౪౪౪ ఆలోచనాలోచనాలు ౪౪౪ సంస్కృత సూక్తి సుధ ౪౪౪ 1* ప్రస్తావన సదృశం వాక్యం, స్వభావ సదృశం క్రియాం! ఆత్మశక్తి సమం కోపం, యో జానాతి సపండితః!! ఎవరైతే ప్రస్తావనకు తగిన మాట మాట్లాడటం, పరుల స్వభావానికి తగినట్లుగా పనిచెయ్యడం, తన శక్తి ఎంతో తెలుసుకొని కోపపడటం చేస్తుంటారో, వారే పండితులు లేదా వివేకవంతులు. 2* ఉషశ్మశంస గార్గ్యస్తు, శకునంతు బృహస్పతిః, మనో జయంతు మాండవ్యో, బుధ వాక్యో జనార్దనః !! ఏదైనా కార్యసాధనకు ఉదయవేళ మంచిదని గార్గ్యముని తెలియబరచాడు. మంచి శకునం చూచుకొని మొదలు పెడితే మంచిదని దేవర్షి బృహస్పతి తెలియబరచాడు. మనస్సులో కార్యసిద్ధి జరుగుతుందనే దృఢనిశ్చయం వుంటే చాలని మాండవ్య మహర్షి పేర్కొన్నాడు. కానీ జనార్దనుడు( శ్రీ కృష్ణ పరమాత్మ) పెద్దలు చెప్పిన సూచనను పాటించడం ఉత్తమమని పేర్కొన్నాడు. 3* ఏకోపి గుణవాన్ పుత్రో, నిర్గుణేన శతైరపి, ఏకచంద్ర ప్రకాశేన , నక్షత్రైః కిం ప్రయోజనమ్? సద్గుణాలు గల ఒక్క కుమారుడు చాలు. గుణహీనులైన వందమంది కుమారులున్నను వ్యర్థమే! ఆకాశంలో కోట్లకొలది నక్షత్రాలు ఉన్ననూ ఒక్క చంద్రునితోనే వెన్నెల ప్రకాశం ఏర్పడుతుంది. 4* ఆహారే, వాద్యే, తథా నృత్తే, సంగ్రామే, రిపు సంకటే, ఆహారే, వ్యవహారేచ, త్యక్తార్లజ్జా సుఖీ భవేత్!! పాటలు పాడేటప్పుడు, సంగీత వాయిద్యాలను వాయించేటప్పుడు, నాట్యంచేసేటప్పుడు, యుద్ధం లోను, శత్రువుతో చిక్కులు ఏర్పడినప్పుడు, భోజనం చేసేటప్పుడు, వ్యవహారం చేసేటప్పుడు సిగ్గు, బిడియాలను వదిలేస్తేనే క్షేమదాయకం.( మొగమాటం పనికిరాదు.) 5* దాతా దరిద్రః, కృపణో ధనాఢ్యః, పాపీ చిరాయుః, సుకృతీ గతాయుః, రాజా ఽకులీనః, స్సుకీలనః భృత్యః, కలౌ యుగే షడ్గుణమాశ్రయింతి!! దానం చేయగల దాత దరిద్రునిగను, పరమలోభి ధనవంతునిగను, పాపాత్ముడు దీర్ఘాయుష్మంతుడుగను, పుణ్యాత్ముడు అల్పాయుష్కుడిగను, హీనుడు ప్రభువుగాను, ఉన్నత వంశస్థుడు సేవకునిగాను, ఈ ఆరు గుణాలు " కలియుగంలో" ప్రసిద్ధమౌతాయి. 6* ఆత్మబుద్ధి స్సుఖంచైవ, గురుబుద్ధిర్విశేషతః, పరబుద్ధిర్వినాశాయ, స్త్రీబుద్ధిః ప్రళయాంతకమ్!! తన స్వబుద్ధితో పనులు చేసుకోవడం ఉత్తమం. గురువు ఆదేశంతో కార్యానికి ఉపక్రమించడం ఇంకా శ్రేష్ఠం. ఇతరులు చెప్పినట్లు చెయ్యడం ప్రమాదకరం. స్త్రీబుద్ధి ప్రళయాన్ని తెచ్చిపెడుతుందని భావం. 7* దర్శనాచ్చిత్త వైకల్యం, స్పర్శనేన ధనక్షయం, సంభోగాత్కిల్బిషం, పణ్యస్త్రీణాం, ప్రత్యక్ష రక్షసామ్!! వేశ్యాస్త్రీ చూడగానే మనస్సు వికలమౌతుంది. వారిని ముట్టుకోగానే ధనం పోతుంది. వారితో కలియడం వలన పాపం సంభవిస్తుంది. వారకాంతలున్నారే వారు ప్రత్యక్ష రాక్షసులు. చివరగా ఒక చమత్కార శ్లోకం--- శివశర్మ అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆ దేశపు రాజుగారు పండిత సత్కారం చేస్తున్నారని విని, ఆ వరుసలో నిలబడ్డాడు. రాజుగారు ఒక్కొక్క పండితునికి బంగారు మామిడి పండును తాంబూలం లో ఉంచి, సన్మానించి వెలుపలికి పంపుతున్నారు. సరిగ్గా ఈ పండిత సత్కారవేళ కుంభవృష్టి కురిసి నేల అంతా బురదమయం అయ్యింది. మొదటిసారి బంగారు మామిడి పండును అందుకొన్న మన శివశర్మకు "ఆశ" చావక, మళ్ళీ రెండవ పర్యాయం వరుసలో ముదుకు కదిలాడు. కాలం, ఖర్మం చాలక బురదలో జారిపడ్డాడు. ఎట్లాగో తెప్పరెల్లి లేచినిలబడి బురదబట్టలతోనే రాజుగారి ముందు నిలబడ్డాడు. రాజుగారు " శివశర్మ" ను గుర్తించి "" ఏమిటీ అవతారమని"" ప్రశ్నించారు. దానికా పండితులవారు దిగువ శ్లోకం తో తలవంచుకొని జవాబిచ్చారు.
క్షుత్తృడాశాః కుటింబిన్యః మయి జీవతి నాన్యగాః ! తాసా మంత్యా ప్రియతమా-- తస్యా శృంగార చేష్టితమ్!!
"" ఓ రాజా! నాకు ఆశ, దప్పిక, మరియు ఆశ అను మువ్వురు భార్యలు. వాళ్ళెప్పుడూ నన్ను విడిచిపెట్టి ఉండరు. అందులో మూడవ భార్య ఉన్నదే "" ఆశ"", ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఆమె చేసిన శృంగారపు చేష్టే, ఈ బంగారపు పూత వంటి ఈ బురద""
అని పలికి సిగ్గుతో తలవంచుకొన్నాడు. పాపం, రాజుగారు పండితుని " పేరాశ" ను చూసి జాలిపడి రెండవ పర్యాయం " బంగారు మామిడి పండు" తో సత్కరించి పంపించారు. రెండు బంగారు మామిడి పండ్లు శివశర్మ కు, మనకు ఈ " చమత్కారశ్లోకం" లభించాయి. తేది 1--10--2023, ఆదివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి