8. " మహా దర్శనము--ఎనిమిదవ భాగము --సందడే సందడి
8. ఎనిమిదవ భాగము--- సందడే సందడి
" జాత కర్మ అనునది ఒక వైదీక కర్మ . దానికి లౌకిక అంటు సోకకూడదు . " అని దేవరాతుని హఠము . అయితే రాజ భవనము దానికి ఒప్పుకోలేదు . ’ వంశభూషణుడైన కొడుకు పుట్టినాడు . కాబట్టి దిగ్దిగంతాలకూ ఈ సమాచారము వ్యాపించవలెను ’ అని వారి వాదము . అంతేగాక , దేవరాతుని పై తన ప్రభావమును చూపి అతనిని రాజభవనపు సలహాను అంగీకరించునట్లు చేయవలెనని భార్గవుని ప్రయత్నములు . ఆ మిథిలా నగరములో భార్గవుని మాటను తిరస్కరించినది ఒక్కరే ఒక్కరు , వారే ఆ వృద్ధ బుడిలులు . " వారిని వదిలేయండి , తాము అపరిగ్రాహులు , ఇతరులు కూడా అపరిగ్రాహులుగా ఉండాలనే వారి ఆశ " అని చాలామంది మూతులూ ముక్కులూ ముడుచుకునేవారే .
మొత్తానికి జాతకర్మ రాజవాడలో జరుగు కర్మ వలెనే నడచింది . ఒక బండెడు చక్కెర పంచినారు . రాజాస్థానపు జ్యోతిష్యులే వచ్చి జాతకమును రాసినారు . వారికి అంతులేని ఆశ్చర్యము , ’ ఆచార్యులవారూ , నేనింతవరకూ ఇట్టి శుభ జాతకమును చూచియుండలేదు . తులా లగ్నము , చతుర్థములో కుజుడు ఉఛ్చములో ఉన్నాడు . దశమములో గురువు ఉఛ్చ. , ద్వితీయములో రవి ఉండుట చూస్తే , ఇతడు వంశభూషణుడే కాదు , లోకవిభూషణుడగుటలో సందేహమే లేదు . ఇతనికి ఎదురుమాట్లాడి నెగ్గగలవారే లేరు . " అని ఎన్నోవిధములుగా పొగిడినారు . ఆదినము పుత్రోత్సవమని ఆచార్యుడు రెండు మూటల చక్కెరను తెప్పించినాడు . ఆస్థానమునుండీ మూడు మూటల చక్కెర వచ్చినది . ఐదు మూటల చక్కెరనూ పంచినారు .
నామకరణపు దినము కూడా అటులే అయినది . లోకభూషణుడగు వాడు పుట్టినాడన్న తర్వాత మహారాజుకు అభిమానము ఇనుమడించినది . ఒక నూరు బళ్ళ బియ్యమును సోపస్కరము ( ఇతర సంభారములు ) తోపాటు పంపినారు . దానిలో మిగిలించుకోవలెనను ఆలోచనకూడా లేక ఆచార్యుడు తన ఇంటిలో నిండిన బియ్యము , పప్పులను వాటితో చేర్చినాడు . వైదీక కర్మ ముగిసేవేళకు మధ్యాహ్నమయినది . మొదట పుణ్యాహ వాచనము , భూమినుండీ ఎప్పుడూ పైకి లేచు ఆఘాహ శక్తులను కడిగివేసి , పైనుండీ దిగు పుణ్యాహ శక్తులు అంతటా వ్యాపించునట్లు చేయుటయే పుణ్యాహపు ఉద్దేశము . ఆ ఉద్దేశము నెరవేరినట్లు వచ్చిన వారందరికీ తెలియునట్లు ఎక్కడెక్కడ చూచినా ప్రసన్నత నిండిపోయినది . నవగ్రహ హోమము , ఆయుష్య హోమములూ నడచినవి . నవగ్రహములు ప్రసన్నులై వచ్చి ఆహుతిని తీసుకొని పోవుటను అక్కడ జ్ఞాన చక్షువులున్న వారందరూ చూచి ’ వల్లె వల్లె ’ అన్నారు . ఆయుష్య హోమకాలములో అగ్ని ప్రసన్నుడై జ్వాలామాలా పరిశోభితుడైనను , శాంతుడై ప్రదక్షిణాకారముగా సంచరిస్తూ హవ్యమును స్వీకరించినాడు . హోమమునకు వచ్చిన ఋత్విజులు ’ మేము ఇంతవరకూ ఎన్నో హోమములు చేసినాము , కానీ యజ్ఞేశ్వరుడు ఇంతగా ప్రసన్నుడగుటను ఎక్కడా చూడలేదు . పొగ యనునదే లేదు , భలే , భలే ! చూడబోతే ఈ పిల్లవాడు దేవకార్యార్థియై జనించినట్లున్నది . ’ అని పాపడిని పొగడినారు . కొందరు ఇతరులు ’ మీరు సరిగ్గా చూడండి , అక్కడ కూర్చున్నది ఎవరు ? సాక్షాత్ ’ యజ్ఞవల్క్య ’ పేరున్న దేవరాతుడు . వారు ఆచార్యులు కూడా ! వారు ఎన్ని యాగములలో అధ్వర్యులై యజ్ఞేశ్వరుని , దేవతలనూ మెప్పించినారో ! వారే యజమానులై కూర్చున్నపుడు ఇలాగయగుట అదేమి ఆశ్చర్యము ? " అన్నారు .
తరువాత పితృ పూజారూపమైన ’ నాందీ ’ యజ్ఞము నెరవేరినది . పుత్రుడికి దేవరాతుడు ’ యాజ్ఞవల్క్యుడు ’ అనియే పేరు పెట్టినాడు . అక్కడికి వచ్చిన కులపతి వైశంపాయనుడు , ఉద్ధాలకుని ముఖమును చూచినాడు . అతడు ముసి ముసిగా నవ్వుచూ , ’ " ఈ శిశువు బ్రహ్మ జ్ఞానియై , కర్మత్యాగము చేయునని ఆచార్యులకు బెదురు . దానివలన , ఈ పేరుంటే ఎల్లపుడూ అతనికి తాను కర్మఠ వంశపు వాడిని యని గుర్తుండవలెనని ఆచార్యుల అభిమతము . కానివ్వండి , ఇంటిలో ఎలాగైనా వేరే పేరుతోనే కదా పిలుస్తారు ! " అన్నాడు . వైశంపాయనులు తలయూపి , సత్యము అన్నారు . మొత్తానికి మాధ్యాహ్నికపు వేళకు వైదిక కర్మ అంతా ముగిసినది .
ఆచార్యుల ఇంటి వెనకే ఒక పెద్దతోట ! దానిలో విస్తరించియున్న ఒక తటాకము . ఆ తటాకము పక్కనే విశాలముగా పాకశాలను కట్టినారు . " వంట అంతా సిద్ధముగానున్నది . అందరూ మాధ్యాహ్నికమునకు లేవ వచ్చును " అని వంటవారు వచ్చి అందరినీ హెచ్చరించినారు . త్రికాల స్నానము చేయువారు స్నానమునకు సిద్ధమైనారు . మిగిలిన వారు తమ తమ కర్మలలో ప్రవృత్తులైనారు .
అక్కడున్న వృద్ధులలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది , " కార్తీక మాసము వనభోజనము. ఉసిరి చెట్టు కూడా ఉంది , ఒక ధాత్రీ హవనము ఏల చేయరాదు ? " అనిపించి ఆచార్యులను వెదకికొని పోయి తమ సలహాను వారి ముందుంచినారు . వారు , " మంచి ఆలోచన , గృహ శౌచము కూడా గడచినది , ఎందుకు చేయరాదు ? అయినా ఇద్దరు కులపతులు వచ్చినారు , వారినొకసారి అడిగి చూదాము " అని వారిని పిలుచుకొని, కులపతులను వెతుక్కుంటూ పోయినారు .
ఇద్దరూ చెరువు ఒడ్డునే కనిపించినారు . ఒకరు అప్పుడే స్నానము చేసి , శిష్యుడు ఇచ్చిన మడి కట్టుకుంటున్నారు . ఇంకొకరు నీటిలో దిగుతున్నారు . ఆచార్యుడు వచ్చి , " యజమానులు ఏమో చెప్పవలెనని యున్నారు " అని విషయమును ప్రస్తావించినారు . కులపతి వైశంపాయనుడు తల ఊపుతూ , ’ మంచి సలహా , అటులే చేసెదము , అయినా ఉద్ధాలకులు కూడా రానీ . వారిని అడిగి చేదాము , ఆ వేళకు హవనమునకు కావలసిన సామగ్రినంతటినీ సిద్ధము చేసుకొనండి . దానికోసము ప్రత్యేకముగా ఒక చరువు కానివ్వండి , అన్నారు . ఆచార్యుడు సరేనని ఆ అనుమతిని నెరవేర్చుటకు శిష్యుడొకనిని పంపించి , తాను , సలహాను సూచించిన వృద్ధునితోపాటు ఉద్ధాలకుని కోసము కాచుకున్నాడు .
వారుకూడా వచ్చినారు , సలహాను విని , " ఎందుకు చేయరాదు ? అవశ్యము చేయవచ్చును . కానీ చాతుర్వర్ణముల వారందరూ రావలెను కదా ! " అన్నారు . వైశంపాయనులు " ఎక్కడికి వెళ్ళినా , రాజభవనపు వారందరూ రాలేదే అనునదొకటే కొరత . అయితే , ఆచార్యుల ఇంటిలో సమారాధనము అంటే ముఖ్యులైన వారందరూ వచ్చే ఉంటారు . అతి ముఖ్యముగా ఆ బుడిలులు వచ్చినారు కదా ? వారు వస్తే ఒక లక్ష మంది వచ్చినట్టు . " ఆసహస్రాత్ పంక్తిం పునంతి " అటువంటి వారొక్కరు వస్తే చాలు . వారు కూర్చున్న పంక్తి మాత్రమేనా ? వారు నడచిన అంతటా భోజనానికి కూర్చున్నవారంతా కృతార్థులే ! వారినే ఆపోశన ఇవ్వమని అడిగితే సరి ! " అన్నారు . అంతలో సన్నాహములకు వెళ్ళిన శిష్యుడు వచ్చి అంతా సిద్ధమగుచున్నది అని తెలిపినాడు .
బ్రహ్మయజ్ఞమైన తర్వాత ఇద్దరు కులపతుల సమ్ముఖములో బుడిలులు ధాత్రీ హవనము చేయుదురు అని నిర్ణయించడమైనది . సకాలములో ధాత్రీ హవనమై , అందరూ వైశ్వేదేవమును నెరవేర్చినారు . భోజనాత్పూర్వములోను , భోజనాత్పరము లోనూ వేదఘోషలు మ్రోగినవి . అప్పుడక్కడ ఉన్న చాతుర్వర్ణముల వారూ పుష్కలముగా భోజనము చేసినారు . సంధ్యవరకూ సమారాధన నడచినది . ఆచార్యుల గాదెలలో నింపిపెట్టిన బియ్యమూ , పప్పులూ అన్నీ వెచ్చమైనవి . అయినా ఆచార్యుని ముఖములో చింతాఛాయలే కనపడలేదు . " సర్వమూ సార్థకమైనది , భూత తృప్తి యయినది , ఈ బాలుడి జీవితములో కూడా సర్వమూ ఇటులనే సార్థకమవనీ , వాడు అనృణుడై కృతార్థుడు కానీ " అని నమస్కారము చేసినాడు .
ఇక్కడ ఆలంబినీ దేవి కూడా కొడుకు సౌఖ్యము కోసము ఏమేమి కావలెను అని ఆలోచిస్తుండినది . బహుదినములనుండీ సేకరించిన ధావళులన్నీ బయటికి వచ్చినాయి . మూడు నాలుగు నెలలనుండీ ఆలంబినీ , జాయంతులు కూడబెట్టిన చీరలూ పంచెలూ , మూటల్లోనున్నవన్నీ గాలికి ఆరేసినారు . జాయంతి మనవడికి హారతి నిచ్చుటకని ఉండలు సిద్ధపరచినది . తొట్టిలు తన స్థానములో అలంకృతమై పాపడిని పిలుచుకొని వచ్చుటకు ఏర్పాటు అయినది . ఆదినము సాయంకాలము అతివల సందడే సందడి . వారి సంభ్రమము మగవారు ఊహించి తెలుసుకోవలసినదే తప్ప , అనుభవించి అర్థము చేసుకొనుట వారి నుదుట రాయనే లేదు . ఆడవారు సంభ్రమము పొందుటకు తమ కార్యమే కానవసరము లేదు . తమకు సంబంధమే లేకున్ననూ , ఇంకొకరి ఇంటిపనే అయిననూ , దానిని అభిమానించగలరు . అలాంటపుడు , ఆచార్యులు , ఆచార్య పత్నులు ఊరికందరికీ కావలసినవారైనపుడు , ఇంక చెప్పవలెనా ?
పాటల పిలుపులలో , కోలాటము , పేరంటపు ఆటపాటలలో , నవ్వుల నర్తనములలో పూజమొదలు జరగవలసిన తంతులన్నీ జాయంతి నేతృత్వములో జరిగినాయి . అందరూ , ’ బాలింతను చూచినారా ? బిడ్డతల్లి వలె లేనే లేదు , పదహారేళ్ళ లేత పడుచువలె నున్నదే ? " అనువారే ! వచ్చినవారంతా పాపడిని చూసి ఆనందముతో , ’ ఆలంబీ ! మొదట నీ కొడుకుకు దిగదుడుచు . తొట్టిలు నిండా పరుండిన ఈ శిశువును చూచి ముచ్చట పడని వారెవరు ? దృష్టి తగలకుండా ఉంటుందా ? పున్నమి చంద్రునిలాగా వెలుగుతున్నాడు . ఆ నుదురు చూడు , ఆ చిన్ని ముక్కు చూడు , ఆ నోరు చూడు , ఆ పెదవులు చూడు , అక్కడ చూడు ఆ చిన్ని చిన్ని చేతులు ! ఆ వేళ్ళు చూడు , ఎంతపొడుగ్గా ఉన్నాయో , ఆ చెవులు చూడు , అప్పుడే ఏనుగు చెవుల్లాగా లేవూ ? " అని పలువురు పలు రకాలుగా పొగడుతున్నారు . అందరి నోటిలోనూ ఒకే మాట ! " ఆలంబమ్మ అదృష్టవంతురాలు . అంతటి భర్త ! ఆ భర్తకు తగ్గ కొడుకు ! మొత్తానికి ఈ కొడుకును పొంది జన్మ సార్థకము చేసుకున్నది . ఆచార్యులు పుత్రుడు కావాలీ అని చేసిన తపస్సు సార్థకమైనది . "
వారు భవిష్యత్తును తెలిసినవారు కారు . వారిలో ఎవరైనా శాస్త్రజ్ఞులు ఉండిఉంటే , తాము ఆడినమాటలు లోకాభిరామముగా ఆడినవి కావు , అది శాస్త్రవాణి వలెనే తథ్యమగుతుంది అని తెలిసి , నమ్మకముతో నిండేవారు .
ఆ సందడులు , కోలాహలములు శాంతమైన తరువాత , ఆచార్యులు వచ్చి భార్యను మాట్లాడించినారు . ఆమె భర్త వచ్చినాడని లేవబోయింది . భర్త , " వద్దొద్దు , ఇకపైన నా పుత్రుడి తల్లివి అని నిన్ను గౌరవించవలెను . నువ్వు గౌరవించుకాలము గడచిపోయినది . చూడు , నేనొచ్చినది నిన్ను హెచ్చరించుటకు . ఇకమీద పాపడిని ఎత్తుకొనునపుడు మరవకుండా సరస్వతీ ధ్యానము చేయి . ఉయ్యాలలో పరుండబెట్టి ఊపునపుడు ’ భద్రం కర్ణేభిః ’ చెప్పుతూ ఉండు . ఒకవేళ సంస్కృతములో చెప్పుట వద్దనిపిస్తే , దాని అర్థమును లౌకిక భాషలో పాటగా చేసుకొని పాడుతూ ఉండు . మిగతా అప్పుడు , వాడిని తొడపైన వేసుకొని ఆడించునపుడు , ’ పూర్ణమదః ’ మరవవద్దు . నేనిక వస్తాను , పొద్దుటినుంచీ నీకు కూడా తీరిక లేనంత పనితో ఆయాసమై ఉంటుంది , పడుకొని నిద్రపో . దేవతలు నిన్నూ , నీ కొడుకునూ కాపాడనీ ! " అన్నాడు . ఆవేళకు భోజనానికి వెళ్ళిన జాయంతి వచ్చినది . అత్త వచ్చినది చూసి అల్లుడు గౌరవముగా లేచి వెళ్ళిపోయినాడు .
తల్లి , కూతురితో హాస్యమాడింది , " అదేమిటే , మొగుడిని పిలిపించుకున్నదానివి , కొడుకుని వారి చేతికి ఇచ్చి ఉండకూడదా ? " అన్నది . కూతురు ఆ హాస్యమును ఆనందిస్తూ , కొంటె తనము కనుపించునట్లు , " మేమిలాగ ఉండాలనే కదా , నువ్వుకోరేది ? వారి కొడుకును వారు ఎత్తుకుంటే నేను అడ్డురాకూడదే తప్ప , నేను ఇవ్వాలేమిటి ? అయినా మధ్యాహ్నము నుండీ , కావలసినంత సేపు చూస్తూ ఉన్నారు కదా ? ఈ నెల పురిటి మైల గడచిన తర్వాత వద్దన్నా ఎత్తుకుంటారు . ఇప్పుడు వచ్చినది , మంత్రములు జపము చేస్తూ ఉండు , ఆఖరికి మంత్రార్థమునైనా నెమరు వేస్తూ ఉండూ అని చెప్పుటకు ! " అన్నది . తల్లికి , కూతురు వెనుక చెప్పిన కల గుర్తుకు వచ్చి , ఈ బాలుడు ఎంతటి మహానుభావుడవుతాడో ,ఎవరికి తెలుసు ? అనిపించింది . ఆకు వక్కలు నోటిలో నిండి ఉండినవి , నిద్ర కంటిలో నిండి ఉండినది . మాట్లాడుతూ అలాగే మంచముపై వాలి ఒరిగింది . పొద్దుటినుండీ అలసి ఆయాసపడిన దేహము నిద్రలోకి జారింది .