28, ఏప్రిల్ 2023, శుక్రవారం

భూతభృతే నమ

 శతాబ్దాల క్రితం కూడా, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఈయమని పట్టు పట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి అతనికి కొంత వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కి పోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆయన వాదించేవాడు.

ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు.

స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చుడండి, రోజంతా వారికీ సేవలు చేయడములోనే నాకు సమయం సరిపోతుంది, వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను, నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను.

సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.." నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారార్థి యై రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు.

ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల కోవెల ప్రసాద వితరణ ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాల ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకు రమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు.

కొంత కలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటు తుండగా ఈ వైష్ణవుడు స్వామి స్వామి అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది. మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు అని చెప్పాడు. అందువల్ల నా పిల్లలు  పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేశాను . నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమ:" జపాన్ని చేస్తున్నాను.

ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడనని చెప్పాడని చెప్పాడా వైష్ణవుడు. ఇంతకీ ఆ బాలుడు ఇంకెవ్వరు, సాక్షాత్ శ్రీరంగనాథుడే.

భూత భృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని అర్థం.

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ           శంకర జయంతి ప్రత్యేకం       4/10 

          ( ఈ నెల 25వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


శంకరుల అవతారం 


3. జాతీయ సమైగ్రత 


    భారతదేశం అనేక రాజ్యాలుగా ఉండేదనీ, ఆంగ్లేయుల పరిపాలనా, అనంతరం రాజ్యాల విలీకరణ పేరుతోనూ ఒకే దేశం అయిందని చరిత్రకారులు ఒక బలమైన అభిప్రాయాన్ని జనబాహుళ్యంలో నిలబెట్టారు. 


ఛప్పన్ రాజ్యాలు 


    వివాహాలలో మహా సంకల్పంలో స్థానం గూర్చి చెప్పేడప్పుడు, 56 రాజ్యాలను పేర్లతో ఉటంకిస్తూ, 

    భారతదేశం అంటే ఈ రాజ్యాలు కలిగియున్న అఖండ భారతం అని పేర్కొంటారు. 


కాశీ - రాశమేశ్వరం యాత్ర 


     పూర్వకాలం నుంచీ, మన దేశంలో కాశీ విశ్వేశ్వరని దర్శించి, గంగను సంగ్రహించి, రామేశ్వరం చేరుకుని ఆ గంగని సముద్రంలో కలిపేవారు. అక్కడి సముద్ర ఇసుకను తీసికొని, మళ్ళీ కాశీ చేరి, దాన్ని కాశీలో గంగలో కలిపి, ఇంటికి చేరుకొని, యాత్ర పూర్తిచేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం కదా! 

    మధ్యలో అనేక రాజ్యాలున్నా, పాస్పోర్టు - వీసాలేవీ లేకనే ప్రయాణాలు సాగేవి. అంటే, ఎన్ని రాజ్యాలుగా ఉన్నా, భారతదేశమంతా ఏక ఖండమనే కదా! 


భారతదేశము - ఒక యాగశాల 


    ఆదిశంకరుల కాలంలో రహదారి వ్యవస్థ సక్రమంగా ఉండేదికాదు. అటువంటి సమయంలోనే, వారు అతి తక్కువ కాలంలో, దేశం నలుమూలలా నాలుగు వేదాలకి సంబంధించి నాలుగు పీఠాలు స్థాపించారు. 

    వాటిని చతురామ్నాయ పీఠాలుగా పేర్కొంటారు. 

     తూర్పున పూరీలో ఋగ్వేదానికి, 

    దక్షిణాన శృంగేరిలో యజుర్వేదానికీ, 

    పశ్చిమాన ద్వారకలో సామవేద సంబంధమైనదీ, 

    ఉత్తరాన బదరీనాథ్ సమీపంలో అథర్వవేదానికీ సంబంధించి వారేర్పరచిన నాలుగు పీఠాలూ ఇప్పటికీ మనం చూస్తునే ఉంటున్నాము కదా! 

     వీటిని చూస్తే, యజ్ఞాలలో యాగశాల నలుదిశలలో, నాలుగు వేదాలకీ నాలుగు ద్వారాలు ఏ విధంగా ఉంటాయో, 

    ఆవిధంగానే దేశమే ఒక యాగశాలగా, ఈ దేశ ప్రజలందరూ ఒకే సమూహంగా/కుటుంబంగా/ బంధువర్గంగా చూపే గొప్ప సంకల్పాన్ని ఏర్పరచి, భారతదేశ అఖండతను శాశ్వతంగా నిలిపారు. 


భారతీయ దేవాలయాలు - అర్చక వ్యవస్థ 


     అంతేకాక ఆదిశంకరులు హిమాలయాలలోని 

కేదారనాథ్, పశుపతినాథ్(నేపాల్ ) ఆలయాలలో కర్ణాటక అర్చకులనీ, 

బదరీనాథ్ లో కేరళ అర్చకులనీ, 

పూర్తి దక్షిణాన గల రామేశ్వరంలో మహారాష్ట్ర అర్చకులనీ ఏర్పాటు చేశారు. 

     ఈ రోజుకీ అదే వ్యవస్థ కొనసాగడం మనం చూస్తునే ఉన్నాం. 

    తద్వారా వారేర్పరచిన జాతీయ సంస్కృతి - సమైగ్రతలకి, ఆయన వేసిన పునాది ఎంత గొప్పదో తెలుస్తుంది కదా! 


    ఈ చారిత్రక సత్యాలు - మన జాతి ఔన్నత్యం,ఐక్యత అనే విషయాలకి నిర్ద్వందంగా ఋజువు చూపేవే కదా! 


                            కొనసాగింపు 


                   =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

సహవాసంలో

 శ్లోకం:☝️

*వరం పర్వతదుర్గేషు*

  *భ్రాంతం వనచరైః సః ।*

*న మూర్ఖజనసంపర్కః*

  *సురేంద్రభవనేష్వపి॥*


భావం: ఇంద్రభవనాలలో మూర్ఖుల సహవాసంలో నివసించడం కంటే, దట్టమైన అటవీ పర్వత ప్రాంతాలలో క్రూర మృగాలతో సంచరించడం మేలు.🙏

భయం


           _*సుభాషితమ్*_


శ్లో॥

భోగే రోగభయం కులే చ్యుతి భయం  విత్తే నృపాలాద్భయం,

మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయమ్।

శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాన్తాద్భయం,

సర్వం వస్తుభయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవాsభయమ్।।

            ~భర్తృహరి వైరాగ్యశతకమ్.


భావం:-

భోగాలు అనుభవిస్తున్నామనే తృప్తి మిగలకుండా రోగాలొస్తాయేమోనని రోగభయం,మంచి కులంలో పుట్టామని తృప్తి పడడానికి ఏం తప్పు జరిగినా కులానికి అప్రతిష్ఠ వస్తుందేమోనని భయం,బాగా డబ్బుఉన్నదిలే అని ఆనందపడితే రాజు ఆధనాన్ని(టేక్సులరూపంలో) కైంకర్యం చేస్తాడేమోనని భయం(దొంగలవలన కూడా భయం), మానశౌర్యంచేత విర్రవీగేవీలులేకుండా అనుక్షణం ఎప్పుడు  ఏంజరుగుతుందోననిభయం, సౌందర్యం ఉందనుకుంటే ముసలితనం వస్తుందని భయం, శాస్త్రవిజ్ఞానం ఉందనుకుంటే ప్రతివాదులతో వాదనాభయం, మంచిశరీరం ఉందనుకుంటే దీనికి ఎప్పుడు యముని బాధ కలుగుతుందోనని భయం, ఇలా ప్రతీదానికి ఏదోఒక విఘాతం ఉందిగాని భయం లేనిది ఒక్క వైరాగ్యానికే. అని శ్లోకభావము.: .

             _*కర్మలు*_


కర్మలు మూడు రకాలు..... 

1) ఆగామి కర్మలు

2) సంచిత కర్మలు

3) ప్రారబ్ధ కర్మలు


*_-----ఆగామి కర్మలు-----_*

మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి.... వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి.... మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్నిస్తాయి..... అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు! వివాహమైన దంపతులందరికీ సంతానం కలుగకపోవచ్చు! అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి..... ఉదాహరణకు మనం భోజనం చేస్తాం... . అది కర్మ..... వెంటనే మన ఆకలి తీరుతుంది..... ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి.... కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు..... దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు..... ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది...... ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి..... ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’!


*_-----సంచిత కర్మలు-----_*

మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి..... అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి..... జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు..... దీనికి కారణం ‘సంచిత కర్మలు


*_-----ప్రారబ్ధ కర్మలు-----_*


సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి.... ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు...... మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు...... మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము..... ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు.... అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది.... ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం!ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరల మరల ఈ జన్మలు,శరీరాలు వస్తున్నాయి..... కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు..... ఇక్కడ మీకో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి.... ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు..... ఆ అనుభవాలను ,కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు..... అంతకు మించి , నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు.….. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం!అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు........



భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే!యోగసాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు evaporate చేసుకోవచ్చు! అలా కర్మలు తొలగించబడేవరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు.... ఇది పరమ సత్యం..... ఇటువంటి సంఘటనలను మీరు కూడా చూసే ఉంటారు..... వైకల్యంతో పుట్టిన ఆ శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం..... ఆ బాధను చూసి కొంతమంది ,ఆ బాలుడిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు..... అయితే, అది అంత మంచిది కాదేమో! కారణం–ఈ ప్రారబ్ధకర్మ నుంచి తల్లి తండ్రులు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే లేక ఆ శిశువు ఆ కర్మ అనుభవించకుండా చేయటం వలన, వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే! అంబానీ సోదరులు అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించటానికి,నిత్యం దేవుడిని సహస్ర నామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాదిమంది బిచ్చగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి వారి ప్రారబ్ధమే...... ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు...... జన్మ పరంపరలు పూర్తైన వారు, తర్వాత దివ్య శరీరంతో రాశీమండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే,మరలా వారు ఈ భూమి మీద జన్మిస్తారు..... ఇంతకు ముందర నేను చెప్పిన విధంగా వారు యేయే అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎన్నుకుంటారు...... జన్మ పరంపరలు పూర్తి కాకపోతే ,వారు రాశీమండలంలోకి చేరటానికి అర్హులు కారు..... కారణం శరీరం నశించిన తర్వాత ,సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది.....వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది....సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలుగదు.....సూక్ష్మ శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి.....సూక్ష్మ శరీరం నశింప చేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి.....ముముక్షువు మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపచేయకుండా ,దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. ...అసలు ఈ శరీరం ఏర్పడటానికి కారణం అజ్ఞానమే!ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తే కారణ శరీరం నశిస్తుంది. .....అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు–అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది..... అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. ....అభిమానం వలన కామ,క్రోధ ,మోహాలు ఏర్పడుతాయి. కామ, క్రోధ, మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది.....కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి..... ప్రారబ్ధకర్మలను ఆనందంగా అనుభవిస్తూ,మరేయితర దుష్కర్మల జోలికి పోకుండా , కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం

కావచ్చేమో!జాతక కధల ప్రకారం బుద్ధుడిది అది 700 వ జన్మ అని చెప్పబడింది....ఇక మనం ఎన్ని జన్మలు ఎత్తాలో? మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుందని నమ్మకం ఏమీ లేదు... అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం! ప్రాపంచిక విషయాలాలసలో ఉన్నప్పటికీ వాటి వాసన అంటకుండా జీవించటం అనేదే కర్మయోగ సాధన సారాంశం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించటం!


*_........శుభం భూయాత్......._*

: *బహువిధ స్నానములు*


*పంచవిధ-స్నానములు :* సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 

1. ఆగ్నేయము (విభూతిని శరీరమంతట పూసికొనుట), 2. వారుణము (జలమున మునుగుట), 3. బ్రాహ్మము (ఆపోహిష్ఠేత్యాధి మంత్రము నుచ్చరించుచు దర్భలతో జలమును మార్జనము చేసికొనుట), 4. వాయవ్యము (సాయం సమయములో గోవుల డెక్కలను లేచిన), వాన కురియుచుండగా నందు శరీరమును తడుపుకొనుట).


*షడ్విధ-స్నానములు :* 

1. నిత్యము, 2. నైమిత్తికము, 3. కామ్యము, 4. క్రియాఖ్యము, 5. మలకర్షణము, 6. కర్మాంగము.


*సప్తవిధ-స్నానములు :* 

1. మంత్రము, 2. భౌమము, 3. ఆగ్నేయము, 4. వాయవ్యము, 5. దివ్యము, 6. వారుణము, 7. మానసము.


*దశవిధ-స్నానములు :*

1. ఆగ్నేయము (భస్మస్నానము), 2. వారుణము (పర్జన్యస్నానము), 3. బ్రహ్మస్నానము (గాయత్రీ స్నానము), 4. వాయవ్యము (గోధూళి స్నానము), 5. అవగాహము, 6. కంఠస్నానము, 7. కటిస్నానము, 8. కాపిలము, 8. కాపిలము. 10. మానసము.


"ఆగ్నేయం వారుణం బ్రాహ్మం వాయవ్యం చావగాహనమ్‌, కంఠస్నానం కటిస్నానం కాపిలం మంత్రమానసే"

పూజ - ప్రసాదం

 పూజ - ప్రసాదం


1945లో పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గర్లోని అణైతాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. పూజ పూర్తైన తరువాత ప్రసాదం పెట్టడానికి మఠం ఏనుగుని పూజాస్థలికి తీసుకురమ్మని ఆదేశించారు. పూజ జరుగుతున్న ప్రదేశం చిన్నదిగా ఉండడం, ప్రవేశద్వారం మొక్కజొన్న పొత్తులతో అలంకరింపబడి ఉండడం వల్ల అంతపెద్ద ఏనుగుని లోపలికి ఎలా తీసుకురావాలో అర్థం కాక అక్కడున్నవారు కలవరపడుతున్నారు.


ఏనుగుని తీసుకునిరాకపోవడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా, స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపించారు.


మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి దాంతో సంభాషించి పూజకు రావల్సిందిగా మహాస్వామివారు పిలిచారు అని చెప్పి దాని బంధనాలను తొలగించాడు. వెంటనే అది వస్తున్నాను పద అన్నట్టుగా తలాడించి పూజామందిరం ద్వారం వద్దకు వచ్చి అంతపెద్ద తన దేహాన్ని చిన్నదిగా చేసుకుని, వంచుతూ, మెలికలు తిప్పుతూ ఆ ద్వాఅరం గుండా లోపలికి ప్రవేశించింది. పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్ధంగా నిలబడి తరువాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే బయటకు తిరిగి వచ్చింది.


ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారందరూ పారవశ్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు.


--- యమ్. ఆర్. బాలసుబ్రమణియన్, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వైశాఖ పురాణం - 7 వ అధ్యాయము🚩

 _*🚩వైశాఖ పురాణం - 7 వ అధ్యాయము🚩*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*వైశాఖమాస దానములు*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷


అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను.


రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది , మడి , స్నానము , సంధ్యావందనము , దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు , అగ్నిహోత్రము , పితృ శ్రాద్దము మానకుండుట , వైశాఖవ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.


సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు , సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి , అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట , మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట , చెప్పులను , పావుకోళ్లను దానమిచ్చుట , గొడుగును , విసనకఱ్ఱలను దానమిచ్చుట , నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట , ఆవుపాలు , పెరుగు , మజ్జిగ , నెయ్యి , వెన్న వీనిని దానము చేయుట , ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు , దిగుడుబావులు , చెరువులు త్రవ్వించుట , కొబ్బరి , చెరకు గడల రసము , కస్తూరి వీనిని దానము చేయుట , మంచి గంధమును పూయుట , మంచము , పరుపు దానమిచ్చుట , మామిడిపండ్ల రసము , దోసపండ్ల రసము దానముచేయుట , దమనము , పుష్పములు , సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట , తాంబూల దానము వైశాఖ అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.


ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట , సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ , పండ్లు , పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ , గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట , సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట , ముఖ్యకర్తవ్యములు. బెల్లము , శొంఠి , ఉసిరిక , పప్పు , బియ్యము , కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి కావలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ , విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.


పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక , విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును , దప్పిక కలవారికి జలమును ఈయవలెను. జలము , అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను , సంపదలను , కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా !

                  *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌹🙏🌷🙏🌹🙏🌹