ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం - 11/11
(ఈ నెల 14వతేదీ హనుమజ్జయంతి)
XI. వ్యక్తిత్వం - ఆదర్శం
1. వ్యక్తిత్వం - శీలం : స్వామి వివేకానంద నిర్వచనం
(i) వ్యక్తిత్వం = చేతలు ÷ మాటలు
మాటలు కోటలు దాటి, చేతలు గడప దాటకపోతే, ఈ భాగాహారం విలువ 1 కన్నా తక్కువ ఉంటుంది.
చెప్పిన మాటా, దానినే చేసి చూపిస్తే, దాని విలువ 1.
చెప్పిన మాటకన్నా, అధికంగా చేసి చూపితే, ఆ నిష్పత్తి విలువ 1 కంటే అధికం.
(ii) శీలం = (మాటలు + చేతలు) ÷ ఆలోచనలు
శీలం విషయంలో
- ఆలోచనలు సక్రమమై, అవి మాటలు చేతల రూపంలో నిలబడగలగాలి.
2. హనుమంతుని మనస్సు - వాక్కు - చేత
(i) మనస్సు
అ) లంకకు వెళ్ళే సమయంలో
వేగము గలవాడు,
వేగము విషయమున మనస్సు నిలిపినవాడు,
శత్రువీరులను సంహరించువాడు,
గొప్ప సామర్థ్యం కలవాడు,
ఉత్తమమైన మనస్సు కలవాడు,
వానరులలో మహావీరుడుఅయిన హనుమంతుడు
మనస్సునుఏకాగ్రము చేసి, మనస్సుచేత లంకకు వెళ్ళాడు.
సవేగవాన్ వేగసమాహితాత్మా
హరిప్రవీరః పరవీరహన్తా I
మనస్సమాధాయ మహానుభావో
జగామ లఙ్కాం మనసా మనస్వీ ৷৷
కిష్కింధ 67/50
ఆ) లంక అంతఃపురంలో స్త్రీలను చూచి
(పరపురుషు లెవ్వరూ లేరుకదా! అనే) నమ్మకంతో ఇష్టమువచ్చినట్లు పరుండి నిద్రించుచున్న రావణుని భార్యలను నేను చూస్తున్నాను.
అయినా నా మనస్సులో ఎట్టి వికారములూ కలగలేదు కదా!
మంచి పరిస్థితులలోగానీ, చెడ్డ పరిస్థితులలోగానీ (పుణ్యపాప కార్యములయందు) ఇంద్రియములు ప్రవర్తించడానికి మనస్సే కారణం. ఈ స్త్రీలను చూసినా, నా మనస్సు ఎట్టి వికారమూ చెందక స్థిరంగా ఉంది.
కామం దృష్టా మయా సర్వా
విశ్వస్తా రావణస్త్రియః I
న హి మే మనసః కిఞ్చిత్
వైకృత్యముపజాయతే ॥
మనో హి హేతుః సర్వేషామ్
ఇన్ద్రియాణాం ప్రవర్తనే I
శుభాశుభాస్వవస్థాసు
తచ్చ మే సువ్యవస్థితమ్ ॥
సుందర 11/40,41
(ii) హనుమంతుని వాక్కు
లంకకి వెళ్ళేముందు వానరులతో
"రాముడు విడిచిన బాణమువలె, నేను వాయువేగంతో రావణుడు పాలించే లంకకు వెడతాను."
యథా రాఘవనిర్ముక్తః
శరః శ్వసనవిక్రమః I
గచ్ఛేత్తద్వద్గమిష్యామి
లఙ్కాం రావణపాలితామ్ ৷৷
సుందర 1/39
(హనుమగూర్చి వాల్మీకి మొదటగా వాడిన పదం "వాక్యకోవిదుడు".)
(iii) హనుమ చేసిన క్రియ - శ్రీరామ ప్రశంస
లంకవెళ్ళి, సీతామాత జాడ తెలిసికొనివచ్చి నివేదించిన హనుమనుగూర్చి, శ్రీరామచంద్రుడు
"ఈ భూలోకములోని ఇతరులెవ్వరూ మనస్సుచేత కూడ భూమియందు చేయజాలని దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు చేశాడు." అన్నాడు.
కృతం హనుమతా కార్యం
సుమహద్భువి దుర్లభమ్ I
మనసాపి యదన్యేన
న శక్యం ధరణీతలే ॥
యుద్ధ 1/2
అనుమితి:
హనుమ అనుగ్రహంతో, ఆయన ఆదర్శ వ్యక్తిత్వవికాసాన్నే మనం కూడా పొందుతాం.
ముగింపు
గత పది రోజులుగా ఒక్కొక్కరోజు ఒక్కొక్క విషయమై విశ్లేషించుకొని, ఈ రోజుతో కలసి ఏకాదశ విషయాలని పొందాం.
మనకి అంతా మంచే జరుగుతుంది. ఆయనని స్మరిస్తేనే అన్నీ లభ్యమవుతాయి కదా!
బుద్ధిర్బలం యశో ధైర్యం
నిర్భయత్వం అరోగతా I
అజాడ్యం వాక్పటుత్వంచ
హనుమత్స్మరణా భవేత్ ॥
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం I
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి
సమాప్తం
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
జై హనుమాన్ జై జై హనుమాన్
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
(86399 68383)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి