మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..
*ఆఖరి ప్రయత్నం.. బోధ..పర్యవసానం..*
*(అరవై వ రోజు)*
తాను కబురు పెట్టేదాకా ఆశ్రమానికి రావొద్దని శ్రీధరరావు దంపతుల తో శ్రీ స్వామివారు చెప్పిన తరువాత..శ్రీ స్వామివారు కఠోర తపస్సు చేయనారంభించారు..ఆహారం దాదాపుగా విసర్జించారు..ఏ రెండు మూడు రోజులకో ఒకసారి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ తిరిగి తపస్సు లోకి వెళ్లిపోయేవారు..ఏప్రిల్ నెల 1976 వ సంవత్సరం..చివరి వారం లో ఒకసారి శ్రీధరరావు గారిని రమ్మని కబురు పంపించారు..
అంతకుముందు శ్రీ స్వామివారు తనకు దోసకాయలు కావాలని అడిగిన విషయం గుర్తుకువచ్చి ప్రభావతి గారు దోసకాయల కోసం మొగలిచెర్ల అంతా వాకబు చేశారు..చిత్రంగా ఆ ఊర్లో ఒక్క దోసకాయా దొరకలేదు..సరే..ప్రాప్తంలేదు..ఆమాటే చెపుదాము అని శ్రీధరరావు గారు అనుకోని..గూడు బండి ఎక్కబోతున్నారు..ఇంతలో నెత్తిన గంప పెట్టుకొని ఒక ఆడమనిషి నేరుగా వచ్చింది..తాను లింగసముద్రం నుంచి వస్తున్నాననీ..దోసకాయలు అమ్మడానికి తెచ్చాననీ..చెప్పి..కొన్ని మంచి కాయలను తానే ఏరి..చేతికిచ్చింది..శ్రీధరరావు గారు ఆశ్చర్యపోతూ..వాటిని తీసుకొని బండి తోలే బాలయ్య చేతికిచ్చి..బండిలో పెట్టించారు..
ఆరోజు శ్రీధరరావు గారు ప్రభావతి గార్లు ఆశ్రమానికి చేరేసరికి..శ్రీ స్వామివారు అత్యంత ఉత్సాహంగా వున్నారు..వీళ్ళను చూడగానే.."రండి!..రండి!!..మీ కోసమే ఎదురు చూస్తున్నాను.." అన్నారు..
"అమ్మా..శ్రద్ధగా వినండి..కేవలం కొద్దీ రోజులు మాత్రమే మిగిలివుంది..మీకు మళ్లీ మళ్లీ బోధ చేసేవారు ఇంకొకరు లభ్యం కావడం దుర్లభం..నేను చెప్పే మాటలు ఆకళింపు చేసుకోండి..నా తపస్సుకు మీరు ఎంతగానో సహకరించారు..నేను చేసిన ఈ సాధన ఫలించే రోజు దగ్గరలోనే ఉంది..ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారం మీ చేతుల్లోనే ఉండబోతోంది..క్షేత్రంగా మారుతుంది.."
"అపార జ్ఞానానికి ప్రతీకలు అవధూతలు..వారి సహచర్యమూ సేవా అత్యంత పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి..నిరంతరం తనను తాను శోధించుకుంటూ..దైవదత్తమైన జ్ఞానాన్ని నలుగురికీ పంచుతూ..తనను తాను ఉద్ధరించుకుంటూ..తన చుట్టూ వున్న సంఘాన్ని కూడా ఉద్ధరించేవాడే అవధూత..శ్రీధరరావు గారూ మీరు ఒకటి రెండుసార్లు..నాగురించి ప్రస్తావిస్తూ.."బాలోన్మత్త పిశాచ వేషాయ.." అన్నారు..పైకి పిచ్చి వాడిలా..పసిపిల్లల చేష్టలతో..శుచీ శుభ్రత లేని వారిలా ప్రవర్తించినా..వారి ప్రతి చర్యలోనూ ఒక పరమార్ధం దాగివుంటుంది..అవధూత అనగానే..పిచ్చివాడు..మద్యం మాంసం స్వీకరిస్తూ వుండేవాడు అనుకోవడం ఒక అపోహ మాత్రమే..అలా ఉన్న వాళ్ళందరూ అవధూతలు కారు..అవధూత మూర్తీభవించిన జ్ఞాన స్వరూపం అని గుర్తించండి..పొట్టకూటికోసం గారడీలు చేసేవాడినో..మాటలతో కోటలు కట్టేవారినో ఆశ్రయించి..విలువైన సమయాన్ని..ధనాన్ని కోల్పోతారు కొందరు..వాళ్ళ అజ్ఞానం వల్ల..అవతలివాడు సుఖాలు పొందుతారే కానీ..వీళ్లకు ఒరిగేదేమీ లేదు.."
"గృహస్థులు మీరు..ఎన్నో బాధ్యతలుంటాయి..కొన్ని కష్టాలుంటాయి..కొన్ని సుఖాలూ వెంటనే ఉంటాయి..సమదృష్టి తో చూడండి..బండి చక్రం లోని ఆకుల వలె.. ఒకటి పైకి వచ్చిన తరువాత..మరొకటి క్రింద ఉంటుంది..మళ్లీ కొద్దిసేపటికే పరిస్థితి తారుమారు అవుతుంది..సంసారపు ప్రయాణం సాగుతూ ఉంటుంది..ఎటువంటి పరిస్థితులలోనూ సంయమనం పాటించండి!..మీరు చేసిన ఈ సేవ ఫలితం ఊరికే మాత్రం పోదు!..మీరు ఎందరో పండితులను నా వద్దకు తీసుకువచ్చారు..కొందరు నా పాండిత్యాన్ని పరీక్షించారు..మరికొందరు నాలోని వేదాంత సారాన్ని వెలికితీయాలని భావించారు..నాకున్న ఈ పాండిత్యం కానీ..మరోటి కానీ..అన్నీ ఆ దత్తుడి అనుగ్రహం తోనే వచ్చాయి..మరో విధంగా రాలేదు.."
"నేనే కాదు..ఏ సాధకుడైనా ఎక్కువ మౌనాన్ని ఆశ్రయిస్తాము..మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది..క్లుప్తంగా మాట్లాడటం సాధన లోని మొదటి మెట్టు అయితే..సంపూర్ణ మౌనం చివరి మెట్టు..అవసరం ఉన్నంతవరకే వాక్కును ఉపయోగించాలి..నిర్మోహత్వం నుంచి నిశ్చలస్థితి..అక్కడినుంచి జీవన్ముక్తి పొందుతామని ఆది శంకరులు చెప్పింది తెలుసుకదా..అక్షర సత్యమది.."
అద్భుతమైన కంఠస్వరంతో శ్రీ స్వామివారు చేస్తున్న బోధను.. పరిసరాలు మర్చిపోయి విన్నారా దంపతులు..తమకు ఈ బోధ చేయడానికి పిలిపించారని అర్ధమయింది వాళ్లకు..ఇక ఈ యోగిపుంగవుడు ఎక్కువ కాలం తమతో కలిసివుండడు అని రూఢీ అయిపోయింది..మనసు స్థిర పరచడానికే ఈరోజు శ్రీ స్వామివారు ఇలా బోధ చేశారు..
శ్రీధరరావు ప్రభావతి గార్లు.."నాయనా!..మీ నిర్ణయం లో మార్పు లేదా?.." అని చివరిగా అడిగారు..
"లేదమ్మా!..లేదు!..నాకు సమయం ముంచుకొస్తున్నది..మీరు వ్యాకులపడొద్దు..శ్రీధరరావు గారూ మరో నాలుగు రోజుల తరువాత ఇక్కడికి రండి..మీతో కొన్ని విషయాలు చెప్పాలి.." అన్నారు..
ఆ దంపతుల అంతరంగంలో ఇంతకుముందు ఉన్నంత భారం ఇప్పుడు లేదు..మనసంతా తేలిక గా ఉంది..ఆ మార్పు ఆ దంపతులకు తెలిసివచ్చింది..శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసారు..
అంతుపట్టని అంతరంగం..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి