*నేడు ఉండ్రాళ్ళతద్దె(తదియ). సకల సౌభ్యాగ్యకరం ఉండ్రాళ్లతద్దె వ్రతం*
*అక్టోబర్ 01 ఆదివారం ఉండ్రాళ్లతద్దె వ్రతం సందర్భంగా...*
హిందూ సంప్రదాయం పండుగలకు పెట్టింది పేరైతే, ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత, ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన పెద్దలు. అటువంటి లక్షణాలన్నీ ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ‘ఉండ్రాళ్ల తద్దె’. ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, హుషారుగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుల తదియ నాడు అంటే పౌర్ణమి తర్వాతి తదియ తిథిరోజున వస్తుంది. ఈ పండుగ జరుపుకేనే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతాభావం, అలాగే ఈ పండుగకు తీసుకోవాల్సిన ఆహారం విషయం చూస్తే వర్షరుతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్యపరిరక్షణ మొదలైనవి మనకు కనిపిస్తాయి. తరతరాలుగా ప్రతి గ్రామంలోను తెలుగింటి ఆడపడుచులు ఈ ఉండ్రాళ్ల తద్దె పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూస్తుంటాం. ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా డైలీ విష్ వీక్షకులకు ఈ ప్రత్యేక కథనం.
ఉండ్రాళ్ల తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విదియకు కూడా ఎంతో పాత్ర ఉంది. పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్తయిదువులకు మహిళలు గోరింటాకు ముద్దను, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించేవారు. అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాళ్ల తద్దె నోము నోచుకుంటే త్వరగా వివాహం అయి మంచి భర్త లభిస్తాడని, వివాహితలు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. దీంతో వివాహం కాని యువతులు సైతం ముందురోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి, జుట్టుకు సాంబ్రాణిపొగ వేయటం కనిపిస్తుంది. కుంకుడుకాయలు జుట్టులోకి చుండ్రును చేరనీయకుండా చేస్తాయి, ఇక సాంబ్రాణి వల్ల వెంట్రుకల మూలాల దగ్గర ఉన్న తడిసైతం ఆవిరవుతుంది.
ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉదయం 6 గంటలలోపే గోంగూరపచ్చడితో పెరుగన్నం పిల్లలందరికి వారి తల్లి తినిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే, పెరుగన్నం చలువ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురికాకుండా ఉష్టోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వులపొడిని కూడా కలుపుని తింటారు. దీంతో ఈ వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, రొంప, కళ్ల మంటలు వంటి అనేక వ్యాధులకు దగ్గరికి కూడా రావు.
ఇక రెండో రోజైన తదియ నాడు అసలైన సందడి మనకు కనిపిస్తుంది. ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర, ఆవకాయ నంచుకుని పెరుగన్నం తినడం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది. ఆ తర్వాత ఊరిలోని మహిళలు, ఆడపిల్లలు ఒకచోట చేరి ఉయ్యాలలూగటం, దాగుడుమూతలు, దూదుంపుల్ల, కోతికొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు. ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాళ్లను తోటి మహిళలకు పంచుతారు. ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి, ఐదు దారపు పోగులు, ఐదుముడులతో ఏడు తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోమునోచుకునే మహిళకు, మిగతా ఐదు ముత్తయిదువులకు కడతారు.
అదేవిధంగా బియ్యంపిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలిమిడిని, ఐదు ఉండ్రాళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ల తద్దె వ్రత కథను చెప్పుకోవాలి. ఆ కథ చెప్పుకునేముందు అక్షింతతలను చేతిలో ఉంచుకుని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి. ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. పూర్ణంబూరెలు, గారెలు, తోరము ఇలా అన్నింటిని ఒక పళ్లెంలో ఉంచి ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటి వాయనం’ అని చెప్తూ మహిళలు ఈ వాయనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
భాద్రపదమాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. వినాయకునికి మోదకప్రియుడు అనిపేరు. అలాగే ఈ ఉండ్రాళ్ల తదియకు కూడా ‘మోదకతదియ’ అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ, శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు, ఆరోగ్యపరమైన ఆహారం, గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగుజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాళ్ల తద్దె అనటంలో ఎటువంటి సందేహం లేదు.