10, ఫిబ్రవరి 2021, బుధవారం

అక్క పలకరింపు

 అక్క పలకరింపు: 


శా. ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో

     ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ

     క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్

     నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్


నిగమశర్మ  అక్క పలకరింపు అంటూ, మధ్యలో ఈ పద్య ప్రవేశం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా ?  వద్దండీ,  అంతగా ఆశ్చర్యం వలదు.  బహుశా మీరందరూ వినే ఉంటారు ఈ విషయం గురించి.  ఒక ఇరవై, ఇరవై రెండు సంవత్సరాల కు పూర్వం  ఈ విషయం  తెలుగు పాఠ్యాంశంలో కూడా  చదువుకుని ఉండచ్చు.  అయినా  మరొకసారి  చూద్దాం ఏమిటో ! 


పై పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము అనే ప్రబంధపు తృతీయాశ్వాసం లోనిది.  చాలా చక్కని పద్యాలున్న ఈ ప్రబంధంలో పండరీపురంలోని పాండురంగ విఠలుని మాహాత్మ్యమూ, లీలలూ, ఆయన భక్తుల కథలూ మొదలైనవి వర్ణించబడ్డాయి. ఆ స్వామి ప్రభావాన్ని వివరించడంలో భాగంగా చెప్పిన నిగమశర్మోపాఖ్యానము  లోనిది పై పద్యం.    


పూర్వం పిఠాపురంలో నిగమశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు. పేరు మాత్రం గొప్పగా నిగమశర్మ (నిగమములు = వేదములు) అని వుంది కాని అతనికి లేని పాడు బుద్ధులు లేవు. జూదరి, వేశ్యాలంపటుడు. వాడి ప్రవర్తన మార్చడానికి వాడి భార్యా, తల్లీతండ్రులూ ఎంతో శ్రమపడతారు. కానీ వాడిది పిల్లి శీలము. చదువులు చిలుక చదువులు. వాడు తాత తండ్రులు సంపాదించిన ఆస్తి అంతా వేశ్యలకు ధారపోశాడు. తల్లి నగలు తాకట్టు పెట్టాడు. దొరికిన చోట్లల్లా అప్పు చేశాడు. బంధువులను యాచించాడు. ఈ రకంగా భ్రష్టు పట్టిపోయిన వీషయం తెలుసుకొని అతని అక్క, తమ్మునికి మంచిబుద్ధి చెప్పడానికి భర్తనూ, పిల్లలనూ తీసుకొని పుట్టింటికి వస్తుంది. అలా వచ్చి, తమ్ముని సంబోధిస్తూ బుద్ధి గరిపే సందర్భంలో మాట్లాడిన తొలి మాటలను వివరించే పద్యం ఇది.


ఇక్కడ నిగమశర్మ అక్కను గురించి విపులంగా ముచ్చటించుకొని తీరాలి. ఎందుకంటే, ఈమె తెలుగు సాహిత్యంలో మర్చిచిపోలేని పాత్రల్లో ఒకటి. తెనాలి కవి ఈమెకు పేరేమీ పెట్టలేదు. అయినా ఏమి, ఎంతో పేరు ఆమెకు ఆమే సంపాదించుకున్నది. పెద్దన వరూధినిలాగా, తిమ్మన సత్యభామలాగా, గురజాడ మధురవాణిలాగా, కలకాలం గుర్తుండిపోయే పాత్ర ఈ అక్కది. ఇప్పుడు చెప్పుకున్న మిగతా నాయికలందరూ ఆయా కావ్యాల్లో చాలా దీర్ఘమైన కార్యక్రమాలే నిర్వహించారు గాని, నిగమశర్మ అక్క మాత్రం కావ్యంలోని ఒక చిన్న ఉపాఖ్యానంలో ఒక క్షణం పాటు జిగేల్మని మెరిసి పోయిన మెరుపు మాత్రమే. అయినా మరపు రాని మగనాలు. పుట్టింటికి వచ్చిన ఎన్నో రోజుల తర్వాత గాని తమ్ముడు ఇంటికి వచ్చి ఆమెను కలవడు. ఈ లోపల ఆమె ఆ ఇంట్లోనిర్వహించిన వ్యవహారం – ఒక ముఖ్యమైన నేపథ్యం. ఆ తర్వాత, తమ్ముడు వచ్చిన పిమ్మట అతనితో మాట్లాడబోయే ముందు జరిగిన తతంగం మరో నేపథ్యం. ఈ రెండు నేపథ్యాలూ ఆమె పాత్రను ఎంతో అద్భుతంగా ప్రోత్తుంగపరచినవి.


తల్లిదండ్రులు ముసలివారు. తమ్ముడు ఇల్లు పట్టకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతుండె. మరదలు చిన్నపిల్ల. అట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఎలా వుండాలో అలానే వున్నది. ఈమె వచ్చి తల్లిదండ్రులను ఊరడిస్తూ ఉపచారాలు చేస్తూ కొంత కొంత వారికి ఉపశమనం కలిగించింది. వెనక బట్టిన దేవతార్చనను పునరుద్ధరించింది. అతిథి అభ్యాగతులను ఆదరించడం మొదలు పెట్టింది. తల్లి తన దగ్గర తమ్ముడికి కనబడకుండా వుంచుకున్న డబ్బులను జాగ్రత్త చేసింది. దాసదాసీలను అభిమానంగా దగ్గరకు తీసింది. 


పశుపోషణాదికాన్ని స్వయంగా పర్యవేక్షించడం ప్రారంభించింది. ఇంట్లో పెద్ద గ్రంధాలయం వున్నట్లున్నది – పుస్తకాలను వరసగా పేర్చడమూ, ఇతరులు తీసుకుపోయిన పుస్తకాలను తిరిగి రాబట్టడమూ, చినిగినవాటిని మరమ్మత్తు చేయడమూ – దాని పనులను భర్తకు పురమాయించింది. ఇంటి మరమ్మత్తులకు – మెత్తడమూ, అలకడమూ,సర్దడమూ – స్వయంగా పూనుకుంది. రాజానుగ్రహంతో వచ్చిన గ్రామభోగాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నది. తప్పిదారిన మడీ మట్రా, చేనూ చెట్టూ – వీటికి జాగ్రత్తగా కాపలా నియమించింది.


ఇదీ, ఆమె పుట్టింటికి వచ్చిన తర్వాత కావించిన నిర్వహణ. (పాపం, ఇన్ని చేస్తున్నా కాపురానికి వచ్చి యౌవనారంభంలో వుండి, భర్త ఆదరణకు నోచుకోని మరదలి స్థితికి “వగచి వగచి కడుపు చుమ్మలు జుట్టి కన్నీరుట్టిపడగా” బాధపడుతూనే వున్నది). పైన తెల్పిన మొదటి నేపథ్యం ఇది.

ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే. పుట్టింట్లో ఏ శుభకార్యం జరిగినా, అన్ని మర్యాదలూ దర్జాగా జరిపించుకొని, ఇతరులకు చెప్పుకుని మురిసిపోయేది ఆడబడుచే. ఆ స్వతంత్రంతోనే తమ్మునికి బుద్ధి గరపడానికి వచ్చింది ఆమె. ఆ చొరవతోనే ఇల్లంతా ఒక దోవకు తెచ్చింది మళ్ళీ.


ఇంతలో ఒకరోజు ఉన్నట్టుండి “చుక్క తెగిపడిన వడుపున” ఇంటికి వచ్చాడు నిగమశర్మ. చాలా రోజుల తర్వాత చూసింది గదా అని కౌగిలించుకోబోయింది కాని, వాడి వంటినిండా నఖక్షతాలున్నాయిట. వాటిని చూసి అసహ్యించుకుంది. పాపం మనసులో కూడా అపవిత్రతకు తావీయక దేవతార్చనలు గావించుకునే ఇంటి ఇల్లాలు గదా. ఐనా వాడిని విముఖుని చేసుకోరాదనే సంగతి తెలుసు. మేనల్లుని ఎత్తుకోమని అందించింది. నిమిషంలో శాకపాకాలు తయారు చేస్తాను, మీ బావతో కలిసి భోంచేద్దువు గాని, స్నానం చేసి రమ్మంది. అతనికి చేయవలసిన ఉపచారాల కోసం మరదలికి కనుసైగ చేసింది. అభ్యంగన స్నానం చేయించింది. ఉతికిన ధోవతీ, ఉత్తరీయమూ ఇప్పించింది. తల తానే శుభ్రంగా తడి లేకుండా తుడిచింది. ఒంటికి గంధం రాచింది. తలలో పూలు తురిమింది. బావా తలిదండ్రుల పంక్తిలో కూర్చోబెట్టి షడ్రసోపేతమైన భోజనం వడ్డించింది. అనంతరం, అరుగు మీద కూర్చుని వుండగా మరదలి చేత తాంబూలపు చిలకలు ఇప్పించింది. తనూ తమ్ముని దగ్గరకు చేరింది. చంటి పిల్లవాడిని ఎత్తుకుని, వాడికన్నా ముందువాడు తన పక్కపక్కనే తిరుగుతూ వుండగా, తమ్ముడి తలముడి విప్పింది. ఈరువానతో (పెద్ద పండ్లు గల దువ్వెన) తలవెండ్రుకల చిక్కు తీసి దిగ దువ్వి, కుచ్చు విడదీసి పైకెత్తి, పేలను గాలించి గోరుముక్కులతో నలిపింది. లేచి శుభ్రంగా (గరగరగా) చేతులు కడుక్కొని వచ్చింది. మరదలు తనకు తాంబూలం ఇస్తే నోట పెట్టుకున్నది. మరదలు విసనకర్రతో విసురుతూ పక్కన నిలబడి వుండగా, దాసీ తెచ్చిన పీటపై కూర్చుని, బిడ్డ చనుబాలు త్రాగుతూ వుండగా, కుడివైపుకు కొంచెము ఒత్తిగిల్లి, పద్మవనంలో కొలువున్న లక్ష్మీదేవిలా కూర్చొని, తమ్మునికి హితబోధ ప్రారంభించింది. ఇది రెండో నేపథ్యం.


ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది. ఆ సందర్భంలోని మొట్టమొదటి పద్యం మనం పైన చదువుకున్నది.


ఉపదేశం తిట్టడంతో గానీ, తప్పులెంచడంతో గాని, ఆమె మొదలు పెట్టలేదు. ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ, వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది.

ప్రారంభించిన వేదపాఠాలకు విఘ్నం కలుగుతుందనా రావడం లేదు అని అడగడం ఎందుకు? ఆమెకు తెలియకనా వాడు వేదపాఠాలను పక్కనబెట్టి చాలా రోజులే అయిందని. అయినా తెలీనట్లే అడిగింది. వాడు రాగానే తిట్లకు లంకించుకోవడం సరిగాదు. నువ్వేమిటి నాకు చెప్పేది అని వాడు విదిలించుకొని పోకుండా, ఎంతో ఆప్తంగా కొడుకుని ఎత్తుకోమని ఇవ్వడం, స్వయంగా వడ్డించడం, తల దువ్వడం లాంటి పనుల్తో వాడి మనసులో విరసపు భావం తొలగించేందుకు జాగ్రత్త పడింది. నెలపొడుపు కోసం సముద్రంలాగా నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది. ఇది ఏదో ఆషామాషీగా వేసిన పోలిక కాదు. చంద్రుడు సముద్ర మధన సమయంలో – అందులోంచి పుట్టాడనేది ప్రసిద్ధం. అందువలన వారిది తండ్రీకొడుకుల సంబంధం. కొడుకు ఉదయించి, క్రమంగా మిన్నందుతుంటే తండ్రికి ఎంతో సంతోషం. అందుకనే పున్నమి రోజున సముద్రంలో వచ్చే ఆటుపోట్లు – సముద్రుడు కొడుకు ఉన్నతికి ఉప్పొంగడంగా కవులు ఉత్ప్రేక్షించారు. నీ శ్రేయం కోరేవాడు తండ్రి. అతని మాటలు నువ్వెట్లా వినడం లేదు? అక్కా బావలు, తలిదండ్రుల తర్వాత అంతటివారు. నీ శ్రేయస్సు కోరేవారు. నీ ఉన్నతిని కాంక్షించేవారు. నీ అభ్యుదయానికి ఆనందించేవారమైన మా మాటలయినా విను నాయనా, అని ధ్వని.


ఒక్కసారి, ఆమె ప్రవర్తనా, ఆమె గృహ నిర్వహణ చేసిన తీరూ, మాట్లాడే ధోరణీ, కూర్చున్న వైఖరీ – ఇవన్నీ మనసులోకి తెచ్చుకొని, ఆమె చెప్పిన ఈ పద్యం తలచుకుంటే ఎంతో ఉజ్జ్వలంగా కన్పట్టక మానదు. ఆ పద్యంతో ప్రారంభించి ఒక పది పద్యాలలో అతని వంశ ప్రతిష్ఠనూ, ఇంటి దుస్థితినీ, భార్య పరిస్థితినీ, వచ్చిన దుష్కీర్తినీ వివరించి, అతను కాదనడానికి వీల్లేని పరిస్థితిని కల్పించి, తాత్కాలికంగానైనా తన మాటలకి ఒడబడేటట్లు మాట్లాడింది – అదీ నిగమశర్మ అక్క అంటే. అక్కడ ఆమె చేత ఉపదేశం చేయించిన తీరూ, మనం పైన అనుకున్న రెండు నేపథ్యాల కల్పనా – ఇవి రామకృష్ణుని అద్భుత ప్రతిభకూ, లోకజ్ఞతకూ నిదర్శనాలు. ఈ ఒక్క పద్యమే కాదు, ఆ సందర్భంలోని పద్యాలన్నీ ఆణిముత్యాలే!


నిగమశర్మ అక్కని ఇంత గొప్పగా చిత్రించి కూడా ఆవిడకో పేరు ప్రసాదించలేదు! అదే మరి రామకృష్ణుని కొంటెతనం :-) ఇంతకన్నా కొంటెతనం మరొకటి ఉంది. ఈవిడగారు ఎంత నచ్చచెప్పినా మారినట్టు నటిస్తాడే కానీ నిజంగా మారడు నిగమశర్మ. ఓ రోజు డబ్బు దస్కం మూటగట్టుకొని చక్కా ఉడాయిస్తాడు. పొద్దున్న విషయం తెలిసిన ఇంటిల్లపాదీ ఏడవడం మొదలుపెడతారు. నిగమశర్మ పారిపోయినందుకు కాదు, పోతూ పోతూ తమ తమకిష్టమైన వస్తువులు తీసుకుపోయాడనిట! ఆఖరికి ఇంత తెలివీ వ్యక్తిత్వమూ ప్రదర్శించిన ఆ నిగమశర్మ అక్కగారు కూడా తను కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని లబోదిబోమంటుందిట! మనుషులలో ఉండే సంకుచిత స్వభావాన్ని వెటకారం చెయ్యడమే రామకృష్ణుని పరమోద్దేశం. అతనికి పాత్రల ఔచిత్యంతో పనేలేదు.


తెలుగు అక్కలందరికీ ఒక ప్రతినిధిలా నిలిచిపోవాలనేమో, ఈ పాత్రకి పేరుపెట్టకుండా "నిగమశర్మ అక్క" అని ఊరుకున్నాడు తెనాలి రామకృష్ణుడు!


      

ఈ శీర్షికను వ్రాసిన శ్రీ  రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కూడా చివరగా వ్రాసిన మాటల్లో  చక్కని వ్యంగం తో కూడిన హాస్యాన్ని జోడిస్తూ ఇలా అంటారు "  


"అక్క సద్బుద్ధిమాట లాదరించి నిగమశర్మ నాల్గునా ళ్ళింటిలో వివేకము దెచ్చుకొన్న వానివలె నుండి, యొకనాటి రాత్రి చేతికి దొరకిన యింటి సొమ్ముల నెల్ల హరించి మూటగట్టుకొని పండుకొన్న "పడుకకును జెప్పక" పాఱిపోయెను. అప్పుడింట నందఱు నేడ్చిరి. వారితోడ నక్కయు నేడ్చినది. ఎందుకనుకొన్నారు? తమ్ముఁడు చెడెనే యని కాదు; ఇల్లు మునిఁగెనే యని గాదు; తన ప్రయత్నము వ్యర్థమాయెనే యనియునుగాదు! మఱి "క్రొత్తగా చేయించుకొన్న ముక్కర" పోయెనే యని 'దుర్వారయై' యడలెనఁట!


పరిహాసము పవిత్ర వస్తువునుగూడ గమనింపదేమో!

.G.B.K.S.Saneevi

కామెంట్‌లు లేవు: