడక్కడ. ఇతరులు ఎవరూ వనంలోకి రాకూడదు. వస్తే సంహరిస్తాడు. కంసుడి మిత్రుడినని వాడికి పొగరెక్కువ. ఒకనాడు బలరామకృష్ణుల దగ్గరకి వారి స్నేహితుడు శ్రీరాముడు వచ్చాడు. మిత్రులని వెంటబెట్టుకుని గుంపుగా వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టుగా ఉండకుండా ఆమాటా ఈమాటా చెప్పి, అసలు సంగతి బలరామకృష్ణుల ముందు బయటపెట్టాడు.*


*ఏంటయ్యా అది అంటే...వాళ్ళందరికీ తాళ్ళవనంలోని తాటిపండ్లు తినాలని ఎప్పటి నుంచో కోరిగ్గా ఉన్నదట! ఆ కోరిక తీర్చుకుందామంటే ఆ వనానికి వెళ్ళేందుకే భయమట. ఎందుకంటే...అక్కడ ఓ రాక్షసుడు ఉన్నాడనీ, వాడికంట పడితే చంపేస్తాడనీ చెప్పాడు. అందుకు పగలబడినవ్వారు బలరామకృష్ణులు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: