9, జూన్ 2023, శుక్రవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 85*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 85*


"ఆర్యుల అనుగ్రహం పర్వతకుల వారికి అదృష్టాన్ని కటాక్షించింది" అన్నాడు చంద్రుడు నిష్టూరంగా. 


చాణక్యుడు అతడివైపు అదోలా చూసి "అదృష్టమో, దురదృష్టమో... తెల్లవారినీ... తెలుస్తుంది..." అనేసి వెళ్ళిపోయాడు చరచరా నడుస్తూ. నిర్ఘాంతపోయాడు చంద్రగుప్తుడు. 


ఆర్యుడు సరాసరి రాక్షసామాత్యుని గృహానికి చేరుకున్నాడు. ఎలాగైనా సరే విషకన్య బారి నుంచి పర్వతకుని కాపాడాలన్న దుగ్ధతో బయలుదేరడానికి సమాయుత్తమవుతున్న రాక్షసుడు తన ఇంటి గుమ్మంలో చాణక్యుడు ప్రత్యక్షమయ్యసరికి నివ్వెరపోయాడు. 


చాణక్యుడు మందహాసం చేసి "లోపలికి రావచ్చునా ?" అని అడిగాడు. 


రాక్షసుడు తేరుకుని, గుమ్మంలోంచి అడుగు లోపలికి వేస్తూ "రండి ...." అన్నాడు అయిష్టంగా. 


చాణక్యుడు లోపలికి ప్రవేశించి "మీరేదో అత్యవసర రాచకార్యం మీద బయలుదేరినట్టున్నారు. నేను పానకంలో పుడకలాగే అడ్డొచ్చానేమో ?" అన్నాడు చాణుక్యుడు చూపులతోనే గృహాన్ని కలియజూస్తూ. 


'అవును పానకంలో పుడకలాగే అడ్డుపడ్డావ్' అనుకున్నాడు రాక్షసుడు లోలోపల. కానీ పైకి మాత్రం మాట్లాడకుండా మౌనం వహించాడు. 'ఈ వేళప్పుడు చాణక్యుడు వెతుక్కుంటున్నట్టు తన ఇంటికి ఎందుకు వచ్చినట్టు ? అతని ఆంతర్యం ఏమిటి ? ఏదైనా, అతడు మొట్టమొదటిసారిగా తన ఇంటికి వచ్చాడు. గౌరవించడం తన విధి.' 


రాక్షసుడు ఆలోచనలనుంచి తేరుకుంటూ "పానీయమేమైనా పుచ్చుకుంటారా ?" అడిగాడు మర్యాద కోసం. 


"పానీయాలు, ఫలహారాలు మనలాంటి వాళ్లకి తగునా ?" అంటూ చాణక్యుడు నవ్వి "అమ్మాయీ.... ! అమ్మాయీ ...!" అంటూ బిగ్గరగా కేకలు పెట్టాడు. ఎక్కడో వంటగదిలో వున్న రాక్షసుని అర్ధాంగి ఆ కేకలకు హడలిపోతూ అక్కడికి పరిగెత్తుకొచ్చింది. సాక్షాత్తూ సరస్వతీ పుత్రునిలా బ్రహ్మతేజస్సుతో కనిపించాడు చాణక్యుడు. 


"అమ్మాయీ ! నన్ను చాణక్యుడంటారు. వేదధ్యయనం చేసిన సబ్బ్రాహ్మణుడిని" అని పరిచయం చేసుకున్నాడు చాణుక్యుడు. 


రాక్షసపత్ని భక్తి ప్రపత్తులతో చాణక్యునికి పాదాలకు నమస్కరించింది. 


"దీర్ఘసుమంగళీభవ..." ఆశీర్వదించాడు చాణక్యుడు. 


ఆ ఆశీర్వాదాన్ని వింటూ అదిరిపడ్డాడు రాక్షసుడు. 'ఆనాడు తొలిసారి ధర్మశాలలో తాను నమస్కరించినప్పుడు 'ఆయుష్మాన్ భవ' అంటూ ఆశీర్వదించాడు చాణక్యుడు. యుద్ధరంగంలో చేత చిక్కిన తనని చంపకుండా వదిలేస్తూ 'ఆర్యులకు ఇచ్చిన మాట కోసం మీ ప్రాణాలు కాపాడా'నన్నాడు చంద్రుడు. ఇప్పుడు చాణక్యుడు వెతుక్కుంటూ తన ఇంటికే వచ్చి తన భార్యని పిలిచి మరీ 'దీర్ఘసుమంగళీభవ...' అని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వచనాలు కాకతాళీయమా ? వీటిద్వారా చాణక్యుడు తనకి ఏదైనా సందేశాన్ని అందిస్తున్నాడా ? ఏది ఏమైనా చాణక్యుడు జిత్తులమారి. ఏమాత్రం నమ్మదగిన వ్యక్తికాడు.' 


రాక్షసుని హావభావాలను వోరకంట గమనిస్తున్న చాణక్యుడు లోలోపల నవ్వుకుని, రాక్షసపత్నితో "అమ్మాయీ ... ! సాటి బ్రాహ్మణుడిని అతిధిని... క్షుద్భాధతో వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇంత పచ్చడో, ఊరగాయో వేసి భోజనం పెడితే సంతోషిస్తా..." నన్నాడు. ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు రాక్షసుడు. 


రాక్షసపత్ని తలవూపి "తమవంటి పెద్దలు మా ఇంటికి అతిధిగా రావడం మా పూర్వజన్మ సుకృతం... రాక రాక మా ఇంటికి వచ్చారు. ఊరగాయతో పంపిస్తానా... అరఘడియ ఆగండి స్వామీ... మా వారితో కబుర్లు చెబుతూ ఉండండి. ఇష్టమృష్టాన్న భోజనమే వండి వడ్డిస్తాను" అని చెప్పి వంటింటి వైపు వెళ్ళిపోయింది. 


"తొందరేం లేదమ్మాయ్... నిదానంగానే వంటకాలు తయారుచేయ్యి. మేము ఈలోపు కాస్తంత పిచ్చాపాటి మాట్లాడుకుంటాం" అంటూ వెనకనుంచి కేకేశాడు చాణక్యుడు. 


రాక్షసునికి అతని వ్యూహం ఇప్పుడు అర్థమైంది. 'తాను పర్వతకుడిని హెచ్చరించకుండా సైంధవుడిలా అడ్డుపడడానికే తన ఇంటికి వచ్చాడు చాణక్యుడు. ఇక అతనిని ఒంటరిగా ఇంట్లో ఉంచి తన మానాన తాను పోలేడు. అలా అని 'ఆ కన్య విషకన్య అనీ, ఆమె పొందు అనుభవించిన వారు తక్షణమే మరణిస్తారన్న' నిజం బయట పెట్టేస్తే తాను నేరస్తుడవుతాడు. 


ఇంక చేసేదేమీ లేక తేలుకుట్టిన దొంగలా మౌనం వహించి చాణక్యుడు చెప్పే కబుర్లు వింటూ ఉండిపోయాడు రాక్షసుడు. చాణక్యుడు ఆ ఇంటి నుంచి బయటపడేసరికి అర్ధరాత్రి దాటింది. తన పథకం పారానందుకు ' ఉస్సూరు ' మంటూ నిట్టూర్చాడు రాక్షసుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 



🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: