మనిషికి మాటనేర్పుండాలి.ఎందుకంటారా?
మాట నేర్పు
--------------------
ఉ: " మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురా
మాటల చేత భూపతులు మన్నన జేసి పురంబు లిత్తురా
మాటల చేత మానినులు మన్నన జేసి సుఖంబు లిత్తురా
మాటలు నేర్వకున్న నవమానము, న్యూనము ,మానభంగమున్;"
అజ్ఙాత కవి కృతం !
ఎంత చక్కని పద్యం? లోకంలో మెప్పుపొందాలంటే మాటనేర్పు చాలా అవసరం!
సుఖజీవనానికది సోపానం. మాటపొందిక లేని మానవుడు ఎక్కడా రాణించలేడు.
యుక్తియుక్తంగా , ప్రియవాక్కులతో హృదయాహ్లాద జనకంగా శోత్రు పేయంగా
మాటలాడ గలిగితే సర్వ సంపదలూ సర్వ శ్రేయములూ వాటియంతకు అవేవచ్చి
మననలరిస్తాయి. అట్టివాడు లోకప్రియుడు .వానికి లోటుండదు.వానిమాటకు
తిరుగుండదు.
అలా మాట నేర్పు గల వారికిఁ గలిగే లాభాలను కవి పైపద్యంలో పేర్కొన్నాడు.
దేవతలు మన మాటలను మెచ్చి వరాలిస్తారు. అవేనుతులు. మాటలను మెచ్చేరాజులు
అగ్రహారాదులు కానుకగా యిస్తారు. ఆమాటలు మెచ్చే మగువలు మనసారా సుఖాన్ని
పంచుతారు. అందుచేత మంచిగా (నేర్పుగా ) మాటలాడటం నేర్చుకో! మాటనేర్పు
లేకపోతే లోకంలో మనుగడ కష్టమౌతుంది. అడుగడుగునా అవమానాలే యెదురౌతాయి.
పందిమందిలో చులకనైపోతారు. స్వాభిమానం దెబ్బతింటుంది. కాబట్టి పొందికగా
అందంగా నేర్పుగా మాటలాడటం నేర్చుకో మని కవి సందేశం!
కాళిదాసాదికవులు సరస్వతీ కటాక్షంతో విశుధ్ధవచోవైభవులై భోజాది రాజేంద్రులచే ననర్ఘ
వైభవముల నంది సుఖింప గా, బీర్ బల్ మొన్నగువారు చతురవచో వైభవంతో అక్బర్
వంటి వారిని మెప్పించుట మనకు విదితమే!
కాబట్టి హితంగా మితంగా ప్రియంగా మాటలాడుతూ లోకమంతా మనవెంట నుండేలా
మనుగడను సాగిద్దాం.మానవత్వపు పరిమళాలను సాటివారికి పంచుదాం!
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి