🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 67*
రాజగురువు సుబంధుడికి జరిగిన పరాభవం గురించి చారుల ద్వారా తెలుసుకొని బాధపడ్డాడు రాక్షసామాత్యుడు. దానికితోడు ఇటీవల కాలంలో చారుల వలన అందుతున్న వార్తలు అతనికే మాత్రం శాంతిని కలిగించడం లేదు.
కుసుమపుర ఉద్యానవనంలో ఒక రహస్య సమావేశం జరిగిందని, మహానందుల వారి అనురక్తులైన కొందరు ప్రధాన రాజోద్యోగులు పాల్గొన్న ఆ సమావేశంలో మహారాణి మురాదేవి ప్రత్యక్షమయ్యారన్న వార్త ఒకటి రాక్షసునికి కంటిమీద కునుకు లేకుండా చేసింది.
'ఆనాటి అగ్ని ప్రమాదంలో మహానందుల వారితో పాటు మురాదేవి, ఆమె కుమారుడు మరణించారని ఇంతకాలం నమ్ముతూ వచ్చాడు తాను. ఇప్పుడు మురాదేవి ప్రత్యక్షమైందంటే ఆమె పుత్రుడూ మగధ సింహాసనానికి అసలైన వారసుడు చంద్రగుప్తుడు జీవించి ఉన్నట్లు వ్యాపిస్తున్న పుకార్లు నిజమేనా ? చంద్రుడు సజీవుడై ఉంటే ఈ రాజ్యాధికారం అతనిదే... అతడికున్న రాజ్యార్హతని ఎవ్వరూ కాదనలేరు. అదే జరిగితే ... మహాపద్మనందుడికి తాను చేసిన ప్రమాణం ఏం కావాలి ? 'తన కంఠంలో ప్రాణాలున్నంతవరకూ నవనందుల రాజ్యాధికారానికి ఎలాంటి ప్రమాదం రానివ్వనని' మహాపద్మానందుడికి తాను చేసిన వాగ్దానాన్ని తలుచుకుంటూ తల్లడిల్లిపోయాడు రాక్షసుడు. ఇప్పుడు నిజంగా అటువంటి ప్రమాదమేదైనా పొంచివున్నదా ?
చంద్రుడు సజీవుడేనంటూ కొంతకాలంగా రాజ్యంలో గూడంగా ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో నిర్ధారణ కాకుండానే రాజ్యమంతటా చంద్రగుప్తుని పేరిట జేజేలు మొదలయ్యాయి. ఇంతలో పులిమీద పుట్రలా హఠాత్తుగా చాణక్యుడు వూడిపడి అనూహ్యంగా నందుల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశాడు. అలా శపధం చేసినవాడు ఆ మర్నాటి నుంచే అదృశ్యమయ్యాడు. అంటే...?
వృషలుడే 'చంద్రగుప్త మౌర్యుడు' అంటూ గూఢచారులు మోసుకొచ్చిన వార్త నిజమేనా ... ? నిజమే... అప్పట్లో తానంతగా వృషలుడిని పట్టించుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. వృషలునిలో మహానందుల వారి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఆనాడు కొందరు మంత్రులు, సేనానులు చెవులు కొరక్కోవడం ఇప్పటికీ తనకి గుర్తుంది.
జరిగిన సంఘటనలూ, వింటున్న వార్తలను విశ్లేషిస్తుంటే ... నిజమైన వృషలుడే చంద్రగుప్త మౌర్యుడా...?'
ఒక్కసారిగా రాక్షసుని గుండె గుభేల్మంది. మహానందుల వారి అసలు సిసలు వారసుడు సజీవుడేనని నిర్ధారణ అయిపోయింది.
"వృషలా... నీవేనా మహానందుల వారి వంశాంకురానివి... ? నీవేనా... చంద్రగుప్త మౌర్యుడివి.. ?" తనలో అనుకుంటున్నట్టుగా అప్రయత్నంగా పైకి అనేశాడు రాక్షసుడు. మరుక్షణం.....
"అవును... వృషలుడే చంద్రగుప్తుడు... ఇది సత్యం..." అన్న మాటలు హఠాత్తుగా గంభీరంగా ప్రతిధ్వనించాయి.
త్రుళ్ళి పడ్డాడు రాక్షసుడు. తల తిప్పి చుట్టూ చూసాడు. ఎవ్వరూ కనిపించలేదు.
"ఏమిటీ మాయ ? ఏం జరిగింది ? అది తన స్వగృహంలో తన ఏకాంత మందిరం. తన అనుమతి లేనిదే తన భార్యపుత్రులు కూడా లోనికి రారు. కానీ ఎవరో ప్రవేశించారు. మాట్లాడి మాయమయ్యారు. తనది భ్రమ కాదు. కానీ... కానీ... తన గృహంలోకి ఆగంతకులెవరో ఎలా ప్రవేశించారు ? కంటికి కనిపించకుండా ఎలా మాయమయ్యారు ?"
సందిగ్ధావస్థతో మతి శూన్యుడయ్యాడు రాక్షసామాత్యుడు. ఆ స్థితిలోనూ ఒక యదార్థాన్ని గుర్తించాడు రాక్షసామాత్యుడు. నందుల రక్షణకు కంకణబద్దుడైన తనతో చదరంగా మాడుతానంటూ సంకేతాలు పంపిస్తున్నాడు ఒక మేధావి. ఆ మహామేధావి ఆర్య చాణక్యుడు.
"సాధ్యమా ... ? రాజకీయ చదరంగంలో పండిపోయిన తనతో ఢీకొని ... తన ఎత్తులకు పై ఎత్తులు వేసి .... తనపై గెలుపొందడం .... ఆ చాణక్య హతకునకి సాధ్యమా... ??"
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి