☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీ రామ రామ రామ నామ మహిమ*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీ రామ జయరామ జయజయ రామ।*
*కలియుగంలో పాపనాశిని రామనామమే! మనకున్న నాలుగు యుగాలలో.. కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరంలో ఆరాధనతోనూ, కలియుగంలో భగవన్నామ స్మరణతోనూ పాపాలను పోగొట్టుకోవచ్చని పురాణాలన్నీ వివరించి చెబుతున్నాయి.*
*ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో రామనామ స్మరణ చేయడంవల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చని పెద్దలందరూ వివరించి చెబుతున్నారు.*
*రామ నామానికి ఎందుకంత విశిష్టత చేకూరిందని చెప్పటానికి అనేకానేక ఉదాహరణలున్నాయి*
*అలాంటి వాటిలో మొదటి ఉదాహరణ రెండు పవిత్ర మంత్రాలలోని రెండు బీజాక్షరాల కలయిక అని చెప్పేదే.*
*ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరీ మంత్రం. నమశ్శివాయ అనేది పంచాక్షరీ మంత్రం. అష్టాక్షరిలోని ‘రా’ పంచాక్షరిలోని ‘మ’ పక్కపక్కన చేరి ‘రామ’ అనే అమృత నామంగా అయింది.*
*రెండు గొప్పగొప్ప మంత్రాలను ఏకకాలంలో జపించినంతటి పుణ్యఫలం రామనామ జపానికి ఈ కారణంచేతనే కలుగుతుంది.*
*‘రామ’ శబ్దాన్ని విడిగా చూస్తే ర+ఆ+మ అనే మూడు బీజాక్షరాల కలయికగా కనిపిస్తుంది. ఇందులో ‘ర’ అగ్నిబీజాక్షరం, ‘ఆ’ సూర్యబీజాక్షరం, ‘మ’ చంద్రబీజాక్షరం.*
*అగ్ని బీజాక్షరమైన ‘ర’ కర్మలను నశింపచేసి మోక్షాన్ని ఇస్తుంది. సూర్య బీజాక్షరమైన ‘ఆ’ మోహాంధకారాలను పోగొడుతుంది. చంద్రబీజాక్షరమైన ‘మ’ తాపత్రయాలను హరిస్తుంది. రామనామశక్తి ఇంత గొప్పది. అలాగే ర, ఆ, మ మూడు త్రిమూర్తులకు ప్రతీకలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆ త్రిమూర్తులు. అలా చూస్తే రామనామ జపం సృష్టి, స్థితి, లయ కారకులు ముగ్గురి కృపను పొందటానికి వీలుంటుంది.*
*జీవాత్మ, పరమాత్మల ఐక్యానికి ప్రతీక ‘రామ’ అనే రెండక్షరాలు. జీవాత్మకు, పరమాత్మకు కూడా ప్రతీకలని, జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని ప్రకటించే శక్తి రామనామానికి అందుకే ఉదంటారు పెద్దలు.*
.*‘రామ’ నామాన్ని జపించేటప్పుడు ‘రా’ అనే పలికే సమయంలో అప్పటిదాకా దేహంలో ఉన్న పాపాలన్నీ బయటకుపోతాయి. ‘మ’ అని అన్నప్పుడు నోరు మూతపడి ఇక పాపాలేనీ లోపలకు పాకుండా ఉంటాయి.*
*ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు రామనామస్మరణ విషయంలో లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి.*
*రామ నామంతో పాటు శ్రీరామజయరామ జయజయరామ అనే మరో అద్భుతమైన దివ్యమంత్రం ఉంది.*
*ఈ మంత్రంలోని శ్రీరామ అనేది శ్రీరాముడిని ఆవాహన చేసేందుకు,*
*జయరామ అనేది రాముడిని స్తుతించేందుకు,*
*జయజయరామ అనేది రాముడి విషయంలో సంపూర్ణ సమర్పణ భావాన్ని ప్రకటించేందుకు ఉపకరిస్తాయి.*
*ఓ రామా నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణు కోరుతున్నాను. నన్ను కరుణించు అనే అర్థాన్ని శ్రీరామ జయరామ జయజయరామ ప్రతిపాదిస్తుంది.*
*తనను శరణన్న వారిని శీఘ్రంగా ఆదుకోవటం ఆ రామప్రభువు తొలి కర్తవ్యంగా భావిస్తాడు. అందుకే ఈ మంత్ర జపం చేసిన ఎందరెందరో మహనీయులకు రామదర్శనం కలిగిందని లోకంలో ఎందరో మహానుభావుల చరిత్రలు వివరిస్తున్నాయి.*
*శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రం ఆవిర్భావం గురించి ఓ ప్రధాన ఇతివృత్తం రామభక్తులు ఉన్నచోట వినిపిస్తుంటుంది.*
*రావణ వధానంతరం రాముడు అయోధ్యను రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతున్న రోజులవి. కష్టాలను పోగొట్టేందుకు తగిన మంత్రాన్ని ఆవిర్భవింపచేసే దిశగా ఆలోచించసాగాడు. అప్పుడాయనకు ఓ ఆలోచన తట్టింది.*
*ఓ రోజున శ్రీరామచంద్రుడు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువులో శ్రీరాముడి గురువు విశ్వామిత్రుడు, రాముడి బంటు హనుమంతుడు కూడా ఉన్నారు.*
*నారదుడు కొలువు ప్రారంభానికి ముందుగా హనుమ దగ్గరకు వెళ్లి కొలువు ప్రారంభంలో అందరికీ నమస్కరించే సమయంలో ఒక్క విశ్వామిత్రుడికి తప్ప అందరికీ నమస్కరించమని చెప్పాడు. దేవర్షి చెబుతున్నాడు కదాని హనుమ అలాగే చేశాడు.*
*ఆ తర్వాత నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి అందరినీ గౌరవించిన హనుమ నిన్ను గౌరవించలేదు కనుక రాముడికి చెప్పి శిక్షపడేలా చేయమని అన్నాడు.*
*విశ్వామిత్రుడు నారదుడి మాయమాటల్లో పడి రాముడికి హనుమ ప్రవర్తన బాగాలేదని మరుసటి రోజు సాయంత్రంలోపల మరణదండన విధించమన్నాడు.*
*అలా ఆవిర్భవించిందీ మంత్రం. రాముడు ఆలోచనలో పడ్డాడు. ఆజ్ఞాపిస్తున్నది తన గురువు.తాను దండించాల్సింది తన భక్తుడిని. ఎలా అని అనుకొంటూ ఆ రోజుకు సభ చాలించాడు. హనుమ సభ ముగియగానే నారదుడి దగ్గరకొచ్చి ఆ సంకటస్థితి నుంచి బయటపడేలా చేయమన్నాడు.*
*అప్పుడు నారదుడు మరుసటి రోజు సూర్యోదయం కంటే ముందు లేచి సరయూ నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయజయరామ అనే మంత్రాన్ని జపించు, అన్ని కష్టాలు అవే తొలగిపోతాయి అని చెప్పాడు. హనుమ అలాగే చేశాడు.*
*మరునాడు గురువు ఆజ్ఞ పాటించేందుకు రాముడు సంసిద్ధుడై హనుమ మీదకు ఎన్నెన్నో బాణాలను సంధించాడు.*
*నిరంతరం శ్రీరామ జయరామ జయజయరామ అని నామజపం చేస్తున్న హనుమను ఆ బాణాలేవీ తాకలేకపోయాయి.*
*వెంటనే నారదుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి తాను భగవంతుడికన్నా భగవన్నామమే గొప్పదని నిరూపించేందుకు, మానవాళికి పుణ్యాన్ని ప్రసాదించే మహామంత్రాన్ని ఆవిర్భవింపచేసేందుకు తానే అలా ఓ చిన్న నాటకాన్ని ఆడానని చెప్పాడు.*
*వెంటనే రాముడి దగ్గరకు వెళ్లి హనుమ మీదకు బాణాలను సంధించవద్దని చెప్పమని కోరాడు. విశ్వామిత్రుడు అలానే చేశాడు. పరిస్థితంతా ప్రశాంతమైంది. రాముడు, విశ్వామిత్రుడు తదితరులంతా హనుమను ఆశీర్వదించారు.*
*అలా శ్రీరామజయరామ జయజయరామ అనే గొప్ప మంత్రం ఆవిర్భవించిందని పెద్దలు, రామతత్త్వ ప్రచారకులు, రామ ఉపాసకులు వివరిస్తున్నారు.*
*జై శ్రీ రామ్।*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి