15, డిసెంబర్ 2022, గురువారం

మన పిల్లలను మనం రక్షించుకోవడం ఎలా!?

 మన పిల్లలను మనం రక్షించుకోవడం ఎలా!?

                  -------------------------------------------------------------

   విశ్వనగరంగా మారిన మన హైదరాబాద్ శివార్లలో హై స్కూల్ వయస్సు విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లో అశ్లీల సినిమాలు చూసి ప్రభావితులై తోటి విద్యార్ధిని పై అత్యాచారం చేశారని వార్త చూసాం!బెంగుళూరు లో విద్యార్థుల బాగ్ లు చెక్ చేస్తే డ్రగ్స్,గర్భ నిరోధ సాధనాలు దొరికాయట.పబ్ లో అమ్మాయి రేప్ కేసు లో మైనర్లు   పట్టుబడటం చూసాం.అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలలో స్కూల్ కెళ్లే విద్యార్థుల పాత్ర బయట పడడం వార్తల్లో వస్తున్నాయి.దానితో పాటు ఉపాధ్యాయులు తమ ప్రైవేటు సంభాషణల్లో విద్యార్థులలో పెరుగుతోన్న తాగుడు,గంజాయిలాంటి మత్థు పదార్ధాల వాడకాల గురించి,నేరప్రవృత్తి గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అపరిపక్వ వయస్సులోనే శృంగార నీలి చిత్రాలు అందుబాటులోకి రావడం తో వాళ్ళ ద్రుష్టి వక్రీకరించి స్కూళ్లలో పలు సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు.వాళ్ళను సన్మార్గంలో పెట్టడం తమ శక్తికి మించిన పనవుతోందని ,ఈ సమస్యను ఎలా అధిగమించాలో బోధ పడడం లేదని సతమతమౌతున్నారు.ఉపాధ్యాయులే ఈ విధంగా బాధ పడుతుంటే తల్లిదండ్రులు తమ  పిల్లల భవిష్యత్తు గురించి హడలెత్తిపోతున్నారు.అమ్మాయైనా,అబ్బాయయినా చదువుకోవడానికి వెళ్లి తాగుబోతులుగా,డ్రగ్స్ కు బానిసగా,రేపిస్టులుగా ,లేదా హంతకులుగా మారకూడదని ,ప్రేమలు పెళ్లిళ్ల పేరిట హత్యలు , ఆత్మ హత్యలకు పాల్పడరాదని వేనోళ్ళ మొక్కుకుంటున్నారు.


   ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన ఒక సర్వే రిపోర్టు మరింత ఆందోళన కలిగిస్తోంది."15  ఏళ్లకు పైబడిన వారిలో 90  శాతం మంది పలురకాల మద్యం తాగుతున్నారు.కల్లు ,బీరు,విస్కీ మొదలైన వాటితో మొదలై చివరకు గంజాయి ,డ్రగ్స్ కు బానిసలవుతున్నారు.ఇది చాలా ఆందోళనకరమైన విషయమని ,తెలంగాణలో పరిమితికి మించి మద్యం వినియోగం జరుగుతోందని"ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ ప్రతినిధి శ్రీ పద్మనాభ రెడ్డి ప్రకటించారు.పంజాబ్ లో  ఏ విధంగా యువత డ్రగ్స్ కు బానిసలు అయ్యారో ఆ దారిలోనే తెలంగాణ నడుస్తోందని ఆయన వివరించారు.ఇక మన పొరుగు తెలుగు రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాలో టాప్ లోకి చేరి,తెలంగాణాకు ఏ మాత్రం తీసిపోలేదు.


  ఈ విధంగా రేపటి పౌరులు రకరకాల వ్యసనాలకు బలవుతుంటే వాళ్ళను రక్షించుకోవడం ఎలా అనే ప్రశ్న మన ముందు భూతంలా నిలబడివుంది.ఇదొక తల్లిదండ్రులు ,ఉపాధ్యాయులు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్యకాదు.వాళ్ళు సన్నిహితంగా రోజువారీగా నలిగిపోతుండవచ్చు!యావత్ పౌర సమాజం ఈ దేశ భవిష్యత్తు ఏమై పోతుందాని ఆందోళన చెందుతోన్న విషయం ఇది!వాస్తవానికి ప్రభుత్వమే ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలి.కానీ మద్యం వ్యాపారం తో వచ్చే ఆదాయం మీదనే ఆధార పడుతోన్న  ప్రభుత్వాలు అలాంటి నియంత్రణా చర్యలు తీసుకుంటాయని ఆశించ లేము.


   ఈ పరిస్థితుల్లో మనపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి!అంటే పౌర సమాజమే నడుం బిగించాలి.ముందుగా ఈ సమస్యకు మూలకారణాలను అనేషిస్తే కానీ పరిష్కార మార్గాన్ని కనుక్కోలేము.


  విద్యార్థులను ప్రభావితం చేస్తున్న వాటిలో 1 ) విద్యావ్యవస్థ 2 )సమాజం 3 ) ప్రభుత్వ విధానాలు అనేవి ప్రధానమైనవిగా మనం వర్గీకరించుకోవచ్చు.


  మొదటిదాన్ని పరిశీలిస్తే 1991  సం.  లో ప్రపంచీకరణ విధానాలు ప్రవేశ పెట్టాక విద్యను భవిష్యత్ఘు తరాలను తీర్చిదిద్దే సాధనంగా కాక ,మార్కెట్ అవసరాలను తీర్చే యంత్రాల ఉత్పత్తి కేంద్రంగా మార్పువచ్చింది.దానితో క్రమంగా విద్యలో ప్రభత్వ జోక్యం తగ్గుతూ,ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది.నిరుపేద వర్గాల పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళు,కాలేజీలు,ధనిక వర్గాలకు ప్రైవేటు,కార్పొరేట్ విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.ఆ క్రమంలో నేడు ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా  పెట్టుకుని చేసే  కోట్ల రూపాయల  వ్యాపారంగా విద్యారంగం మారి పోయింది.ఉద్యోగాల కోసమే విద్య అనేది సిలబస్ గా మారి పోయింది.చిన్న నాటినుండి నైతిక విలువలు,సామాజిక అవగాహన ,సంస్కృతి పెంపొందించడానికి తోడ్పడే సోషల్ సైన్స్ లాంటి సబ్జెక్టుల ప్రాధాన్యత వెనక పట్టు పట్టింది.విద్యార్థులలో రాంకులకోసం అమానుషమైన  పోటీ కి ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు బోధనా పద్దతులను రూపొందించారు.ఆ విధంగా ఎంతో సహజ సిద్ధంగా ,ఆడుతూ పాడుతూ సంపూర్ణ మానవులుగా ఎదగాల్సిన విద్యార్థుల స్థానంలో, ఒకటి..రెండు.. మూడు..అంటూ ర్యాంకులు సాధించి తీరాల్సిన యంత్రాలలాంటి  విద్యార్థులను ప్రవేశ పెట్టారు.ఆ విధంగా కౌమార్య దశలోనే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.మెకాలే విద్యా విధానం స్థానంలో ప్రపంచీకరణ ఫలితంగా "మెకానికల్ విద్యావిధానాన్ని"పాలకులు ప్రవేశ పెట్టారు.ఆ విధంగా పిల్లల సహజ వ్యక్తిత్వ వికాసం  ఆంతరంగికంగా ధ్వంసమై వికృత పరిణామాలకు దారితీస్తోంది.


  సమాజ పరంగా చూస్తే గత మూడు దశాబ్దాలలో వచ్చిన సమాచార విప్లవం ఫలితంగా  మన దేశ ప్రజలకు ఇంటర్నెట్,ఇరవై నాలుగు గంటల చానళ్లు,స్మార్ట్ టీవీ లు,సెల్ ఫోన్ లు, పేస్  బుక్,వాట్సాప్ లాంటి సోషల్ మీడియా   అందుబాటులోకి వచ్చాయి.మన రోజువారీ జీవితంలోని అవసరాలన్ని కూడా సెల్ ఫోన్ తోనే గడుపుకునే రోజులొచ్చాయి.అనివార్యంగా విద్యార్థులకు కూడా సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.రిలయన్స్ అంబానీ మొదట్లో "దునియా తేరి ముట్టి మే" అంటూ సెల్ ఫోన్ కు ప్రకటనలు ఇచ్చేవాడు.నేడు అదే నిజమైంది.చిన్న పిల్లాడి నుంచికూడా ఏది దాచి పెట్టలేని పరిస్థితి.వాళ్ళ సహజ కుతూహలం కొద్దీ వాళ్ళ కిష్టమొచ్చిన సైట్ లను ఓపెన్ చేసుకుని చూసుకుంటున్నారు.దీన్ని నిరోధించడం ఎవరి తరం కాదు.సామాజికంగా వచ్చిన ఈ సాంకేతిక మార్పుల ప్రభావం  ప్రజల మీదవుంది.గత కాలపు మన దేశానికే ప్రత్యేకమైన సంస్కృతి,విలువలు ఈ  సమాచార విప్లవ దాడిలో పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఫ్యూడల్ సంస్కృతి ,విలువలు,ఎదిగి ఎదగని పెట్టుబడి దారి సంస్కృతితో మిశ్రమమై బయట ఆధునిక వేషం ,రూపం ,లోపల వెనకబాటుతనం,ఫ్యూడల్ భావజాలంతో వుండే భారతీయులు ఈ దాడితో విలవిలలాడుతున్నారు.భార్య భర్తల మధ్య సంబంధాలు,కుటుంబ వ్యవస్థ కుదేలవుతోంది.స్త్రీ,పురుషుల మధ్య సంబంధాలు,వివాహబంధం పునర్నిర్వచించబడుతోంది.సామ్రాజ్యవాద చొరబాటు అన్ని రంగాలను కబళిస్తూ సాంస్కృతిక రంగంలో కూడా తనకున్న ఆధునిక సాంకేతిక శక్తితో  తన క్షీణ సంస్కృతిని ప్రవేశ బెడుతోంది.సహజంగానే కౌమార్యం,యుక్త వయస్సులోగల పిల్లలు తప్పుడు ప్రభావాలకు  ఆకర్షితులై బలై పోతున్నారు.సామ్రాజ్యవాద పెట్టుబడికి ఊడిగం చేస్తోన్న పాలకులుకూడా ఈ ధోరణికి అన్ని రకాల అండదండలిస్తూనే పైకి మన సంస్కృతి ,విలువలు మంటగలుస్తున్నాయని శోకాలు పెడుతున్నారు.


    నేడు విద్యారంగం లో ఇటువంటి సాంస్కృతిక సంక్షోభం ఏర్పడడానికి ,స్కూలు స్థాయి లోనే పిల్లలు దారితప్పడానికి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు సంబంధం వుంది.మద్యం అమ్మకాలతోనే ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రభుత్వ విధానం నేటి దుస్థితికి కారణం.పిల్లలు, పెద్దలు చెప్పే మాటల నుండి నేర్చుకునే దానికంటే వాళ్ళను అనుకరించి నేర్చుకుంటారని అంటారు.అందుకే "ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా" అనే సామెత వచ్చినట్టుంది.తన చుట్టూరా అందరు తాగడం,అటు సినిమాలో తాను అభిమానించే హీరో తాగడం,సాటివాళ్ళు తాగడంలాంటి వాతావరణం లో పిల్లలు చిన్నప్పుడే మొదలెట్టడంలో ఆశ్చర్యమేముంది!? తాగుడు తమ సంస్కృతి,జీవన విధానంలో భాగమంటూనో,కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిదంటూనో పిల్లలకు అలవాటు చేసే వారు కూడా వున్నారు.దాని ఫలితంగా దేశంలో అరుణ చల్  ప్రదేశ్ లోని  15 లక్షల జనాభాలో సుమారు 7 .6  లక్షలమంది మద్యం తాగడం తో అది నెంబర్ వన్ గా ఉండగా ,రెండవ స్థానంలో తెలంగాణా వుంది.తెలంగాణాలో 15  నుండి 49 ఏళ్ళ  మధ్య వయస్సుగల వారిలో యాభై అయిదు శాతం మంది మద్యపానం చేస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019 -21 ) వివరాలు  తెలుపుతున్నాయి.గ్రామీణ ప్రాంతాలలో ఈ అలవాటు అధికంగా 62  శాతం ఉందిట!నేడు హై స్కూల్ స్థాయి పిల్లలు తాగి బడికి వస్తున్నారంటే దానిలో ఆశ్చర్యమేముంది.ఏ విత్తనం   వేస్తే అదే పంట వస్తుందిగదా!?సామాజిక పరిస్థితుల్ని,విద్యావిధానాన్నిఒక పధకం ప్రకారం  భ్రుష్టు పట్టించి నేటి ఫలితాలను చూసి ఏడవడమెందుకు!?


   మన భావితరాలు రక రకాల వ్యసనాలకు లోనవుతూ నిర్వీర్యం,అవుతుంటే ఎంతో ఆందోళన చెందుతున్నాము.మన పిల్లలను విద్యా వ్యవస్థ ద్వారా చదువు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతనుండి తప్పించుకుని ప్రైవేట్ రంగానికి విద్యను అప్పగించింది

.మరో వైపు తన ఆదాయం కోసం మద్యం వినియోగాన్ని నియంత్రించకుండా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది.సామ్రాజ్యవాదానికి గులాంగిరి చేస్తూ దానితాలుకు విష సంస్కృతికి అన్ని ద్వారాలు తెరిచేసింది.మరోవైపు మధ్యయుగాలనాటి తిరోగమన భావజాలాన్ని విద్యావ్యవస్థలో జొప్పించి విద్యార్థులలో మతోన్మాద భావాలు నింపే ప్రయత్నం చేస్తోంది.అందువలన మన పిల్లల సవ్యమైన ఎదుగుదలకు,భవిష్యత్తుకు  ఈ ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించదని ముందుగా మనం గుర్తించాలి.ఆ ప్రభుత్వ విధానాల వల్లే ఈ దుస్థితికి చేరామనేది గ్రహించాలి.


    ఒక వైపు తిరోగమన ఫ్యూడల్  సంస్కృతి,మరోవైపు సామ్రాజ్యవాద విష సంస్కృతి డాడి

 చేస్తున్న నేటి  సందర్భంలో తల్లిదండ్రులుగా, ప్రజలుగా ,పౌర సమాజంగా మనం ఒక ప్రత్యామ్నాయ నూతన ప్రజాస్వామ్య సంస్కృతికోసం పోరాడాల్సిన బాధ్యత మన మీద వుంది.విద్యార్థులను సామాజిక బాధ్యతగల  ఉత్తమ పౌరులుగా,ఆరోగ్యకరమైన అలవాట్లు,జీవన శైలి గల వారీగా తీర్చిదిద్దే విద్యా విధానం కోసం ఉద్యమించాలి.ఫ్యూడల్,సామ్రాజ్యవాద భావ జాలాలకు వ్యతిరేకమైన శాస్త్రీయ విద్యను డిమాండు చేయాలి.విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి.మద్యంతో  కలిగే దుష్ఫలితాలను,డ్రగ్స్ వినియోగం తో కలిగే ప్రమాదాలను వివరిస్తూ సమాజాన్ని చైతన్యం చేయాలి.దానికోసం ఒక ఉద్యమాన్నే నడపాలి.ఈ విధంగా ప్రభుత్వ విధానాలతో తలపడకుండా పునాది స్థాయిలో మన పిల్లల భవిష్యత్తును కాపాడుకో లేమని స్పష్టమవుతోంది.ఇదొక అనివార్యమైనా వాయిదా వేయలేని యుద్ధం ! దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.అన్ని ప్రగతిశీల విద్యార్థి సంఘాలు,పౌర ప్రజా సంఘాలు ఈ మహత్తర ప్రజా ఉద్యమానికి సారధ్యం వహించాలి.

                                                 *************************

                                                                                           -సత్య భాస్కర్

                                                                                        9848391638  

(నవతెలంగాణ,15.12.2022)