8, సెప్టెంబర్ 2024, ఆదివారం

మహాదర్శనము " --తొమ్మిదవ భాగము

 9. " మహాదర్శనము " --తొమ్మిదవ భాగము--అపరిగ్రాహి


తొమ్మిదవ భాగము  ---అపరిగ్రాహి 


        పాపడికి రెండు నెలలు నిండినాయి . ఆ రెండు నెలలలో రెండుసార్లు తొట్టిలు మార్చవలసి వచ్చింది . ఆలంబినికీ , జాయంతికీ , బిడ్డ అలాగ పెరుగుతున్నది చూసి చాలా సంతోషము . దేవరాతుడు కన్నారా చూస్తున్నాడు కాబట్టి నమ్మక తప్పలేదు . 


         రెండు నెలలు నిండి రెండు మూడు దినములయి ఉంటుంది . బుడిలుడు ’ ఆచార్యా ’ అంటూ వచ్చినాడు . దేవరాతుడు బయటికి ఎక్కడికో  వెళ్ళవలెను అని సిద్ధమవుతున్నవాడు , అతని గొంతు విని , ’ దయ చేయండి ’ అని వాకిలి దగ్గరకు వచ్చి లోపలికి పిలుచుకొని పోయినాడు . దేవరాతుడు అంచులు మడతలు పోకుండా అందముగా , పద్దతిగా కట్టుకొన్న ధోవతిని చూచి బుడిలుడు , " దీనికే కదటయ్యా మేమంతా నిన్ను అంతగా మెచ్చుకొనేది ! భలే , ఎంతబాగా ధోవతి కట్టుకున్నావు ! సరే , ఎక్కడికైనా కార్యార్థివై వెళుతున్నావా ? నేను ఒంటి బ్రాహ్మణుడను ఎదురు వచ్చినట్లాయె కదా " అన్నాడు . 


         ఆచార్యుడు నవ్వుతూ , " మీరే అలాగన్న ఎలాగు ? మీరే కదా చెపుతారు , " సర్వే దేవా వేదవిది బ్రాహ్మణే ప్రతివసంతి "  దేవతలందరూ వేదవిదుడైన బ్రాహ్మణునిలో ఉంటారు అని ! అలాగైనపుడు మీరు ఒంటి అనుట ఎలాగు ? " అన్నాడు . 


        బుడిలుడు నవ్వి అన్నాడు , " ఇదే చూడు మాయ అనేది ! మనకు తెలిసిన విషయమును మూసి , వేరొకదాన్ని పలికిస్తుంది కదా అది ! మంచిది , నావలన నీ కార్యమునకు తొందరేమీ కాలేదు కదా ? " 


        " ఏమీ లేదు , భార్గవులు ఎందుకో పిలిచినారు . తరువాత కూడా వెళ్ళవచ్చును . వెళ్ళకున్నా ఫరవాలేదు . మీరు వచ్చినారంటే నాకు మిగిలినవేవీ గణ్యములు కావు . " 


" అయితే సరే , నేను వచ్చినది ఒక విచిత్రమైన పని మీద . నీ భార్యకు పురిటి నెల గడిచింది కదా ? " 


" అప్పుడే గడచిపోయింది , గడచి ఒక నెల అవుతున్నది . " 


" మంచిదైంది , నేను పాపడిని చూడవలెను , అందుకే వచ్చినాను " 


" ఆమే ఎత్తుకొని రావచ్చునా లేక తమరే ఒక అడుగు అక్కడికి దయచేసెదరా ? " 


        " ఇంకెవరైనా అయిఉంటే , ఇక్కడికే రానిమ్ము అనేవాడిని , అయితే , ఆ పొద్దు చూచిన దృశ్యము మరచునట్లు లేదు . అందువలన , యే మహానుభావుడో మీ ఇంటికి వచ్చినాక , మేము అక్కడికి వెళ్ళుటయే సరి , అది సరేగానీ ఇదేమో చూచినావా ? " 


        బుడిలుడు నడుముకు కట్టుకున్న ఒక చిన్న డబ్బీ తీసినాడు . దానిలో యజ్ఞేశ్వరుని ప్రసాదమైన విభూతీ , ఒక తమలపాకులో రక్షా ఉన్నాయి . 


       " అతని దర్శనమునకు వెళ్ళునపుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు అని తెచ్చినాను . మీ ఇంట్లో లేనిది తెచ్చినాను అన్న అహంకారము కాదులేవయ్యా !  ! " 


      " సరే పోయింది , మీరందరూ ఆశీర్వాదము చేయవలసిన బుడం కాయ వాడు . మాకందరికీ ఆచార్య స్థానము లో నున్న మీరే ఇలాగంటే ఇంకెటులో ? " 


       " అట్లు కాదయ్యా , ఆ శిశువు దేహము చిన్నదైనా గొప్ప ఆత్మ . మనము దానిని మరచిపోరాదు . అది , యే యే ప్రభావముల చేత , యేయే సిద్ధులతో పుట్టిందో మనకేమి తెలుసు ? " 


       దేవరాతునికి అవుననిపించినది . భార్యకు ఏకాంతములో ఈ సంగతి చెప్పవలెను అనిపించినది . ఆ భావముతో బుడిలుడి సిద్ధాంతమును ఒప్పుకుంటూ , " మీరే అంటిరి కదా , ఉన్నమాటని మాయ మరపిస్తుంది అని , నాకూ అదే జరిగింది . ఇకపైన జాగరూకతగా ఉంటే సరి . రండి , వెళదాము " అన్నాడు . 


" వీధిలో నడచి వచ్చినాను . ఒక చెంబెడు నీరు తెప్పించు . కాళ్ళు కడుక్కొని వస్తాను . " 


       బుడిలుడు వద్దన్ననూ ఆచార్యుడు వదలక , తానే కాళ్ళుకడిగి తుడిచినాడు . ఇద్దరూ పాపడిని చూచుటకు వెళ్ళినారు . వీరు వస్తున్నది చూచి ఆలంబిని చెరుగు సరిగ్గా కప్పుకున్నది . కూతురితో ఏమో మాట్లాడుతున్న జాయంతి లేచి వెళ్ళి తెర వెనుక నిలచింది . 


        బుడిలుడు వచ్చి ఉయ్యాలలోని పాపడిని చూసినాడు . ఎవరో తెలిసినవారిని చూసినట్లే సంతోషపడి , " ఆచార్యా , సందేహమే లేదు , నేను ఆ దినము , సీమంతము నాడు చూసిన ముఖము ఇదేనయ్యా , ఆవగింజంత కూడా వ్యత్యాసము లేదు . " అని వేదమంత్రముతో ఆశీర్వదించి , రక్షనూ , విభూతినీ తల్లి చేతికిచ్చి , " దీనిని పాపడి ఉయ్యాలలో ఉంచమ్మా , మొత్తానికి  వీర పత్నివై , వీరమాతవు కూడా అయినావు . ఈ దేహమును చూస్తే , నీ కొడుకు ఒక పెద్ద మర్రి వృక్షమువంటి వాడగుటలో ఆశ్చర్యము లేదు . నీ కడుపున పుట్టి కాయోన్నతి ని పొందినాడు . ఇక మానోన్నతి , విద్యోన్నతులను సంపాదించి ఇవ్వటము మీ దంపతుల ధర్మము . " అని మరలా ఒకసారి ఆశీర్వదించినాడు . 


       దేవరాతునికి , వృద్ధ బుడిలుడు కొడుకును మెచ్చుకొన్నాడని గొప్ప సంతోషమైనది . వెనుతిరిగి బయటికి వస్తూ బుడిలుడు , " ఏమయ్యా , రాజపుత్రులకు కూడా దొరకని దేహము కదా అది , బహు సంతోషమయినది " అని మరలా అన్నాడు . దేవరాతుడు , " యజుర్వేదుల ఇంట పుట్టినాడు , మాది ఎంతైనా ఆధ్వర్యము కదా ! దానికి తగ్గట్టు గట్టిగా ఉండవలెనా లేదా " అని నవ్వినాడు .


      బుడిలుడు చటుక్కున వెనక్కు తిరిగి , " వీడు కేవలము శ్రౌత విద్యా సంపన్నుడగు పాపడు కాదు , ఆ సౌందర్యము చూస్తే , కర్మ బ్రహ్మలు రెండింటికీ అధికారియగునట్లు కనపడుతున్నాడు . ఏమైనా కానీ  వాడిని అపరిగ్రాహిగా చేయి " అన్నాడు .


" అపరిగ్రాహిని చేయుట ఎలాగ ? " 


       " అదేమి పెద్ద విషయము ? అన్యాయార్జితమైన విత్తము వద్దన్న చాలు . గురువు గారని వచ్చి తీసుకోండి అని గురు దక్షిణ ఇచ్చినా , ’ నువ్వు ఉద్ధారమైనావు అని నమ్మకము వచ్చు వరకూ నేనుతీసుకోను ’ అంటే సరి . నీ చూపు చూస్తుంటే , ’ అలాగన్న , కుటుంబ భరణమునకు ఏమి గతి ? ’ అనేవాడిలా ఉన్నావు . చూడు , మొదటిది , మనుష్యుని మనసు ఎల్లపుడూ అర్థ కామముల వైపుకే తిరుగుతుంటుంది . రెండోది , బిడ్డ పుట్టుటకు ముందు తల్లికి స్తన్యము ఉండునట్లే , వారివారిని కాపాడుతూ , వారివారిచేత వారివారికి తగ్గ పనులు చేయించు ప్రారబ్ధము ఒకటుందనే సంగతిని మనము మరచినాము . కాబట్టి అపరిగ్రహము కష్టమేమీ కాదు . అపరిగ్రహము లేనివాడికి మానోన్నతి ఎక్కడిది ? మానోన్నతి లేనివాడికి విద్యోన్నతి ఎక్కడిది ? కాబట్టి మొదట అపరిగ్రహమును నేర్పించు . నేను చెప్పింది మనసుకు ఎక్కిందా ? " 


       దేవరాతుడు ఒప్పుకున్నాడు .అతని మనసుకు అర్థమైనది , " కొడుకుకు చిన్నవాటికి ఆశ పడకుండునట్లు నేర్పించవలెను . ఏమితీసుకున్నా , కార్యాంతములో దక్షిణా రూపముగా రావలెనే తప్ప , మధ్యలోనే ఆశపోతు వలె చేయి చాచరాదు . "... ’ అది సరియే కదా ’ అనిపించి , ఆచార్యుడు బుడిలుడి మాట ఒప్పుకున్నాడు . 


       బుడిలుడు ఇంకొంత సేపుండి , బిడ్డడి భవిష్యత్తు గురించి మాట్లాడి , వెళ్ళిపోయినాడు . దేవరాతుడు కూడా అతడిని పంపించివేసి , వెళ్ళి భార్గవుడిని చూచుకొని వచ్చినాడు .

కామెంట్‌లు లేవు: