🕉 మన గుడి : 🕉️
⚜ కడప జిల్లా : గండికోట
⚜ శ్రీ అగస్త్యేశ్వరకోన
💠 పరమ శివుని వాహనం నంది.
పరమ శివుని ధనుస్సు పినాకము. అటువంటి పవిత్రమైన నంది కొండలకు (కర్ణాటక) అధిష్టాన దైవమైన నందీశ్వరస్వామి విల్లే రెండు పాయాలుగా చీలి ఉత్తర పినాకిని (పెన్నా, రాయలసీమ ) దక్షిణ పినాకిని (పాలారు, తమిళనాడు) గా ప్రవహిస్తున్నాయి. తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వరుని, పుష్పగిరిలో వైద్యనాథేశ్వరుని పాదాలు కడుగుతూ పవిత్ర నది పెన్నమ్మ తల్లి ప్రవహించే మనరాయలసీమ మొత్తం శైవ క్షేత్రమే.
శివునికి ప్రీతి పాత్రమైన భూమే.
అందుకే ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని, ఒక పంచభూత లింగ క్షేత్రాన్ని, ఒక భాస్కర క్షేత్రాన్ని మనకి అనుగ్రహించాడు.
అటువంటి ఇంకొక మహత్తర " ముగ్గురు మూర్తుల తపోక్షేత్రo శ్రీ అగస్త్యేశ్వరకోన "
💠 మైలవరం జలాశయం పశ్చిమ దిశలో సహజసిద్దమైన ప్రకృతి అందాలతో, అనేక విశేషాలతో శ్రీ అగస్త్యేశ్వరకోన పుణ్యక్షేత్రం వెలిసింది.
శ్రీ అగస్త్య మహాముని కఠోర తపముచే వెలిసినందున ఈ పుణ్యక్షేత్రం శ్రీ అగస్త్యేశ్వరకోన గా పేరొందినది.
⚜ స్థలపురాణం ⚜
💠 త్రేతాయుగంలో శ్రీ అగస్త్యమహాముని పరమశివుని సలహా మేరకు, బ్రహ్మ వరం వల్ల మదగర్వితుడైన వింధ్య పర్వతం మదమణచడానికి దక్షిణ దేశ సంచారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అగస్త్యుడు దక్షిణ దిశగా వెళ్తూ అనేక ప్రదేశాల్లో శివలింగ ప్రతిష్ఠాపన గావించి, తపమాచరిస్తూ ముందుకు సాగారు.
💠 ఈ క్రమంలో దండకారణ్యమైన ఆంధ్రదేశంలో కూడా ఆయన సంచరించారు. ఇందులో భాగంగా ప్రకృతి రమణీయత, మానసిక ప్రశాంతత, దైవసంచారం లాంటి విశిష్ఠతలున్న ఈ ప్రాంతంలో అగస్త్య మహాముని మనోసంకల్పసిద్ది కోసం ధర్మపత్ని లోపాముద్రతో కలిసి పరమేశ్వరుని అనుగ్రహానికై శ్రీ దుర్గా సుబ్రమణ్యేశ్వరుల ప్రతిష్ఠ గావించి ఘోర తపస్సు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
💠 శ్రీ అగస్త్యేశ్వరకోన జిల్లాలోనే అతిపురాతనమైన, పవిత్రమైన శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నది. రాజరిక పాలనకు సాక్ష్యంగా నిలిచిన గండికోట దుర్గంనకు సమీపంలో మధ్యలో పెన్నమ్మ పరవళ్ళతో శ్రీ అగస్త్యేశ్వరకోన ఎంతో పవిత్రమైన వాతావరణంతో ఏర్పడినది.
💠 ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలు వున్నాయి. ఇందులో ఔషధీయ గుణాలు గల జలంతో నిండిన కోన వుంది.
ఇందులో స్నానమాచరించిన అనారోగ్య పీడితులకు స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆదిశేషునికి నివాసంగా వెలిసిన పుట్ట స్ర్తిలకు గౌరవప్రదమైన మాతృత్వాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే శ్రీ యంత్ర సహితంగా వెలిసిన ఆదిశక్తి శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు భక్తుల పాలిటి కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.
🔅 ముగ్గురు మూర్తుల తపోక్షేత్రం
💠 త్రేతాయుగంలో దక్షిణ దేశ సంచారంలో భాగంగా శ్రీ అగస్త్యమహాముని ఈ క్షేత్రంలో శ్రీ దుర్గా సుబ్రమణ్యేశ్వరుల ప్రతిష్ఠ గావించి తపమాచరించారు.
అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు సైకత లింగ ప్రతిష్ఠాపనచేసి తపమాచరించాడు. అలాగే అత్రిమహాముని కూడా ఇదే ప్రాంతంలో తపమాచరించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.
ముగ్గురు మహానుభావులు తపో క్షేత్రంగా, భక్తుల పాలిటి కలియుగ కైలాసంగా శ్రీ అగస్త్యేశ్వరకోన విరాజిల్లుతున్నది.
💠 గండికోట నుండి సుమారు 3 మైళ్ల దూరంలో అగస్త్య కోన ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి