10, ఫిబ్రవరి 2021, బుధవారం

ఆర్తితో ప్రార్థన చేసి

 కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.


ఆయన ఒక ఇంటి ముందునుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగుమీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా! అని తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి.భోజనం వడ్డిస్తాను' అంది.

కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది.

 భోజనం ఐన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సు ను పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.

 వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగుమీద పడుకుంటామమ్మా!' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది. 


మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగుమీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లుఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది'అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో , వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో , అమ్మవారిపట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మ యే కాపాడుతూఉంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పతాకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చక్కటి విడిది.. రూ.200లకే

 *చక్కటి విడిది.. రూ.200లకే*


వసతిరూ. 40వేలకే పెండ్లి మండపంతో పాటు 15 గదులు 


సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌


వైద్యం కోసమని రోగులు,  సిటీ అందాలను  చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది.  ఇది పేదలు, సామాన్యులకు కొంత ఇబ్బందే. అలాంటి వారి కోసం ఇంటిని మరిపించేలా చక్కటి వసతి కల్పిస్తున్నది కాచిగూడలోని తుల్జాభవన్‌. తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భవన్‌లో నామమాత్రపు ధరతో అంటే నలుగురికి రోజుకు రూ. 200కే  వసతి కల్పిస్తున్నారు.  


ఇతర రాష్ట్రాల పర్యాటకులు..

నగరం నడిబొడ్డున ఉండటం, పార్కింగ్‌ రవాణా సౌకర్యం, తక్కువ చార్జీ ఉండటం వల్ల ఈ భవన్‌ మంచి ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు, వివిధ వైద్యశాలలకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులు నిత్యం ఇక్కడ బస చేస్తుంటారు. ఎక్కువగా  ఏపీ, బెంగళూరు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , పంజాబ్‌, కర్ణాటక, హర్యానా, గోవా తదితర రాష్ర్టాల నుంచి వచ్చే  టూరిస్టులు ఇక్కడే విడిది చేస్తారు. అలా వచ్చే ఆదాయంతోనే భవనాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ విడిది కేంద్రంలో తక్కువ చార్జీలతో సకల సౌకర్యాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల వారికి ఈ భవనం గురించి తెలియకపోవడం వల్ల వసతి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


వివాహ వేడుకలకు.. 

శతాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులు సమకూర్చారు. మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. సకల  సౌకర్యాలు కల్పించారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వంటశాల గదిని నిర్మించారు. ప్రస్తుతం 18 గదులు అందుబాటులో ఉండగా, అన్నింటిల్లో బాత్‌రూంలను ఏర్పాటు చేశారు. ఇటీవలే పేదల సౌకర్యార్థ్ధం *తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు చేసుకోవడానికి టెంట్‌ సామాన్లు, 15 గదులను కేవలం రూ.40 వేల ప్యాకేజీతో ఇస్తుండటం విశేషం.*


ఆలయం.. గ్రంథాలయం.. 

ఈ తుల్జాభవన్‌లో పురాతన రామాలయం ఉంది. ఏటా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక యువత, నిరుద్యోగులు, పాఠకుల కోసం గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు స్వచ్ఛంద సంస్థలు వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాయి.   


ఎంతో మేలు...

పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ఖర్చుతో *పెండ్లిండ్లు చేసుకోవడానికి కేవలం రూ.40 వేల ప్యాకేజీ ఇవ్వడం శుభసూచికం.* కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజలు ఈ భవన్‌లో పెండ్లిళ్ల్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు బయట లాడ్జిలతో పొల్చితే ఇక్కడ కేవలం రూ.200 చెల్లిస్తే నలుగురికి వసతి కల్పిస్తున్నారు -పట్లూరి సతీశ్‌, యాత్రికుడు 


అనేక  సౌకర్యాలు అందుబాటులో..

నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు అందుబాటు ధరలో అంటే *నలుగురికి రోజుకు కేవలం రూ.200లకే  తుల్జాభవన్‌లో వసతి కల్పిస్తున్నాం.* వివిధ పనుల కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ వసతి పొందడానికి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరం నడి బొడ్డున ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉన్నది. వసతి పొందాలనుకునే వారు -9491000687, 8309481306 నంబర్లలో  సంప్రదించవచ్చు.  -ఎ.బాలాజీ(దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కాచిగూడ తుల్జాభవన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)

అక్క పలకరింపు

 అక్క పలకరింపు: 


శా. ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో

     ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ

     క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్

     నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్


నిగమశర్మ  అక్క పలకరింపు అంటూ, మధ్యలో ఈ పద్య ప్రవేశం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా ?  వద్దండీ,  అంతగా ఆశ్చర్యం వలదు.  బహుశా మీరందరూ వినే ఉంటారు ఈ విషయం గురించి.  ఒక ఇరవై, ఇరవై రెండు సంవత్సరాల కు పూర్వం  ఈ విషయం  తెలుగు పాఠ్యాంశంలో కూడా  చదువుకుని ఉండచ్చు.  అయినా  మరొకసారి  చూద్దాం ఏమిటో ! 


పై పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము అనే ప్రబంధపు తృతీయాశ్వాసం లోనిది.  చాలా చక్కని పద్యాలున్న ఈ ప్రబంధంలో పండరీపురంలోని పాండురంగ విఠలుని మాహాత్మ్యమూ, లీలలూ, ఆయన భక్తుల కథలూ మొదలైనవి వర్ణించబడ్డాయి. ఆ స్వామి ప్రభావాన్ని వివరించడంలో భాగంగా చెప్పిన నిగమశర్మోపాఖ్యానము  లోనిది పై పద్యం.    


పూర్వం పిఠాపురంలో నిగమశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు. పేరు మాత్రం గొప్పగా నిగమశర్మ (నిగమములు = వేదములు) అని వుంది కాని అతనికి లేని పాడు బుద్ధులు లేవు. జూదరి, వేశ్యాలంపటుడు. వాడి ప్రవర్తన మార్చడానికి వాడి భార్యా, తల్లీతండ్రులూ ఎంతో శ్రమపడతారు. కానీ వాడిది పిల్లి శీలము. చదువులు చిలుక చదువులు. వాడు తాత తండ్రులు సంపాదించిన ఆస్తి అంతా వేశ్యలకు ధారపోశాడు. తల్లి నగలు తాకట్టు పెట్టాడు. దొరికిన చోట్లల్లా అప్పు చేశాడు. బంధువులను యాచించాడు. ఈ రకంగా భ్రష్టు పట్టిపోయిన వీషయం తెలుసుకొని అతని అక్క, తమ్మునికి మంచిబుద్ధి చెప్పడానికి భర్తనూ, పిల్లలనూ తీసుకొని పుట్టింటికి వస్తుంది. అలా వచ్చి, తమ్ముని సంబోధిస్తూ బుద్ధి గరిపే సందర్భంలో మాట్లాడిన తొలి మాటలను వివరించే పద్యం ఇది.


ఇక్కడ నిగమశర్మ అక్కను గురించి విపులంగా ముచ్చటించుకొని తీరాలి. ఎందుకంటే, ఈమె తెలుగు సాహిత్యంలో మర్చిచిపోలేని పాత్రల్లో ఒకటి. తెనాలి కవి ఈమెకు పేరేమీ పెట్టలేదు. అయినా ఏమి, ఎంతో పేరు ఆమెకు ఆమే సంపాదించుకున్నది. పెద్దన వరూధినిలాగా, తిమ్మన సత్యభామలాగా, గురజాడ మధురవాణిలాగా, కలకాలం గుర్తుండిపోయే పాత్ర ఈ అక్కది. ఇప్పుడు చెప్పుకున్న మిగతా నాయికలందరూ ఆయా కావ్యాల్లో చాలా దీర్ఘమైన కార్యక్రమాలే నిర్వహించారు గాని, నిగమశర్మ అక్క మాత్రం కావ్యంలోని ఒక చిన్న ఉపాఖ్యానంలో ఒక క్షణం పాటు జిగేల్మని మెరిసి పోయిన మెరుపు మాత్రమే. అయినా మరపు రాని మగనాలు. పుట్టింటికి వచ్చిన ఎన్నో రోజుల తర్వాత గాని తమ్ముడు ఇంటికి వచ్చి ఆమెను కలవడు. ఈ లోపల ఆమె ఆ ఇంట్లోనిర్వహించిన వ్యవహారం – ఒక ముఖ్యమైన నేపథ్యం. ఆ తర్వాత, తమ్ముడు వచ్చిన పిమ్మట అతనితో మాట్లాడబోయే ముందు జరిగిన తతంగం మరో నేపథ్యం. ఈ రెండు నేపథ్యాలూ ఆమె పాత్రను ఎంతో అద్భుతంగా ప్రోత్తుంగపరచినవి.


తల్లిదండ్రులు ముసలివారు. తమ్ముడు ఇల్లు పట్టకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతుండె. మరదలు చిన్నపిల్ల. అట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఎలా వుండాలో అలానే వున్నది. ఈమె వచ్చి తల్లిదండ్రులను ఊరడిస్తూ ఉపచారాలు చేస్తూ కొంత కొంత వారికి ఉపశమనం కలిగించింది. వెనక బట్టిన దేవతార్చనను పునరుద్ధరించింది. అతిథి అభ్యాగతులను ఆదరించడం మొదలు పెట్టింది. తల్లి తన దగ్గర తమ్ముడికి కనబడకుండా వుంచుకున్న డబ్బులను జాగ్రత్త చేసింది. దాసదాసీలను అభిమానంగా దగ్గరకు తీసింది. 


పశుపోషణాదికాన్ని స్వయంగా పర్యవేక్షించడం ప్రారంభించింది. ఇంట్లో పెద్ద గ్రంధాలయం వున్నట్లున్నది – పుస్తకాలను వరసగా పేర్చడమూ, ఇతరులు తీసుకుపోయిన పుస్తకాలను తిరిగి రాబట్టడమూ, చినిగినవాటిని మరమ్మత్తు చేయడమూ – దాని పనులను భర్తకు పురమాయించింది. ఇంటి మరమ్మత్తులకు – మెత్తడమూ, అలకడమూ,సర్దడమూ – స్వయంగా పూనుకుంది. రాజానుగ్రహంతో వచ్చిన గ్రామభోగాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నది. తప్పిదారిన మడీ మట్రా, చేనూ చెట్టూ – వీటికి జాగ్రత్తగా కాపలా నియమించింది.


ఇదీ, ఆమె పుట్టింటికి వచ్చిన తర్వాత కావించిన నిర్వహణ. (పాపం, ఇన్ని చేస్తున్నా కాపురానికి వచ్చి యౌవనారంభంలో వుండి, భర్త ఆదరణకు నోచుకోని మరదలి స్థితికి “వగచి వగచి కడుపు చుమ్మలు జుట్టి కన్నీరుట్టిపడగా” బాధపడుతూనే వున్నది). పైన తెల్పిన మొదటి నేపథ్యం ఇది.

ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే. పుట్టింట్లో ఏ శుభకార్యం జరిగినా, అన్ని మర్యాదలూ దర్జాగా జరిపించుకొని, ఇతరులకు చెప్పుకుని మురిసిపోయేది ఆడబడుచే. ఆ స్వతంత్రంతోనే తమ్మునికి బుద్ధి గరపడానికి వచ్చింది ఆమె. ఆ చొరవతోనే ఇల్లంతా ఒక దోవకు తెచ్చింది మళ్ళీ.


ఇంతలో ఒకరోజు ఉన్నట్టుండి “చుక్క తెగిపడిన వడుపున” ఇంటికి వచ్చాడు నిగమశర్మ. చాలా రోజుల తర్వాత చూసింది గదా అని కౌగిలించుకోబోయింది కాని, వాడి వంటినిండా నఖక్షతాలున్నాయిట. వాటిని చూసి అసహ్యించుకుంది. పాపం మనసులో కూడా అపవిత్రతకు తావీయక దేవతార్చనలు గావించుకునే ఇంటి ఇల్లాలు గదా. ఐనా వాడిని విముఖుని చేసుకోరాదనే సంగతి తెలుసు. మేనల్లుని ఎత్తుకోమని అందించింది. నిమిషంలో శాకపాకాలు తయారు చేస్తాను, మీ బావతో కలిసి భోంచేద్దువు గాని, స్నానం చేసి రమ్మంది. అతనికి చేయవలసిన ఉపచారాల కోసం మరదలికి కనుసైగ చేసింది. అభ్యంగన స్నానం చేయించింది. ఉతికిన ధోవతీ, ఉత్తరీయమూ ఇప్పించింది. తల తానే శుభ్రంగా తడి లేకుండా తుడిచింది. ఒంటికి గంధం రాచింది. తలలో పూలు తురిమింది. బావా తలిదండ్రుల పంక్తిలో కూర్చోబెట్టి షడ్రసోపేతమైన భోజనం వడ్డించింది. అనంతరం, అరుగు మీద కూర్చుని వుండగా మరదలి చేత తాంబూలపు చిలకలు ఇప్పించింది. తనూ తమ్ముని దగ్గరకు చేరింది. చంటి పిల్లవాడిని ఎత్తుకుని, వాడికన్నా ముందువాడు తన పక్కపక్కనే తిరుగుతూ వుండగా, తమ్ముడి తలముడి విప్పింది. ఈరువానతో (పెద్ద పండ్లు గల దువ్వెన) తలవెండ్రుకల చిక్కు తీసి దిగ దువ్వి, కుచ్చు విడదీసి పైకెత్తి, పేలను గాలించి గోరుముక్కులతో నలిపింది. లేచి శుభ్రంగా (గరగరగా) చేతులు కడుక్కొని వచ్చింది. మరదలు తనకు తాంబూలం ఇస్తే నోట పెట్టుకున్నది. మరదలు విసనకర్రతో విసురుతూ పక్కన నిలబడి వుండగా, దాసీ తెచ్చిన పీటపై కూర్చుని, బిడ్డ చనుబాలు త్రాగుతూ వుండగా, కుడివైపుకు కొంచెము ఒత్తిగిల్లి, పద్మవనంలో కొలువున్న లక్ష్మీదేవిలా కూర్చొని, తమ్మునికి హితబోధ ప్రారంభించింది. ఇది రెండో నేపథ్యం.


ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది. ఆ సందర్భంలోని మొట్టమొదటి పద్యం మనం పైన చదువుకున్నది.


ఉపదేశం తిట్టడంతో గానీ, తప్పులెంచడంతో గాని, ఆమె మొదలు పెట్టలేదు. ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ, వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది.

ప్రారంభించిన వేదపాఠాలకు విఘ్నం కలుగుతుందనా రావడం లేదు అని అడగడం ఎందుకు? ఆమెకు తెలియకనా వాడు వేదపాఠాలను పక్కనబెట్టి చాలా రోజులే అయిందని. అయినా తెలీనట్లే అడిగింది. వాడు రాగానే తిట్లకు లంకించుకోవడం సరిగాదు. నువ్వేమిటి నాకు చెప్పేది అని వాడు విదిలించుకొని పోకుండా, ఎంతో ఆప్తంగా కొడుకుని ఎత్తుకోమని ఇవ్వడం, స్వయంగా వడ్డించడం, తల దువ్వడం లాంటి పనుల్తో వాడి మనసులో విరసపు భావం తొలగించేందుకు జాగ్రత్త పడింది. నెలపొడుపు కోసం సముద్రంలాగా నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది. ఇది ఏదో ఆషామాషీగా వేసిన పోలిక కాదు. చంద్రుడు సముద్ర మధన సమయంలో – అందులోంచి పుట్టాడనేది ప్రసిద్ధం. అందువలన వారిది తండ్రీకొడుకుల సంబంధం. కొడుకు ఉదయించి, క్రమంగా మిన్నందుతుంటే తండ్రికి ఎంతో సంతోషం. అందుకనే పున్నమి రోజున సముద్రంలో వచ్చే ఆటుపోట్లు – సముద్రుడు కొడుకు ఉన్నతికి ఉప్పొంగడంగా కవులు ఉత్ప్రేక్షించారు. నీ శ్రేయం కోరేవాడు తండ్రి. అతని మాటలు నువ్వెట్లా వినడం లేదు? అక్కా బావలు, తలిదండ్రుల తర్వాత అంతటివారు. నీ శ్రేయస్సు కోరేవారు. నీ ఉన్నతిని కాంక్షించేవారు. నీ అభ్యుదయానికి ఆనందించేవారమైన మా మాటలయినా విను నాయనా, అని ధ్వని.


ఒక్కసారి, ఆమె ప్రవర్తనా, ఆమె గృహ నిర్వహణ చేసిన తీరూ, మాట్లాడే ధోరణీ, కూర్చున్న వైఖరీ – ఇవన్నీ మనసులోకి తెచ్చుకొని, ఆమె చెప్పిన ఈ పద్యం తలచుకుంటే ఎంతో ఉజ్జ్వలంగా కన్పట్టక మానదు. ఆ పద్యంతో ప్రారంభించి ఒక పది పద్యాలలో అతని వంశ ప్రతిష్ఠనూ, ఇంటి దుస్థితినీ, భార్య పరిస్థితినీ, వచ్చిన దుష్కీర్తినీ వివరించి, అతను కాదనడానికి వీల్లేని పరిస్థితిని కల్పించి, తాత్కాలికంగానైనా తన మాటలకి ఒడబడేటట్లు మాట్లాడింది – అదీ నిగమశర్మ అక్క అంటే. అక్కడ ఆమె చేత ఉపదేశం చేయించిన తీరూ, మనం పైన అనుకున్న రెండు నేపథ్యాల కల్పనా – ఇవి రామకృష్ణుని అద్భుత ప్రతిభకూ, లోకజ్ఞతకూ నిదర్శనాలు. ఈ ఒక్క పద్యమే కాదు, ఆ సందర్భంలోని పద్యాలన్నీ ఆణిముత్యాలే!


నిగమశర్మ అక్కని ఇంత గొప్పగా చిత్రించి కూడా ఆవిడకో పేరు ప్రసాదించలేదు! అదే మరి రామకృష్ణుని కొంటెతనం :-) ఇంతకన్నా కొంటెతనం మరొకటి ఉంది. ఈవిడగారు ఎంత నచ్చచెప్పినా మారినట్టు నటిస్తాడే కానీ నిజంగా మారడు నిగమశర్మ. ఓ రోజు డబ్బు దస్కం మూటగట్టుకొని చక్కా ఉడాయిస్తాడు. పొద్దున్న విషయం తెలిసిన ఇంటిల్లపాదీ ఏడవడం మొదలుపెడతారు. నిగమశర్మ పారిపోయినందుకు కాదు, పోతూ పోతూ తమ తమకిష్టమైన వస్తువులు తీసుకుపోయాడనిట! ఆఖరికి ఇంత తెలివీ వ్యక్తిత్వమూ ప్రదర్శించిన ఆ నిగమశర్మ అక్కగారు కూడా తను కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని లబోదిబోమంటుందిట! మనుషులలో ఉండే సంకుచిత స్వభావాన్ని వెటకారం చెయ్యడమే రామకృష్ణుని పరమోద్దేశం. అతనికి పాత్రల ఔచిత్యంతో పనేలేదు.


తెలుగు అక్కలందరికీ ఒక ప్రతినిధిలా నిలిచిపోవాలనేమో, ఈ పాత్రకి పేరుపెట్టకుండా "నిగమశర్మ అక్క" అని ఊరుకున్నాడు తెనాలి రామకృష్ణుడు!


      

ఈ శీర్షికను వ్రాసిన శ్రీ  రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కూడా చివరగా వ్రాసిన మాటల్లో  చక్కని వ్యంగం తో కూడిన హాస్యాన్ని జోడిస్తూ ఇలా అంటారు "  


"అక్క సద్బుద్ధిమాట లాదరించి నిగమశర్మ నాల్గునా ళ్ళింటిలో వివేకము దెచ్చుకొన్న వానివలె నుండి, యొకనాటి రాత్రి చేతికి దొరకిన యింటి సొమ్ముల నెల్ల హరించి మూటగట్టుకొని పండుకొన్న "పడుకకును జెప్పక" పాఱిపోయెను. అప్పుడింట నందఱు నేడ్చిరి. వారితోడ నక్కయు నేడ్చినది. ఎందుకనుకొన్నారు? తమ్ముఁడు చెడెనే యని కాదు; ఇల్లు మునిఁగెనే యని గాదు; తన ప్రయత్నము వ్యర్థమాయెనే యనియునుగాదు! మఱి "క్రొత్తగా చేయించుకొన్న ముక్కర" పోయెనే యని 'దుర్వారయై' యడలెనఁట!


పరిహాసము పవిత్ర వస్తువునుగూడ గమనింపదేమో!

.G.B.K.S.Saneevi

అర్చకత్వం

 FWD...  "అర్చకత్వం" అంటే అంత సులభం కాదు ? ఎందుకు అంటున్నాను అంటే కొంతమంది మహానుభావులు ఏముందండీ మీ నోరే గా  నాలుగు మంత్రాలు చదవడం మేగా   మాలాగా గొడ్డు చాకిరి లేదు అంటారు .కానీ  అర్చకత్వం చేసేవారి మానసిక సంక్షోభం, ఒక వయస్సు వచ్చేటప్పటికీ వాళ్లు తీసుకునే సాత్వికఆహారపు అలవాట్ల కి శారీరక దౌర్బల్యం, మానసిక సంక్షోభం ఇవన్నీ కలిసి 40 ఏళ్ల వాడిని 60 ఏళ్ళ వాడిని చేస్తాయి. ఇవన్నీ  మహానుభావులకి తెలియదు. సుఖంగా కూర్చున్నదే వాళ్ళకి తెలుస్తుంది

తెల్లవారకట్ట నిద్ర లేచిన అర్చకుడు కాలకృత్యాలు నెరవేర్చుకుని దేవలయం ద్వారాలు తెరచి విగ్రహం దగ్గరనుండీ అంతా శుభ్రం చేసుకొని , అభిషేకం , అర్చనా పూర్తి అయ్యే సరికి నీరసం నిస్సత్తువ తో  ఇంటికి పోయి కాఫీ/టీ తాగుదామని అనుకొనే లోపల , భక్తులు వొచ్చి పూజచేయమని అడగంగానే అప్పుడు వారితో ఇప్పుడే వస్తానండి  ఇంటికి వెళ్ళి కొంచెము కాఫీ తాగివస్తా అంటే ! స్వామి త్వరగా రండి మాక పనిఉంది అంటారు . కొంతమందైతే 

మాకు త్వరగా అర్చన చేసిపోస్వామి అంటారు..

అలా వొచ్చిన వారికి  పూజ చేస్తూనే తీర్ధం, శఠారీ పెడుతూ  ఆకలిని చంపుతూ పూజని పూర్తిచేసి బడలిక తీర్చుకున్న అర్చకుడు ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి అవసరాలను తీర్చుకొని.. దేముడికి భోగము పెట్టి, వచ్చిన వారి గోత్ర నామాలను చెప్పి అర్చన మొదలు పెట్టిన తరువాత ఎవరో ఒకరు తమకు కూడా అర్చన మొదలు పెట్టమని మొదటి భక్తుడు ఉరిమి చూస్తూ ఉండగా రెండవ భక్తుడి గోత్రనామాలను చెపితే మొదటి భక్తుడు తన ముని మనవారళ్ళ పేర్లతో సహా చెప్పమని వత్తిడి చేస్తే కంఠం నెప్పి వచ్చినా మారు మాట్లాడకుండా అన్నీ చెప్పి పూజ చేసి తీర్ధ మంత్రంతో మూడుసార్లు వేయకుండా ఒకసారి వేసినందులకు కోపంగా చూసే కళ్ళను తప్పుంచుకుంటూ ప్రసాదం ఇచ్చి సంభావన ని చూసి నిరాసక్తంగాను ఒక్కొక్కప్పుడు ఆనందంగానూ చూసే లోపు కమిటీ మెంబర్లు వస్తే వాళ్ళ పేర్లమీద పూజచేసి ఒక కంట వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ మధ్యలో వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు మాట్లాడకుండా అర్చన చేసి ప్రసాదం ఇచ్చిన తరువాత వారు తిట్టినా కోప పడక వారి సలహాలను పాటిస్తూ  అని వాళ్ళని తృప్తి పరచి హమ్మయ్యా అని కూర్చునే లోపల భక్తుల వస్తే పూజ లేదా తీర్ధం ఇచ్చి వాళ్ళ సమస్యలను విని సలహాలు ఇచ్చే సరికి ఆకలి నకనకలాడతూ ఇంత ప్రసాదమో లేక ఫలమో తిందామటే ఉండొచ్చూ ఉండొక పోవచ్చు అనుకుంటూ ఉన్నదాంట్లో తృప్తి పడే లోపు కమిటీ లేదా  పంపిన గుఢాచారికి సరైన సమాధానమచ్చే సరికి తలప్రాణం తోకకి వస్తుంది అప్పటికి సమయం మధ్యాహ్నం 12:00 ఇక గుడిని కట్టేద్దామనుకునే లోపల భక్తులు వస్తే వారికి ప్రసాదం పెట్టి  నీరసంగా గుడి తలుపులు వేసి ఇంటికి పోయి మహా నైవేద్యం తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టి తాను తినేసరికి మధ్యాహ్నం2:00 కాస్తంత నిద్రపోయి సాయంత్రానికల్లా ఇంటి కోసం, గుడి కోసం  సరుకులను తెచ్చే సరికి గుడితీసే సమయం ప్రారంభం , ఆరాత్రి 9:00 గంటలకి గుడి మూసి ఇంటికి వచ్చి నిద్రపోయే సరికి  రాత్రి 11:00 గంటలు ఇదీ ఒక గుళ్ళోని అర్చకుని రోజువారీ వ్యవహారం, ఇంకొటి సెలవులు అవేమీ ఉండవు,  పైగా అదనంగా తిట్లు రాజకీయాలు భరించాలీ, తన కుటుంబం కోసం తాను నమ్మిన దేవత & దేవుని కోసం. పొరపాటున బయట టిఫిన్ తిన్నాడా ఇక పని ఐపోయి నట్టే ఇదీ ఒక సాధారణ అర్చకుని కధ కాదు కాదు ఇది ఒక అర్చకుని వ్యధ, ప్రతీ గుడి తిరుపతో,యాదగిరి గుట్టో కాదు!థూపదీపాలకు నోచుకోని గుళ్ళు,ఒక రోజు కూడా భో(క్త)జనానికి దొరగని "బాపని ఇళ్ళు" ఎన్నో ఉన్నాయీ మన(దేశం) తెలుగు రాష్ట్రాల్లో...

* ఇదేనయ్యా అర్చకుల బాధలు..ఇంకా వ్రాయాలంటే ఎన్నో ఉన్నాయి కాని మీరు చదవలేరు..అందుకే ముగిస్తున్నాను..🙏

అనలసంబంధ. .. భాషా చమత్కారము

 "అనలసంబంధ వాంఛనాకగునయేని

అనల సంబంధ వాంఛనా కగునుజూవె’’


ఇది కవి సార్వభౌముడు  శ్రీనాథుడి ‘శృంగార నైషధం’లో వాడిన భాషా చమత్కారం. 


యిది నలదమయంతుల పరిణయము గురించిన వృత్తాంతము.  


నలుడ్ని దమయంతి వరించింది. అతనినే పెళ్లి చేసుకోవాలనుకుంది. దమయంతీ స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా ఈ స్వయంవరానికి బయలుదేరారు. 


వారు దారిలో నలుడ్ని కలిశారు. ‘‘ఓ నలమహారాజా, నువ్వు వెళ్లి దమయంతికి నచ్చచెప్పి మాలో ఒకర్ని వివాహమాడమని చెప్పు’’ అన్నారు.


నలుడు వెళ్ళి దమయంతికి ‘దిక్పాలకులలో ఒకర్ని పెళ్లిచేసుకోమని’ చెప్తాడు. దమయంతి వినదు. 


అప్పుడు శ్రీనాథుడు పై పంక్తుల్ని రాశాడు- రెండూ ఇంచుమించు ఒకే వాక్యం- కానీ అర్థాలు వేరు:


మొదటి పాదం- అనల సంబంధం- అంటే నలుడు కాని వానితో సంబంధం!


రెండవ పాదం- అనల సంబంధం- అంటే అగ్నితో సంబంధం (అనల అంటే అగ్ని).


నలుడుకానివాడితో నాకు సంబంధం ఏర్పడి (పెళ్ళి అయితే)- నాకిక అగ్నితోనే సంబంధం! అంటే ఆత్మాహుతి తప్పదు అని భావం. 


యిలాంటి భాషా చమత్కారము శ్రీనాథునికి అందెవేసిన చేయి.

ఓం కారం ప్రణవ లక్షణము

 ఓం కారం ప్రణవ లక్షణము వక పరిశీలన. ఓ అనగా జీవుడుని దానికి ౦ పూర్ణమే జీవ లక్షణము. ప్రతీ అక్షరమునకు పూర్ణమే మూలం యిది లేని అక్షర శక్తి పలుకుట శబ్దమునకు జీవం తెలియదు. తెలుగు భాషగొప్పదనమునకు కారణం త్రిలింగ రూపము మూలమని లింగాకారం ప్రణవమే.౦ లింగార లక్షణము పూర్ణ తత్వం గల లింగరూపధారి పరమేశ్వరుడు. మహేశ్వర సూత్రములు భాష గురించి పరమేశ్వరుని ెఢమరకం నిండి వెలువడిన పూర్ణ శబ్ద లక్షణము తత్వం గురించి తెలిపిరి. ఋషులకు మహేశ్వర అనుగ్రహం వలననే పూర్ణ శక్తి తెలిసినది. మనకు కూడా అంతే. భాష ఔన్నత్యమునకు పూర్ణమే ౦ మూలం. అందుకు అమ్మ మ అనే పదమే మూలం. అమ్మ అనే మెుదటి

పూర్ణ స్వరముతో సృష్టి చైతన్యం మెుదలు. ప్రణవరూపం అర్ధం తెలియుట యే శుద్ద ఙ్ఞానము. అది నిర్మలము అనగా లింగాకారము మౌనమునకు సంకేతం తపస్సుకు మూలం మౌనం. మౌనం పరిశీలన మాత్రమే ఙ్ఞానం తో పరిశీలన. సూక్మగ్రాహి మాత్రమే మౌని. దానికి ప్రణవమే మూలం. ఉశ్ఛ్వాస నిశ్వాసములే ప్రణవ మూలం యిది ఓం కారము. పెదవులు కలుపకుండా ఓంకార జపం మౌని లక్షణమునకు తొలి రూపము. ఆపై పెదవులు కదుపులుట ఆపై అక్షర పరబ్రహ్మమును సా మ గానం సాధన ద్వారా శబ్దము శక్తిని తెలియుట. అన్ని అక్షర శబ్ద లక్షణములు మానవులకు అవసరమే. యిది శూన్యంలో వాయు రూపములో ప్రాణం. ఎంతవరకూ అనగా వాయు తత్వము గల ప్రాంతము వరకు ప్రయాణము.వాయు లక్షణము శబ్ద శక్తికి మూలమా, కాదు. వాయురూపములేకపోయిననూ శబ్దము యెుక్క అగ్ని తత్వమును వ్యాప్తికి ఆటంకం లేదు.అది హవిస్సు ఎలక్ట్రానిక్ రూపములో. ప్రణవాక్షరమునకు ముక్కు ప్రధానము దీని చిహ్నమును ఌకారము ఓ శబ్దమునకు మూలం. వాటికి పదార్ధ శక్తి లం జీవ గుర్తు ఓ రెండింటికి ౦ పూర్ణమే లం పృధ్వి తత్వం. ఓం పృధ్వి రూపరూప లం పదార్ధ చైతన్యలక్షణము జీవ తత్వం. లలితా సహస్రం కూడా యిదే విషయాన్ని తెలుపు చున్నది. ఓం లం రం హం శ్రీం యని. తెలుగు భాష పూర్ణము తీయనైనది. వేద మునకు మూలం పూర్ణ స్వరము యిది లేని స్వరం జీవంలేనిది. పూర్ణాత్ పూర్ణమిదం, యిదం యిది యనగా యీ అనే పూర్ణ శక్తి జీవ శక్తిని తెలియుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *స్వయం ప్రకటిత దీక్ష*


"నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడే వుండిపోదామని వచ్చాను..స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాను..నాకోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లూ వద్దు..ఆహారం  కూడా ఒక్కపూట మాత్రమే తీసుకుంటాను..నేను ఒక కోరిక అనుకోని ఇలా నిష్ఠగా ఉండాలని అనుకున్నాను..నాకు అవకాశం కల్పించండి.." అన్నాడు ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం.."మీ పూర్తి వివరాలు ఇవ్వండి..మీ గురించి తెలిసిన వాళ్లేవారైనా ఇక్కడ ఉన్నారా?..మేమూ విచారించుకొని చెపుతాము.." అన్నాను..మొగిలిచెర్ల గ్రామం లో తనకు దూరపు బంధువులున్నారనీ..వాళ్ళను అడిగి తన గురించి తెలుసుకోవచ్చుననీ చెప్పి, వాళ్ళ పేర్లు ఇచ్చాడు..మా సిబ్బందిని పిలిచి ఆ వివరాలు కనుక్కోమని చెప్పాను..అతని పేరు మాధవరావు..మొగిలిచెర్ల గ్రామం లో అతని బంధువులు ఉన్నమాట వాస్తవమే..ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అనీ..వ్యవసాయం లో నష్టాలు రావడం..ఇతరత్రా కారణాల వల్ల ఆర్ధికంగా దెబ్బతిన్నారనీ..చెప్పుకొచ్చారు..వ్యక్తిగతంగా మంచివాడే అని చెప్పారు..


"ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం ఉంటుంది..నువ్వు వుండదల్చుకొన్న నలభై ఒక్క రోజులూ ఇక్కడే భోజనం చెయ్యి..జాగ్రత్తగా ఉండు.." అని చెప్పాను.."చాలా సంతోషమయ్యా..స్వామివారి సేవ చేసుకుంటాను.." అన్నాడు..ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకల్లా అతను స్వామివారి మందిరం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసేవాడు..ఆ తరువాత మందిరం వెలుపల ఉన్న బావి వద్దకు వెళ్లి మళ్లీ స్నానం చేసి..నేరుగా స్వామివారి మందిరం లోకి వచ్చి..అర్చకస్వాములు ఇచ్చే ప్రభాత హారతి ని కళ్లకద్దుకొని..మంటపం లోకి వెళ్లి ఒక ప్రక్కగా కూర్చునేవాడు..మరొక గంట తరువాత..స్వామివారి మందిరం శుభ్రంగా చిమ్మి పెట్టేవాడు..మా సిబ్బంది కుంకుమను పొట్లాలు కడుతుంటే..అందులో సహాయం చేసేవాడు..మధ్యాహ్న హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రానికి వెళ్లి మితంగా భోజనం చేసి వచ్చేవాడు..ఎవరితోనూ అనవసరపు విషయాలు మాట్లాడేవాడు కాదు..


ఇరవై రోజులు గడిచిపోయాయి..ఒక ఆదివారం సాయంత్రం నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకుంటూ వున్నప్పుడు..నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.."మీతో కొంచెం సేపు మాట్లాడాలి..ఇప్పుడు వీలవుతుందా..? " అన్నాడు..పది నిమిషాల వుండమన్నాను..మరో పదినిమిషాల తరువాత..ఇద్దరమూ మందిరం లో ఓ ప్రక్కగా కూర్చున్నాము.."ఇప్పుడు చెప్పు నీసమస్య.." అన్నాను.."అయ్యా..నేను ఇక్కడికి వచ్చేముందు చాలా బాధల్లో వున్నాను..మాది పెద్ద కుటుంబం..మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లలు..నేనొక్కడినే మగ సంతానం..కొన్నాళ్ల క్రితం వరకూ బాగానే ఉన్నాము..వ్యవసాయం లో..ముఖ్యంగా పొగాకు సాగు చేసి దెబ్బతిన్నాము..అప్పుల పాలై పోయాము..ఆడపిల్లల్లో ఇద్దరికి వివాహం చేసాము..ఒక అమ్మాయికి చేయాలి..వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం తో..దిక్కుతోచలేదు..మా బంధువుల ద్వారా ఈ స్వామివారి గురించి విని..ఇక్కడ దత్తదీక్ష తీసుకొన్న వారి వద్ద అనుభవాలు తెలుసుకొని..నాకు నేనే దీక్ష లో ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను..మీరూ సహకారం ఇచ్చారు..దత్తదీక్ష నియమాలే పాటిస్తున్నాను..స్వామిని పూర్తిగా నమ్ముకున్నాను..నన్నూ నా కుటుంబాన్నీ ఒడ్డున పడేయమని రోజూ ప్రార్ధిస్తున్నాను..ఇంకొక్క ఇరవై రోజులు కూడా ఇంతే నిష్ఠతో ఉంటాను..ఒక సందేహం వచ్చి ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను..మా చెల్లెలికి సంబంధం వచ్చిందని కబురు వచ్చింది..నేను వెళ్లి రావాలి..ఇలా దీక్ష లో వున్నాను కదా..మా ఊరు వెళ్లవచ్చా..?" అని అడిగాడు..ఇవే నియమాలు పాటిస్తూ..నీ పని చూసుకొని వచ్చేయి..అని చెప్పాను..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని..నాకు ధన్యవాదాలు తెలిపి..వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు..


మరో మూడురోజుల తరువాత తిరిగి వచ్చాడు..యథావిధిగా మందిరం వద్ద తన దీక్ష కొనసాగించాడు..నలభై రోజులు పూర్తి అయిన రోజున..అతని తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు వాళ్ళ సంసారాల తో సహా అందరూ వచ్చారు..స్వామివారికి పొంగలి పెట్టుకొని..సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..రెండు మూడు నెలకోసారి మాధవరావు  స్వామివారి మందిరానికి రావడం మాత్రం మానలేదు..రెండేళ్లు తిరిగే సరికి..మాధవరావు స్వంత ట్రాక్టర్ లో తన కుటుంబం తో సహా స్వామివారి మందిరానికి వచ్చాడు.."ఇక్కడ నలభై రోజుల పాటు దీక్ష గా ఉన్నందుకు..స్వామివారు తనమీద కరుణించారనీ..ఏ పొగాకు సాగులో తాను నష్టపోయానో..అందులోనే మంచి లాభాలు వచ్చాయని..అప్పులు కూడా మొత్తం తీరిపోయాయనీ..మూడో అమ్మాయికి కూడా పెళ్లి చేసేసామనీ..సంతోషంగా చెప్పుకొచ్చాడు..ఇక నుంచీ ప్రతి సంవత్సరం అందరితో పాటు దత్తదీక్ష తీసుకుంటానని చెప్పాడు..అదే పాటిస్తున్నాడు..స్వామివారి అపార కరుణకు మాధవరావు నోచుకున్నాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)