28, ఏప్రిల్ 2023, శుక్రవారం

శంకర జయంతి ప్రత్యేకం

 ॐ           శంకర జయంతి ప్రత్యేకం       4/10 

          ( ఈ నెల 25వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


శంకరుల అవతారం 


3. జాతీయ సమైగ్రత 


    భారతదేశం అనేక రాజ్యాలుగా ఉండేదనీ, ఆంగ్లేయుల పరిపాలనా, అనంతరం రాజ్యాల విలీకరణ పేరుతోనూ ఒకే దేశం అయిందని చరిత్రకారులు ఒక బలమైన అభిప్రాయాన్ని జనబాహుళ్యంలో నిలబెట్టారు. 


ఛప్పన్ రాజ్యాలు 


    వివాహాలలో మహా సంకల్పంలో స్థానం గూర్చి చెప్పేడప్పుడు, 56 రాజ్యాలను పేర్లతో ఉటంకిస్తూ, 

    భారతదేశం అంటే ఈ రాజ్యాలు కలిగియున్న అఖండ భారతం అని పేర్కొంటారు. 


కాశీ - రాశమేశ్వరం యాత్ర 


     పూర్వకాలం నుంచీ, మన దేశంలో కాశీ విశ్వేశ్వరని దర్శించి, గంగను సంగ్రహించి, రామేశ్వరం చేరుకుని ఆ గంగని సముద్రంలో కలిపేవారు. అక్కడి సముద్ర ఇసుకను తీసికొని, మళ్ళీ కాశీ చేరి, దాన్ని కాశీలో గంగలో కలిపి, ఇంటికి చేరుకొని, యాత్ర పూర్తిచేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం కదా! 

    మధ్యలో అనేక రాజ్యాలున్నా, పాస్పోర్టు - వీసాలేవీ లేకనే ప్రయాణాలు సాగేవి. అంటే, ఎన్ని రాజ్యాలుగా ఉన్నా, భారతదేశమంతా ఏక ఖండమనే కదా! 


భారతదేశము - ఒక యాగశాల 


    ఆదిశంకరుల కాలంలో రహదారి వ్యవస్థ సక్రమంగా ఉండేదికాదు. అటువంటి సమయంలోనే, వారు అతి తక్కువ కాలంలో, దేశం నలుమూలలా నాలుగు వేదాలకి సంబంధించి నాలుగు పీఠాలు స్థాపించారు. 

    వాటిని చతురామ్నాయ పీఠాలుగా పేర్కొంటారు. 

     తూర్పున పూరీలో ఋగ్వేదానికి, 

    దక్షిణాన శృంగేరిలో యజుర్వేదానికీ, 

    పశ్చిమాన ద్వారకలో సామవేద సంబంధమైనదీ, 

    ఉత్తరాన బదరీనాథ్ సమీపంలో అథర్వవేదానికీ సంబంధించి వారేర్పరచిన నాలుగు పీఠాలూ ఇప్పటికీ మనం చూస్తునే ఉంటున్నాము కదా! 

     వీటిని చూస్తే, యజ్ఞాలలో యాగశాల నలుదిశలలో, నాలుగు వేదాలకీ నాలుగు ద్వారాలు ఏ విధంగా ఉంటాయో, 

    ఆవిధంగానే దేశమే ఒక యాగశాలగా, ఈ దేశ ప్రజలందరూ ఒకే సమూహంగా/కుటుంబంగా/ బంధువర్గంగా చూపే గొప్ప సంకల్పాన్ని ఏర్పరచి, భారతదేశ అఖండతను శాశ్వతంగా నిలిపారు. 


భారతీయ దేవాలయాలు - అర్చక వ్యవస్థ 


     అంతేకాక ఆదిశంకరులు హిమాలయాలలోని 

కేదారనాథ్, పశుపతినాథ్(నేపాల్ ) ఆలయాలలో కర్ణాటక అర్చకులనీ, 

బదరీనాథ్ లో కేరళ అర్చకులనీ, 

పూర్తి దక్షిణాన గల రామేశ్వరంలో మహారాష్ట్ర అర్చకులనీ ఏర్పాటు చేశారు. 

     ఈ రోజుకీ అదే వ్యవస్థ కొనసాగడం మనం చూస్తునే ఉన్నాం. 

    తద్వారా వారేర్పరచిన జాతీయ సంస్కృతి - సమైగ్రతలకి, ఆయన వేసిన పునాది ఎంత గొప్పదో తెలుస్తుంది కదా! 


    ఈ చారిత్రక సత్యాలు - మన జాతి ఔన్నత్యం,ఐక్యత అనే విషయాలకి నిర్ద్వందంగా ఋజువు చూపేవే కదా! 


                            కొనసాగింపు 


                   =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: