23, అక్టోబర్ 2024, బుధవారం

*1 - భజగోవిందం

 *1 - భజగోవిందం*

 🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑   


      *ఉపోద్ఘాతం*


శ్రీ మద్భగవత్పాద ఆచార్య శంకరులు మహా మేధావి, అద్వైత సిద్ధాంతులలో గొప్ప ప్రసిద్ధి గలవాడు. ఆయన హిందూమత సంబంధమైన ఆవేశంచేత ప్రేరితుడైన యోధుడు. మన దేశమందవతరించిన మత ప్రచారకులందరిలో సాటిలేని మేటి. ఆరోజులలో అలాంటి శక్తివంతుడైన పురోగామి దేశానికి ఎంతో అవసరమై యుండును. ఎందుకనగా హిందూమతము ఆ కాలములో భిన్న భిన్న శాఖలయి వుండెడిది. బౌద్ధ సిద్ధాంతములోని సునాయాసమై కనబడే బోధల ఎఱలలోబడి మతస్థుల బుద్ధి శీర్ణమ యి పోతూండేది. దాని ఫలితంగా హిందూ సమాజం పలుశాఖలై, తెగలై, ఒక శాఖకు మరొక దానితో పొత్తు కుదరక, ఎవరి సిద్ధాంతమును వారే ప్రతిపాదించి, సిద్ధాంతీ కరించు చుంటిమని భ్రమపడుతూ అంతమనేదిలేని తర్కంలో పడి కొట్టుకుంటూ వుండేవారు. ప్రతి పండితుడు కూడ, శిష్యులను చేరదీసి, ప్రత్యేకమయిన సిద్ధాంత మొకటి తయారుచేసి, తనే యొకానొక వ్యాఖ్యానము వ్రాసి యథేచ్ఛగా సంచరిస్తూ వుండే వాడు. తన సిద్ధాంత మొక్కటే యటుంచి, ఇతరులు ప్రతిపాదించిన సిద్ధాంత ములను పూర్వ పక్షము చేయుటయే యాతడి ముఖ్యోద్దేశమై యుండెడిది. ఈ ధీవిచ్చిత్తి ముఖ్యంగా శాస్త్రీయ రంగంలో - యింతగా దిగజారి పోవడమనేది శ్రీ శంకరుల సమయంలో జరిగి యున్నంతగా అంతకు ముందెన్నడూ జరిగి యుండలేదు. అట్టి విషమ పరిస్థితులలో ప్రమాద భరిత, విషపూరిత దుఃఖమయ మయినది హిందూ సమాజ మారోజుల్లో,ఆదర్శవంతమైన యాలోచనలు, ఆచరణ పూర్వకమైన సిద్దాంతములు ఆ రోజులలో ఎంతో అవసరమై యుండినవి. అహింస, ఆత్మ నిగ్రహం, దయ, ప్రేమ మొద లయిన బౌద్ధ సూత్రాలు కడు రమ్యమైనవై ప్రభువు-పాలితులు అనే తేడాలేకుండ అందఱను ఆకర్షించినవి. ఐతేనేమి దిగజారి పోయే సమాజం ఈ బౌద్ధ సంబంధమైన ఆలోచనలను కూడ వదలలేదు. అందులో విభిన్నమైన ఊహలు, వ్యాఖ్యానాలు, పాటమరించినవి. అసద్వాదులైన ఈ శూన్యవాదులు అధిక సంఖ్యాకులై దుర్బోధలు చేసి హిందువులనేకులను మత బాహ్యులను చేయడం జరిగింది శ్రీ శంకరుల యావిర్భావం నాటికి.


ఇటువంటి చిందరవందరగా నున్న అజ్ఞాన వాతావరణంలోకి శ్రీ శంకరులు ఉపనిషత్ప్రతిపాదిత మైన అద్వైత సిద్ధాంతమును ప్రవేశపెట్టారు. క్రీ.శ. 7 నుండి 9వ శతాబ్దముల మధ్య ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ప్రచారమునకు వీలయిన సదు పాయములు కనిపెట్టబడని ఆ రోజుల్లో కేవలం ఒక్క వ్యక్తికి అద్వైత మత ప్రచారం చేయ బూనడం, ఎంతటి ఉత్కృష్టమైన శ్రమతో గూడిన సాహస కార్యమో ఆలోచిస్తే అవగతమవుతుంది.


శ్రీశంకరుల బుద్ధికుశలత దేశములోని సమస్యను పరిష్కారంజేసింది. సందేహం లేదు.ఆయన తన భౌతకకాయాన్ని వదలకముందే అసద్వాదులైన బౌద్ధుల సిద్ధాంతాన్ని దేశపు సరిహద్దులను దాటించి, వెళ్ళగొట్టి అప్పటి ఆర్యావర్తంలో తిరిగి హిందూ సిద్దాంతములను నెలకొల్పారు. శతాబ్దాలపాటు యితరత్రా భిన్న భావాల వాతావరణంలో వుండి, అనేకమయిన అనుభవాలు గడించుకొని, విసిగి వేసారిన భారత దేశం తిరిగి తనదైన, స్వీయమైన సిద్ధాంతానికే చేరుకొన్నది.


ఉపనిషత్సిద్ధాంతాలు మన జాతి సంస్కృతికి ఆధారమైనవి. వాటిని పునరుద్ధ రించడంలో శ్రీ శంకరులు మన సంస్కృతిని కూడ పునరుద్ధరించారు. ఈ మహ త్కార్యాచరణకై ఆయనవద్ద పలురకాలుగా పనికివచ్చే ఆయుధ సామాగ్రి వుంది. ఋషుల మతాన్ని సంరక్షించే ఈ పరమపవిత్ర మయిన బాధ్యతను స్వీకరించగల సమర్థత ఆయన కొక్కనికే తగివున్నది.


ఉత్కృష్టమైన మేధ, తేజోవంత మైన ధీశక్తి, సత్యపదార్థ దృష్టితో పూర్ణత చెందిన వ్యక్తిత్వం జాతిని సేవించవలెననే తీవ్ర ఉత్కంఠ, దీక, మధురమైన భావుకత, తీక్ష్యమైన తర్కం యిటువంటి సల్లక్షణాల నెన్నో కలిగిఉన్న శ్రీ శంకరులను ఉపనిషత్తులు ఆధ్యాత్మికాధిపతిగా ఎన్నుకొన్నవి.


బహుశ్రమతో గూడిన ఈ మహత్కార్యాన్ని శ్రీశంకరులు ఇరవయి రెండేళ్ళ నిరంతర ప్రచారంచేసి నెరవేర్చవలసి వచ్చింది. ఆయన ముప్పది రెండవయేట పని ముగించి వ్యక్తిత్వాన్ని ముకుళింప చేసుకొని అవ్యక్తములో కలిసి పోయారు.


ఆయన గద్యపద్య రచన రెంటిలోను తన వాఙ్మయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీక్షాపూర్ణమైన ఆయన ఆశయాల వేడికి సంస్కృత భాష ఆయన చేతిలో మైనంవలె ఒదిగింది. ఆ భాష ఆయన భావాలకు అనుగుణంగా వివిధ రూపాలు ధరించింది. వారి శక్తివంతమైన ఆయన గద్యము చక్కని వాదములతో గంభీరంగా సాగింది. మధుర భక్తి గానాలు ఆయన పలికిందే తడవుగా ప్రవాహంవలె చక్కని ఫణితులతో విరాజిల్లాయి. శ్రీశంకరులు చేపట్టని ప్రక్రియ లేదు. ఏది చేపట్టినా అన్నిటిలో కూడా ఆయన సమర్థత కనిపిస్తుంది. మగటిమి చూపించే గద్యం, స్త్రీ లాలిత్యం చూపించే గానాలు,

కదం త్రొక్కే పద్యాలు, నృత్యం చేసే గీతాలు-- ఆయన ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం వ్రాస్తేనేమి, బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పితేనేమి, ప్రవృత్తి పూర్ణమైన భక్తి శ్లోకాలు రచిస్తేనేమి ఆయన హృదయంతో బాటే ఆయన లేఖిని నృత్యం చేసింది.ఆయన ఆలోచనల తోబాటు ఊయలలూగింది.


రచనా శక్తి మాత్రమే దిగజారిన దేశ సంస్కృతిని ఉద్దరించదు. ఆయన గొప్ప కార్యనిర్వాహకుడు, దూరదృష్టిగల సాంఘిక నీతి ధురంధురుడు. ధైర్యవంతుడయిన యోధుడు. విశ్రాంతి నెఱుగని దేశసేవకుడు. నిస్వార్థుడై, నిగర్వుడై, ఈ దైవాంశ సంభూతుడు దేశపు నలు మూలలా తిరిగి తిరిగి దేశ గౌరవ ప్రతిష్ఠల కనుగుణంగా ఎలాంటి ప్రవర్తం కలిగి వుండాలో సర్వులకూ బోధించి, మాతృదేశానికి అనర్గళ మైన సేవ చేశాడు. ఆయన కొనసాగించిన కార్యక్రమం. మంచి క్రమ శిక్షణ కలిగిన శిష్యులు స్థిరమైన పూర్ణమైన సంఘమూ ఉంటే తప్ప సఫలీకృతమయ్యేది కాదు. మఠాలను స్థాపించి, దేవాలయాలు నెలకొల్పి, సంఘోపయో గార్థం విద్యాలయాలు, మతపరమైన శాసనాలు యేర్పరచడంలో తాను సాధించదలచిన ఆశయ సిద్ధికోసం శ్రీజగత్ గురువులు ముట్టని గొప్పకార్యంలేదు.


భజగోవిందం ఆదిశంకరుల రచనలో చిన్నదైనా అత్యంత ముఖ్యమైనది. వేదాంతానికి పునాదియైన విషయాలతో గూడిన యీ సంగీత శ్లోకాల్ని, కడు సులభంగా వ్రాయడం చేత, చిన్నతనం నుంచి ఋషుల బిడ్డలైన పిల్లలు యీ అద్వైత భావాలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో పెరుగుతారు. గొప్ప అర్థాన్ని దాచుకొన్న యీ శ్లోకా లయొక్క ఫణితి తాళ సంయుతమై, పసివారి మనస్సు నిట్టే ఆకర్షించుతుంది. జ్ఞాపకం పెట్టుకునేందుకు ఎంతో ఊతమిస్తుంది. తెలివైన యుక్తవయస్కుడు ఏకాగ్రతతో యీ శ్లోకాలు చదివినట్లయితే అవి అతడి భ్రాంతులను మోహాన్ని తుడిచి వేస్తాయి. అందు కని యీ శ్లోకాన్ని "మోహ ముద్గర ” మంటారు.


ఈ శ్లోకాలు శ్రీగురుపాదుల హృదయంలో నుంచి ఎలా ప్రేరితమై ఆవిర్భ వించాయో చెప్పడానికి ఒకానొక ప్రసిద్ధమైన కథవుంది. ఒకనాడు శ్రీశంకరులు కాశీ పట్టణంలో, పధ్నాలుగురు శిష్యులు తన వెంటరాగా, బయలు దేరి దోవవెంట వెడుతూ వున్నాడు. దారిలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూవుండడం విన్నారు.


ఈ కథ ద్వాదశ మంజరికా స్తోత్రముయొక్క చివర ఈ శ్లోకంలో వుంది. 


*ద్వాదశ మంజరికాభిరశేషః కథితో వైయాకరణ శిష్యః* *ఉపదేశోభూద్విద్యానిపుణః శ్రీ మధ్ఛంకర భగవచ్చరణైః* .


*సశేషం*

🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕

కామెంట్‌లు లేవు: