8, సెప్టెంబర్ 2024, ఆదివారం

నిందనీయులు గూడా వందనీయులే*

 🙏🙏 *శ్రీ గణేశాయ నమః*🙏🙏

*నిందనీయులు గూడా వందనీయులే*


సభ్యులకు నమస్కారములు.


ఈ దినం వినాయక చతుర్థి. సాయం సంధ్య తదుపరి చంద్ర దర్శనము కూడదని, చంద్ర దర్శనము అవుతే నీలాపనిందలు తప్పవని వినాయక కథలలో తెలుసుకున్నాము. *అవుతే* సభ్య సమాజంలో *ఒక్కొక్క సారి నిందనీయలు కూడా వందనీయులే*. ఇందుకు సముచిత దృష్టాంతము *శమంతక మణి - శ్రీ కృష్ణ పరమాత్మ* ఉందంతము. ఆలాగే *రామాయణ మహా కావ్యంలో సీతమ్మ వారి గురించి చాకలి ప్రేలాపనలు*. నిందలకు గురికావడం యాద్ధృచ్ఛికమా లేక వినాయక చతుర్థి రోజు చంద్ర దర్శనమా అంటే ఇదమిద్ధంగా ఏమి చెప్పలేము. కాని, వినాయక చతుర్థి కథల ప్రకారము, చంద్ర దర్శనము వలన నిందలు వాస్తవమే అని అంగీకరించవలసి ఉంటుంది.


పై రెండు వృత్తాంతములు (శమంతక మణి - శ్రీ కృష్ణ పరమాత్మ, శ్రీ రామాయణ మహా కావ్యము) సర్వులకు విదితమే కావున చర్విత చర్వణం కూడదని అనుకుంటున్నాను.


ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు సంసార లేదా వ్యవహార రంగంలో ఈలాంటి పరిస్థితి తప్పకపోవచ్చును. వ్యక్తులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, సత్యాసత్యాలు ఎట్లున్నా అపనిందలకు గురవుతుంటారు. ఈ అపనిందలు తాత్కాలికం కావచ్చును లేదా శాశ్వతము కావచ్చును. *ఇవి అన్నియు పరిస్థితుల ప్రాబల్యం అని గ్రహించిన నాడు ప్రశాంతత ఏర్పడుతుంది*. పలు రకాల మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో ఎప్పుడో అప్పుడు నిందా పూర్వక ఆరోపణలు, ఆక్షేపణలు తప్పవు. *అంత మాత్రాన కృంగి పోయి అపరాధ భావనకు లోను కాకుడదు*. 


*ఒక్కొక్క సారి మంచి చెప్పబోయినా, చెప్పినా* అపార్థాలకు, ఆలోచనా రాహిత్యానికి గురైన వారు ఎదుటివారిపై *నిందలు వేస్తుంటారు*. *అవుతే* నిందలకు గురైన వారు దుర్మార్గులు, ధూర్తులు కాకపోవచ్చును. మీదు మిక్కిలి నిందలన్ని అసత్యాలు అని తేలిననాడు *నిందనీయులే వందనీయులవుతారు. నిందలు మోపిన వారు దోషులవుతారు*. 

ఈ ప్రపంచం చాలా పెద్దది, మోప బడిన నిందలన్నీ నిజాలని నమ్మే వారు కొందరైతే, నమ్మని వారు అధికులు. 


మనుష్యుల వ్యక్తిత్వాలు గురించి ఒక రచయిత మాటల్లో...

*ఒకరి వ్యక్తిత్వం గురించి మంచిగా చెప్పుకోకపోయినా ఫరవాలేదు గాని, చెప్పుడు మాటలు విని ప్రచారం చేయవద్దు. ఆ వ్యక్తి యొక్క గుణగణాలు అతనికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే బహిర్గతమవుతాయి తప్ప, దూరంగా ఉండి ఇతరుల మంచి చెడులను గ్రహించలేము, అంచనా వేయలేము*.


*మరి ఒక మాట* నిందలు వేసిన వాళ్లపై తారాస్థాయిలో విరుచుకపడవద్దు, సర్వాంతర్యామి దృష్టిలో పడవద్దు. *ఇద్దరు ఇద్దరే అనుకునే ప్రమాదనున్నది*. సమాజం గూడా అందరిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. మంచి చెడులు తెలుస్తూనే ఉంటాయి.


పెద్దలు చెప్పిన మరియొక వాక్యం చూద్దాం.

*నహి నిందా న్యాయం, ప్రశస్తా వాక్యం* అర్థం :- ఒకరిని నిందించడం, తక్కువచేసి మాట్లాడం న్యాయం కాదు, మంచి పద్ధతి కాదు. నిందలను మాని (వద్దు), వారి ప్రశస్తి అంటే మంచిదనం మరియు కీర్తి గురించి తెలియజేయాలి.


చాలా వరకు నిందలన్నీ నిజాలు కాకపోవచ్చును. తొందరపడి నిందలను నమ్మడం, ప్రచారం చేయడం తగదు, 


*శ్రీ గణనాథం భజామ్యహాం*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ధన్యవాదములు.

కామెంట్‌లు లేవు: