9, జూన్ 2023, శుక్రవారం

నిజరూప దర్శనం

 శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా.............!!



కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత మూలమూర్తి ఎలాంటి అలంకారాలూ లేకుండా దర్శనమిస్తారు. 


నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. 


దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. 


ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టుధోవతిని ధరింపజేస్తారు. 


కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు. 


గురువారం ఆలయంలోనే కాదు, 

తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానిక్కూడా సిబ్బంది భయపడతారు. 


ఎందుకంటే పుణ్యకార్యాలు చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం. 


గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు.

మన గుడి :

 🕉 మన గుడి : 🕉️





⚜ కడప జిల్లా : గండికోట 


⚜ శ్రీ  అగస్త్యేశ్వరకోన 


💠 పరమ శివుని వాహనం నంది. 

పరమ శివుని ధనుస్సు పినాకము. అటువంటి పవిత్రమైన నంది కొండలకు (కర్ణాటక) అధిష్టాన దైవమైన నందీశ్వరస్వామి విల్లే రెండు పాయాలుగా చీలి ఉత్తర పినాకిని (పెన్నా, రాయలసీమ ) దక్షిణ పినాకిని (పాలారు, తమిళనాడు) గా ప్రవహిస్తున్నాయి. తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వరుని, పుష్పగిరిలో వైద్యనాథేశ్వరుని పాదాలు కడుగుతూ పవిత్ర నది పెన్నమ్మ తల్లి ప్రవహించే మనరాయలసీమ  మొత్తం శైవ క్షేత్రమే.

 శివునికి ప్రీతి పాత్రమైన భూమే. 

అందుకే ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని, ఒక పంచభూత లింగ క్షేత్రాన్ని, ఒక భాస్కర క్షేత్రాన్ని మనకి అనుగ్రహించాడు.

అటువంటి ఇంకొక  మహత్తర " ముగ్గురు మూర్తుల తపోక్షేత్రo  శ్రీ అగస్త్యేశ్వరకోన "


💠 మైలవరం జలాశయం పశ్చిమ దిశలో సహజసిద్దమైన ప్రకృతి అందాలతో, అనేక విశేషాలతో శ్రీ అగస్త్యేశ్వరకోన పుణ్యక్షేత్రం వెలిసింది. 

శ్రీ అగస్త్య మహాముని కఠోర తపముచే వెలిసినందున ఈ పుణ్యక్షేత్రం శ్రీ అగస్త్యేశ్వరకోన గా పేరొందినది.

 

⚜ స్థలపురాణం ⚜


💠 త్రేతాయుగంలో శ్రీ అగస్త్యమహాముని పరమశివుని సలహా మేరకు, బ్రహ్మ వరం వల్ల మదగర్వితుడైన వింధ్య పర్వతం  మదమణచడానికి దక్షిణ దేశ సంచారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అగస్త్యుడు దక్షిణ దిశగా వెళ్తూ అనేక ప్రదేశాల్లో శివలింగ ప్రతిష్ఠాపన గావించి, తపమాచరిస్తూ ముందుకు సాగారు. 


💠 ఈ క్రమంలో దండకారణ్యమైన ఆంధ్రదేశంలో కూడా ఆయన సంచరించారు. ఇందులో భాగంగా ప్రకృతి రమణీయత, మానసిక ప్రశాంతత, దైవసంచారం లాంటి విశిష్ఠతలున్న ఈ ప్రాంతంలో అగస్త్య మహాముని మనోసంకల్పసిద్ది కోసం ధర్మపత్ని లోపాముద్రతో కలిసి పరమేశ్వరుని అనుగ్రహానికై శ్రీ దుర్గా సుబ్రమణ్యేశ్వరుల ప్రతిష్ఠ గావించి ఘోర తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.


💠 శ్రీ అగస్త్యేశ్వరకోన జిల్లాలోనే అతిపురాతనమైన, పవిత్రమైన శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నది. రాజరిక పాలనకు సాక్ష్యంగా నిలిచిన గండికోట దుర్గంనకు సమీపంలో మధ్యలో పెన్నమ్మ పరవళ్ళతో శ్రీ అగస్త్యేశ్వరకోన ఎంతో పవిత్రమైన వాతావరణంతో ఏర్పడినది. 


💠 ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు వున్నాయి. ఇందులో ఔషధీయ గుణాలు గల జలంతో నిండిన కోన వుంది.

ఇందులో స్నానమాచరించిన అనారోగ్య పీడితులకు స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆదిశేషునికి నివాసంగా వెలిసిన పుట్ట స్ర్తిలకు గౌరవప్రదమైన మాతృత్వాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే శ్రీ యంత్ర సహితంగా వెలిసిన ఆదిశక్తి శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు భక్తుల పాలిటి కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.


🔅 ముగ్గురు మూర్తుల తపోక్షేత్రం


💠 త్రేతాయుగంలో దక్షిణ దేశ సంచారంలో భాగంగా శ్రీ అగస్త్యమహాముని ఈ క్షేత్రంలో శ్రీ దుర్గా సుబ్రమణ్యేశ్వరుల ప్రతిష్ఠ గావించి తపమాచరించారు. 

అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు సైకత లింగ ప్రతిష్ఠాపనచేసి తపమాచరించాడు. అలాగే అత్రిమహాముని కూడా ఇదే ప్రాంతంలో తపమాచరించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. 

ముగ్గురు మహానుభావులు తపో క్షేత్రంగా, భక్తుల పాలిటి కలియుగ కైలాసంగా శ్రీ అగస్త్యేశ్వరకోన  విరాజిల్లుతున్నది.


💠 గండికోట నుండి సుమారు 3 మైళ్ల దూరంలో అగస్త్య కోన ఉంది.

నాలుగో పాదం! (కథ)*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

        *నాలుగో పాదం! (కథ)*

*రచన: జయంతి ప్రకాశ శర్మ*

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️


*రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.* 

 

*రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే!*

*'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను.*

 

*'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.*  

*అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది.*

 

*చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది.*

 

*"అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?" పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది.*

*ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు.* 

*"సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?" నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను.*

*"వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!" మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది.*

*"అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి.* 

*పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!"*

*అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు.*

*"వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!" అంటూ చురచురా చూసింది.* 

*నేనేం మాట్లాడలేదు.*


*"అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!" అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి.*

*రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది.* 

*మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను.*

*మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం!*

*మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది.*

 

*"పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?" అ‌ని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను.*

*ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు.*

*నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను.*

*అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు.* *'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు.*

*రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను.*


*"సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?" ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు.* 

*ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది.*

*"అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!"* *నిజాయితీగా అన్నాను.*

*"అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?"* *మరొకసారి అదే ప్రశ్న అడిగాడు.*

*"అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!"*

*"అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!" అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు.* 

*"నువ్వూ..."*

*"వాళ్ళబ్బాయినండీ!'*

*ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది..*

*"రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి.‌ తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి.* *వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి.* *అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!"*

*ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది.*

*నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది.*

*"చదువుకుంటున్నావా?" అడిగాను.*

*"టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!"*

*ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది.*

*"ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?" అంటూ అడిగాను.*

*నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను.*

*"తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!" అతడ్ని అభినందిస్తూ అన్నాను.*

*"పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!"*

*ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను.* 

*" అయితే ఒక్క విషయం బాబూ!" అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి.."చెప్పండి!" అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను.*

*"మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!" అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి, అబ్బాయి భుజం తట్టెను.*

*ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.* 

 

 *‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!*

*****

ఇష్టమైన పూలు*

 *భగవంతునికి  ఇష్టమైన పూలు*

            

🌹🌹🌹🌹🌹🌹🌹

*"అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః*                                       

*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః*                                                     

*జ్ఞాన  పుష్పం  తపః పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ*                                           

*సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్"*



*1. అహింసాపుష్పం: *

*ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’*



*2. ఇంద్రియ నిగ్రహం: * 

*చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం!’*


*3.  దయ: *

*కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.  ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.*


*4.  క్షమ: * 

*ఎవరైనా మనకి అపకారం చేసినా,  ఓర్పుతో సహించడమే క్షమ.  ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.*


*5. ధ్యానం: *

*ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదవ పుష్పం!*


*6. తపస్సు: * 

*మానసిక ( మనస్సు), వాచిక (మాట), కాయక ( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.  ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.*


*7. జ్ఞానం: *

*పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.  ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.*


*8.సత్యం: *

*ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.  ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.* 


*ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలే, అవన్నీ మీ తోటలో లేవంటారా.  మరేం పరవా లేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి. *✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

హైదరాబాద్‌లోని ప్రాంతాలు-

 


హైదరాబాద్‌లోని ప్రాంతాలు- 

             వాటి వెనుక చరిత్ర..!

                ➖➖➖✍️



వివిధ మాధ్యమాల ద్వారా, మితృల ద్వారా,..... తెలుసుకున్న కొంత సమాచారం....


చాలామందికి తెలియని 

ఈ విషయాలను అందరితో పంచుకోవాలనుకుని పోస్ట్ చేస్తున్నాను....


ఆరో నిజాం కాలంలో ‘అల్‌ బర్ట్ అబిద్’ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి ‘అబిద్ అండ్ కంపెనీ’ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా   "అబిడ్స్" గా మారిపోయింది.


గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన ‘లంగర్ ఖానా’ కాలక్రమేణా

 "లంగర్‌ హౌజ్‌" మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో "చెంచల్‌ గూడ" గా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


 ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు "కార్వాన్" అని పిలుస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆప్రాంతాన్ని   ‘కావడీల గూడెం’ అని పిలిచేవారు. క్రమంగా ఆ ఏరియా "కవాడిగూడ" గా మారింది.


 దోమలగూడ అసలు పేరు ‘దో   మల్ గూడ’!    పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను ‘దో మల్ గూడ’ అని పిలిచేవారు. కాలక్రమంలో అది

"దోమలగూడ" గా మారింది.


ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా "ఖైరతాబాద్" గా మారింది.


హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం 

ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో  "బేగం బజారు" గా నిలిచిపోయింది.


ఐదో నిజాం ‘అఫ్జల్ ఉద్ధౌలా’ ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా

"అఫ్జల్ గంజ్" గా మారింది.


ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు ‘హిమాయత్ అలీ ఖాన్’ పేరుతో 

"హిమాయత్ నగర్" గా స్థిరపడింది.


మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో

" హైదర్ గూడ"  ఏర్పడింది.


గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే ‘మాలిక్ యాకూబ్’ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో "మలక్ పేట" గా మారింది.


‘తార్నాక’ అసలు పేరు తార్  నాకా ! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను ‘తార్  నాకా’ అని పిలిచేవారు. కాలక్రమంలో అది

"తార్నాక" గా మారింది.


‘శాలిబండ’ అసలు పేరు ‘షా-అలీ-బండ’. అప్పట్లో ‘షా అలీ’ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ పై నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను ‘షా అలీ బండ’ అని పిలిచేవారు. కాలక్రమంలో అది "శాలిబండ" గా మారింది.


నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను  "హబ్సిగూడ" పిలుస్తున్నారు.


ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి

"మదీనా" అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి అసలు పేరు ‘చిక్కడ్-పల్లి. ‘చిక్కడ్’ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్ పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది!  బురద ఉన్న ప్రదేశం కాబట్టి ‘చిక్కడ్- పల్లి’ అని పిలిచేవారు. కాలక్రమంలో "చిక్కడపల్లి"గా మారిపోయింది.


‘అడిక్‌మెట్’ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో  "అడిక్ మెట్ "గా మారిపోయింది.


నిజాం కాలంలో ‘నౌబత్ పహాడ్’‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. ‘నౌబత్’ అంటే డోలు. ‘పహాడ్’ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి  "నౌబత్

పహాడ్ "అని పేరొచ్చింది.


గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను 

" బాగ్‌లింగంపల్లి" అంటున్నారు.


సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ 

"మీరాలంమండి" మార్కెట్ ఫేమస్!


నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు "బార్కాస్"అని పిలుస్తున్నారు.


 తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో "తాడ్‌ బండ్‌"గా మారిపోయింది.


ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం "ఎర్రమంజిల్‌" గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.


కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి  "కాచిగూడ "అనే పేరొచ్చింది


మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన

 "లాడ్‌ బజార్ " లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.


హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం "ముషీరాబాద్" గా స్థిరపడిపోయింది.


ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ " ఎల్బీ స్టేడియం" నిర్మించారు.


పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడుబాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా

 "పబ్లిక్ గార్డెన్స్ "అని పిలుస్తున్నారు.


మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు "చాదర్ ఘాట్" అని పేరొచ్చింది.


1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద "ఆస్మాన్ గఢ్" ఏర్పడింది.


నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద  "ఉమ్దా బజార్" ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.


గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం  "గౌలిగూడ"గా స్థిరపడిపోయింది.


రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం "మౌలాలీ "సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో  "లాలాగూడ"గా మారింది. 


1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని "సుల్తాన్ బజార్ "అని మార్చేశారు.


రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. "బేగంపేట" ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది. 


1853లో నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది! లాండ్ మార్కుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత "సోమాజీగూడ" అయింది.


రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో "రికాబ్ గంజ్‌"గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.


రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం  "సరూర్ నగర్ "అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ "డబిర్ పురా" లో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.


అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది "అంబర్‌ పేట" గా స్థిరపడిపోయింది.


చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది  "చాంద్రాయణగుట్ట"గా మారిపోయింది.


చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి "చిలకలగూడ" కు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!


మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత.     ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ‘మంగళ్ హత్’ అనే పిలిచేవారు. కాలక్రమంలో    "మంగళ్‌హాట్‌" గా మారిపోయింది.


నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది 

"నాంపల్లి" గా మారిపోయింది.


1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరుమీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత "సైదాబాద్ " అని పిలుస్తున్నారు.


టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని

" టప్పాచబుత్ర" అని పిలుస్తున్నారు.


లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం "తుకారాంగేట్" గా మారిపోయింది.


హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు  "యాఖుత్ పురా"                   

అని పిలుస్తున్నారు.✍️

                                 …సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



ధనవంతుడు

 

          *నిజమైన ధనవంతుడు*

                   ➖➖➖✍️     


*ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై  ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు.* 


*ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు.*


*ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు.*


*రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు.*


*ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు.*


*ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు.*


*ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.*


*రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు.*


*ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు.*


*ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది.*


*ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ‘సాందీపనీ’ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన ‘వశిష్ఠముని’ దగ్గరికీ వెళ్ళారు.*


*ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు.*


*ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు.*


*ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.*


*రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు.*


*ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.*


*ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు… “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”*


*ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు.*


*అంతకు మునుపు ఠాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు.* 


*వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు.*


*లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు.*


*ఆయన కుటుంబమంతా ఠాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.*


*రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.*


*అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు పెద్ద ఫ్యాక్టరీ లున్నాయి.”*


*“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా                         నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.*


*“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”*


*“అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది.                                  నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను.       ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.     నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను                          ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”*


*ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.*


*కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.*


*రవీంద్రుల వారు సంతోషంగా….                   “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”*


*“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ఆచార్య సద్బోధన:*

 

           *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️



*సత్సంగం*

```

మనసులో ఆధ్యాత్మిక భావాలు కలగడానికి సత్సంగం మంచి వేదిక.  


ఎట్టివారి చెంత ఉంటామో అట్టివారి ఆలోచనలు, గుణాలే మనకు అంటు కుంటాయి. 


కడివెడు పాలకు ఒక్క విషపు చుక్క కలిపినా చాలు కదా, ఆ పాలు అన్నీ విషపూరితం కావడానికి. 


ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం చాలు మనిషిని అధఃపాతాళానికి నెట్టడానికి. 


మనలో ఎన్ని సుగుణాలు ఉన్నాయా అని కాదు ఎన్ని దుర్గుణాలను బయటకు నెట్టేశామా అనేది ముఖ్యం. 


మంచి మిత్రులు ఎంతమంది ఉన్నా పరవాలేదు. కానీ దుర్మార్గుడు ఒక్కడున్నా చాలు, జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక ఈ విషయములో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం.


"సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే  నిర్మోహత్వం నిర్మోహత్వే  నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి".✍️```

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

న’గరం’

 *శీర్షిక: న’గరం’* (మినీ కవితలు)

             ~తుమ్మ జనార్దన్ (కలం పేరు: జ్ఞాన్)


11. నగరం పెరుగుతుంది

లేనివాడికి అందడం లేదు

ఉన్నవాడికి చాలడం లేదు.

12. బండి నడపడానికి హెల్మెట్ ఉంటే చాలు

లైసెన్సు లేకున్నా పర్లేదు

ఆపేదెవరు, అడిగేదెవరు.

13. హైటెక్ సిటీ

రద్దీ (Traffic) నియంత్రణకు

ఏ టెక్నాలజీ పనిచేయడం లేదు.

14. ట్రాఫిక్ గీతల్ని పిచ్చిగీతలనుకుంటారు

లక్ష్మణ రేఖలనుకుంటే బాగుండేది.

15. ఇక్కడ హిల్స్ పరిస్థితి

మైసూర్ బోండాం లాంటిది.

16. పేదవారు కొండలపై నివసించేవారు

ఇప్పుడు పెద్దవారు/ధనికులు 

నివసించాలనుకుంటున్నారు.

17. ఆశల పల్లకీ ఎక్కి 

నగరం చేరేవారే అందరూ

నిరంతరాయంగా జరుగుతూనే ఉంది

ఇది ఎప్పుడు ఆగుతుందో.....

18. ముత్యాల నవ్వులతో

ముత్యాల నగరం చేరారు

చివరికి అదీ కరువైంది ఇక్కడ.

19. జీతాలే ఎక్కువ కాదు 

ఖర్చులూ అంతే.

20. ఆంధ్రులు (సంక్రాంతి) పండుగకి వెళ్తే

సిటీ రోడ్లు పండుగ చేసుకున్నాయి.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 85*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 85*


"ఆర్యుల అనుగ్రహం పర్వతకుల వారికి అదృష్టాన్ని కటాక్షించింది" అన్నాడు చంద్రుడు నిష్టూరంగా. 


చాణక్యుడు అతడివైపు అదోలా చూసి "అదృష్టమో, దురదృష్టమో... తెల్లవారినీ... తెలుస్తుంది..." అనేసి వెళ్ళిపోయాడు చరచరా నడుస్తూ. నిర్ఘాంతపోయాడు చంద్రగుప్తుడు. 


ఆర్యుడు సరాసరి రాక్షసామాత్యుని గృహానికి చేరుకున్నాడు. ఎలాగైనా సరే విషకన్య బారి నుంచి పర్వతకుని కాపాడాలన్న దుగ్ధతో బయలుదేరడానికి సమాయుత్తమవుతున్న రాక్షసుడు తన ఇంటి గుమ్మంలో చాణక్యుడు ప్రత్యక్షమయ్యసరికి నివ్వెరపోయాడు. 


చాణక్యుడు మందహాసం చేసి "లోపలికి రావచ్చునా ?" అని అడిగాడు. 


రాక్షసుడు తేరుకుని, గుమ్మంలోంచి అడుగు లోపలికి వేస్తూ "రండి ...." అన్నాడు అయిష్టంగా. 


చాణక్యుడు లోపలికి ప్రవేశించి "మీరేదో అత్యవసర రాచకార్యం మీద బయలుదేరినట్టున్నారు. నేను పానకంలో పుడకలాగే అడ్డొచ్చానేమో ?" అన్నాడు చాణుక్యుడు చూపులతోనే గృహాన్ని కలియజూస్తూ. 


'అవును పానకంలో పుడకలాగే అడ్డుపడ్డావ్' అనుకున్నాడు రాక్షసుడు లోలోపల. కానీ పైకి మాత్రం మాట్లాడకుండా మౌనం వహించాడు. 'ఈ వేళప్పుడు చాణక్యుడు వెతుక్కుంటున్నట్టు తన ఇంటికి ఎందుకు వచ్చినట్టు ? అతని ఆంతర్యం ఏమిటి ? ఏదైనా, అతడు మొట్టమొదటిసారిగా తన ఇంటికి వచ్చాడు. గౌరవించడం తన విధి.' 


రాక్షసుడు ఆలోచనలనుంచి తేరుకుంటూ "పానీయమేమైనా పుచ్చుకుంటారా ?" అడిగాడు మర్యాద కోసం. 


"పానీయాలు, ఫలహారాలు మనలాంటి వాళ్లకి తగునా ?" అంటూ చాణక్యుడు నవ్వి "అమ్మాయీ.... ! అమ్మాయీ ...!" అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు. ఎక్కడో వంటగదిలో వున్న రాక్షసుని అర్ధాంగి ఆ కేకలకు హడలిపోతూ అక్కడికి పరిగెత్తుకొచ్చింది. సాక్షాత్తూ సరస్వతీ పుత్రునిలా బ్రహ్మతేజస్సుతో కనిపించాడు చాణక్యుడు. 


"అమ్మాయీ ! నన్ను చాణక్యుడంటారు. వేదధ్యయనం చేసిన సబ్బ్రాహ్మణుడిని" అని పరిచయం చేసుకున్నాడు చాణుక్యుడు. 


రాక్షసపత్ని భక్తి ప్రపత్తులతో చాణక్యునికి పాదాలకు నమస్కరించింది. 


"దీర్ఘసుమంగళీభవ..." ఆశీర్వదించాడు చాణక్యుడు. 


ఆ ఆశీర్వాదాన్ని వింటూ అదిరిపడ్డాడు రాక్షసుడు. 'ఆనాడు తొలిసారి ధర్మశాలలో తాను నమస్కరించినప్పుడు 'ఆయుష్మాన్ భవ' అంటూ ఆశీర్వదించాడు చాణక్యుడు. యుద్ధరంగంలో చేత చిక్కిన తనని చంపకుండా వదిలేస్తూ 'ఆర్యులకు ఇచ్చిన మాట కోసం మీ ప్రాణాలు కాపాడా'నన్నాడు చంద్రుడు. ఇప్పుడు చాణక్యుడు వెతుక్కుంటూ తన ఇంటికే వచ్చి తన భార్యని పిలిచి మరీ 'దీర్ఘసుమంగళీభవ...' అని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వచనాలు కాకతాళీయమా ? వీటిద్వారా చాణక్యుడు తనకి ఏదైనా సందేశాన్ని అందిస్తున్నాడా ? ఏది ఏమైనా చాణక్యుడు జిత్తులమారి. ఏమాత్రం నమ్మదగిన వ్యక్తికాడు.' 


రాక్షసుని హావభావాలను వోరకంట గమనిస్తున్న చాణక్యుడు లోలోపల నవ్వుకుని, రాక్షసపత్నితో "అమ్మాయీ ... ! సాటి బ్రాహ్మణుడిని అతిధిని... క్షుద్భాధతో వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇంత పచ్చడో, ఊరగాయో వేసి భోజనం పెడితే సంతోషిస్తా..." నన్నాడు. ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు రాక్షసుడు. 


రాక్షసపత్ని తలవూపి "తమవంటి పెద్దలు మా ఇంటికి అతిధిగా రావడం మా పూర్వజన్మ సుకృతం... రాక రాక మా ఇంటికి వచ్చారు. ఊరగాయతో పంపిస్తానా... అరఘడియ ఆగండి స్వామీ... మా వారితో కబుర్లు చెబుతూ ఉండండి. ఇష్టమృష్టాన్న భోజనమే వండి వడ్డిస్తాను" అని చెప్పి వంటింటి వైపు వెళ్ళిపోయింది. 


"తొందరేం లేదమ్మాయ్... నిదానంగానే వంటకాలు తయారుచేయ్యి. మేము ఈలోపు కాస్తంత పిచ్చాపాటి మాట్లాడుకుంటాం" అంటూ వెనకనుంచి కేకేశాడు చాణక్యుడు. 


రాక్షసునికి అతని వ్యూహం ఇప్పుడు అర్థమైంది. 'తాను పర్వతకుడిని హెచ్చరించకుండా సైంధవుడిలా అడ్డుపడడానికే తన ఇంటికి వచ్చాడు చాణక్యుడు. ఇక అతనిని ఒంటరిగా ఇంట్లో ఉంచి తన మానాన తాను పోలేడు. అలా అని 'ఆ కన్య విషకన్య అనీ, ఆమె పొందు అనుభవించిన వారు తక్షణమే మరణిస్తారన్న' నిజం బయట పెట్టేస్తే తాను నేరస్తుడవుతాడు. 


ఇంక చేసేదేమీ లేక తేలుకుట్టిన దొంగలా మౌనం వహించి చాణక్యుడు చెప్పే కబుర్లు వింటూ ఉండిపోయాడు రాక్షసుడు. చాణక్యుడు ఆ ఇంటి నుంచి బయటపడేసరికి అర్ధరాత్రి దాటింది. తన పథకం పారానందుకు ' ఉస్సూరు ' మంటూ నిట్టూర్చాడు రాక్షసుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మాతృ భాష సేవలో

 185వ రోజు: (శుక్ర వారము) 09-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఒళ్లు వంచి పనుల నుత్సాహముగ చేయ

ఫలితమదియె కలుగు బాగుగాను 

కష్ట పడెడు గుణము ఘన కీర్తి కలిగించు 

తెలిసి మెలగ మేలు తెలుగు  బాల.


 మనము చేసేది ఏ పనినైన ఇష్టముగ, సంతోషముగ, మన:పూర్వకముగ ఫలితము ఆశసించకుండ చేసిన ఎడల అది మనకు మంచి ఫలితమునిచ్చును. అంతే కాకుండ కష్టపడే గుణము శారీరక మనోధైర్యం పాటు మంచి కీర్తిని కూడ చేకూర్చును. 

 

ఈ రోజు పదము. 

ముంగిస : అంగూషము, అహిభుక్కు, అహిమారకము, ఉరగారి, మకులము, పింగళము, బభ్రువు, ముంగి, లోహితాననము, సర్పతృణము, హ్రీకము.

అహం వైశ్వానరో భూత్వా

 ఊర్ధ్వమూలం.....


శ్లో॥ అహం వైశ్వానరో భూత్వా

ప్రాణినాం దేహమాశ్రితః ।

ప్రాణాపాన సమాయుక్తః

పచామ్యన్నం చతుర్విధం ॥


తా॥ నేను వైశ్వానరుణ్ణి (జఠరాగ్ని) అయి ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉంటాను. ప్రాణ అపానాలతో కూడి నాలుగు రకాల అన్నాన్ని ఆరగిస్తాను.


వ్యాఖ్య...


ఈ శ్లోకం ప్రసిద్ధమైన శ్లోకం. భారతదేశంలో చాలామంది, అనేక ఆశ్రమవాసులు "అన్నదోష నివారణకై భోజనకాలాలలో ఈ శ్లోకాన్ని పఠించి భుజించటం ఆచారం" గా వస్తున్నది.


పరమాత్మ సర్వవ్యాపి. అంతటా ఉన్నాడు. వెలుపల అంతటా ఎలా వ్యాపించి యున్నాడో అలాగే ప్రాణుల లోపల కూడా వ్యాపించి యున్నాడు.


ఎలాంటి రూపంలో ఉన్నాడు...


1. వైశ్వానరో భూత్వా...


వైశ్వానర రూపంలో.. జఠరాగ్నిరూపంలో.. ఉన్నాడు. ప్రాణం ఉన్నంతకాలం శరీరం వెచ్చగా ఉండాలి. ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది భగవంతుడే. అందుకే మండు వేసవిలోను, చల్లని శీతాకాలంలోను ఒకేవిధంగా 98.4 F వేడి ఉంటుంది. ఆ అగ్నియే జఠరాగ్ని- వైశ్వానరాగ్ని. అదే పరమాత్మ.


ఏం చేస్తున్నాడు పరమాత్మ వైశ్వానరాగ్ని రూపంలో...


2. పచామ్యన్నం చతుర్విధం...


మనం తినే 4 రకాల అన్నాన్ని పచనం చేస్తున్నాడు పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి. మనం హాయిగా తిని పడుకుంటే ఆయన మాత్రం నిద్రపోకుండా తిన్నదాన్ని పక్వం చేస్తున్నాడు. మనం నిద్రించినా ఆయన నిద్రపోడు. మనం నిద్రలేచి మళ్ళీ తినాలని అనుకుంటే తింటాం. అలా తినాలంటే అంతకు ముందు తిన్నది జీర్ణం కావాలి. ఆ పనిని ఆయన చేసి మనకు సహాయపడుతున్నాడు.

మనం తినే "అన్నం చతుర్విధం". అంటే నాలుగు రకాలుగా ఉంటుంది. అవి...


2.1. భక్ష్యం...


గట్టి పదార్థాలు. పళ్ళతో కొరికి, నమిలి తినేవి. గారెలు, వడలు, లాంటివి.


2.2. భోజ్యం...


మెత్తని పదార్థాలు. ముద్దలుగా చేసుకొని తినేవి. అన్నం, కూరలు, పచ్చళ్ళు, పప్పు మొదలైనవి.


2.3. చోష్యం...


జుర్రుకోనేవి, త్రాగేవి అయిన ద్రవపదార్థాలు. సాంబారు, రసం, మజ్జిగ, కూల్ డ్రింక్స్, పాయసం మొదలైనవి.


2.4. లేహ్యం...


నాలుకకు రాసుకొనేవి, నంజుకోనేవి, చప్పరించేవి. ఊరగాయలు, కొన్నిరకాల పచ్చళ్ళు, తేనె మొదలైనవి.


ఈ నాలుగు రకాల ఆహారాలను పరమాత్మే జఠరాగ్ని రూపంలో పక్వం చేస్తాడు. ఎలా...


3. ప్రాణ అపాన సమాయుక్తః...


ప్రాణ, అపాన శక్తులతో కూడి పక్వం చేస్తాడు. మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలకు లాగివేసి, దానిని జఠరాగ్నితో బాగా పచనం చేసి, జీర్ణింపజేసి, అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి, మిగిలిపోయిన సారంలేని, అవసరంలేని ఆహారపు పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేసేది ప్రాణం. ఈ పనికిరాని పిప్పిని బయటకు త్రోసివేసేది అపానం. ఈ రెండు చర్యల ద్వారా మనకు కావలసిన శక్తి వస్తుంది. దానితో పనులు చేసుకో గలుగుతాం. మళ్ళీ శక్తి కోసం తినగలుగుతాం. ఈ నిరంతర ప్రక్రియతో ప్రాణ అపానములనే శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడు. ఈ సహాయాన్ని పరమాత్మ చేయకపోతే మళ్ళీ మళ్ళీ తినలేం. శక్తిని పొందలేం.

నిజంగా ఇక్కడ ప్రాణ అపానాలను రెండింటినే చెప్పినా ఇంకా మూడు (వ్యాన,

ఉదాన, సమాన)

అనే రూపాలలో పరమాత్మ మనకు నిరంతరం సాయం చేస్తూనే ఉన్నాడు.


3.1. వ్యాన...


అంటే జీర్ణమైన ఆహారంలోని సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేర్చేది. ఈ సారాన్ని రక్తంలో కలిపి రక్తం ద్వారా సరఫరా చేస్తుంది.


3.2 సమాన...


అంటే ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో అంత అన్నసారాన్ని ఆయా అవయవాలకు సరఫరా చేసేది.


3.3. ఉదాన...


అంటే అన్ని శరీరభాగాలకు వార్తలు పంపటమే గాక శరీరాన్ని విడిచిన తర్వాత జీవుణ్ణి చేర్చవలసిన స్థానానికి చేర్చేది.


"జఠరాగ్ని అనేది బొడ్డు దగ్గర ఉండే కుంపటి. ఆ కుంపటిని ప్రజ్వలింప జేసే కొలిమితిత్తులే ప్రాణ అపానాలు".


ఈ పనులన్నింటిని పరమాత్మ ఎక్కడ ఉండి నిర్వహిస్తున్నాడు? నిజంగా పరమాత్మ అడ్రస్ లేనివాడు. అన్ని అడ్రస్ లు ఆయనవే. ఎక్కడో ఒకచోట ఉండేవాడికే అడ్రసులు. అంతటా ఉండేవానికి అడ్రస్ ఎందుకు..? "ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు" అన్న ప్రహ్లాదుని పలుకు ఇదే...


4. ప్రాణినాందేహం ఆశ్రితః...


ఈ పనులన్నీ చేయటానికి అన్ని ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు. కనుక పరమాత్మను ఎక్కడా వెతకనక్కరలేదు. బస్సులలో, రైళ్ళలో, విమానాలలో ప్రయాణించాల్సిన పనిలేదు. దేహంలోనే వెతికి తెలుసుకోవచ్చు. అయితే బయటకు చూడకుండా లోపలకే చూడాలి. అంతర్ముఖులు కావాలి.


ఈ ప్రకారంగా పరమాత్మే సూర్యచంద్రుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయనే జఠరాగ్ని రూపంలో తిన్న అన్నాన్ని అరిగిస్తున్నాడు. ఆయనే దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తున్నాడు. ఇంతటి ఉపకారం చేసే పరమాత్మకు మనం చూపే కృతజ్ఞత ఏమిటి? అదే నివేదన. ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే సమర్పించి భుజించాలి. అలా నివేదించకుండా, సమర్పించకుండా, అనుమతి తీసుకోకుండా తింటే దొంగలమవుతాం. కనుక జాగ్రత్త తీసుకోవాలి.


ఆహారాన్ని ఇస్తున్నదీ ఆయనే, తయారు కావటానికి అగ్ని రూపంలో సాయం చేస్తున్నదీ ఆయనే, తిన్న అన్నాన్ని అరిగించి అన్ని అవయవాలకు సరఫరా చేస్తున్నదీ ఆయనే. కనుక అన్నం ముద్ద నోట్లోకి పోయేముందు పరమాత్మ జ్ఞాపకానికి రావాలి. కృతజ్ఞత తెలుపాలి. అంతేకాదు. పట్టెడన్నం అతిధికి పెట్టినప్పుడు ఆ అతిధిని భగవంతునిగా భావించాలి. ఒక కుక్కకు పిడికెడు అన్నం పెడితే అక్కడ జఠరాగ్ని రూపంలో ఆరగించి అరిగించేవాడు పరమాత్మేననే భావనచేయాలి.


దీనివల్ల ఏమిటి ఫలితం...


అన్నం ఆరగించే వానిలోను, పచనం చేసే జఠరాగ్నిలోను, వెలుపల ఉండే సూర్యచంద్రుల లోను, క్రింద ఆధారంగా ఉండే భూమిలోను, సస్యాలలోను, ప్రాణికోట్లలోను, సర్వేసర్వత్రా, అంతటా, అన్నింటా, అన్ని వేళలా బ్రహ్మబుద్ధి.. ఈశ్వరుడి భావన చేయగా.. చేయగా.. మన పరిమిత వ్యక్తిత్వం (జీవభావం) కరిగిపోయి నీవు, నేనూ, అతడు, ఆమె, అదీ, అన్నీ.. సర్వమూ బ్రహ్మమే.. ఈశ్వరుడె అనే స్థిరభావన సిద్ధిస్తుంది. 'అప్పుడే ఊర్ధ్వమూలం' అనే తత్వార్థం అనుభవానికి వస్తుంది...


|| ఓం నమః శివాయ ||


*సేకరణ*

జ్యేష్ఠ మాసమంటే

 సంస్కృతీవైభవమ్!


*జ్యేష్ఠ మాసమంటే ....*


1జ్యేష్ఠులకు వివాహము చేయవచ్చునా ? 

   

సమాధానం.వధువు , వరుడు ఇద్దరు జ్యేష్ఠులు అయినప్పుడు నిరభ్యంతరముగా వివాహము చేయవచ్చు . జ్యేష్ఠమాసము లో వివాహము జరిపించ కుండా మిగిలిన మాసములలో జరిపించవచ్చు .  . కానీ త్రి జ్యేష్ట కాకూడదు  . 


2 . త్రి జ్యేష్ఠఅంటే ఏమిటి ?


సమాధానం.వధూ వరులు ఇద్దరు { మొదటి సంతానము}  జ్యేష్టు లైనపుడు జ్యేష్ట మాసమునందు వివాహము చేయకూడదు ఇద్దరిలో ఏ ఒక్కరూ జ్యేష్ఠనక్షత్రము లో గానీ , జ్యేష్ఠమాసము నందు గానీ , జన్మించి ఉండకూడదు .

ఈ విధముగా త్రి జ్యేష్ఠను తెలుసుకోవాలి .


౩. ఒకే రాశి లో గానీ , ఒకే నక్షత్రములో గానీ జన్మించిన వారికి పెండ్లి జరపవచ్చా ?

 

సమాధానం.ఒకే రాశిలో వేర్వేరు నక్షత్రములలో పుట్టిననూ , ఒకే నక్షత్రములో వేర్వేరు రాశులలో జన్మించిననూ వివాహము చేయవచ్చును . ఒకే నక్షత్రములో జన్మించిననూ పాదముల తేడా ఉన్నప్పుడు పెండ్లి జరిపించ వచ్చు .


4 . కొంతమంది జాతకములు చూసుకొని సంబంధములు కుదుర్చుకొంటారు.జాతకము ఒకరికి ఉండి మరొకరికి లేనప్పుడు ఏంచెయ్యాలి ?


 సమాధానం.జాతకములు వదూవరులకు ఇద్దరికీ ఉన్నప్పుడు వారియొక్క జన్మ నక్షత్రముల ప్రకారమే వివాహ లగ్నము నిర్ణయించుకోవాలి .వరుని జన్మ నక్షత్రము వధువు నామ నక్షత్రము కలిపి వివాహలగ్నం నిర్ణయించ వచ్చు . నామ నక్షత్రము కూడా సరిపడక పొతే వధువుకు పేరు మార్చి అనుకూలమైన పేరు పెట్టి వివాహము చేయవచ్చు . కానీ ఎట్టి పరిస్థితులలోనూ వరుని నామము మార్చకూడదు .


5.  ఇక్కడ చాలామందికి అనుమానము వస్తుంది . అమ్మాయి పేరే ఎందుకు మార్చాలి . అబ్బాయి పేరు ఎందుకు మార్చకూడదు .అని .?


సమాధానం.ఎందుకంటే భారతీయ వివాహ వ్యవస్థలో వివాహం జరిగిన తరువాత స్త్రీ కి ఇంటి పేరు మారుతుంది . అదేవిధముగా పిలుపు పేరు కూడా మార్చుకో వచ్చునని తెల్పితిరి . 


6. సొంత అన్న తమ్ములకు ఒకే ముహూర్తములో వివాహము చేయవచ్చునా ?


సమాధానం.అన్న తమ్ములకు ఒకే ముహూర్తములో వివాహము చేయకూడదు .

ఆరు మాసముల తేడా ఉండాలి . తెలుగు సంవత్సరముల ప్రకారము ఉగాది ముందు వచ్చే మాఘ , పాల్గుణ మాసములలో ఒకరికి , ఉగాది తరువాత వచ్చే వైశాఖ, జ్యేష్ట మాసములలో మరియొకరికి వివాహము చేయవచ్చు ఒకే  తల్లికి జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సూత్రము వర్తించదు . ముందు కుమార్తె వివాహముచేసి ఆతరువాత ఎప్పుడైనా కుమారుని వివాహము చేయవచ్చు .🙏🙏🙏🌷👌👌

మాంగళ్యం విశిష్ఠత!

  సంస్కృతీవైభవం!


మాంగళ్యం విశిష్ఠత!


పెళ్ళిలో ముత్తైదువుల హృదయానికి మంగళసూత్రాలని ఎందుకు తాకిస్తారో తెలుసా?


పెళ్ళిలో ప్రతీ ఆచారం అద్భుతం, పైగా ప్రతీ ఆచారం వెనుక ఎంతో అర్ధం ఉంటుంది. పెళ్ళిలో మాంగల్యధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి మేడలలో తాకించిన తరువాత వరుని చేత వధువు మేడలో మాంగల్యధారణ చేయిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేయిస్తారంటే… ఎంత జాగ్రత్తగా వధూవరుల జాతకాలను చూపించినా, ప్రతినక్షత్రానికి ఒక గండకాలం ఉంటుంది. అలాంటి గండకాలం వస్తే? అన్న, విషయాన్ని కూడా ఏ కన్యాదాత (తండ్రి) ఆలోచించలేడు. హృదయస్థానంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. అందుకనే మాంగల్యధారణ చేయించే సమయంలో కూడా మంగళసూత్రాలను వధువు హృదయస్థానానికి తాకేటట్టుగా పట్టుకొమ్మంటారు.


వధువు కళ్యాణవేదిక మీదకి వచేటప్పుడు కూడా గౌరీ పూజ చేసి వస్తుంది. అందరి స్త్రీలకీ ఉపాసనా శక్తి ఒకే రకంగా ఉండదు కదా! ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలా ప్రతి ముత్తైదువు యొక్క మేడలో ఆ మంగళసూత్రాలను తాకించడం చేత ఏ తల్లి ఉపాసన ఎక్కువగా ఉన్నదో తెలియదు. అలా తాకించి కట్టడం వల్ల ఆ ఉపాసన శక్తి కొంత ఆ మంగళ సూత్రాలు తీసుకుంటాయి. తీసుకొని వధువుని దీర్ఘసుమంగళిగా ఉండేటట్లుగా అనుగ్రహించగలిగిన శక్తి వస్తుంది ఇలా చెయ్యడం వలన. ఇలా ముత్తైదువులకు మాంగల్యం తాకించే సమయంలో కొంతమంది లలితా సహస్రం చదువుతారు. పూర్తిగా చదివే సమయం లేకపోయినా “కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా” అన్న నామం వరకు అయినా చదువుతారు. అలా చదవడం వల్ల ఆ తల్లి యొక్క కృప అప్పుడే మాంగల్యం కట్టించుకోబోతున్న వధువు మీద ఉండి తీరుతుంది.


                స్వస్తి!

మాటనేర్పుండాలి

 


మనిషికి మాటనేర్పుండాలి.ఎందుకంటారా?


మాట నేర్పు 

--------------------

ఉ: " మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురా

మాటల చేత భూపతులు మన్నన జేసి పురంబు లిత్తురా

మాటల చేత మానినులు మన్నన జేసి సుఖంబు లిత్తురా

మాటలు నేర్వకున్న నవమానము, న్యూనము ,మానభంగమున్;"


అజ్ఙాత కవి కృతం !


ఎంత చక్కని పద్యం? లోకంలో మెప్పుపొందాలంటే మాటనేర్పు చాలా అవసరం! 

సుఖజీవనానికది సోపానం. మాటపొందిక లేని మానవుడు ఎక్కడా రాణించలేడు. 

యుక్తియుక్తంగా , ప్రియవాక్కులతో హృదయాహ్లాద జనకంగా శోత్రు పేయంగా 

మాటలాడ గలిగితే సర్వ సంపదలూ సర్వ శ్రేయములూ వాటియంతకు అవేవచ్చి 

మననలరిస్తాయి. అట్టివాడు లోకప్రియుడు .వానికి లోటుండదు.వానిమాటకు 

తిరుగుండదు.

అలా మాట నేర్పు గల వారికిఁ గలిగే లాభాలను కవి పైపద్యంలో పేర్కొన్నాడు. 

దేవతలు మన మాటలను మెచ్చి వరాలిస్తారు. అవేనుతులు. మాటలను మెచ్చేరాజులు 

అగ్రహారాదులు కానుకగా యిస్తారు. ఆమాటలు మెచ్చే మగువలు మనసారా సుఖాన్ని 

పంచుతారు. అందుచేత మంచిగా (నేర్పుగా ) మాటలాడటం నేర్చుకో! మాటనేర్పు 

లేకపోతే లోకంలో మనుగడ కష్టమౌతుంది. అడుగడుగునా అవమానాలే యెదురౌతాయి. 

పందిమందిలో చులకనైపోతారు. స్వాభిమానం దెబ్బతింటుంది. కాబట్టి పొందికగా 

అందంగా నేర్పుగా మాటలాడటం నేర్చుకో మని కవి సందేశం!

కాళిదాసాదికవులు సరస్వతీ కటాక్షంతో విశుధ్ధవచోవైభవులై భోజాది రాజేంద్రులచే ననర్ఘ 

వైభవముల నంది సుఖింప గా, బీర్ బల్ మొన్నగువారు చతురవచో వైభవంతో అక్బర్ 

వంటి వారిని మెప్పించుట మనకు విదితమే!

కాబట్టి హితంగా మితంగా ప్రియంగా మాటలాడుతూ లోకమంతా మనవెంట నుండేలా 

మనుగడను సాగిద్దాం.మానవత్వపు పరిమళాలను సాటివారికి పంచుదాం!

స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷