8, సెప్టెంబర్ 2024, ఆదివారం

08.09.2024,ఆదివారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

08.09.2024,ఆదివారం



ఋషి పంచమి


భాద్రపద మాసంలో వినాయక చవితి మరసటి రోజు వచ్చే పంచమి 'ఋషి పంచమి' గా జరుపుకుంటాం. భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూల స్థంబాలు అయిన గొప్ప గొప్ప మహర్షులలో సప్తర్షులను ఋషి పంచమి రోజు ఒక్కసారి అయినా తలచుకోవాలని పెద్దలు చెబుతారు.


ఋషి పంచమి రోజు "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో సప్తర్షులు ఖ్యాతికెక్కారు.


అత్రి మహర్షి

* సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమయంలో అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకు తన ఆశీర్వాదాన్ని ఇచ్చారు.


భారద్వజ మహర్షి

* శ్రీరాముని అరణ్యవాస సమయంలో సీతారాములకు చిత్రకూట పర్వతానికి దారి చూపించినవాడు భారధ్వజ మహర్షి.


గౌతమ మహర్షి

* తన భార్య అహల్యకు శాపవిమోచనం కలిగించిన శ్రీరామునికి తన తపః శక్తిని మొత్తం ధారబోసిన వాడు గౌతమ మహర్షి.


విశ్వామిత్రుడు

* రామలక్ష్మణులను తన వెంట తోడ్కొనిబోయి వారిచేత రాక్షస సంహారం చేయించినవాడు విశ్వామిత్రుడు.


వశిష్ఠుడు

* ఇక్ష్వాకు వంశ కులగురువు, శ్రీరాముని గురువు వశిష్ఠుడు.


జమదగ్ని

* శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారమైన పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి.


కశ్యపుడు

* శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మరొక అవతారమైన వామనుడి తండ్రి కశ్యప మహర్షి.


ఈ సప్తర్షులను ఋషి పంచమి రోజున తప్పకుండా స్మరించాలి, పూజించాలి. ఎందుకంటే వారు అందించిన జ్ఞానమే నేటి భారతదేశాన్ని గొప్పగా నిలబెడుతోంది. ఈ సప్తర్షులకు రామాయణానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఋషి పంచమి రోజు శ్రీరాముని పూజించడం, రామాయణ పారాయణ చేయడం తప్పకుండా చేయాలి...

కామెంట్‌లు లేవు: