*ఆట పెట్టిన మంట- మాట తెచ్చిన తంటా!*
(హాస్యకథ...??!)
పెళ్ళివారి విడిదిలో స్నాతకం అలా అవ్వడమేంటి, ఇలా చాపలు, వాటిమీద పేకలూ పరిచేసారు. ఆడపెళ్ళివారు బాధ్యతలన్నీ ఈవెంట్ల వాళ్ళకప్పచెప్పేసి....నిష్పూచీగా బహుముఖ పారాయణ మొదలుపెట్టారు! ( చతుర్ముఖ పారాయణల్లా పదిమంది చేరి బహుముఖంగా విస్తరింప చేసారన్నమాట) ! పేకాట మా ఇంటావంటా లేదంటూనే మగపెళ్ళివారి నుండి కొందరు ఘనులు ముసుగేసుకుని మందలో చేరిపోయారు!
ముందు ముక్తసరిగా మొదలుబెట్టిన క్రీడాకారులు... మెల్లమెల్లగా తమ గానగాంధర్వాన్ని బయటపెట్టడం మొదలుబెట్టారు. సాక్షాత్తు కాబోయే కన్యాదాతే...గళమెత్తి గాభరాపెట్టాడు!
“ పేకలో నారాజు తొంగిచూసేను నాడు... ఆటలో ఆ రాజు సెట్టు చేసెను నేడు”.... అంటూ ప్రఫుల్లహృదయుడై....”యువర్ మేజస్టీ “అంటూ డైమండ్ కింగ్ గారిని కళ్ళకద్దుకున్నాడు!
మావగారు పడేసిన మరో రాజుగారిని భుజస్కంధాలపై మోస్తూ.....
“ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా!”... అంటూ ఠక్కున ఇస్పేట్ రాజును అందుకుని...” రాణీ రాణమ్మా! ఆనాటి నవ్వులు ఏవమ్మా! నీ వేడుక చూడాలనీ..ఎన్నెన్నో ఆశలతో నీరాజును తెచ్చానమ్మా...!”.... అంటూ ఆనందంగా పాటకు పేరడీనీ, పేకలో సెట్టునీ కట్టేసాడు పెద్దల్లుడు!
ఇంతలో జోకరు తగిలిందో ఏమో... పెళ్ళికొడుకు పెద్దక్క...”సుందరి నీవంటి దివ్యస్వరూపం ఎందెందు వెతికిన లేదు కదా!”... అంటూ టకటకా పేకలో ముక్క నేర్పుగా సర్దేసుకుని , ఓ చెత్తముక్క పడేయగానే.....పెళ్ళికొడుకు చిన్న మేనత్తకు ఉడుకుమోత్తనంతో కళ్ళూముక్కులూ ఎర్రబడ్డాయి. అది చూసి ఆమె భర్త.....
“ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
రాని ముక్కల కోసం శోకాలెందుకే
ఫుల్లుకౌంటులే నీ అకౌంటులో...”.... అంటూ ఓ ఖూనీరాగం అందుకుని, భార్యచూపులకు భస్మమ్ అవ్వకుండా పేకముక్కలు అడ్డుపెట్టుకున్నాడు!
ఈ విధంగా “ఆడుతూ పాడుతూ ఆటాడేస్తే అలుపూసొలుపేమున్నది”......అంటూ ఒకరు,
“ఏవండోయ్ బావగారూ! ఒక చిన్న ముక్క! “..... అంటూ వియ్యంకులవారూ
“...విన్నపాలు వినవలే వింతవింతలూ! తిన్ననయిన ఒక్క ఆట మాకీయ వేమయ్యా! “.... అంటూ మరొక పినమావగారూ......
బ్రహ్మాండమయిన క్రీడాస్ఫూర్తితో , భీభత్సమయిన పేకపేరడీలతో.....ఒలింపిక్స్ లెవెల్ లో సాగుతున్న చీట్లపేకాటలో .... పత్తాలో కరిపేపాకు పత్తాలా, పానకంలో పేకపుడకలా దూరాడు పెళ్ళికొడుకు! కాలక్షేపానికి వచ్చినవాడు ఆటచూసి ఆనందించకుండా.... ఓ కూత కూసాడు... కూతవేటు వరకూ వినిపించేలా!
“ రేఖ ఆడదా!”..... అంటూ!
పేకాటలో పెనువిస్ఫోటనంలా ఉలిక్కి పడ్డారంతా!
అంతటా ఒక్కసారి అలుముకున్న ఆ నిశ్శబ్దంలో... ఖంగున మ్రోగింది పెద్దల్లుడి గొంతుకు!
“ ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది?”... అంటూ! ... గాన గార్ధభంలా!
“ సృష్టికి మొదలు “ఆడదే” కదా సోదరా! మా రేఖ కూడా “ఆడదే”! ఆ ఆడదాని మాయలో పడకూడదనే కదా, ఆ జన్మలో ,అర్ధరాత్రి భార్యాబిడ్డలను వదిలి అర్ధాంతరంగా అడవులకు వెడలినావు! .”.... అన్నాడు అక్కినేనిలా ముక్కు దిబ్బడచేసుకుని! పెళ్ళికొడుకు పేరు “గౌతమ్” లెండి!
అందరూ ఆ హాస్యవిస్సాటానికి గొల్లుమన్నారు!
తలకొట్టుకుని, ఏదో చెప్పబోయాడుగౌతమ్! ఇంతలో....
“ అవును నాయనా! మొన్నటి దాకా రేఖ ఈడదే! ఎప్పుడయితే నీకు తాంబూలంలో పోకనూ, రేఖనూ ప్రదానం చేసానో ... అప్పుడే తను “ ఆడది” అయిపోయింది బాబూ! అయిపోయింది! అంటూ... గుండెపట్టుకుని... గుమ్మడిలా గద్గదమయ్యారు మాంగారు! ఒకప్పటి “రంగస్థల భీభత్స” బిరుదాంకితుడు!
నేనేనా తక్కువ తిన్నానని...భార్యాబాధితుడైన పెద్దమావగారి కొడుకు... గొంతు సవరించేసుకుని...
“ బావా! ఆడదె ఆధారం! మన కధ ఆడనె ఆరంభం! ఆడదె సంతోషం! మనిషికి ఆడదె సంతాపం”....అంటూ... శోభన్ బాబు రింగొకటి నుదుటి మీద తిప్పుకుంటూ క్రిష్ణలా మొహాన్ని మూడుతిప్పులు తిప్పి ...ముక్కుతో పాడాడు.
అప్పటికే ఆ గానాబజానాకు విరక్తి, విరసం వచ్చిన గౌతమ్ ....“ ఆపండి మహాప్రభో ఆపండి! మీతో పెట్టుకున్నాను చూడండి! నా చెప్పెట్టుకు నేను కొట్టుకోవాలి! నేను అడిగింది...” నా కాబోయే భార్య రేఖారాణి పేకాట ఆడదా?”... అని. అంతే కానీ ఆడదా, మగాడా? మధ్యస్థమా? తటస్థమా?”.... అని కాదండి”.... అంటూ ఎర్రబారిన మొహంతో ఒక్కరుపు అరిచాడు!
“ మరంతే తమ్ముడూ! ఏరు దాటొచ్చి మా పిల్లను ఇమ్మనడం కాదు. ఏటికి ఎదురీదడం కూడా నేర్చుకోవాలి. “ ఎదురీతకు అంతము లేదు! ఏ దరికి తేలతామో అసలే తెలీదు! “
“ పెళ్ళంటే నూరేళ్ళ వంట
అది తెలిసుంటే ఉండదు మంట”.... అంటూ ఆ క్రిష్ణాజిల్లా పెళ్ళికొడుక్కు కమ్మకట్టడం మొదలుపెట్టారు గోదారి బామ్మర్దులు!
ఇవన్నీ వింటూ కూడా, కిమ్మనకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్న తండ్రితో....” నాన్నగారు! మీకు పౌరుషం లేదా! శతృపక్షంలో చేరి పేకాడుతున్నారా?”... అంటూ రోషపడ్డాడు గౌతమ్!
“ ఏట్లో దిగినవాడూ
రోట్లో తలపెట్టినవాడు
నోట్లోనాలుక లేని నా బోటివాడు
చీట్లపేకలో కూర్చున్నవాడూ.....
నిమిత్తమాత్రుడు నాయనా!
ఎన్నాళ్ళకో దొరికిన ఈ స్వేచ్ఛ నేను దుర్వినియోగం చెయ్యలేను!
ఈ గోదారోళ్ళ వెటకారాలను వేటాడలేను!
క్షమించు మైసన్! క్షమించు”...... అంటూ పేకలో తలదూర్చాడా పెద్దమనిషి!
ఇంతలో అవ్వాలిసిన డేమేజ్ అవ్వనే అయ్యింది. ఆ పక్కనే ...వాడేసిన పేకలు వాటంగా ఏరుకుంటున్న ఓ గూఢచారి కమ్ రాయబారి...కుర్రపిశాచి, వాచాలకాపాలి ఒకతి .... ఈ వార్తకు యెల్లోజర్నలిజమ్ హోదానిచ్చి.... నీలిరంగు పూసి మరీ ...పెళ్ళికూతురి చెవిన వేసింది!....” రేఖక్కా! బావ ... అసలు నువ్వు ఆడదానివేనా? అసలు ఆడపిల్ల లక్షణాలు రవ్వంతేనా ఉన్నాయా? మగరాయుడిలా ఆ బట్టలేంటి? పెళ్ళికూతురి వేషంలో నువ్వు ఆడామగా కాకుండా మధ్యస్థంగా ఉన్నావని అంటున్నాడే!”..... అంటూ ఊరంతా వినేట్టు చెవులు కొరికి....అగ్గిరాజేసి...సారె బుట్టలోంచి అరిసెకొటి లాఘవంగా లాగి... కొరుక్కుంటూ...సాగిపోయింది!
చూడాలి... ఈ అగ్గి...రేఖాగౌతమ్ లను అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయిస్తుందో ?లేక బడబాగ్ని రాజేస్తుందో!
ఒకవేళ వేయించినా.... గౌతముడికి “వేయింపో, వాయింపో? సరసాల పూయింపో?”! “ నూరేళ్ళ పంటో? నూరేళ్ళ మంటో!”.... ముందుముందు!😃😊😢😲😂😍
ధన్యవాదాలతో
ఓలేటి శశికళ!