31, మార్చి 2025, సోమవారం

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(92వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

        *బలరామ కృష్ణులు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘రాక్షసుడేం చేస్తాడు? ఏమీ చెయ్యడు, చెయ్యలేడు. పదండి, ఎవరికి కావాల్సిన తాడిపండ్లు వారు తినండి. మేమున్నాం మీ వెనుక.’’ అన్నారు.*


*అందరూ కలసి తాళవనానికి చేరుకున్నారు. ఆకాశాన్ని అంటుతున్న తాళవృక్షాలను చూశాడు బలరాముడు.*


*ఆకాశంలో వేలాడుతున్నట్టుగా వృక్షాలకు వేలాడుతున్న తాటిపళ్ళను చూశాడు. చెట్ల మొదళ్ళను చూశాడు. బలంగా ఉన్నాయి. ఉంటేనేం? తన బలం ముందు అవెంత? అనుకున్నాడు బలరాముడు. రెండు చేతులా చెట్లను పట్టుకుని, తొండాన్ని చుట్టి చెట్లను ఏనుగు ఊపినట్టుగా బలంగా ఊపాడు బలరాముడు. ఆ ఊపునకు తాటిపళ్ళు జలజలా రాలిపడ్డాయి. ‘తినండి.’’ అన్నాడు బలరాముడు.గోపాలురు తనివితీరా తినసాగారు. బహురుచిగా ఉన్నాయంటే బహురుచిగా ఉన్నాయంటూ జుర్రుకున్నారు.*


*బలరాముని ఊపునకు కొన్ని చెట్లు విరిగి పడిపోయాయి. మరికొన్ని అయితే ఒరిగి నిల్చున్నాయి. వనం అంతా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా తయారయింది.*


*ధేనుకాసురుడికి ఈ సంగతి తెలిసింది. అంతే! ఉగ్రుడైపోయాడు. పళ్ళునూరాడు. గాడిదలా ఓండ్రపెడుతూ, కొండలా దొర్లుకుంటూ బలరామకృష్ణుల్ని సమీపించాడు.*


*కృష్ణుడు అతన్ని ఎదుర్కొనబోయాడు. తమ్ముణ్ణి వారించాడు బలరాముడు. వీడు నా వంతు అన్నట్టుగా చూశాడు.*


*కొండలా వచ్చి మీద పడుతున్న ధేనుకాసురుణ్ణి ఒంటిచేత్తో అడ్డుకున్నాడు బలరాముడు. వాడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎగిరి, రెండుకాళ్ళూ ఎత్తి ధేనుకాసురుని వీపు మీద తన్నాడు బలరాముడు. దెబ్బకు నడుము విరిగినట్టుగా కిందపడ్డాడు అసురుడు. బాధతో గట్టిగా అరిచాడు. లేచేందుకు ప్రయత్నించసాగాడు. లేవనీయలేదు బలరాముడు. అసురుని ముందు కాళ్ళు రెండూ పట్టుకుని అల్లంత దూరానికి విసిరేశాడు. ఎగిరొచ్చి కిందపడ్డాడు అసురుడు. ఎముకులు విరిగిపోయాయేమో! లేవలేకపోయాడు. బలరాముని బలానికి ఆశ్చర్యపోయారు గోపాలురు. మెచ్చుకున్నారతన్ని. బలరాముని చేతికండల్ని నిమురుతూ నిల్చున్నారు.*


*అన్నబలం తమ్ముడికి తెలుసు. అదిప్పుడు ప్రదర్శితమవుతోంది. నలుగురికీ అన్నబలం తెలియాలి అనుకున్నాడు కృష్ణుడు. అందుకే తను కల్పించుకోకుండా దూరంగా నిల్చున్నాడు. నవ్వుతూ నిల్చున్నాడు.*


*ఇంతలో బలాన్ని కూడదీసుకున్నాడు అసురుడు. పరుగు పరుగున వచ్చాడు. బలరాముని మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలమయింది. పరుగున వచ్చిన అసురుని నాలుగుకాళ్ళూ పట్టుకుని, పైకెత్తాడు బలరాముడు. కొండను తిప్పుతున్నట్టుగా గిరగిరా తిప్పాడు వాణ్ణి. తర్వాత గాడిద రూపంలో ఉన్న ఆ అసురుణ్ణి నేల మీదకి గట్టిగా విసరికొట్టాడు. మెడ విరిగిపోయింది. కళ్ళు పేలిపోయాయి. పొట్ట చీలిపోయింది. ధేనుకాసురుడు చనిపోయాడు.*


*రాక్షసుడు చనిపోయాడని తెలియడంతో కృష్ణుడు సహా గోపాలురంతా హర్షద్వానాలు చేశారు. మెచ్చుకోలుగా బలరాముణ్ణి చుట్టుముట్టారు.*


*ధేనుకాసురుణ్ణి గిరగిరాతిప్పి నేలకేసి గట్టిగా విసిరికొట్టినప్పుడు అప్పుడు కలిగిన అదురుకి తాళవృక్షాలు నేలలోంచి లేచిపడిపోయాయి. చెట్లు ఒకదాని మీద ఒకటి విరిగి పడడంతో వనం అంతా కుప్పకూలిపోయింది.*


*కుప్పకూలిపోతున్న వనాన్నీ, చనిపోయిన ధేనుకాసురుణ్ణీ చూసి అతని బంధుమిత్రులంతా గాడిదముఖాలతో బలరామకృష్ణుల మీద దాడి చేశారు. తమ్ముడు కృష్ణుని సహకారం ఇప్పుడు కావాల్సివచ్చింది రాముడికి. కృష్ణునితో చేయికలిపాడు. రాక్షసుల్ని కృష్ణుడు సహా ఎదుర్కొన్నాడు. అన్నదమ్ములిద్దరూ ధేనుకాసుర బంధుమిత్రుల్ని చంపి పోగులుపెట్టారు. తాళవనంలో ఎక్కడ చూసినా విరిగిపడిన తాటిచెట్లూ, చచ్చిపడి ఉన్న గాడిద ముఖాల రాక్షసులే! ఆ దృశ్యాల్ని చూసి ఆకాశంలోని దేవతలు హర్షించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: