23, అక్టోబర్ 2024, బుధవారం

54. " మహా దర్శనము

 54. " మహా దర్శనము " --యాభై నాలుగవ భాగము --పారాయణము


54. -యాభై నాలుగవ భాగము--  పారాయణము



          ఉద్ధాలకుల ఆశ్రమమిప్పుడు యాజ్ఞవల్క్యుల వలన అనాథ గా మిగలక , సనాథమయినది . కులపతులను భగవానులు అని సంబోధించవలెను అని ఎవరూ ఆజ్ఞనివ్వలేదు , అయినా , ఆశ్రమ వాసులందరూ భగవానులనే సంబోధిస్తారు. వారుకూడా కులపతిహోదా తమకు మొదటినుండీ ఉన్నట్టే , అలవాటైనట్టే నడుచుకున్నారు. వారి ఆశ్రమములో ఒక ఆశ్చర్యమేమనిన, భగవతి వారు. వయోమానము చేత చూచునట్లైతే , భగవతి కాత్యాయని  అక్కడున్న అనేక పాత శిష్యులకన్నా చిన్నవారు . కానీ ఆమె వద్ద నిలుచొని కొంచముసేపు మాట్లాడితే వారిలో అనిర్వచనీయమైన వృద్ధత్వమును చూచి తల పంకించుతారు. ఆమె వయోవృద్ధురాలు కాదు , జ్ఞాన వృద్ధురాలు కాదు; జరాది వృద్ధురాలు కాదు . ఇంకా పదహారేళ్ళ షోడశి. బాలచంద్రునివలె పెరుగుతున్న యవ్వనము. అంగాంగములూ యౌవనవతి అనుదానిని ఉద్ఘోషిస్తున్నాయి. అయినా ఆమెలో అందరూ తమకన్నా ఎక్కువగా ఏదో ఒకదానిని చూచి తల ఊపువారు. అది పతిసేవా పరాయణత్వము యొక్క ఫలమని ఎవరికీ తెలియదు. దానినెవరూ చూడలేరు. 


          యాజ్ఞవల్క్య దంపతులు ఏ విధమైన ఉద్వేగమూ లేకనే ఆశ్రమపు కార్యములను నిర్వహించువారు. ఆశ్రమవాసులు మొదలుకొని , ఒకటిరెండు దినములు అతిథులుగా వచ్చిన వారు, పెద్దవారు , గొప్పవారు , చిన్నవారు అందరూ , ’ వెళ్ళిపోయిన దంపతులు ఈ వచ్చిన దంపతులను ఆవహించి ఉండవలెను ’ అంటారు. 


          విదేహరాజైన జనకుడు సందర్శనార్థమై ఆశ్రమమునకు వస్తాడని సమాచారము వచ్చింది . రాజు సపరివారముగా ఆశ్రమపు అతిథిగా వచ్చుట అదే మొదటిసారి. ఆశ్రమవాసులందరికీ అదొక పరమ సంతోషమైన సమాచారము. కొందరు ఉత్సాహముతో కొంచము ముందుకు వెళ్ళి , " ఇంకేమి లేవయ్యా, మన ఆశ్రమము ఒక యాత్రా క్షేత్రమై పోవును. విద్యాభిమానులందరూ యాజ్ఞవల్క్యాశ్రమమునకు వెళ్ళకుంటే వారికి అదొక కళంకము అనిపించుకుంటుంది . " అంటారు. 


          మహారాజుల రాక గురించి కొన్ని ఏర్పాట్లు జరిగినవి. వారికని భవ్యమైన మందిరమొకటి ఏర్పడింది . దానికి ఎడమపక్కగా రాజ పరివారము వారికి వేరే వేరే మందిరములు. కుడిపక్కగా విద్వాంసుల వసతులు. దానికి వెనుక పక్క రాజకాంతలకు అంతఃపురములు. చుట్టూ కాపలా సేనలకు చిన్న చిన్న వసతులు. సమీపములోనే ఒక గోశాల , పాక గృహములు. మహారాజువారూ , అంతఃపుర కాంతలూ , రాజపరివారమూ , విద్వాంసులూ , ఆశ్రమవాసులూ , కులపతులూ కూర్చొనుటకు అనుకూలమైన , ఎత్తైన , విశాలమైన అనావృత మంటపమొకటి . వారు వచ్చినపుడు వారికి ఎదురుపడి ఆహ్వానించు వారెవరు ,  వారిలో పూర్ణ కుంభము తీసుకొని వెళ్ళువారు ఎవరు , లాజ , అక్షతలను వేయువారెవరు , పుష్పములను చల్లువారెవరు , అనునవెల్లా నిర్ణయింపబడినవి. తన వెంట మైత్రేయి ఉండవలెనని , కాత్యాయని తాను తీసుకొని వెళ్ళ వలసిన పూర్ణ కుంభమును వేరొక ముత్తైదువకు అప్పజెప్పింది. 


          మహారాజులు వచ్చినారు. పల్లకీలో వచ్చిన వారి వెంట పల్లకీలలోనూ , మేనా లలోను విద్వాంసులు వచ్చినారు. రథములు- బండ్లు వంటి వాహనములమీద , ఏనుగుల మీద , రాజపరివారమూ , రాజ కాంతలూ వచ్చినారు. పూర్ణకుంభములతోను వేద ఘోషలతోను వారిని ఎదురుకొని , భగవానులూ , భగవతీ , మైత్రేయీ పిలుచుకొని వచ్చి వారి వారి స్థానములలో వారిని దింపినారు . భార్గవులనూ , దేవి గార్గినీ , వెనుకటి దినమే వచ్చిన దేవరాతులు వదలక , తమ ఇంటికి పిలుచుకొని వచ్చినారు . మరుసటి దినము నుండీ వేద బ్రాహ్మణోపనిషత్తుల పారాయణము అని నిర్ణయించినారు . 


          యథా కాలములో వేద పారాయణము ఆరంభమయినది . పూర్వాహ్ణము , అపరాహ్ణము రెండింటిలోనూ పారాయణము నడచినది . వృద్ధ శిష్యుడు వేదిక పైన కూర్చొనును. అతనికి కుడివైపు కులపతులూ , ఆశ్రమవాసులూ భగవతీ ఆలంబినీ తోపాటు మైత్రేయీ , ఆశ్రమ స్త్రీలూ కూర్చుంటారు . ఎడమవైపు మహారాజులూ , విద్వాంసులూ , రాజపరివారమూ , రాజ కాంతలూ కూర్చుంటారు. సభను చూచినవారికి అది ఒక బ్రహ్మ సభ యనిపించును. వారిలో ఇద్దరు ముగ్గురిని వదలితే , మిగిలిన వారందరూ మొదటి దినము సభాదర్శనపు ఆనందములో విస్మితులైపోయినారు . భార్గవులూ దేవరాతులూ భగవానుల కుడిపక్క ఆసీనులైనారు. భార్గవులకు , తాను ఉపనిషత్తును వినగలుగు సుదినము వచ్చినదని ఆనందోద్రేకములతో ముఖమంతా ఎర్ర తామర వలె వికసించినది. 


          వేదపారాయణము జరుగుతున్నపుడు విద్వాంసులు మంత్రముగ్ధులై పాములవలె తలలాడిస్తున్నారు. ఇదివరకూ ఉన్న వేదములో  మంత్ర బ్రాహ్మణములు కలసిపోయినాయి. కొత్త వేదములో అది లేదు. అందువలన వేదపారాయణము ముగియగనే విద్వత్సభ దానిని ఆమోదించి కృష్ణ యజుర్వేదము , శుక్ల యజుర్వేదము అని పేరు పెట్టుటకు మహారాజుకు సలహా ఇచ్చినది. దానిని భగవానులకు విజ్ఞాపన చేసి సరియేనా అని అడుగగా , వారు , " ఇది వివరణాత్మకమైన నామధేయమైనది. అయితే అది వచ్చినది వాజిరూపుడైన ఆదిత్యుని వలన అనునది అందరికీ జ్ఞాపకము రావలసిన అవసరముంది. కాబట్టి ’ వాజిసనేయ సంహితా ’ అన్న పేరు సమంజసముగా ఉంటుంది  " అన్నారు . మహారాజులు రెండింటినీ ఆమోదించినారు . అప్పటినుండీ నూతన వేదము శుక్ల యజుర్వేదము , వాజిసనేయ సంహితా అను రెండు పేర్లతో ప్రసిద్ధమైనది. 


           సంహితోపనిషత్తులను అప్పుడే ఆరంభించుటయా అని ఒక చిన్న వాదము జరిగినది. మహారాజు గార్గి ముఖము చూచినారు. ఆమె విధిలేక లేచి నిలబడింది. విద్వాంసులకు నమస్కారము చేసి అన్నది : " ఇక్కడి ఆశ్రమవాసులు కాక, బహుశః ఆ ఉపనిషత్తును చూచినదానిని నేనొక్కదానినే అని తోచుచున్నది. అందులో ఉన్న మంత్రముల సంఖ్య మరీ చిన్నది ( సంహిత యొక్క నలభైయవ అధ్యాయమైన ఈ ఉపనిషత్తులలో ఉన్నది కేవలము పదిహేడు మంత్రములు. ఇప్పుడు ప్రచారములో ఉన్న ఉపనిషత్తులలో ఉన్న మంత్రములూ , అక్కడున్న మంత్రములూ వేర్వేరు క్రమములలో ఉన్నవి అన్నది గమనించవలెను ). అయితే అర్థములో మాత్రము అది చాలా విస్తారమైనది. ప్రశ్న , ఐతరేయ , కేన , తైత్తిరీయాది ఉపనిషత్తులు పూర్ణముగా అర్థమై , ఉపనిషద్ధర్మములన్నీ కరతలామలకములైన వారికి మాత్రమే ఈ ఉపనిషత్తు అర్థము కావచ్చు. కాబట్టి ఇప్పుడే దీని పారాయణము జరగనీ. మరలా ఇంకొకసారి కూడా జరగవలెను. ఇది నా అభిప్రాయము. " 


         అదేవిధముగా తీర్మానమయినది. దానిని విన్న విద్వాంసులు, " దేవి గార్గి చెప్పినది సరిగా ఉన్నది " అన్న సిద్ధాంతమునకు వచ్చినారు. ఆ ఉపనిషత్తు అంతా అయిన తరువాత మరలా ఒకసారి పారాయణము కావలెనని తీర్మానించినారు. 


         బ్రాహ్మణ పారాయణము ఆరంభమయినది . మొదటి ఏడు కాండములు ముగిసినాయి. అగ్ని రహస్యము వచ్చినది. అప్పుడు మహారాజులు భగవానుల ముఖమును చూచి నవ్వినారు. అగ్ని రహస్య పారాయణమైన తర్వాత అన్నారు , " భగవానులు యజ్ఞేశ్వరుని సంపూర్ణముగా తెలుసుకున్నారు అనుటకు ఇది ఒక నిదర్శనము. మేము , వారు వీరు చెప్పినది విన్నంత మాత్రమునకే ఏదో మహా తెలుసుకున్నట్టు విర్రవీగుతాము. అటువంటప్పుడు , ఇంత తెలిసియుండి .....ఇంకా సరిగ్గా చెప్పవలెనంటే , సర్వజ్ఞులైననూ భగవానులు అంతంతగా ఉన్నారు అన్న తరువాత , వారి జ్ఞానమునకు వెలకట్టువారు ఉన్నారా అనిపిస్తుంది " అని పరి పరి విధములుగా ప్రశంసించినారు. భగవానులు పెదవి కదపలేదు. 


          బ్రాహ్మణ పారాయణము ముగిసింది. అశ్వమేధ కాండము నుంచీ ఉపనిషత్తు ఆరంభమయినది . అప్పుడు భగవానులు మాట్లాడినారు . "  దేవి గార్గి వెనుక అడిగిన ఒక ప్రశ్నకు ఇక్కడ ఆదిత్య భగవానుడు ఉత్తరము నిచ్చినాడు. వారు కర్మ బ్రహ్మ సముఛ్చయ వాదమే సిద్ధాంతమైతే కర్మాధికారము లేని వారి ఉద్ధారము ఎలాగు ?  అన్నారు. అటువంటి వారు ఒక యజ్ఞమును గురించి తత్ సంబంధిత మంత్రములనూ బ్రాహ్మణమునూ పారాయణము చేస్తే తత్ఫలము దొరకునని ఆదిత్య దేవుని ఉత్తరము. అది మాత్రమే కాక , ఆదిత్య దేవుని అనుమతితో ఇంకొక మాట చెపుతాను. చాతుర్వర్ణ్యమూ చేరి ఒక సమాజము. గుణకర్మల వలన , గుణకర్మల కోసము విభాగమగుటను గమనింపకయే , కాలవశమున ప్రతియొక్కరూ తాము తాము ప్రత్యేకమైనట్టు వర్తించినారు . ఇది సరి కాదు. దానికోసము ఉపలక్షణముగా రాజన్యుల కథలు రెండింటిని చేర్చి ఈ ఉపనిషత్తును పూర్తి చేయ వలసినదంట. కాబట్టి ఇది అసంపూర్ణముగానే ఇంకా మిగిలింది. " అన్నారు. 


          ఉపనిషద్భాగమునకు భగవానులు విద్వాంసుల కోరిక మేరకు తామే అర్థము చెప్పినారు. భగవానుల వచో వైఖరియే అట్లున్నదో , లేక తపస్వి మాటలు కాబట్టి వాటికి విచిత్రమైన శక్తి వచ్చినదో , లేక విద్వాంసుల హృదయములు పక్వమైనవో గానీ మొత్తానికి ఆ అర్థమును అందరూ గ్రహించి , భగవానులు కృతకృత్యులని ఒప్పుకున్ననూ , భార్గవ దేవరాతులు మరియొకసారి ఉపనిషత్తును వినవలెను అనుకున్నారు. 


          మరుసటి దినము జనక రాజు భగవానుల వద్ద వినయముతో విన్నవించుకున్నాడు, " ఎప్పుడైనా ఒకసారి భగవానులు మా రాజ భవనమునకూ దయచేసి మమ్ములను అనుగ్రహించవలెను. వెనుక మాకు ఇచ్చిన వరమును , అనగా , కామప్రశ్నుడను కావచ్చును అన్న వరమును మరవకూడదు. " అన్నాడు. భగవానులు నవ్వుచూ సమయోచితముగా మాటలాడి ముగించినారు. 


         ఆశ్రమవాసులందరికీ యథోచితముగా , ఉదారముగా మర్యాదలను వితరణ చేసి భగవానులవద్ద వీడుకోలు పొంది మహారాజు వెనుకకు తిరిగినాడు. ఆదినము రాత్రి ఇంటి పనులనన్నిటినీ ముగించుకొని కాత్యాయని శయనించుటకు వెళ్ళవలెను. అప్పుడు మైత్రేయి వచ్చినది. 


అక్కను మాట్లాడించు చెల్లెలి వలె స్నేహముతో కాత్యాయని మాట్లాడింది. " ఏమక్కా , వచ్చినావు ? "


మైత్రేయి, " నేను నీతో ఒక విషయమును గురించి మాట్లాడవలెనని వచ్చినాను. నువ్వు సావధానముగా వింటావా ? " 


" నువ్వు నాకన్నా పెద్దదానివి. నువ్వు చెప్పినది వినుట నా ధర్మము. "


          " చెల్లీ , నువ్వు నాకు ఏదీ తక్కువ చేయలేదు. అన్నిటిలోనూ మొదట నేను , ఆ తరువాత నువ్వు అన్నట్టు నడచుకుంటున్నావు. కానీ ఇది మంచిది కాదు. ఈ ఆశ్రమానికి అధిరాజ్ఞివి నువ్వు. నావలన నీ అధికారమునకు లోపము కాకూడదు. అందుకని నేను ఇక్కడినుండీ అయినంత తొందరగా వెళ్ళిపోవలె ననుకున్నాను. "


        " అలాగ అనుకొనుటకు ఏమి కారణము వచ్చింది ? నాకు తెలియకుండా నేను నీతో యేమైనా అవినయముగా నడచుకున్నానా ? "


          " నేనప్పుడే అన్నాను కదా , నువ్వు ఆవగింజ కాదు , ఆవగింజ మొలకంత కూడా అవినయమును చూపలేదు. కానీ నేనిక్కడుంటే నీ అధికార వ్యాప్తి తగ్గుతుంది. నువ్వు భగవానుల పత్నివి. భగవతివి. కానీ నువ్వు ప్రవర్తించునది ఎలాగుందంటే  , నేను భగవతిని , నువ్వు నా ఆజ్ఞాధారకురాలివి అన్నట్లుంది. ఈ అధికార హానిని నేనెలాగ ప్రోత్సహించేది ? "


         కాత్యాయని కూర్చున్నది . మైత్రేయి చేయి పట్టి లాగి , ’ కూర్చో ’ అని కూర్చోబెట్టుకున్నది. విశ్వాసముతో అన్నది , " నీది విచిత్రమైన మనోరోగము. మొదట నీకు మానుండీ ఏమైనా తప్పు జరిగిందా అని భయపడినాను. నువ్వు చెప్పినదంతా విన్న తరువాత నువ్వు కారణము లేకుండానే వ్యథ పడుచున్నావు అనిపించినది. సరే , నీమాటే వింటాను , ఇప్పుడు నువ్వు ఏమి చేయాలనుకున్నావు ? " 


" నేను ఇంకెక్కడికైనా వెళ్ళవలె ననుకుంటున్నాను "


" ఎక్కడికి ? "


         " అదే ఇంకా తెలీదు. చూడు , నేను పెరిగిన యువతిని. పెళ్ళికాని దాన్ని. అదీకాక , ఇష్టము వచ్చినట్లు నడచుకొను దానిని. ఇలాగ లోకపు దృష్టిలో ఉన్న ఆడది ఎక్కడున్నా అపయశస్సు తప్పదు ఇక్కడ కాక, పుట్టింటికి వెళ్ళినాననుకుందాము , అక్కడ కూడా అపయశస్సు తప్పలేదు. కాబట్టి నావలెనే ఉన్న గార్గి వద్దకు పోవలెనని ఒక ఆలోచన. "


" అలాగయితే ఇక్కడికి గార్గి వచ్చినపుడు అడిగినావా ? "


         " ఔను  , అడిగినాను. ఆమె , ఉంటే ఇక్కడ ఉండు. భగవానులు మనందరికీ పెద్దవారు. వారి ఆశ్రయము వదలుట అయితే ఇంకెక్కడికీ వెళ్ళ వద్దు , నా దగ్గరే వచ్చి ఉండు అన్నారు " 


" సరే , నీకు భగవానులు కావాలా వద్దా ? " 


" నువ్వూ ? నీ తుంపు మాటలూ ? సరే , అదుండనీ. నాకు కావలసినది మార్గదర్శియగు సద్గురువు. "


" భగవానులు అటువంటి సద్గురువులు కాగలరు అన్న నమ్మకము నీకుందా ? " 


       " నాకు సంపూర్ణముగా ఉంది . అంతే కాదు , అటువంటి వారు గురువుగా లభించవలెనంటే అదృష్టము ఉండవలెను. కానీ వయో ధర్మమును చూచు జగత్తు తనకు తోచినట్లు మాట్లాడుతుంది. " 


        " అక్కా , జగత్తు వద్దు అని బయలుదేరిన దానివి నీకు జగత్తు అలాగంటుంది , ఇలాగంటుంది అన్న లక్ష్యము ఎందుకు ? " 


         మైత్రేయి తన తప్పు ఒప్పుకొని అన్నది " అపయశస్సు అనునది ఎప్పటికీ ఒకరిని గురించి మాత్రమే రాదు. అసంగతములైన రెండు పదార్థములను గురించి వెడలునదే అపయశస్సు. దానికేమంటావు ? " 


         భగవతి, పులి వచ్చి మీద పడినట్టు మైత్రేయి పైపడి అన్నది. " అక్కా , నువ్వింత మెతకదానివని నేననుకోలేదు. నేనిప్పుడు చెపుతాను విను. ఊరికే వెయ్యి మాటలాడి నిన్ను నొప్పించడము నాకు ఇష్టము లేదు. అందుకని పోకలు కత్తరించినట్లు చెపుతాను విను , నువ్వు ఇక్కడే భగవానుల ఆశ్రయములో ఉండు. వారికి తమ వేదాంత విచారములను వినువారు , అందులో పాలు పంచుకొనెడి వారు ఒకరు కావలెను. నాకు ఆ అదృష్టము లేదు. కాబట్టి వారి కోరికను నువ్వు నెరవేర్చు. అపయశస్సు అన్నావు. అది రాకుండా నువ్వు వారి సహధర్మిణివి కా. నువ్వో అంటావా ? నాకన్నా వయసులోను , జ్ఞానము లోనూ , ఆలోచన లోనూ పెద్దదానివైన నువ్వు అక్క. నేను చెల్లెలు. ఇద్దరమూ ఆ మహానుభావుడిని సేవించి కృతార్థులమవుదాము. మనము సవతులము కాదు, అక్క చెళ్ళెళ్ళము, తెలిసిందా ? "


         మైత్రేయి అనిరీక్షితముగా వచ్చిన ఈ ఔదార్యమును చూచి మూగబోయింది. కాత్యాయని కొనసాగించింది, " అక్కా, నీకు భగవానులను ఒప్పించే రహస్యము ఒకటుంది , అది చెపుతాను విను . వారు అగ్నిహోత్రము ముగించి వచ్చి కొంచము సేపు కూర్చుంటారు. అప్పుడు వెళ్ళు. నమస్కారము చేసి , రక్షణ , మార్గదర్శనము రెండింటినీ వరముగా కోరుకో. అప్పుడు వారు లేదనకుండా నీకు వరమునిస్తారు. అప్పుడు నీ శంక , సందేహమూ అన్నీ నివారణయగును. " 


మైత్రేయి ఏమీ అనలేదు. కాత్యాయనిని హత్తుకున్నది. ఇద్దరి కనులూ చెమర్చినాయి. 

Janardhana Sharma

కామెంట్‌లు లేవు: