22, మే 2023, సోమవారం

శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు.


శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు.

మీరు ఈ మహానుభావుడి పేరు విన్నారా? మీరు ఆయన పేరు వినకుంటే అది ఆయన ఔన్నత్యమే తప్ప వేరే ఏమీ కాదు. అదేమిటి అంటారా? ఆయనకి కీర్తి కండూతి, వ్యక్తిగత ప్రచార ఆర్భాటాలు లేవు అని నా భావం.

ముందుగా ఆయన ఎవరు , ఆయన ఏమి చేస్తుంటారో చెబుతాను.

ఈయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍లో శ్రీమద్భగద్గీత ప్రవచనం చేశారు. వీరు వృత్తి రిత్యా తిరుపతి లో సంస్కృత విశ్వవిద్యాలయంలో న్యాయ తర్క విభాగంలో ప్రొఫెసర్‍గా ఉన్నారు.

ఈయన గూర్చి గూగుల్ లో ఎంత వెదకినా నాకు కనపడలేదు. అది ఆయన సింప్లిసిటీ కావచ్చు కానీ మంచికి ప్రచారం జరగాలి. ఇలాంటి మహానుభావుల గూర్చి అందరికీ తెలియాలి.

10 సెప్టెంబర్ 2020 లో మొదలు పెట్టి 13 జనవరి 2022 వరకు భగవద్గీత పారాయణ, ప్రవచనం అనె యఙ్జాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించారు ఈయన. ఈ కార్యక్రమం ఎస్వీబీసీ భక్తి ఛానెల్‍లో లైవ్ టెలికాస్ట్ గా ప్రసారం అయ్యి అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఎంతో మంది ఈ కార్యక్రమము  చాలా బాగుంది అని చెప్పటం జరిగింది. తప్పక చూడండి అని నాకు ఎందరో చెప్పారు. నా పని వత్తిళ్ళవల్ల ఈ లైవ్ కార్యక్రమం  టీవీలో చూసే అవకాశం నాకు కలగలేదు. కానీ నా అదృష్టం బాగుండి యూట్యూబ్ లో ఈ కార్యక్రమం 491 ఎప

మనుషుల్లో దేవుళ్ళు*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🙏 *మనుషుల్లో దేవుళ్ళు*🙏 

          ➖➖➖


*ఆయన ఆ అర్ధరాత్రి పడుకుని పది నిమిషాలు కూడా కాలేదు,   ఒక యువకుడు వచ్చి తలుపు తట్టాడు… 'సార్, ఒక గర్భిణి ప్రసవవేదన పడుతోంది, దయచేసి రండి. ఆమెను మీరే కాపాడాలి.”* 


*'70 ఏళ్ళ క్రిందటి రోజుల్లో మహరాష్ట్రలో మారుమూల గ్రామంలో ఒక డాక్టరు ఆయన. వెంటనే వెళ్ళాడు. ఆ యువతికి 19 లేదా 20 ఏళ్ళుంటాయంతే. ప్రసవం చాలా కష్టమయ్యింది. కొన్ని గంటలపాటు ఆయన వైద్యం చేశాడు. ఆ రాత్రి తెలవారుతుండగా, ఆమె డాక్టరు చెయ్యిపట్టుకొని ఇలా అనింది దీనంగా.. 'డాక్టరు గారూ నన్ను బ్రతికించవద్దండి, చంపేయండి. నేను పేదరాలిని, భర్త వదిలేసాడు, పుట్టబోయే బిడ్డను సాకలేను'.*


*ఆయన కదిలిపోయాడు… 'అమ్మా!మేమున్నది బ్రతికించడానికి, చంపటానికి కాదు.’* 


*'ప్రసవం జరిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆనందించాలో, బాధపడాలో ఆ యువతికి అర్థం కాలేదు. ఆయన అన్నాడు… 'అమ్మాయీ, భయపడవద్దు. నేను నీ దగ్గర ఫీజు ఏమీ తీసుకోను, నేనే నీకు వంద రూపాయలిస్తున్నా. దగ్గర్లో  వున్న పూణే కి వెళ్ళి అక్కడ Nursing college లో ఒక గుమాస్తాను కలువు. నేను పంపానని చెప్పు.'* 


*ఆమె వెళ్ళింది. ఫలనా డాక్టరు పంపారు అని చెప్పగానే, వాళ్ళు ఆమెను చేర్చుకుని Training ఇప్పించి, 8 నెలల తరువాత ఉద్యోగం కూడా ఇచ్చారు.*


*25 ఏళ్ళు గడచిపోయాయి. ఆ డాక్టరు Senior  Professor అయ్యాడు. ఒక University వాళ్ళు విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రధానం చేసే కార్యక్రమానికి డాక్టరు గారిని ఆహ్వానించారు. అది పూర్తి అయ్యింది. 'చంద్రా' అనే ఒక యువతి వచ్చి డాక్టరును కలిసి తన ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది.* 


*స్వతహాగా సున్నిత మనసున్న ఆయన వెళ్ళాడు. అక్కడ నడివయసులో వున్న ఒకామె డాక్టరుకు 'టీ' ఇస్తూ తమది ఒక పల్లె అని, తమ కుటుంబానికి సంబంధిన వివరాలు చెపుతుండగా, ఆయన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ఇంతలో హఠాత్తుగా ఆమె, ఆ యువతి డాక్టరు కాళ్ళకు నమస్కారం చేసారు.*


 *'ఏమిటమ్మా ఇది ?' అని ఆయన అడిగితే 25 ఏళ్ళక్రితం ఓ అర్ధరాత్రి మీరే నన్ను  కాపాడారు, దిక్కు లేని నా పేద జీవితానికి దారి చూపారు. ఆ ఆర్ధరాత్రి పుట్టిన ఆడపిల్లనే ఈ అమ్మాయి,' అని ఆమె కన్నీళ్ళు కారుతుండగా ఆయనతో చెపుతూ, మీరే మాకు దేవుడు. మీ పేరునే ఈ పాపకు పెట్టాను 'చంద్ర’ అని. అంతేకాదు, త్వరలో  మేము పేదలకోసమని ఉచిత ఆసుపత్రి ప్రారంభించబోతున్నామని దానికి కూడా మీ పేరునే పెడ్తున్నాం.' అని చెప్పారు.* 


*అది విన్నాక, ఈసారి కన్నీరు పెట్టడం డాక్టరు వంతు అయ్యింది.*


*ఇంతకీ ఆ డాక్టరు ఎవరో తెలుసా ?*


*ఇన్ఫోసిస్ కు చెందిన శ్రీమతి సుధా మూర్తి గారి తండ్రి అయిన                                          Dr రామచంద్ర కులకర్ణి గారు*


🙏🌹🙏🌹🙏🌹 


👉*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 67*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 67*


రాజగురువు సుబంధుడికి జరిగిన పరాభవం గురించి చారుల ద్వారా తెలుసుకొని బాధపడ్డాడు రాక్షసామాత్యుడు. దానికితోడు ఇటీవల కాలంలో చారుల వలన అందుతున్న వార్తలు అతనికే మాత్రం శాంతిని కలిగించడం లేదు. 


కుసుమపుర ఉద్యానవనంలో ఒక రహస్య సమావేశం జరిగిందని, మహానందుల వారి అనురక్తులైన కొందరు ప్రధాన రాజోద్యోగులు పాల్గొన్న ఆ సమావేశంలో మహారాణి మురాదేవి ప్రత్యక్షమయ్యారన్న వార్త ఒకటి రాక్షసునికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. 


'ఆనాటి అగ్ని ప్రమాదంలో మహానందుల వారితో పాటు మురాదేవి, ఆమె కుమారుడు మరణించారని ఇంతకాలం నమ్ముతూ వచ్చాడు తాను. ఇప్పుడు మురాదేవి ప్రత్యక్షమైందంటే ఆమె పుత్రుడూ మగధ సింహాసనానికి అసలైన వారసుడు చంద్రగుప్తుడు జీవించి ఉన్నట్లు వ్యాపిస్తున్న పుకార్లు నిజమేనా ? చంద్రుడు సజీవుడై ఉంటే ఈ రాజ్యాధికారం అతనిదే... అతడికున్న రాజ్యార్హతని ఎవ్వరూ కాదనలేరు. అదే జరిగితే ... మహాపద్మనందుడికి తాను చేసిన ప్రమాణం ఏం కావాలి ? 'తన కంఠంలో ప్రాణాలున్నంతవరకూ నవనందుల రాజ్యాధికారానికి ఎలాంటి ప్రమాదం రానివ్వనని' మహాపద్మానందుడికి తాను చేసిన వాగ్దానాన్ని తలుచుకుంటూ తల్లడిల్లిపోయాడు రాక్షసుడు. ఇప్పుడు నిజంగా అటువంటి ప్రమాదమేదైనా పొంచివున్నదా ? 


చంద్రుడు సజీవుడేనంటూ కొంతకాలంగా రాజ్యంలో గూడంగా ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో నిర్ధారణ కాకుండానే రాజ్యమంతటా చంద్రగుప్తుని పేరిట జేజేలు మొదలయ్యాయి. ఇంతలో పులిమీద పుట్రలా హఠాత్తుగా చాణక్యుడు వూడిపడి అనూహ్యంగా నందుల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశాడు. అలా శపధం చేసినవాడు ఆ మర్నాటి నుంచే అదృశ్యమయ్యాడు. అంటే...? 


వృషలుడే 'చంద్రగుప్త మౌర్యుడు' అంటూ గూఢచారులు మోసుకొచ్చిన వార్త నిజమేనా ... ? నిజమే... అప్పట్లో తానంతగా వృషలుడిని పట్టించుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. వృషలునిలో మహానందుల వారి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆనాడు కొందరు మంత్రులు, సేనానులు చెవులు కొరక్కోవడం ఇప్పటికీ తనకి గుర్తుంది. 


జరిగిన సంఘటనలూ, వింటున్న వార్తలను విశ్లేషిస్తుంటే ... నిజమైన వృషలుడే చంద్రగుప్త మౌర్యుడా...?' 


ఒక్కసారిగా రాక్షసుని గుండె గుభేల్మంది. మహానందుల వారి అసలు సిసలు వారసుడు సజీవుడేనని నిర్ధారణ అయిపోయింది. 


"వృషలా... నీవేనా మహానందుల వారి వంశాంకురానివి... ? నీవేనా... చంద్రగుప్త మౌర్యుడివి.. ?" తనలో అనుకుంటున్నట్టుగా అప్రయత్నంగా పైకి అనేశాడు రాక్షసుడు. మరుక్షణం..... 


"అవును... వృషలుడే చంద్రగుప్తుడు... ఇది సత్యం..." అన్న మాటలు హఠాత్తుగా గంభీరంగా ప్రతిధ్వనించాయి. 


త్రుళ్ళి పడ్డాడు రాక్షసుడు. తల తిప్పి చుట్టూ చూసాడు. ఎవ్వరూ కనిపించలేదు. 


"ఏమిటీ మాయ ? ఏం జరిగింది ? అది తన స్వగృహంలో తన ఏకాంత మందిరం. తన అనుమతి లేనిదే తన భార్యపుత్రులు కూడా లోనికి రారు. కానీ ఎవరో ప్రవేశించారు. మాట్లాడి మాయమయ్యారు. తనది భ్రమ కాదు. కానీ... కానీ... తన గృహంలోకి ఆగంతకులెవరో ఎలా ప్రవేశించారు ? కంటికి కనిపించకుండా ఎలా మాయమయ్యారు ?" 


సందిగ్ధావస్థతో మతి శూన్యుడయ్యాడు రాక్షసామాత్యుడు. ఆ స్థితిలోనూ ఒక యదార్థాన్ని గుర్తించాడు రాక్షసామాత్యుడు. నందుల రక్షణకు కంకణబద్దుడైన తనతో చదరంగా మాడుతానంటూ సంకేతాలు పంపిస్తున్నాడు ఒక మేధావి. ఆ మహామేధావి ఆర్య చాణక్యుడు. 


"సాధ్యమా ... ? రాజకీయ చదరంగంలో పండిపోయిన తనతో ఢీకొని ... తన ఎత్తులకు పై ఎత్తులు వేసి .... తనపై గెలుపొందడం .... ఆ చాణక్య హతకునకి సాధ్యమా... ??"

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పద్యము

 167వ రోజు: (ఇందు వారము) 22-05-2023


మన మాతృ భాష సేవలో ఈ రోజు 

a) పద్యము:

గురువు పలుకులెల్ల గురుతుగా గమనించి

పదిలపరచుకొనుము హృదయమందు 

చిన్ననాటి గుర్తు చిత్తము వీడదు 

తెలిసి మెలగ మేలు తెలుగు  బాల.


గురువు చిన్నతనములో అందించిన విద్యను మనస్సునందు పెక్కు (ఎక్కువ) సార్లు మననము చేసికొనిన ఎడల అది జీవితాంతము  జ్ఞప్తియందుండును. (జ్ఞాపకముండును).


b)పదము. 

నక్క (Fox): గంధిలము, జంబుకము, నరియుడు, పేరము, భీరుకము, మృగధూర్తకము, వంచకము, వ్యాఘ్రనాయకము, శివ, సాలావృకము.

నక్క కూత : ఊళ.

ధర్మమే జీవుని అనుసరిస్తుంది

 శ్లోకం:☝

*మృతం శరీరముత్సృజ్య*

  *కాష్ఠలోష్ఠసమం క్షితౌ ।*

*విముఖా బాంధవా యాంతి*

  *ధర్మస్తమనుగచ్ఛతి ॥*


భావం: కట్టెపుల్ల, మట్టిబెడ్డ వలె మృతుని శరీరాన్ని స్మశానంలో వదిలి బంధువులందరూ తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. *కేవలం ధర్మమే జీవుని అనుసరిస్తుంది!*🙏

మంగళములు

 .


                  _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కంఠే యస్య లసత్కరాల గరళం గంగాజలం మస్తకే!*

*వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతీ!*

*నంది స్కంద గణాధిరాజసహితా శ్రీవిశ్వనాథప్రభుః!*

*కాశీమందిరసంస్థితోఽఖిలగురు ర్దేయాత్సదా మంగళం!!*


తాత్పర్యము:


*ఎవని గళమునందు గరళము ప్రకాశిస్తున్నదో, ఎవని జటాజూటములో గంగ అలరారుతున్నదో ఎవరి వామాంకమందు పర్వతరాజతనయయైన పార్వతి సంసేవితయై యున్నదో ఆ తల్లి భవానీ, ఆ అమ్మ సతీదేవీ, తన పరివారమైన నంది, స్కంద, గణపతి, అమ్మ భవానీతో కూడి కాశీమందిరము నందు సంస్థితుడైన అఖిల గురువైన ఆ శ్రీవిశ్వనాథప్రభువు మనలకు సదా మంగళములు

 ఇచ్చు గాక* !!

నిజమైతే

 నిజమైతే బాగుంటుందనిపించే కల😇


వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ


దోరగా వేగిన పెసరట్టు కొరికితే -  జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ


మిర్చిబజ్జి ఆబగా తినబోతే -  నాలిక సుర్రుమన్నట్టూ


పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ


పచ్చి మిరపకాయలు తగిలించి -  రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ


మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ


పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ


దిబ్బరొట్టె మొత్తం - 

నేనే తినేసినట్టూ


వేపచెట్టు కింద మడతమంచమెక్కి - 

చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ


చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ


పప్పుచారులో గిన్నెడు -  చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు


రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ


లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ


కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ


చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ


నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ


పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ


చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ


సావిట్లో గేదెలతో పోటీపడి -  తేగలు తెగ తినేసినట్టూ


దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ


తిరుపతి లడ్డూ మొత్తం -  అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ


పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ


పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ


టమాటా పప్పుకి తోడు -  ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ


మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ


బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు


వేడి వేడి బెల్లం జిలేబీ , 

రోడ్ మీద కొనీ కొనగానే - 

కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు


బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు -  ఒలుచుకు తిన్నట్టూ


లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ -  స్టార్ బక్స్ లో దొరికినట్టూ


బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు -  పటపటమని నమిలేసినట్టూ


అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు -  తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ


సినిమా హాల్ లో పాప్కార్న్ -  ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ


చిన్నా పెద్దా తేడాలేకుండా -  రసాలు గుటకలేసినట్టూ


కొబ్బరి బూరెల కోసం చేసిన -  చలివిడి కొట్టేసి తిన్నట్టూ


బిడ్డనెత్తుకొచ్చిన సారెలో -  పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ


కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ


మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ


కిస్మిస్ లని -  కేజీల్లో మాయం చేసేసినట్టూ


దోర జాంకాయాలు  చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని -  పరపరా నమిలేసి తిన్నట్టూ


సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు -  ఘుప్పుమన్నట్టూ


వానాకాలంలో పకోడీల వాసన -  గాలిలో తేలి వచ్చినట్టూ


తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ


పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ


పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ


దోరగా పండిన చింతకాయ -  చిటుక్కున చేతికి అందినట్టూ


పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ


చిన్నుసిరికాయల చెట్టు -  స్కూలుకెళ్ళే దారిలో  కొమ్మజాపి రమ్మన్నట్టూ


ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ


వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ


కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ


మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ


సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ


ఎర్రని సీమతుమ్మకాయలు -  కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ


గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ


వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ


విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ 


బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ


వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ 


వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ


భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని -  పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ


ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ


పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ


ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ


గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు


పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ


దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ


ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ


కమ్మని కలలు కంటూ మాంచిగా నిద్రలో  ఉంటే,  కుళ్ళుమోతు అలారం  పీడకలొచ్చినట్టు  మోగిచచ్చింది!


ఇదంతా ఎందుకంటే .....


ఈ రోజుల్లో ఇవిదొరకటం,దొరికినా తిని అరిగించుకునే శక్తిని కోల్పోయాం కదా‌!😍😍

హనుమజ్జయంతి ప్రత్యేకం - 11/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  11/11 

         (ఈ నెల 14వతేదీ హనుమజ్జయంతి) 

         

XI. వ్యక్తిత్వం - ఆదర్శం 


1. వ్యక్తిత్వం - శీలం : స్వామి వివేకానంద నిర్వచనం 


(i) వ్యక్తిత్వం = చేతలు ÷ మాటలు  


    మాటలు కోటలు దాటి, చేతలు గడప దాటకపోతే, ఈ భాగాహారం విలువ 1 కన్నా తక్కువ ఉంటుంది. 

    చెప్పిన మాటా, దానినే చేసి చూపిస్తే, దాని విలువ 1. 

    చెప్పిన మాటకన్నా, అధికంగా చేసి చూపితే, ఆ నిష్పత్తి విలువ 1 కంటే అధికం. 


(ii) శీలం = (మాటలు + చేతలు) ÷ ఆలోచనలు 


    శీలం విషయంలో 

  - ఆలోచనలు సక్రమమై, అవి మాటలు చేతల రూపంలో నిలబడగలగాలి. 


2. హనుమంతుని మనస్సు - వాక్కు - చేత 


(i) మనస్సు 


అ) లంకకు వెళ్ళే సమయంలో 


    వేగము గలవాడు, 

    వేగము విషయమున మనస్సు నిలిపినవాడు, 

    శత్రువీరులను సంహరించువాడు, 

    గొప్ప సామర్థ్యం కలవాడు, 

    ఉత్తమమైన మనస్సు కలవాడు, 

    వానరులలో మహావీరుడుఅయిన హనుమంతుడు 

    మనస్సునుఏకాగ్రము చేసి, మనస్సుచేత లంకకు వెళ్ళాడు.   


సవేగవాన్ వేగసమాహితాత్మా

హరిప్రవీరః పరవీరహన్తా I 

మనస్సమాధాయ మహానుభావో 

జగామ లఙ్కాం మనసా మనస్వీ ৷৷ 

         కిష్కింధ 67/50 


ఆ) లంక అంతఃపురంలో స్త్రీలను చూచి 


(పరపురుషు లెవ్వరూ లేరుకదా! అనే) నమ్మకంతో ఇష్టమువచ్చినట్లు పరుండి నిద్రించుచున్న రావణుని భార్యలను నేను చూస్తున్నాను. 

    అయినా నా మనస్సులో ఎట్టి వికారములూ కలగలేదు కదా! 

    మంచి పరిస్థితులలోగానీ, చెడ్డ పరిస్థితులలోగానీ (పుణ్యపాప కార్యములయందు) ఇంద్రియములు ప్రవర్తించడానికి మనస్సే కారణం. ఈ స్త్రీలను చూసినా, నా మనస్సు ఎట్టి వికారమూ చెందక స్థిరంగా ఉంది. 


కామం దృష్టా మయా సర్వా 

విశ్వస్తా రావణస్త్రియః I 

న హి మే మనసః కిఞ్చిత్ 

వైకృత్యముపజాయతే ॥

మనో హి హేతుః సర్వేషామ్  

ఇన్ద్రియాణాం ప్రవర్తనే I 

శుభాశుభాస్వవస్థాసు 

తచ్చ మే సువ్యవస్థితమ్ ॥ 

           సుందర 11/40,41 


(ii) హనుమంతుని వాక్కు 


లంకకి వెళ్ళేముందు వానరులతో 


   "రాముడు విడిచిన బాణమువలె, నేను వాయువేగంతో రావణుడు పాలించే లంకకు వెడతాను." 

   

యథా రాఘవనిర్ముక్తః 

శరః శ్వసనవిక్రమః I 

గచ్ఛేత్తద్వద్గమిష్యామి 

లఙ్కాం రావణపాలితామ్ ৷৷ 

             సుందర 1/39 


(హనుమగూర్చి వాల్మీకి మొదటగా వాడిన పదం "వాక్యకోవిదుడు".) 


(iii) హనుమ చేసిన క్రియ - శ్రీరామ ప్రశంస 


    లంకవెళ్ళి, సీతామాత జాడ తెలిసికొనివచ్చి నివేదించిన హనుమనుగూర్చి, శ్రీరామచంద్రుడు 

   "ఈ భూలోకములోని ఇతరులెవ్వరూ మనస్సుచేత కూడ భూమియందు చేయజాలని దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు చేశాడు." అన్నాడు. 


కృతం హనుమతా కార్యం 

సుమహద్భువి దుర్లభమ్ I 

మనసాపి యదన్యేన 

న శక్యం ధరణీతలే ॥ 

         యుద్ధ 1/2 


అనుమితి: 


    హనుమ అనుగ్రహంతో, ఆయన ఆదర్శ వ్యక్తిత్వవికాసాన్నే మనం కూడా పొందుతాం.  


ముగింపు 


    గత పది రోజులుగా ఒక్కొక్కరోజు ఒక్కొక్క విషయమై విశ్లేషించుకొని, ఈ రోజుతో కలసి ఏకాదశ విషయాలని పొందాం. 

    మనకి అంతా మంచే జరుగుతుంది. ఆయనని స్మరిస్తేనే అన్నీ లభ్యమవుతాయి కదా!


బుద్ధిర్బలం యశో ధైర్యం 

నిర్భయత్వం అరోగతా I 

అజాడ్యం వాక్పటుత్వంచ 

హనుమత్స్మరణా  భవేత్ ॥


మనోజవం మారుతతుల్యవేగం 

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం I 

వాతాత్మజం వానరయూథముఖ్యం 

శ్రీరామదూతం శిరసా నమామి 


                     సమాప్తం 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)