23, అక్టోబర్ 2024, బుధవారం

*1 - భజగోవిందం

 *1 - భజగోవిందం*

 🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑   


      *ఉపోద్ఘాతం*


శ్రీ మద్భగవత్పాద ఆచార్య శంకరులు మహా మేధావి, అద్వైత సిద్ధాంతులలో గొప్ప ప్రసిద్ధి గలవాడు. ఆయన హిందూమత సంబంధమైన ఆవేశంచేత ప్రేరితుడైన యోధుడు. మన దేశమందవతరించిన మత ప్రచారకులందరిలో సాటిలేని మేటి. ఆరోజులలో అలాంటి శక్తివంతుడైన పురోగామి దేశానికి ఎంతో అవసరమై యుండును. ఎందుకనగా హిందూమతము ఆ కాలములో భిన్న భిన్న శాఖలయి వుండెడిది. బౌద్ధ సిద్ధాంతములోని సునాయాసమై కనబడే బోధల ఎఱలలోబడి మతస్థుల బుద్ధి శీర్ణమ యి పోతూండేది. దాని ఫలితంగా హిందూ సమాజం పలుశాఖలై, తెగలై, ఒక శాఖకు మరొక దానితో పొత్తు కుదరక, ఎవరి సిద్ధాంతమును వారే ప్రతిపాదించి, సిద్ధాంతీ కరించు చుంటిమని భ్రమపడుతూ అంతమనేదిలేని తర్కంలో పడి కొట్టుకుంటూ వుండేవారు. ప్రతి పండితుడు కూడ, శిష్యులను చేరదీసి, ప్రత్యేకమయిన సిద్ధాంత మొకటి తయారుచేసి, తనే యొకానొక వ్యాఖ్యానము వ్రాసి యథేచ్ఛగా సంచరిస్తూ వుండే వాడు. తన సిద్ధాంత మొక్కటే యటుంచి, ఇతరులు ప్రతిపాదించిన సిద్ధాంత ములను పూర్వ పక్షము చేయుటయే యాతడి ముఖ్యోద్దేశమై యుండెడిది. ఈ ధీవిచ్చిత్తి ముఖ్యంగా శాస్త్రీయ రంగంలో - యింతగా దిగజారి పోవడమనేది శ్రీ శంకరుల సమయంలో జరిగి యున్నంతగా అంతకు ముందెన్నడూ జరిగి యుండలేదు. అట్టి విషమ పరిస్థితులలో ప్రమాద భరిత, విషపూరిత దుఃఖమయ మయినది హిందూ సమాజ మారోజుల్లో,ఆదర్శవంతమైన యాలోచనలు, ఆచరణ పూర్వకమైన సిద్దాంతములు ఆ రోజులలో ఎంతో అవసరమై యుండినవి. అహింస, ఆత్మ నిగ్రహం, దయ, ప్రేమ మొద లయిన బౌద్ధ సూత్రాలు కడు రమ్యమైనవై ప్రభువు-పాలితులు అనే తేడాలేకుండ అందఱను ఆకర్షించినవి. ఐతేనేమి దిగజారి పోయే సమాజం ఈ బౌద్ధ సంబంధమైన ఆలోచనలను కూడ వదలలేదు. అందులో విభిన్నమైన ఊహలు, వ్యాఖ్యానాలు, పాటమరించినవి. అసద్వాదులైన ఈ శూన్యవాదులు అధిక సంఖ్యాకులై దుర్బోధలు చేసి హిందువులనేకులను మత బాహ్యులను చేయడం జరిగింది శ్రీ శంకరుల యావిర్భావం నాటికి.


ఇటువంటి చిందరవందరగా నున్న అజ్ఞాన వాతావరణంలోకి శ్రీ శంకరులు ఉపనిషత్ప్రతిపాదిత మైన అద్వైత సిద్ధాంతమును ప్రవేశపెట్టారు. క్రీ.శ. 7 నుండి 9వ శతాబ్దముల మధ్య ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ప్రచారమునకు వీలయిన సదు పాయములు కనిపెట్టబడని ఆ రోజుల్లో కేవలం ఒక్క వ్యక్తికి అద్వైత మత ప్రచారం చేయ బూనడం, ఎంతటి ఉత్కృష్టమైన శ్రమతో గూడిన సాహస కార్యమో ఆలోచిస్తే అవగతమవుతుంది.


శ్రీశంకరుల బుద్ధికుశలత దేశములోని సమస్యను పరిష్కారంజేసింది. సందేహం లేదు.ఆయన తన భౌతకకాయాన్ని వదలకముందే అసద్వాదులైన బౌద్ధుల సిద్ధాంతాన్ని దేశపు సరిహద్దులను దాటించి, వెళ్ళగొట్టి అప్పటి ఆర్యావర్తంలో తిరిగి హిందూ సిద్దాంతములను నెలకొల్పారు. శతాబ్దాలపాటు యితరత్రా భిన్న భావాల వాతావరణంలో వుండి, అనేకమయిన అనుభవాలు గడించుకొని, విసిగి వేసారిన భారత దేశం తిరిగి తనదైన, స్వీయమైన సిద్ధాంతానికే చేరుకొన్నది.


ఉపనిషత్సిద్ధాంతాలు మన జాతి సంస్కృతికి ఆధారమైనవి. వాటిని పునరుద్ధ రించడంలో శ్రీ శంకరులు మన సంస్కృతిని కూడ పునరుద్ధరించారు. ఈ మహ త్కార్యాచరణకై ఆయనవద్ద పలురకాలుగా పనికివచ్చే ఆయుధ సామాగ్రి వుంది. ఋషుల మతాన్ని సంరక్షించే ఈ పరమపవిత్ర మయిన బాధ్యతను స్వీకరించగల సమర్థత ఆయన కొక్కనికే తగివున్నది.


ఉత్కృష్టమైన మేధ, తేజోవంత మైన ధీశక్తి, సత్యపదార్థ దృష్టితో పూర్ణత చెందిన వ్యక్తిత్వం జాతిని సేవించవలెననే తీవ్ర ఉత్కంఠ, దీక, మధురమైన భావుకత, తీక్ష్యమైన తర్కం యిటువంటి సల్లక్షణాల నెన్నో కలిగిఉన్న శ్రీ శంకరులను ఉపనిషత్తులు ఆధ్యాత్మికాధిపతిగా ఎన్నుకొన్నవి.


బహుశ్రమతో గూడిన ఈ మహత్కార్యాన్ని శ్రీశంకరులు ఇరవయి రెండేళ్ళ నిరంతర ప్రచారంచేసి నెరవేర్చవలసి వచ్చింది. ఆయన ముప్పది రెండవయేట పని ముగించి వ్యక్తిత్వాన్ని ముకుళింప చేసుకొని అవ్యక్తములో కలిసి పోయారు.


ఆయన గద్యపద్య రచన రెంటిలోను తన వాఙ్మయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీక్షాపూర్ణమైన ఆయన ఆశయాల వేడికి సంస్కృత భాష ఆయన చేతిలో మైనంవలె ఒదిగింది. ఆ భాష ఆయన భావాలకు అనుగుణంగా వివిధ రూపాలు ధరించింది. వారి శక్తివంతమైన ఆయన గద్యము చక్కని వాదములతో గంభీరంగా సాగింది. మధుర భక్తి గానాలు ఆయన పలికిందే తడవుగా ప్రవాహంవలె చక్కని ఫణితులతో విరాజిల్లాయి. శ్రీశంకరులు చేపట్టని ప్రక్రియ లేదు. ఏది చేపట్టినా అన్నిటిలో కూడా ఆయన సమర్థత కనిపిస్తుంది. మగటిమి చూపించే గద్యం, స్త్రీ లాలిత్యం చూపించే గానాలు,

కదం త్రొక్కే పద్యాలు, నృత్యం చేసే గీతాలు-- ఆయన ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం వ్రాస్తేనేమి, బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పితేనేమి, ప్రవృత్తి పూర్ణమైన భక్తి శ్లోకాలు రచిస్తేనేమి ఆయన హృదయంతో బాటే ఆయన లేఖిని నృత్యం చేసింది.ఆయన ఆలోచనల తోబాటు ఊయలలూగింది.


రచనా శక్తి మాత్రమే దిగజారిన దేశ సంస్కృతిని ఉద్దరించదు. ఆయన గొప్ప కార్యనిర్వాహకుడు, దూరదృష్టిగల సాంఘిక నీతి ధురంధురుడు. ధైర్యవంతుడయిన యోధుడు. విశ్రాంతి నెఱుగని దేశసేవకుడు. నిస్వార్థుడై, నిగర్వుడై, ఈ దైవాంశ సంభూతుడు దేశపు నలు మూలలా తిరిగి తిరిగి దేశ గౌరవ ప్రతిష్ఠల కనుగుణంగా ఎలాంటి ప్రవర్తం కలిగి వుండాలో సర్వులకూ బోధించి, మాతృదేశానికి అనర్గళ మైన సేవ చేశాడు. ఆయన కొనసాగించిన కార్యక్రమం. మంచి క్రమ శిక్షణ కలిగిన శిష్యులు స్థిరమైన పూర్ణమైన సంఘమూ ఉంటే తప్ప సఫలీకృతమయ్యేది కాదు. మఠాలను స్థాపించి, దేవాలయాలు నెలకొల్పి, సంఘోపయో గార్థం విద్యాలయాలు, మతపరమైన శాసనాలు యేర్పరచడంలో తాను సాధించదలచిన ఆశయ సిద్ధికోసం శ్రీజగత్ గురువులు ముట్టని గొప్పకార్యంలేదు.


భజగోవిందం ఆదిశంకరుల రచనలో చిన్నదైనా అత్యంత ముఖ్యమైనది. వేదాంతానికి పునాదియైన విషయాలతో గూడిన యీ సంగీత శ్లోకాల్ని, కడు సులభంగా వ్రాయడం చేత, చిన్నతనం నుంచి ఋషుల బిడ్డలైన పిల్లలు యీ అద్వైత భావాలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో పెరుగుతారు. గొప్ప అర్థాన్ని దాచుకొన్న యీ శ్లోకా లయొక్క ఫణితి తాళ సంయుతమై, పసివారి మనస్సు నిట్టే ఆకర్షించుతుంది. జ్ఞాపకం పెట్టుకునేందుకు ఎంతో ఊతమిస్తుంది. తెలివైన యుక్తవయస్కుడు ఏకాగ్రతతో యీ శ్లోకాలు చదివినట్లయితే అవి అతడి భ్రాంతులను మోహాన్ని తుడిచి వేస్తాయి. అందు కని యీ శ్లోకాన్ని "మోహ ముద్గర ” మంటారు.


ఈ శ్లోకాలు శ్రీగురుపాదుల హృదయంలో నుంచి ఎలా ప్రేరితమై ఆవిర్భ వించాయో చెప్పడానికి ఒకానొక ప్రసిద్ధమైన కథవుంది. ఒకనాడు శ్రీశంకరులు కాశీ పట్టణంలో, పధ్నాలుగురు శిష్యులు తన వెంటరాగా, బయలు దేరి దోవవెంట వెడుతూ వున్నాడు. దారిలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూవుండడం విన్నారు.


ఈ కథ ద్వాదశ మంజరికా స్తోత్రముయొక్క చివర ఈ శ్లోకంలో వుంది. 


*ద్వాదశ మంజరికాభిరశేషః కథితో వైయాకరణ శిష్యః* *ఉపదేశోభూద్విద్యానిపుణః శ్రీ మధ్ఛంకర భగవచ్చరణైః* .


*సశేషం*

🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕

Panvhaang

 


ఎవరు గొప్ప?

 *ఎవరు గొప్ప?*

 మనిషి ఏ చిన్నపాటి మంచిపని చేసినా “నేను చేశాను” అనే అహంభావాన్ని పొందుతాడు.  ఆ అహం చాలా తప్పులకు దారి తీస్తుంది.  “నేను తప్పు చేస్తే నన్ను ఎవరు అడుగుతారు? అనేది ఆయనలో ఉండే అహంకారం వల్ల. "నాకు అన్నీ తెలుసు, ఏది కావాలంటే అది చేస్తాను" అనే వైఖరిని సృష్టిస్తుంది.  అటువంటి వైఖరి అన్ని చెడులకు మూలం.  అన్నీ తెలుసు అని చెప్పే వ్యక్తి కంటే ఎక్కువ తెలిసిన వారు చాలా మంది  ఈ ప్రపంచంలో ఉన్నారు.  నాకు చాలా అధికారం ఉంది అని చెప్పేవాళ్ళ కంటే శక్తివంతులు చాలా మంది ఉన్నారు. 

ఈ వాస్తవాలన్నీ అహం ఉన్నవారికి తెలియవు.  మనం చేసే దుర్మార్గపు పనులు, అక్రమాలు ఎవరూ చూడరని మరోలాకూడా అనుకుంటారు.  మన చర్యలను ఎవరూ చూడటం లేదని అనుకోవడం తప్పు.

 *ఆదిత్యచంద్రవానలో స్నిలచ్చ* 

 *థైలార్భూమిరభో హృదయం యమచ* 

 *ఐఅహచ రాత్రిచ ఉభే స సంధ్యే* 

 *ధర్మాచ జానాతి నరస్య వృతం* II

 అని శాస్త్రాలు చెబుతున్నాయి.  పృథ్వీ, తేజస్సు, జలం, వాయు, ఆకాశ, సూర్య చంద్రులు, సంధ్యా కాలాలు, ప్రతివారి మనసులో అంతర్యామిగా ఉన్న పరమాత్మ వంటి పంచమహాభూతాలు ఏమి చూస్తున్నాయో చాలా మంది కి తెలీదు. మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇది సరైనదేనా? అనికూడా ఆలోచించం. మనలో ఉండే అహం వల్లనే ఇలాంటి దుర్బుద్ధులు మనకు వస్తాయి.  అనేక తప్పులకు అహంకారమే కారణం.  కాబట్టి అహంను ఎప్పుడూ ఉండకూడదు.

సర్వ అవయవాలు ఉన్న వానికంటే ఒక అంధుడు తన ఎదురుగా ఉన్నవానిని అలికిడితో గుర్తించి పెట్టె నమస్కారం భగవంతుని దీవనకంటే గొప్పది. ఎందుకంటే అతను నిత్య ధ్యాన స్వరూపమే కదా..అతనికి అహం ఉండదు, ఎవరు ఏమి మంచి, చెడులు చేస్తున్నారో తెలీదు. మనం కళ్ళుండి ఎన్నో చెడుపనులు, కొన్ని మంచి పనులను మాత్రమే చూస్తుంటాము.మరి మనము గొప్పా? ఆ అంధుడు గొప్పా...? నిర్ణయం భగవంతుడే చెప్పాలి.లేదా ప్రతీ వారిలో ఉండే అంత రాత్మే చెప్పాలి.

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ..*

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది.

 ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి.కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషం తో వుండసాగాడు. 

రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు వుంది.కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని,కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్త్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు. 

వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు  "అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"కావాలనే తప్పుగా చదివాడు 'బాధతే' బదులుగా 'బాధతి' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు.రోజూఅదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.

 ఐదవరోజు    ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు వుండబట్టలేక " "నాయమాం దోలికా దండ స్తవ 'బాధ తి' బాధతి" 

ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ 'బాధతి' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము విని నంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించ మని వేడి  ఆపల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.

సంస్కృతం లో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.

అందుకే పెద్దవాళ్ళు 'లలితా సహస్ర నామము"విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునే టప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామము చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదు.అని. అలా చదవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ అని చెప్తారు.

54. " మహా దర్శనము

 54. " మహా దర్శనము " --యాభై నాలుగవ భాగము --పారాయణము


54. -యాభై నాలుగవ భాగము--  పారాయణము



          ఉద్ధాలకుల ఆశ్రమమిప్పుడు యాజ్ఞవల్క్యుల వలన అనాథ గా మిగలక , సనాథమయినది . కులపతులను భగవానులు అని సంబోధించవలెను అని ఎవరూ ఆజ్ఞనివ్వలేదు , అయినా , ఆశ్రమ వాసులందరూ భగవానులనే సంబోధిస్తారు. వారుకూడా కులపతిహోదా తమకు మొదటినుండీ ఉన్నట్టే , అలవాటైనట్టే నడుచుకున్నారు. వారి ఆశ్రమములో ఒక ఆశ్చర్యమేమనిన, భగవతి వారు. వయోమానము చేత చూచునట్లైతే , భగవతి కాత్యాయని  అక్కడున్న అనేక పాత శిష్యులకన్నా చిన్నవారు . కానీ ఆమె వద్ద నిలుచొని కొంచముసేపు మాట్లాడితే వారిలో అనిర్వచనీయమైన వృద్ధత్వమును చూచి తల పంకించుతారు. ఆమె వయోవృద్ధురాలు కాదు , జ్ఞాన వృద్ధురాలు కాదు; జరాది వృద్ధురాలు కాదు . ఇంకా పదహారేళ్ళ షోడశి. బాలచంద్రునివలె పెరుగుతున్న యవ్వనము. అంగాంగములూ యౌవనవతి అనుదానిని ఉద్ఘోషిస్తున్నాయి. అయినా ఆమెలో అందరూ తమకన్నా ఎక్కువగా ఏదో ఒకదానిని చూచి తల ఊపువారు. అది పతిసేవా పరాయణత్వము యొక్క ఫలమని ఎవరికీ తెలియదు. దానినెవరూ చూడలేరు. 


          యాజ్ఞవల్క్య దంపతులు ఏ విధమైన ఉద్వేగమూ లేకనే ఆశ్రమపు కార్యములను నిర్వహించువారు. ఆశ్రమవాసులు మొదలుకొని , ఒకటిరెండు దినములు అతిథులుగా వచ్చిన వారు, పెద్దవారు , గొప్పవారు , చిన్నవారు అందరూ , ’ వెళ్ళిపోయిన దంపతులు ఈ వచ్చిన దంపతులను ఆవహించి ఉండవలెను ’ అంటారు. 


          విదేహరాజైన జనకుడు సందర్శనార్థమై ఆశ్రమమునకు వస్తాడని సమాచారము వచ్చింది . రాజు సపరివారముగా ఆశ్రమపు అతిథిగా వచ్చుట అదే మొదటిసారి. ఆశ్రమవాసులందరికీ అదొక పరమ సంతోషమైన సమాచారము. కొందరు ఉత్సాహముతో కొంచము ముందుకు వెళ్ళి , " ఇంకేమి లేవయ్యా, మన ఆశ్రమము ఒక యాత్రా క్షేత్రమై పోవును. విద్యాభిమానులందరూ యాజ్ఞవల్క్యాశ్రమమునకు వెళ్ళకుంటే వారికి అదొక కళంకము అనిపించుకుంటుంది . " అంటారు. 


          మహారాజుల రాక గురించి కొన్ని ఏర్పాట్లు జరిగినవి. వారికని భవ్యమైన మందిరమొకటి ఏర్పడింది . దానికి ఎడమపక్కగా రాజ పరివారము వారికి వేరే వేరే మందిరములు. కుడిపక్కగా విద్వాంసుల వసతులు. దానికి వెనుక పక్క రాజకాంతలకు అంతఃపురములు. చుట్టూ కాపలా సేనలకు చిన్న చిన్న వసతులు. సమీపములోనే ఒక గోశాల , పాక గృహములు. మహారాజువారూ , అంతఃపుర కాంతలూ , రాజపరివారమూ , విద్వాంసులూ , ఆశ్రమవాసులూ , కులపతులూ కూర్చొనుటకు అనుకూలమైన , ఎత్తైన , విశాలమైన అనావృత మంటపమొకటి . వారు వచ్చినపుడు వారికి ఎదురుపడి ఆహ్వానించు వారెవరు ,  వారిలో పూర్ణ కుంభము తీసుకొని వెళ్ళువారు ఎవరు , లాజ , అక్షతలను వేయువారెవరు , పుష్పములను చల్లువారెవరు , అనునవెల్లా నిర్ణయింపబడినవి. తన వెంట మైత్రేయి ఉండవలెనని , కాత్యాయని తాను తీసుకొని వెళ్ళ వలసిన పూర్ణ కుంభమును వేరొక ముత్తైదువకు అప్పజెప్పింది. 


          మహారాజులు వచ్చినారు. పల్లకీలో వచ్చిన వారి వెంట పల్లకీలలోనూ , మేనా లలోను విద్వాంసులు వచ్చినారు. రథములు- బండ్లు వంటి వాహనములమీద , ఏనుగుల మీద , రాజపరివారమూ , రాజ కాంతలూ వచ్చినారు. పూర్ణకుంభములతోను వేద ఘోషలతోను వారిని ఎదురుకొని , భగవానులూ , భగవతీ , మైత్రేయీ పిలుచుకొని వచ్చి వారి వారి స్థానములలో వారిని దింపినారు . భార్గవులనూ , దేవి గార్గినీ , వెనుకటి దినమే వచ్చిన దేవరాతులు వదలక , తమ ఇంటికి పిలుచుకొని వచ్చినారు . మరుసటి దినము నుండీ వేద బ్రాహ్మణోపనిషత్తుల పారాయణము అని నిర్ణయించినారు . 


          యథా కాలములో వేద పారాయణము ఆరంభమయినది . పూర్వాహ్ణము , అపరాహ్ణము రెండింటిలోనూ పారాయణము నడచినది . వృద్ధ శిష్యుడు వేదిక పైన కూర్చొనును. అతనికి కుడివైపు కులపతులూ , ఆశ్రమవాసులూ భగవతీ ఆలంబినీ తోపాటు మైత్రేయీ , ఆశ్రమ స్త్రీలూ కూర్చుంటారు . ఎడమవైపు మహారాజులూ , విద్వాంసులూ , రాజపరివారమూ , రాజ కాంతలూ కూర్చుంటారు. సభను చూచినవారికి అది ఒక బ్రహ్మ సభ యనిపించును. వారిలో ఇద్దరు ముగ్గురిని వదలితే , మిగిలిన వారందరూ మొదటి దినము సభాదర్శనపు ఆనందములో విస్మితులైపోయినారు . భార్గవులూ దేవరాతులూ భగవానుల కుడిపక్క ఆసీనులైనారు. భార్గవులకు , తాను ఉపనిషత్తును వినగలుగు సుదినము వచ్చినదని ఆనందోద్రేకములతో ముఖమంతా ఎర్ర తామర వలె వికసించినది. 


          వేదపారాయణము జరుగుతున్నపుడు విద్వాంసులు మంత్రముగ్ధులై పాములవలె తలలాడిస్తున్నారు. ఇదివరకూ ఉన్న వేదములో  మంత్ర బ్రాహ్మణములు కలసిపోయినాయి. కొత్త వేదములో అది లేదు. అందువలన వేదపారాయణము ముగియగనే విద్వత్సభ దానిని ఆమోదించి కృష్ణ యజుర్వేదము , శుక్ల యజుర్వేదము అని పేరు పెట్టుటకు మహారాజుకు సలహా ఇచ్చినది. దానిని భగవానులకు విజ్ఞాపన చేసి సరియేనా అని అడుగగా , వారు , " ఇది వివరణాత్మకమైన నామధేయమైనది. అయితే అది వచ్చినది వాజిరూపుడైన ఆదిత్యుని వలన అనునది అందరికీ జ్ఞాపకము రావలసిన అవసరముంది. కాబట్టి ’ వాజిసనేయ సంహితా ’ అన్న పేరు సమంజసముగా ఉంటుంది  " అన్నారు . మహారాజులు రెండింటినీ ఆమోదించినారు . అప్పటినుండీ నూతన వేదము శుక్ల యజుర్వేదము , వాజిసనేయ సంహితా అను రెండు పేర్లతో ప్రసిద్ధమైనది. 


           సంహితోపనిషత్తులను అప్పుడే ఆరంభించుటయా అని ఒక చిన్న వాదము జరిగినది. మహారాజు గార్గి ముఖము చూచినారు. ఆమె విధిలేక లేచి నిలబడింది. విద్వాంసులకు నమస్కారము చేసి అన్నది : " ఇక్కడి ఆశ్రమవాసులు కాక, బహుశః ఆ ఉపనిషత్తును చూచినదానిని నేనొక్కదానినే అని తోచుచున్నది. అందులో ఉన్న మంత్రముల సంఖ్య మరీ చిన్నది ( సంహిత యొక్క నలభైయవ అధ్యాయమైన ఈ ఉపనిషత్తులలో ఉన్నది కేవలము పదిహేడు మంత్రములు. ఇప్పుడు ప్రచారములో ఉన్న ఉపనిషత్తులలో ఉన్న మంత్రములూ , అక్కడున్న మంత్రములూ వేర్వేరు క్రమములలో ఉన్నవి అన్నది గమనించవలెను ). అయితే అర్థములో మాత్రము అది చాలా విస్తారమైనది. ప్రశ్న , ఐతరేయ , కేన , తైత్తిరీయాది ఉపనిషత్తులు పూర్ణముగా అర్థమై , ఉపనిషద్ధర్మములన్నీ కరతలామలకములైన వారికి మాత్రమే ఈ ఉపనిషత్తు అర్థము కావచ్చు. కాబట్టి ఇప్పుడే దీని పారాయణము జరగనీ. మరలా ఇంకొకసారి కూడా జరగవలెను. ఇది నా అభిప్రాయము. " 


         అదేవిధముగా తీర్మానమయినది. దానిని విన్న విద్వాంసులు, " దేవి గార్గి చెప్పినది సరిగా ఉన్నది " అన్న సిద్ధాంతమునకు వచ్చినారు. ఆ ఉపనిషత్తు అంతా అయిన తరువాత మరలా ఒకసారి పారాయణము కావలెనని తీర్మానించినారు. 


         బ్రాహ్మణ పారాయణము ఆరంభమయినది . మొదటి ఏడు కాండములు ముగిసినాయి. అగ్ని రహస్యము వచ్చినది. అప్పుడు మహారాజులు భగవానుల ముఖమును చూచి నవ్వినారు. అగ్ని రహస్య పారాయణమైన తర్వాత అన్నారు , " భగవానులు యజ్ఞేశ్వరుని సంపూర్ణముగా తెలుసుకున్నారు అనుటకు ఇది ఒక నిదర్శనము. మేము , వారు వీరు చెప్పినది విన్నంత మాత్రమునకే ఏదో మహా తెలుసుకున్నట్టు విర్రవీగుతాము. అటువంటప్పుడు , ఇంత తెలిసియుండి .....ఇంకా సరిగ్గా చెప్పవలెనంటే , సర్వజ్ఞులైననూ భగవానులు అంతంతగా ఉన్నారు అన్న తరువాత , వారి జ్ఞానమునకు వెలకట్టువారు ఉన్నారా అనిపిస్తుంది " అని పరి పరి విధములుగా ప్రశంసించినారు. భగవానులు పెదవి కదపలేదు. 


          బ్రాహ్మణ పారాయణము ముగిసింది. అశ్వమేధ కాండము నుంచీ ఉపనిషత్తు ఆరంభమయినది . అప్పుడు భగవానులు మాట్లాడినారు . "  దేవి గార్గి వెనుక అడిగిన ఒక ప్రశ్నకు ఇక్కడ ఆదిత్య భగవానుడు ఉత్తరము నిచ్చినాడు. వారు కర్మ బ్రహ్మ సముఛ్చయ వాదమే సిద్ధాంతమైతే కర్మాధికారము లేని వారి ఉద్ధారము ఎలాగు ?  అన్నారు. అటువంటి వారు ఒక యజ్ఞమును గురించి తత్ సంబంధిత మంత్రములనూ బ్రాహ్మణమునూ పారాయణము చేస్తే తత్ఫలము దొరకునని ఆదిత్య దేవుని ఉత్తరము. అది మాత్రమే కాక , ఆదిత్య దేవుని అనుమతితో ఇంకొక మాట చెపుతాను. చాతుర్వర్ణ్యమూ చేరి ఒక సమాజము. గుణకర్మల వలన , గుణకర్మల కోసము విభాగమగుటను గమనింపకయే , కాలవశమున ప్రతియొక్కరూ తాము తాము ప్రత్యేకమైనట్టు వర్తించినారు . ఇది సరి కాదు. దానికోసము ఉపలక్షణముగా రాజన్యుల కథలు రెండింటిని చేర్చి ఈ ఉపనిషత్తును పూర్తి చేయ వలసినదంట. కాబట్టి ఇది అసంపూర్ణముగానే ఇంకా మిగిలింది. " అన్నారు. 


          ఉపనిషద్భాగమునకు భగవానులు విద్వాంసుల కోరిక మేరకు తామే అర్థము చెప్పినారు. భగవానుల వచో వైఖరియే అట్లున్నదో , లేక తపస్వి మాటలు కాబట్టి వాటికి విచిత్రమైన శక్తి వచ్చినదో , లేక విద్వాంసుల హృదయములు పక్వమైనవో గానీ మొత్తానికి ఆ అర్థమును అందరూ గ్రహించి , భగవానులు కృతకృత్యులని ఒప్పుకున్ననూ , భార్గవ దేవరాతులు మరియొకసారి ఉపనిషత్తును వినవలెను అనుకున్నారు. 


          మరుసటి దినము జనక రాజు భగవానుల వద్ద వినయముతో విన్నవించుకున్నాడు, " ఎప్పుడైనా ఒకసారి భగవానులు మా రాజ భవనమునకూ దయచేసి మమ్ములను అనుగ్రహించవలెను. వెనుక మాకు ఇచ్చిన వరమును , అనగా , కామప్రశ్నుడను కావచ్చును అన్న వరమును మరవకూడదు. " అన్నాడు. భగవానులు నవ్వుచూ సమయోచితముగా మాటలాడి ముగించినారు. 


         ఆశ్రమవాసులందరికీ యథోచితముగా , ఉదారముగా మర్యాదలను వితరణ చేసి భగవానులవద్ద వీడుకోలు పొంది మహారాజు వెనుకకు తిరిగినాడు. ఆదినము రాత్రి ఇంటి పనులనన్నిటినీ ముగించుకొని కాత్యాయని శయనించుటకు వెళ్ళవలెను. అప్పుడు మైత్రేయి వచ్చినది. 


అక్కను మాట్లాడించు చెల్లెలి వలె స్నేహముతో కాత్యాయని మాట్లాడింది. " ఏమక్కా , వచ్చినావు ? "


మైత్రేయి, " నేను నీతో ఒక విషయమును గురించి మాట్లాడవలెనని వచ్చినాను. నువ్వు సావధానముగా వింటావా ? " 


" నువ్వు నాకన్నా పెద్దదానివి. నువ్వు చెప్పినది వినుట నా ధర్మము. "


          " చెల్లీ , నువ్వు నాకు ఏదీ తక్కువ చేయలేదు. అన్నిటిలోనూ మొదట నేను , ఆ తరువాత నువ్వు అన్నట్టు నడచుకుంటున్నావు. కానీ ఇది మంచిది కాదు. ఈ ఆశ్రమానికి అధిరాజ్ఞివి నువ్వు. నావలన నీ అధికారమునకు లోపము కాకూడదు. అందుకని నేను ఇక్కడినుండీ అయినంత తొందరగా వెళ్ళిపోవలె ననుకున్నాను. "


        " అలాగ అనుకొనుటకు ఏమి కారణము వచ్చింది ? నాకు తెలియకుండా నేను నీతో యేమైనా అవినయముగా నడచుకున్నానా ? "


          " నేనప్పుడే అన్నాను కదా , నువ్వు ఆవగింజ కాదు , ఆవగింజ మొలకంత కూడా అవినయమును చూపలేదు. కానీ నేనిక్కడుంటే నీ అధికార వ్యాప్తి తగ్గుతుంది. నువ్వు భగవానుల పత్నివి. భగవతివి. కానీ నువ్వు ప్రవర్తించునది ఎలాగుందంటే  , నేను భగవతిని , నువ్వు నా ఆజ్ఞాధారకురాలివి అన్నట్లుంది. ఈ అధికార హానిని నేనెలాగ ప్రోత్సహించేది ? "


         కాత్యాయని కూర్చున్నది . మైత్రేయి చేయి పట్టి లాగి , ’ కూర్చో ’ అని కూర్చోబెట్టుకున్నది. విశ్వాసముతో అన్నది , " నీది విచిత్రమైన మనోరోగము. మొదట నీకు మానుండీ ఏమైనా తప్పు జరిగిందా అని భయపడినాను. నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నువ్వు కారణము లేకుండానే వ్యథ పడుచున్నావు అనిపించినది. సరే , నీమాటే వింటాను , ఇప్పుడు నువ్వు ఏమి చేయాలనుకున్నావు ? " 


" నేను ఇంకెక్కడికైనా వెళ్ళవలె ననుకుంటున్నాను "


" ఎక్కడికి ? "


         " అదే ఇంకా తెలీదు. చూడు , నేను పెరిగిన యువతిని. పెళ్ళికాని దాన్ని. అదీకాక , ఇష్టము వచ్చినట్లు నడచుకొను దానిని. ఇలాగ లోకపు దృష్టిలో ఉన్న ఆడది ఎక్కడున్నా అపయశస్సు తప్పదు ఇక్కడ కాక, పుట్టింటికి వెళ్ళినాననుకుందాము , అక్కడ కూడా అపయశస్సు తప్పలేదు. కాబట్టి నావలెనే ఉన్న గార్గి వద్దకు పోవలెనని ఒక ఆలోచన. "


" అలాగయితే ఇక్కడికి గార్గి వచ్చినపుడు అడిగినావా ? "


         " ఔను  , అడిగినాను. ఆమె , ఉంటే ఇక్కడ ఉండు. భగవానులు మనందరికీ పెద్దవారు. వారి ఆశ్రయము వదలుట అయితే ఇంకెక్కడికీ వెళ్ళ వద్దు , నా దగ్గరే వచ్చి ఉండు అన్నారు " 


" సరే , నీకు భగవానులు కావాలా వద్దా ? " 


" నువ్వూ ? నీ తుంపు మాటలూ ? సరే , అదుండనీ. నాకు కావలసినది మార్గదర్శియగు సద్గురువు. "


" భగవానులు అటువంటి సద్గురువులు కాగలరు అన్న నమ్మకము నీకుందా ? " 


       " నాకు సంపూర్ణముగా ఉంది . అంతే కాదు , అటువంటి వారు గురువుగా లభించవలెనంటే అదృష్టము ఉండవలెను. కానీ వయో ధర్మమును చూచు జగత్తు తనకు తోచినట్లు మాట్లాడుతుంది. " 


        " అక్కా , జగత్తు వద్దు అని బయలుదేరిన దానివి నీకు జగత్తు అలాగంటుంది , ఇలాగంటుంది అన్న లక్ష్యము ఎందుకు ? " 


         మైత్రేయి తన తప్పు ఒప్పుకొని అన్నది " అపయశస్సు అనునది ఎప్పటికీ ఒకరిని గురించి మాత్రమే రాదు. అసంగతములైన రెండు పదార్థములను గురించి వెడలునదే అపయశస్సు. దానికేమంటావు ? " 


         భగవతి, పులి వచ్చి మీద పడినట్టు మైత్రేయి పైపడి అన్నది. " అక్కా , నువ్వింత మెతకదానివని నేననుకోలేదు. నేనిప్పుడు చెపుతాను విను. ఊరికే వెయ్యి మాటలాడి నిన్ను నొప్పించడము నాకు ఇష్టము లేదు. అందుకని పోకలు కత్తరించినట్లు చెపుతాను విను , నువ్వు ఇక్కడే భగవానుల ఆశ్రయములో ఉండు. వారికి తమ వేదాంత విచారములను వినువారు , అందులో పాలు పంచుకొనెడి వారు ఒకరు కావలెను. నాకు ఆ అదృష్టము లేదు. కాబట్టి వారి కోరికను నువ్వు నెరవేర్చు. అపయశస్సు అన్నావు. అది రాకుండా నువ్వు వారి సహధర్మిణివి కా. నువ్వో అంటావా ? నాకన్నా వయసులోను , జ్ఞానము లోనూ , ఆలోచన లోనూ పెద్దదానివైన నువ్వు అక్క. నేను చెల్లెలు. ఇద్దరమూ ఆ మహానుభావుడిని సేవించి కృతార్థులమవుదాము. మనము సవతులము కాదు, అక్క చెళ్ళెళ్ళము, తెలిసిందా ? "


         మైత్రేయి అనిరీక్షితముగా వచ్చిన ఈ ఔదార్యమును చూచి మూగబోయింది. కాత్యాయని కొనసాగించింది, " అక్కా, నీకు భగవానులను ఒప్పించే రహస్యము ఒకటుంది , అది చెపుతాను విను . వారు అగ్నిహోత్రము ముగించి వచ్చి కొంచము సేపు కూర్చుంటారు. అప్పుడు వెళ్ళు. నమస్కారము చేసి , రక్షణ , మార్గదర్శనము రెండింటినీ వరముగా కోరుకో. అప్పుడు వారు లేదనకుండా నీకు వరమునిస్తారు. అప్పుడు నీ శంక , సందేహమూ అన్నీ నివారణయగును. " 


మైత్రేయి ఏమీ అనలేదు. కాత్యాయనిని హత్తుకున్నది. ఇద్దరి కనులూ చెమర్చినాయి. 

Janardhana Sharma

గౌరవం మన భాషపై ఉండొద్దా

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 మనకు పరభాషలమీద ఉండే గౌరవం మన భాషపై ఉండొద్దా? అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు. ఈ ఎపిసోడ్ లో తెలుగు భాషను అందరూ ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో వివరంగా చర్చించారు. కాలానుగుణంగా భాషలో కొన్ని మార్పులు వస్తూంటాయి కానీ మౌలిక సూత్రాలను అందరూ తప్పక పాటించాలి. అప్పుడే భాష సజీవంగా ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు భాషను మార్చేస్తూ ఉంటే అసలు భాష ఏదో మరచి పోతాం. ఇంకా ఏమంటున్నారో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి,శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

ఈశావాస్యోపనిషత్తు

 *ఈశావాస్యోపనిషత్తు*


ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదములో ఉంది.


ఈశావాస్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?

ఈ ఉపనిషత్తు ‘ఈశావాస్య’ అనే పదంతో ప్రారంభము అయ్యింది ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది. దీనినే ఈశోపనిషత్తు అని కూడా అంటారు.


ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?

ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి.


ఈశావాస్యోపనిషత్తు అందించిన ప్రధానమైన సందేశము ఏమిటి?

ఈ చరాచర ప్రపంచము అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత ‘నేను’, ‘నాది’ అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనమనే ఉదాత్త సందేశముతో ప్రారంభమవుతుందీ ఉపనిషత్తు.


పరమాత్మ ‘విశ్వవ్యాపి’ అని చెప్పే మంత్రము ఏది?

ఈశావాస్య మిదగ్ం సర్వం

యత్కించిత్ జగత్యామ్ జగత్

ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదము. ఈ దృశ్యమాన విశ్వము ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది – అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థము.

వివరణ: ఈ విషయం వేదములో అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ప్రసిద్ధమైన నారాయణ సూక్తములో

“యచ్చ కించిజ్జగత్సర్వమ్ దృశ్యతే శ్రూయతే2పివా

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః”

అని ఉంది.

ఈ ప్రపంచంలో కనిపించేది, వినిపించేది ఏది ఉందో, దాని లోపల, బయట ఉన్నవాడు నారాయణుడే (అంటే బ్రహ్మమే). ఇలా అంతా బ్రహ్మ మయమే అని గ్రహించి మానవుడు ఆయన మీదే మనస్సు లగ్నము చెయ్యాలని సందేశము.


త్యాగము చెయ్యవలసిందని, పరుల ద్రవ్యాన్ని అపహరింౘ వద్దని చెప్పిన వచనము ఏది?

లోభం గర్హించదగింది అని చెప్పే మంత్రము ఇది.


తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్


ఇది మొదటి మంత్రంలో రెండవ భాగము. ఈ చరాచర ప్రపంచమంతా భగవన్మయమే అయినప్పుడు, ఈ వస్తువు నాది, నేను సంపాదించాను అనుకోవడము అజ్ఞానము. భోగ్య వస్తువులను వేటినయినా తన ప్రయోజకత్వముతో సాధించాననే అహంకారంతో కాకుండా, భగవద్దత్తమైనవనే భావముతో, త్యాగ బుద్ధితో, అనాసక్తతతో అనుభవించుచూ ఎవరి ధనాన్ని ఆశింౘ వద్దు అని దీని అర్థము.


పరబ్రహ్మము పరిపూర్ణమూ లేక సంపూర్ణమూ అని చెప్పే శాంతి వచనము ఏమిటి?


బ్రహ్మము ఎప్పుడూ పూర్ణమే!

 

పూర్ణమదః పూర్ణమిదమ్ పూర్ణాత్పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిః


భగవంతుడు పూర్ణము (అదః పూర్ణమ్), ఈ విశ్వమూ పూర్ణమే (ఇదం పూర్ణమ్), పూర్ణమైన ఆ భగవంతుని నుండే ఈ పూర్ణమైన విశ్వము కూడా ఆవిర్భవించింది. పూర్ణము నుండి పూర్ణమును పరిహరిస్తే మిగిలేదీ పూర్ణమే.

వివరణ: బ్రహ్మము నుండి నామ రూపాలుగా విశ్వము ఆవిర్భవించి నప్పుడు, మళ్ళీ ప్రళయము వచ్చినప్పుడు, విశ్వము బ్రహ్మములో లీనమైనప్పుడు – అంటే అన్ని స్థితులలోనూ బ్రహ్మము పూర్ణమే. విశ్వము అశాశ్వతము. బ్రహ్మము శాశ్వతము. విశ్వము శాశ్వతము అనుకోవడమే అవిద్య. విశ్వము శాశ్వతము కాదని ఆధునిక సృష్టి సిద్ధాంతం కూడా చెపుతుంది. ఆ విషయాన్ని వేల సంవత్సరాల నాడు వేదము ఈ మంత్రము ద్వారా సూచించింది. సృష్టికి కావలసిన ద్రవ్యము ఏది అనే ప్రశ్నకు ఆధునిక శాస్త్రజ్ఞుల వద్ద సమాధానం లేదు. బ్రహ్మమే – శుద్ధ చైతన్యమే ద్రవ్యంగా విశ్వావిర్భావము జరిగిందని ఈ మంత్రము ద్వారా సూచించి ఆధునిక శాస్త్రజ్ఞుల కంటే ఒకడుగు ముందరే ఉంది వేద విజ్ఞానము.


ఈ మంత్రము పిల్లలతో సహా అందరికి రావలసిన శుభకర మంత్రము.


పరమాత్మ యొక్క విశిష్ట లక్షణాలను వర్ణించే వచనము ఏమిటి?


ఆ వాక్యము ఇది:

తదేజతి తన్నైజతి

తద్దూరే తద్వంతికే

త దంతరస్య సర్వస్య

తదు సర్వస్యాస్య బాహ్యతః

ఇది ఈ ఉపనిషత్తులో ఐదవ మంత్రం. దీని అర్థము – ఆత్మ తత్వము చలిస్తుంది, చలించదు, దూరంగానూ ఉంటుంది. జగత్తు లోపలా బయటా కూడా ఉంటుంది. అలాగే పాండిత్యానికి పరిమితమైన వారికి అది దూరమే, యోగులకు దగ్గరే.

వివరణ:

ఆత్మ సర్వ వ్యాప్తము – తనలో నున్న ఆత్మ తత్వము ఇతరులలో నున్న ఆత్మ తత్వము ఒకటే అనే జ్ఞానము లోపించినపుడు గుడికి ఎంత దగ్గరగా నున్నా – అంటే ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎంత పాండిత్యము సంపాదించినా దైవానికి దూరమే. గుడికి దగ్గిర – దైవానికి దూరము అనే అర్థము వచ్చే ఆంగ్ల సామెత ఉద్భవింౘక ముందే ఈ విషయాన్ని ఉపనిషత్తు బోధించింది. ఆత్మావలోకనము చేసిన యోగులకు మాత్రమే ఆత్మతత్వం దగ్గరగా ఉంటుంది.


సర్వ వ్యాప్తమైన ఆత్మతత్వానికి అచంచలత్వము స్వాభావికము. కాని మన ఇంద్రియాలు చలించేవి గనుక ఆ చలనము ఆత్మ తత్వము మీద ఆరోపించి అది చలిస్తుందని మనము భ్రమలో ఉన్నాము. అది పొరపాటని ఈ మంత్రము మొదట వివరించింది.


సకల జీవుల యెడల సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని సందేశాన్ని అందించిన వచనము ఏది?


ఆ వచనము ఇది:

యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి

సర్వభూతేషుచాత్మానమ్ తతో న విజుగుప్సతే

యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః

తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః


ఈ రెండు మంత్రాలు (6, 7) ఈ ఉపనిషత్తుకి గుండెకాయ వంటివి. వీటి అర్థము ఇది:


“ఎవ్వడైతే ప్రపంచము లోని అన్ని ప్రాణులను ఆత్మస్వరూపుడగు తనలో చూచుచున్నాడో, అలాగే అన్ని ప్రాణులలోను ఆత్మ స్వరూపుడగు తనను చూచుచున్నాడో అతడు ఎవ్వరినీ ద్వేషించడు. అలాగే బ్రహ్మజ్ఞాని అయినవాడు, సర్వాంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని గుర్తెఱిగి తనకు ఇతరులకు మధ్య భేద భావము పరిత్యజిస్తాడు. అలాంటి వానికి శోకము గాని, మోహము గాని ఉండవు”


వివరణ:

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది భేద భావమే. ఇది తొలగినపుడు వివాదాలకు, యుద్ధాలకు, ఉగ్రవాదానికి తావెక్కడుంటుంది? మత ఛాందస వాదము ఎక్కడ ఉంటుంది? సర్వ మానవ సమానత్వం అన్నది అందరిలో నున్న పరమాత్మ ఒక్కడే అన్న ఉపనిషత్సూక్తి గ్రహించిన వాళ్లలోనే కలుగుతుంది.


ఉపనిషత్సారము హిందువుల రక్తంలో ఉంది గనుక ఎన్నడూ మనము ఇతర దేశాల మీదకి దండయాత్ర చెయ్యలేదు. అంటే కాక ఇతర దేశాల నుండి వచ్చిన అన్యమతస్తులకు ఆశ్రయము కూడా భారతదేశము కలిగించింది.


ఈశావాస్యోపనిషత్తు అందించిన సమన్వయ సిద్ధాంతము ఏమిటి?


ఏకాగ్రత సంపాదించి దేవతాజ్ఞానాన్ని అభ్యసించాలని పతిపాదించింది. అలాగే భక్తీ, జ్ఞాన మార్గాలను విడివిడిగా కాక సమన్వయము చేసి ఆచరించాలని భోధించింది. భార్య, పుత్రులు, సంపద – వీటి మీద వ్యామోహము వదలాలని ఉపదేశించింది. దీనిని ఏషణాత్రయ పరిత్యాగము అంటారు, అలాగే సమాజ ప్రగతికి ప్రవృత్తి మార్గంలోనూ, ఆత్మోద్ధరణకు నివృత్తి మార్గంలో నిస్సంగంగాను ఉంటూ, ప్రవృత్తి, నివృత్తి మార్గాల సమన్వయము పాటించాలి అని ఉపదేశించింది.


ఇలా ఆధ్యాత్మిక జీవనం, లౌకిక జీవనం పరస్పర విరుద్ధాలు కావని, వీటిని చక్కగా సమన్వయము చేసి పరిపూర్ణమైన జీవనం సాగించవచ్చుననే సమన్వయ దృక్పథాన్ని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది.


ఈశావాస్యోపనిషత్తులోని చివరి ప్రార్థన ఏమిటి?


ఈ ఉపనిషత్తులోని చివరి ప్రార్థనా మంత్రము –


అగ్నే నయ సుపథా రాయే అస్మాన్

విశ్వాని దేవ వయునాని విద్వాన్

యుయోధ్యస్మజ్జుహురాణమేనో

భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ


అగ్నిదేవా! మమ్ము సరైన మార్గంలో, భాగ్యవంతులమగునట్లుగా నడిపింపుము. నీవు అన్ని మార్గములను తెలిసినవాడవు. పాపము మమ్ములను చేరకుండునట్లుగా చేయుము. నీకు అనేక ప్రార్థనా నమస్కారములను సమర్పించుచున్నాము.


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(నిన్నటి వరకు ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి రుద్రాక్షలు గురించి తెలుసుకున్నాం. నేడు మరి కొన్ని రుద్రాక్షలు గురించి తెలుసుకుందాం.)*


*4.చతుర్ముఖి రుద్రాక్ష:~*


*చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు ముఖాలు కలిగి ఉంటుంది. చతుర్ముఖి రుద్రాక్ష ‘బ్రహ్మదేవుని’ స్వరూపం. చతుర్ముఖి రుద్రాక్షకి బుధుడు అధిపతి విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు రచయితలు, జ్యోతిష్యుల ధారణకు యోగ్యమైనది. విద్యార్ధులకు జ్ఞాపకశక్తిని పెంచును. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చర్మ వ్యాదిగ్రస్తులు చతుర్ముఖి రుద్రాక్షను నీటిలో వేసుకొని త్రాగిన మంచి ఫలితం కలుగును. మాటలు సరిగా రానివారు, మూగవారు, చెవిటివారు చతుర్ముకి ధరించిన ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్ధులు, వార్తాపత్రికల వ్యాపారులు, విద్యాలయాలవాళ్ళు, రచన, ఎక్కౌంట్స్ చేసేవారు చతుర్ముఖి ధరించాలి. ఈ రుద్రాక్షలను మణికట్టు వద్ద కూడ చేతికి ధరించ వచ్చును.*


*'చతుర్ముఖి' రుద్రాక్ష సకల పాపాలను హరించుటలో ప్రధానపాత్ర పోషిస్తుంది. బ్రహ్మదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, విద్యావంతులను చేస్తుంది. బుద్ధిబలాన్ని తేజస్సును పెంచి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనేలా చేస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు, చవితి తిధి రోజున జన్మించిన వారు, కన్య, మిధున రాశిలో జన్మించిన వారు, జాతకంలో బుధుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, మీనరాశిలో నీచలో ఉన్న, బుధుడు శత్రుక్షేత్రాలలో ఉన్న, బుధదశ, అంతర్దశలలో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది.*


*చతుర్ముఖి రుద్రాక్షను బుధవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి బుధహోరలో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన వారికి మానసిక రుగ్మతలను, పక్షవాతం, నాసికా సంబంధ, కంఠ సంబంద వ్యాదు లను రాకుండా చేస్తుంది. వాక్శుద్ది, తెలివితేటలు మొదలగు ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.*


*చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:- ``ఓం హ్రీం నమః''*


*5.పంచముఖి రుద్రాక్ష:~*


*పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాలు కలిగి ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష ‘పంచముఖేశ్వరుని’ యొక్క స్వరూపము. పంచముఖి రుద్రాక్షకు గురువు అధిపతి. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివ ప్రసాదం. తినకూడని పదార్ద భక్షణ దోషమును పోగోట్టును. 32 పంచముఖి రుద్రాక్షలను కంఠ మాలగా ధరించి ప్రతిరోజు స్నానం చేసిన మంచి ఆరోగ్యం కలుగుతుంది. చెట్టు నుండి తీసిన రుద్రాక్షలను పైన బెరడు తీసి నీటిలో వేసి ప్రతిరోజు పరగడుపున త్రాగుచున్నచో అనేక రుగ్మతల నుండి ప్రశాంతతనిచ్చును. పంచముఖి రుద్రాక్ష మాలతో జపం చేయుటకు సర్వశ్రేష్ఠమైనది.*


*పంచముఖి రుద్రాక్ష ధారణ వల్ల కామాతిశయం, అతి తిండివల్ల కలిగే అరిష్ఠాలురావు. గుండెజబ్బులున్న వారికి పంచముఖి రుద్రాక్ష ధారణ చాలా మంచిది. పాముకాటు, విష జంతువుల బారిన పడకుండా కాపాడు తుంది రక్షణ కలిగిస్తుంది. నిద్రలేమి పోతుంది. మానసిక ప్రశాంతత కలుగు తుంది. శత్రువులపై సులభంగా విజయం సాధించవచ్చును. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారు, పంచమి తిధి రోజు జన్మించినవారు, ధనస్సు, మీనరాశుల వారు, గురువు మకర రాశిలో నీచలో ఉన్న, గురుగ్రహం శత్రుక్షేత్రంలో ఉన్న, గురుమహాదశ, అంతర్ధశలలో పంచముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది.*


*పంచముఖి రుద్రాక్షను గురువారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి పంచముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధారణ చేసిన సుఖశాంతులు, సిరిసంపదలు, నమ్మక ద్రోహంవంటి వాళ్ళతో మోసపోకుండా ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.*


*పంచముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:- ``ఓం హ్రీం నమః''*


*ఓం నమః శివాయ।*


*(రేపు మరికొన్ని రుద్రాక్షలు గురించి తెలుసుకుందాం)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

పూజలో రాగిపాత్రలను

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూజలో రాగిపాత్రలను ఎందుకు వాడుతారు.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే వాడుతుంటారు. దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆదివరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది.*


*కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు. వైకుంఠధారి అంటే అతనికి ఎంతో భక్తి. ఒక ఆశ్రమంలో ‘రాగి’ రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు.*


*కొంత కాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు. తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు.*


*అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు. కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది. సుదర్శనచక్రం అతని శరీరాన్ని ముక్కలు చేస్తుంది. గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది.*


*శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్తకోటిని ఆదేశించాడు. అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగిపాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది.*


*మానవజీవితం బంధనాలమయంగా ఉంటుంది. అశాశ్వతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు. కానీ సకలా చరాచర జగత్తు ఆ స్వామి సృష్టేనని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చేయాలన్న జ్ఞానం ఉండదు.*


*నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరిని అనుగ్రహిస్తాడు అనేందుకు ఉదాహరణ గుడాకేశుని కథ. మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.*


*రాగిపాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం: భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

ఆంజనేయస్వామి

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *ఆంజనేయస్వామి*

   *పంచముఖాల ప్రాశస్త్యం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రి యాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు.*


*అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది.*


*స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహా వతారం, ఊ్వర్ధ ముఖాన హయ గ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి.*


*నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యా లనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధినీ కలుగ చేస్తాయి.*


*ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.*


*స్వామి పంచముఖుడు ఎందుకయ్యాడు:~*


*శ్రీరాముని రక్షించడానికి ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. అత్యంత భక్తిశ్రద్ధ లతో స్వామి కార్యం నెరవేర్చాడు ఆంజ నేయస్వామి. అంతేనా శ్రీరాముని కూడా మైరావణుని బారి నుంచి రామలక్ష్మణులను కూడా రక్షించాడు.*


*మైరావణ వృత్తాంతం:~*


*రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమా దం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలా ఉంచినా అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకుపోతాడు మైరావణుడు.*


*హనుమంతుని పయనం:~*


*రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.*


*మైరావణుని సంహారం:~*


*మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన హనుమ అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు.*


*మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్క సారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది.*


*దాంతో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊ్వర్ధ ముఖం… ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు.*


*పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి… మైరావణుని అంతం చేస్తాడు.*


ఆ స్వామే పంచముఖ ఆంజనేయుడు.


*ఓం నమో శ్రీ ఆంజనేయ॥*

*జై శ్రీ రామ్॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*గజేంద్ర మోక్షం లో అంతరార్ధం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్న వాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగ లాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.*


*జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్న మానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియ భోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!*


*తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం.*


*గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు.*


*గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి.*


*జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి.*


*గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు.*


*ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనే జ్ఞానముతో అజ్ఞాన అహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది. జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి.*


*'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం.*


*ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.*


*ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై*

*యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం*

*బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా*

*డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్।*


*భావం : ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో! ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో! ఎవడు ఆది మధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో! ఎవడు తనకు తాను పుట్టినవాడో! ఈ ప్రపంచానికంతటికీ అటువంటి ప్రభువైనవానిని శరణు కోరుతున్నాను.*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(నిన్నటి రోజున ఏకముఖి రుద్రాక్ష గురించి తెలుసుకున్నాం. నేడు మరి కొన్ని రుద్రాక్షలు గురించి తెలుసుకుందాం.)*


*2. ద్విముఖి రుద్రాక్ష:~*


*ద్విముఖి రుద్రాక్షకు రెండు ముఖాలు ఉంటాయి. ద్విముఖి రుద్రాక్ష ‘అర్ధనారీశ్వర’ తత్వానికి సంకేతం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్విముఖి రుద్రాక్ష చంద్రగ్రహ ప్రతీక.*


*కామాన్నిజయించటానికి, శాంతికి, తత్వ విజ్ఞానానికి, సర్వపాప హరణానికి, కుండలిని శక్తి పెంపొందించుటకు ఉపయోగపడుతుంది. ద్విముఖి రుధ్రాక్ష బధ్రాక్ష రూపం లోను, రుధ్రాక్ష రూపంలోను దొరుకుతుంది. ద్విముఖి రుధ్రాక్ష ధరిస్తే గోహత్యాపాతకాలు నశిస్తాయి. వ్యాపారాలలో మెలుకువలు, క్రయవిక్రయాలలో అనుభవాన్ని ఇస్తుంది. మతిమరుపు ఉన్న వారు తప్పకుండా ద్విముఖి రుధ్రాక్షని ధరించాలి. కళలు, సాహిత్యం, కవిత్వం, సంగీతం, ఆటపాటలయందు ఆసక్తిని కలిగిస్తుంది. నిర్మలమైన మనస్సును, మంచి ఆలోచనా విధానాన్ని కలిగిస్తుంది. వశీకరణ శక్తిని కలిగిస్తుంది.*              


*వాటర్ బిజినెస్ వాళ్ళు, గృహనిర్మాణ పనులు చేసేవారు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవారు, డ్యాం నిర్మాణ పనులు చేసేవారు, హోటల్ మేనేజ్‌ మెంట్ చేసేవారు, వ్యవసాయం చేసేవారు ద్విముఖి రుధ్రాక్షని తప్పక ధరించాలి.*


*జాతకంలో చంద్రుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న వృశ్చికంలో నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న మహాదశ అంతర్దశలలో ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది.*


*రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాల వారు, విదియ తిధిలో జన్మించినవారు, కర్కాటకరాశిలో జన్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. ద్విముఖి రుద్రాక్షను సోమవారంరోజు శివాలయంలో అభిషేకం చేయించి ద్విముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో మెడలో ధరించాలి.*


*ద్విముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-ఓం నమః।*


*3. త్రిముఖి రుద్రాక్ష:~*


*త్రిముఖి రుద్రాక్షకు మూడు ధారలు (ముఖాలు) ఉంటాయి. త్రిముఖి రుద్రాక్ష ‘అగ్నిదేవుని’ ప్రతిరూపం.*


*ఆరోగ్యానికి, అభ్యుదయానికి ఈ రుద్రాక్ష బాగా ఉపయోగ పడుతుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ చేసేవారు, వృత్తి, వ్యాపారం చేసేవారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది.*


*అగ్నిదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష వివాదాలను దూరం చేయడమే కాకుండా, దీర్ఘాయువుని ఇస్తుంది.*


*మూడు ముఖాలు కల్గిన రుద్రాక్షకి కుజుడు అధిపతి. ముఖ్యముగా స్త్రీలు మంగళసూత్రమునందు ఎడమ వైపుకు ధరించిన పవిత్రత, మాంగళ్య రక్షణ కల్గును. అగ్ని పురాణమున స్త్రీలు రుద్రాక్షలు ధరించుట గూర్చి ఈ రుద్రాక్ష ధారణ మిక్కిలి శ్రేష్టము అని, సౌభాగ్యం కలిగించునని పేర్కొనటం జరిగింది. అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని “అగ్ని రుద్రాక్ష” అనికూడ అంటారు.*


*కుజగ్రహదోషాలు ఉన్నవారు, వైవాహికజీవితంలో సమస్యలు ఉన్నవారు త్రిముఖి రుద్రాక్ష ధారణ సర్వశ్రేష్ఠం.*


*జాతకంలో కుజుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, నీచక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న కుజదశ, అంతర్దశ యందు, తదియ తిధి రోజున జన్మించిన వారు, కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్ర, ధనిష్ఠ లందు, మేష, వృశ్చిక  రాశిలందు జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం.*


*త్రిముఖి రుద్రాక్షను మంగళవారం రోజు గాని, సోమవారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించి కుజ హోరాలో త్రిముఖి ధారణ మంత్రం పఠిస్తూ మెడలో ధరించిన  వారికి చెవులు, చేతులు, భుజాలు మొదలగు అవయవాలకు సంబందించిన దోషాలను తొలగించి రక్తహీనత కలగకుండా ఎర్ర రక్తకణాల సమతుల్యతను కలిగిస్తాయి. ప్లేగు, ఆటలమ్మ, మశూచి వంటి భయంకరమైన వ్యాదుల నుండి రక్షణ పొందవచ్చును.*


*త్రిముఖి రుద్రాక్ష ధారణ మంత్రం :-“ఓం క్లీం నమః”।*


*ఓం నమః శివాయ।*


*(రేపు మరికొన్ని రుద్రాక్షలు గురించి తెలుసుకుందాం)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

శ్రీ రామ రామ రామ నామ మహిమ

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రీ రామ రామ రామ నామ మహిమ*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్రీ రామ జయరామ జయజయ రామ।*


*కలియుగంలో పాపనాశిని రామనామమే! మనకున్న నాలుగు యుగాలలో..  కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరంలో ఆరాధనతోనూ, కలియుగంలో భగవన్నామ స్మరణతోనూ పాపాలను పోగొట్టుకోవచ్చని పురాణాలన్నీ వివరించి చెబుతున్నాయి.*


*ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో రామనామ స్మరణ చేయడంవల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చని పెద్దలందరూ వివరించి చెబుతున్నారు.*


*రామ నామానికి ఎందుకంత విశిష్టత చేకూరిందని చెప్పటానికి అనేకానేక ఉదాహరణలున్నాయి*


*అలాంటి వాటిలో మొదటి ఉదాహరణ రెండు పవిత్ర మంత్రాలలోని రెండు బీజాక్షరాల కలయిక అని చెప్పేదే.*


*ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరీ మంత్రం. నమశ్శివాయ అనేది పంచాక్షరీ మంత్రం. అష్టాక్షరిలోని ‘రా’ పంచాక్షరిలోని ‘మ’ పక్కపక్కన చేరి ‘రామ’ అనే అమృత నామంగా అయింది.*


*రెండు గొప్పగొప్ప మంత్రాలను ఏకకాలంలో జపించినంతటి పుణ్యఫలం రామనామ జపానికి ఈ కారణంచేతనే కలుగుతుంది.* 


*‘రామ’ శబ్దాన్ని విడిగా చూస్తే ర+ఆ+మ అనే మూడు బీజాక్షరాల కలయికగా కనిపిస్తుంది. ఇందులో ‘ర’ అగ్నిబీజాక్షరం,  ‘ఆ’ సూర్యబీజాక్షరం, ‘మ’ చంద్రబీజాక్షరం.*


*అగ్ని బీజాక్షరమైన ‘ర’ కర్మలను నశింపచేసి మోక్షాన్ని ఇస్తుంది. సూర్య బీజాక్షరమైన ‘ఆ’ మోహాంధకారాలను పోగొడుతుంది. చంద్రబీజాక్షరమైన ‘మ’ తాపత్రయాలను హరిస్తుంది. రామనామశక్తి ఇంత గొప్పది. అలాగే ర, ఆ, మ మూడు త్రిమూర్తులకు ప్రతీకలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆ త్రిమూర్తులు. అలా చూస్తే రామనామ జపం సృష్టి, స్థితి, లయ కారకులు ముగ్గురి కృపను పొందటానికి వీలుంటుంది.*


*జీవాత్మ, పరమాత్మల ఐక్యానికి ప్రతీక ‘రామ’ అనే రెండక్షరాలు. జీవాత్మకు, పరమాత్మకు కూడా ప్రతీకలని, జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని ప్రకటించే శక్తి రామనామానికి అందుకే ఉదంటారు పెద్దలు.*


.*‘రామ’ నామాన్ని జపించేటప్పుడు ‘రా’ అనే పలికే సమయంలో అప్పటిదాకా దేహంలో ఉన్న పాపాలన్నీ బయటకుపోతాయి. ‘మ’ అని అన్నప్పుడు నోరు మూతపడి ఇక పాపాలేనీ లోపలకు పాకుండా ఉంటాయి.*


*ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు రామనామస్మరణ విషయంలో లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి.*


*రామ నామంతో పాటు శ్రీరామజయరామ జయజయరామ అనే మరో అద్భుతమైన దివ్యమంత్రం ఉంది.*


*ఈ మంత్రంలోని శ్రీరామ అనేది శ్రీరాముడిని ఆవాహన చేసేందుకు,*


*జయరామ అనేది రాముడిని స్తుతించేందుకు,*


*జయజయరామ అనేది రాముడి విషయంలో సంపూర్ణ సమర్పణ భావాన్ని ప్రకటించేందుకు ఉపకరిస్తాయి.*


*ఓ రామా నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణు కోరుతున్నాను. నన్ను కరుణించు అనే అర్థాన్ని శ్రీరామ జయరామ జయజయరామ ప్రతిపాదిస్తుంది.*


*తనను శరణన్న వారిని శీఘ్రంగా ఆదుకోవటం ఆ రామప్రభువు తొలి కర్తవ్యంగా భావిస్తాడు. అందుకే ఈ మంత్ర జపం చేసిన ఎందరెందరో మహనీయులకు రామదర్శనం కలిగిందని లోకంలో ఎందరో మహానుభావుల చరిత్రలు వివరిస్తున్నాయి.*


*శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రం ఆవిర్భావం గురించి ఓ ప్రధాన ఇతివృత్తం రామభక్తులు ఉన్నచోట వినిపిస్తుంటుంది.*


*రావణ వధానంతరం రాముడు అయోధ్యను రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్న రోజులవి. కష్టాలను పోగొట్టేందుకు తగిన మంత్రాన్ని ఆవిర్భవింపచేసే దిశగా ఆలోచించసాగాడు. అప్పుడాయనకు ఓ ఆలోచన తట్టింది.*


*ఓ రోజున శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువులో శ్రీరాముడి గురువు విశ్వామిత్రుడు, రాముడి బంటు హనుమంతుడు కూడా ఉన్నారు.*

 

*నారదుడు కొలువు ప్రారంభానికి ముందుగా హనుమ దగ్గరకు వెళ్లి కొలువు ప్రారంభంలో అందరికీ నమస్కరించే సమయంలో ఒక్క విశ్వామిత్రుడికి తప్ప అందరికీ నమస్కరించమని చెప్పాడు. దేవర్షి చెబుతున్నాడు కదాని హనుమ అలాగే చేశాడు.*


*ఆ తర్వాత నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి అందరినీ గౌరవించిన హనుమ నిన్ను గౌరవించలేదు కనుక రాముడికి చెప్పి శిక్షపడేలా చేయమని అన్నాడు.*


*విశ్వామిత్రుడు నారదుడి మాయమాటల్లో పడి రాముడికి హనుమ ప్రవర్తన బాగాలేదని మరుసటి రోజు సాయంత్రంలోపల మరణదండన విధించమన్నాడు.*


*అలా ఆవిర్భవించిందీ మంత్రం. రాముడు ఆలోచనలో పడ్డాడు. ఆజ్ఞాపిస్తున్నది తన గురువు.తాను దండించాల్సింది తన భక్తుడిని. ఎలా అని అనుకొంటూ ఆ రోజుకు సభ చాలించాడు. హనుమ సభ ముగియగానే నారదుడి దగ్గరకొచ్చి  ఆ సంకటస్థితి నుంచి బయటపడేలా చేయమన్నాడు.*


*అప్పుడు నారదుడు మరుసటి రోజు సూర్యోదయం కంటే ముందు లేచి సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రాన్ని జపించు, అన్ని కష్టాలు అవే తొలగిపోతాయి అని చెప్పాడు. హనుమ అలాగే చేశాడు.*


*మరునాడు గురువు ఆజ్ఞ పాటించేందుకు రాముడు సంసిద్ధుడై హనుమ మీదకు ఎన్నెన్నో బాణాలను సంధించాడు.*


*నిరంతరం శ్రీరామ జయరామ జయజయరామ అని నామజపం చేస్తున్న హనుమను ఆ బాణాలేవీ తాకలేకపోయాయి.*


*వెంటనే నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి తాను భగవంతుడికన్నా భగవన్నామమే గొప్పదని నిరూపించేందుకు, మానవాళికి పుణ్యాన్ని ప్రసాదించే మహామంత్రాన్ని ఆవిర్భవింపచేసేందుకు తానే అలా ఓ చిన్న నాటకాన్ని ఆడానని చెప్పాడు.*


*వెంటనే రాముడి దగ్గరకు వెళ్లి హనుమ మీదకు బాణాలను సంధించవద్దని చెప్పమని కోరాడు. విశ్వామిత్రుడు అలానే చేశాడు. పరిస్థితంతా ప్రశాంతమైంది. రాముడు, విశ్వామిత్రుడు తదితరులంతా హనుమను ఆశీర్వదించారు.*


*అలా శ్రీరామజయరామ జయజయరామ అనే గొప్ప మంత్రం ఆవిర్భవించిందని పెద్దలు, రామతత్త్వ ప్రచారకులు, రామ ఉపాసకులు వివరిస్తున్నారు.*


*జై శ్రీ రామ్।*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️