11, సెప్టెంబర్ 2022, ఆదివారం

Bhargava Speach on 15th aug 22

 


బ్రహ్మవేత్త

 శ్లోకం:☝️

*సైంధవస్య ఘనోయద్వత్-*

  *జలయోగాజ్జలం భవేత్ l*

*ఆత్మయోగాత్తథా బుద్ధిః*

  *ఆత్మావః బ్రహ్మవేదినః ll*


భావం: ఉప్పుగడ్డ నీటితో కలిసి నీటియాకారమునే పొందినట్లు, బ్రహ్మవేత్త యొక్క బుద్ధి ఆత్మయొగమువల్ల (ఆత్మలో లయమై) ఆత్మాకారమునే పొందును.🙏

వామనావతారం

 వామనావతారం


అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.

ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రము లో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.

‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.


వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.


ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.


వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!


నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.


‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.


ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

అందరూ స్నేహితులే!

 శ్లోకం:☝️

  *కోఽతిభారః సమర్థానాం*

*కిం దూరం వ్యవసాయినాం l*

  *కో విదేశః స విద్యానాం*

*కః పరః ప్రియవాదినాం ll*


భావం: సమర్థుడైన వాడికి భారమైన (చేయలేని) పని ఏమున్నది? 

కార్యదక్షుడగు (పరిశ్రమ చేయు) వాడికి దూరం ఏమిటి? అంటే సాధించలేనిది ఏమున్నది?

విద్యావంతునికి విదేశమేమిటి? విద్వాన్ సర్వత్ర పూజ్యతే!

మంచిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కడుంటారు? ప్రియంగా మధురంగా మాట్లాడేవాడికి అందరూ స్నేహితులే!

ఆరోగ్యంగా జీవిద్దాం

 🌻 *అరిటాకు* 🌻


*మొదట్లో అరిటాకు మధ్యలో ఆ గీతాలా ఉండేది కా దుట.*


*ఒకరోజు విందులో ఆ శ్రీరాముడు హనుమంతుడు ఒకే అరిటాకులో* *బోంచేయాల్సిన వేళ* 

*శ్రీరాముడు ఆకులో* *సగానికి అలా గీత* *గీ శారట*.


*రామయ్య హనుమయ్య ఎదురెదురుగా కూర్చుని భుజించ ప్రారంభించారు.*


*రామయ్య వైపు ఉన్న ఆకులో మానవులం తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని అని ఉంచడం జరిగిందట.*


*అప్పటి నుండి అరిటాకులో అలా గీత రావడం మొదలైందట.*


*అందరికి అనుమానం అరిటాకు తినేవారి ముందు ఎటువైపు ఉంచి వడ్డించాలి అని*. 


*కూర్చున్న వారి ఎడమవైపున చిన్నదైన మూల భాగమును వెడల్పైన భాగాన్ని కుడివైపున ఉండాలట.* 


*మనం కుడిచేతితో కలుపుకుని తినాలి కనుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు.*


*ఆకులో మొదట వడ్డించిన విస్తరిలో తీపి తినాలని ఎందుకు అంటారు. ఎడమవైపు పైభాగాన తీపు పళ్ళు అన్ని వడ్డిస్తారు.*


*ఆహారానికి ముందు తీపి తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ చురుకుగా మొదలై మనం తీసుకునే ఆహరం బాగా జీర్ణం అవుతుందని తీపిని మొదట తినమంటారు.*


*ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్లనే మన పెద్దలు ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఈ అరిటాకులనే వాడేవారు.*


*మన ఇంటికి వచ్చిన అతిథి ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచన వల్ల కానీ ఆ సంప్రదాయాన్ని మరిచి ప్లాస్టిక్ ఆకులు ప్లాస్టిక్ ప్రేమలు ఎక్కువయ్యాయి ఇప్పటికైనా మారుదాం* 


 *సంప్రదాయాలను పాటించి ఆరోగ్యంగా జీవిద్దాం*