10, ఫిబ్రవరి 2021, బుధవారం

మొగలిచెర్ల

 *స్వయం ప్రకటిత దీక్ష*


"నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడే వుండిపోదామని వచ్చాను..స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాను..నాకోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లూ వద్దు..ఆహారం  కూడా ఒక్కపూట మాత్రమే తీసుకుంటాను..నేను ఒక కోరిక అనుకోని ఇలా నిష్ఠగా ఉండాలని అనుకున్నాను..నాకు అవకాశం కల్పించండి.." అన్నాడు ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం.."మీ పూర్తి వివరాలు ఇవ్వండి..మీ గురించి తెలిసిన వాళ్లేవారైనా ఇక్కడ ఉన్నారా?..మేమూ విచారించుకొని చెపుతాము.." అన్నాను..మొగిలిచెర్ల గ్రామం లో తనకు దూరపు బంధువులున్నారనీ..వాళ్ళను అడిగి తన గురించి తెలుసుకోవచ్చుననీ చెప్పి, వాళ్ళ పేర్లు ఇచ్చాడు..మా సిబ్బందిని పిలిచి ఆ వివరాలు కనుక్కోమని చెప్పాను..అతని పేరు మాధవరావు..మొగిలిచెర్ల గ్రామం లో అతని బంధువులు ఉన్నమాట వాస్తవమే..ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అనీ..వ్యవసాయం లో నష్టాలు రావడం..ఇతరత్రా కారణాల వల్ల ఆర్ధికంగా దెబ్బతిన్నారనీ..చెప్పుకొచ్చారు..వ్యక్తిగతంగా మంచివాడే అని చెప్పారు..


"ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం ఉంటుంది..నువ్వు వుండదల్చుకొన్న నలభై ఒక్క రోజులూ ఇక్కడే భోజనం చెయ్యి..జాగ్రత్తగా ఉండు.." అని చెప్పాను.."చాలా సంతోషమయ్యా..స్వామివారి సేవ చేసుకుంటాను.." అన్నాడు..ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకల్లా అతను స్వామివారి మందిరం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసేవాడు..ఆ తరువాత మందిరం వెలుపల ఉన్న బావి వద్దకు వెళ్లి మళ్లీ స్నానం చేసి..నేరుగా స్వామివారి మందిరం లోకి వచ్చి..అర్చకస్వాములు ఇచ్చే ప్రభాత హారతి ని కళ్లకద్దుకొని..మంటపం లోకి వెళ్లి ఒక ప్రక్కగా కూర్చునేవాడు..మరొక గంట తరువాత..స్వామివారి మందిరం శుభ్రంగా చిమ్మి పెట్టేవాడు..మా సిబ్బంది కుంకుమను పొట్లాలు కడుతుంటే..అందులో సహాయం చేసేవాడు..మధ్యాహ్న హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రానికి వెళ్లి మితంగా భోజనం చేసి వచ్చేవాడు..ఎవరితోనూ అనవసరపు విషయాలు మాట్లాడేవాడు కాదు..


ఇరవై రోజులు గడిచిపోయాయి..ఒక ఆదివారం సాయంత్రం నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకుంటూ వున్నప్పుడు..నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.."మీతో కొంచెం సేపు మాట్లాడాలి..ఇప్పుడు వీలవుతుందా..? " అన్నాడు..పది నిమిషాల వుండమన్నాను..మరో పదినిమిషాల తరువాత..ఇద్దరమూ మందిరం లో ఓ ప్రక్కగా కూర్చున్నాము.."ఇప్పుడు చెప్పు నీసమస్య.." అన్నాను.."అయ్యా..నేను ఇక్కడికి వచ్చేముందు చాలా బాధల్లో వున్నాను..మాది పెద్ద కుటుంబం..మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లలు..నేనొక్కడినే మగ సంతానం..కొన్నాళ్ల క్రితం వరకూ బాగానే ఉన్నాము..వ్యవసాయం లో..ముఖ్యంగా పొగాకు సాగు చేసి దెబ్బతిన్నాము..అప్పుల పాలై పోయాము..ఆడపిల్లల్లో ఇద్దరికి వివాహం చేసాము..ఒక అమ్మాయికి చేయాలి..వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం తో..దిక్కుతోచలేదు..మా బంధువుల ద్వారా ఈ స్వామివారి గురించి విని..ఇక్కడ దత్తదీక్ష తీసుకొన్న వారి వద్ద అనుభవాలు తెలుసుకొని..నాకు నేనే దీక్ష లో ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను..మీరూ సహకారం ఇచ్చారు..దత్తదీక్ష నియమాలే పాటిస్తున్నాను..స్వామిని పూర్తిగా నమ్ముకున్నాను..నన్నూ నా కుటుంబాన్నీ ఒడ్డున పడేయమని రోజూ ప్రార్ధిస్తున్నాను..ఇంకొక్క ఇరవై రోజులు కూడా ఇంతే నిష్ఠతో ఉంటాను..ఒక సందేహం వచ్చి ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను..మా చెల్లెలికి సంబంధం వచ్చిందని కబురు వచ్చింది..నేను వెళ్లి రావాలి..ఇలా దీక్ష లో వున్నాను కదా..మా ఊరు వెళ్లవచ్చా..?" అని అడిగాడు..ఇవే నియమాలు పాటిస్తూ..నీ పని చూసుకొని వచ్చేయి..అని చెప్పాను..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని..నాకు ధన్యవాదాలు తెలిపి..వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు..


మరో మూడురోజుల తరువాత తిరిగి వచ్చాడు..యథావిధిగా మందిరం వద్ద తన దీక్ష కొనసాగించాడు..నలభై రోజులు పూర్తి అయిన రోజున..అతని తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు వాళ్ళ సంసారాల తో సహా అందరూ వచ్చారు..స్వామివారికి పొంగలి పెట్టుకొని..సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..రెండు మూడు నెలకోసారి మాధవరావు  స్వామివారి మందిరానికి రావడం మాత్రం మానలేదు..రెండేళ్లు తిరిగే సరికి..మాధవరావు స్వంత ట్రాక్టర్ లో తన కుటుంబం తో సహా స్వామివారి మందిరానికి వచ్చాడు.."ఇక్కడ నలభై రోజుల పాటు దీక్ష గా ఉన్నందుకు..స్వామివారు తనమీద కరుణించారనీ..ఏ పొగాకు సాగులో తాను నష్టపోయానో..అందులోనే మంచి లాభాలు వచ్చాయని..అప్పులు కూడా మొత్తం తీరిపోయాయనీ..మూడో అమ్మాయికి కూడా పెళ్లి చేసేసామనీ..సంతోషంగా చెప్పుకొచ్చాడు..ఇక నుంచీ ప్రతి సంవత్సరం అందరితో పాటు దత్తదీక్ష తీసుకుంటానని చెప్పాడు..అదే పాటిస్తున్నాడు..స్వామివారి అపార కరుణకు మాధవరావు నోచుకున్నాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: