10, ఫిబ్రవరి 2021, బుధవారం

అనలసంబంధ. .. భాషా చమత్కారము

 "అనలసంబంధ వాంఛనాకగునయేని

అనల సంబంధ వాంఛనా కగునుజూవె’’


ఇది కవి సార్వభౌముడు  శ్రీనాథుడి ‘శృంగార నైషధం’లో వాడిన భాషా చమత్కారం. 


యిది నలదమయంతుల పరిణయము గురించిన వృత్తాంతము.  


నలుడ్ని దమయంతి వరించింది. అతనినే పెళ్లి చేసుకోవాలనుకుంది. దమయంతీ స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా ఈ స్వయంవరానికి బయలుదేరారు. 


వారు దారిలో నలుడ్ని కలిశారు. ‘‘ఓ నలమహారాజా, నువ్వు వెళ్లి దమయంతికి నచ్చచెప్పి మాలో ఒకర్ని వివాహమాడమని చెప్పు’’ అన్నారు.


నలుడు వెళ్ళి దమయంతికి ‘దిక్పాలకులలో ఒకర్ని పెళ్లిచేసుకోమని’ చెప్తాడు. దమయంతి వినదు. 


అప్పుడు శ్రీనాథుడు పై పంక్తుల్ని రాశాడు- రెండూ ఇంచుమించు ఒకే వాక్యం- కానీ అర్థాలు వేరు:


మొదటి పాదం- అనల సంబంధం- అంటే నలుడు కాని వానితో సంబంధం!


రెండవ పాదం- అనల సంబంధం- అంటే అగ్నితో సంబంధం (అనల అంటే అగ్ని).


నలుడుకానివాడితో నాకు సంబంధం ఏర్పడి (పెళ్ళి అయితే)- నాకిక అగ్నితోనే సంబంధం! అంటే ఆత్మాహుతి తప్పదు అని భావం. 


యిలాంటి భాషా చమత్కారము శ్రీనాథునికి అందెవేసిన చేయి.

కామెంట్‌లు లేవు: