బేగి ఎలిపొచ్చీ...!
సాహిత్యం... సంగీతం... విజయనగరం! ఈ మూడింటిని వేర్వేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా... గురజాడ, గణపతిముని, ఆదిభట్ల, వంగపండు... ఎందరెందరు కవులు, కళాకారులు! ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల... మరెందరెందరు సుస్వరాల సమ్రాట్టులు! ఇక అక్కడి సంస్థానాలు... జానపదుల నోళ్లలో నానే వాటి వీరగాథలు... అన్నీ అబ్బురమే! ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆ నేలమాట ఇంకా ప్రత్యేకమైంది. పలుకుల కలకూజితాలతో తనదైన తెలుగు తియ్యందనాన్ని పంచే ఆ జిల్లా అమ్మభాషా విశేషాలు మీకోసం...!
తెలుగునాడుకు ఉత్తర సరిహద్దులో, తూర్పుతీరపు అంచున... అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వారధిలా ఉంటుంది విజయనగరం జిల్లా. అనేక భాషల సంగమం ఈ ప్రాంతం. నాగరిక, జానపద సంస్కృతులు దోబూచులాడుతుంటాయి. శాతవాహనుల పాలనలో ‘మధ్యపరగణాలు’గా వ్యవహారంలో ఉందీ ప్రాంతం. తర్వాత కళింగులు, గజపతులు, వెలమరాజులు ఇలా క్రమంగా విజయనగర గజపతుల చేతుల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటుచేశారు.
జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతమంతా పర్వతమయం. గిరిజనులు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు నేడు ఒడిశాలో అంతర్భాగంగా ఉన్న గంజాం ప్రాంతం వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఏలుబడిలో కొన్నాళ్లుంది. ఇలా... తెలుగు, తమిళ, ఒడియా సంస్కృతులతో పాటు హిందీభాషా ప్రభావమూ ఈ ప్రాంతపు తెలుగు మీద బలంగానే ఉంది. భౌగోళికంగా అంతగా సంబంధం లేని హిందీ ఇక్కడికి ఎలా వచ్చిందంటే... ఒకప్పటి మధ్యప్రదేశ్, నేటి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, జగదల్‌పుర్ తదితర ప్రాంతాల ప్రజలు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించడం వల్ల. మొత్తమ్మీద విజయనగరం తెలుగు ఇన్ని భాషల కలగలుపు. ఉదాహరణకు ‘తన నివాసాన్ని మార్చుకున్నాడు’ అనే అర్థంలో ‘బిచాణా ఎత్తేశాడు’ అంటారు. ‘బిచాణా’ అనేది ఒడియా పదం. అలాగే ‘వేగం’ అనే పదానికి గ్రామ్యరూపం ‘బేగి’. ఈ పద రూపాంతరం మీదా ఒడియా ప్రభావం ఉంది. ఆ భాషీయులు ‘వ’ అక్షరాన్ని పలకరు. దాని బదులు ‘బ’ వాడతారు. వాళ్ల సాపత్యంతో ‘వేగిరం’ అనే ఉచ్చారణ కాస్తా ‘బేగిరం’గా మారింది. కాలక్రమేణా ‘బేగి’గా స్థిరపడిపోయింది.
భలే భలే మాటలు
వివిధ భాషల సంపర్కంతో తయారైన ‘తెలుగు మాటలు’ ఇక్కడ కొల్లలు. ‘మేనత్త’ను స్థానికులు ‘బాప్ప’ అంటారు. హిందీ ‘బాప్’ (నాన్న)కి, తెలుగు ‘అప్ప’ (అక్క) కలిసి ‘నాన్నకి అక్క’... ‘బాప్ప’ అయిందన్న మాట. ఎవరైనా నేరాన్ని కప్పిపుచ్చితే ‘కామప్ చేసేశారు’ అంటారు. ఆంగ్లంలోని ‘క్లెయిమ్ అప్’ (దాచేయడం) దీనికి మూలం. ఎవరైనా అబద్ధాలు చెబుతోంటే, ‘వాడివన్నీ జూటా మాటలు’ అనేస్తారు. ‘ఝాటా’ అంటే హిందీలో అబద్ధం. ఇక ‘పొడవు’నేమో ‘జబరు’ అని పిలుచుకుంటారు. ఇది ఉర్దూ మాట. ఆ భాషలో దీనికి అర్థం ‘ఉన్నతమైన’ అని. ‘ఉష్ణం’ (వేడి) అనే సంస్కృత పదం ‘ఊష్టం’గా మారి విజయనగరం తెలుగులో జ్వరానికి మారుపేరైంది. అలాగే ఉక్కపోతని ‘ఈష్ట’ అంటారు. ఇదీ ‘ఉష్ణం’ రూపాంతరమే. ఇలా సంస్కృతం నుంచి వచ్చిన మరో మాట ‘జిమ్మ’. అంటే... నాలుక. ‘జిహ్వ’ దీనికి మూలం. ‘బైఠాయించు’ అంటే పత్రికా భాష అనుకుంటాం కానీ, ‘కూర్చోవడం’ అనే అర్థంలో స్థానికులు దీన్ని సాధారణంగానే వాడేస్తుంటారు. వీటన్నింటికీ మించి ఆశ్చర్యాన్ని కలిగించే మాట ‘ఎప్పెస్’. విజయనగరం భాషలో దానికి అర్థం ‘ఉచితం’. ఆంగ్ల ‘ఫ్రీ సర్వీస్’లోని ఎఫ్, ఎస్ అక్షరాల గ్రామ్య కలగలుపు ఇది! ఈ జిల్లా భాషని తరచిచూస్తే ఇలాంటి మాటలు చాలానే కనిపిస్తాయి.
ఇక్కడి ఊళ్ల పేర్లు కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చుట్టూ పర్వతాలు ఉన్న ఊరు మొదట ‘పర్వతపురం’ అయింది. కాలక్రమంలో అది పార్వతీపురంగా మారింది. భేల్- ఎలుగుబంటి, గాఁవ్- గ్రామం.... ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించే గ్రామం ‘భేల్‌గాఁవ్’ అయింది. క్రమేపీ అది ‘బెలగాం’గా మారింది. నిడువైన కల్లు(కొండ) ఉన్న ఊరు ‘నిడువుకల్లు’గా వ్యవహారంలోకి వచ్చి ‘నిడగల్లు’గా రూపాంతరం చెందింది. ముళ్లపొదలు ఎక్కువగా ఉన్న పల్లె ‘కంటకాపల్లి’ అయింది. తాటిచెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతమే ‘తాడివాడ’. కోనేం రకపు చేపలు ఎక్కువగా అమ్ముడయ్యే సముద్రతీర గ్రామమే కోనవాడ.. అదే కోనాడ. ఇలా ప్రతి ఊరిపేరు వెనకా ఓ విశేషం కనిపిస్తుంది.
వాళ్లది ప్రత్యేకం
నాగావళి, వేగావతి, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, జంఝావతి తదితర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంత వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. అయినప్పటికీ ఆహార, వాణిజ్య పంటలకి అనువైన ప్రదేశం. ‘అయ్యకి ఆస్తి లేదు, గర్వమూ లేదు’ అన్న చందాన ఉంటుందీ ప్రాంత ఫలసాయం. తిండికి లోటుండదు. అలాగని అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే చాలదు. అలాంటి ఈ ప్రాంతానికి గోదావరి సీమనుంచి కొన్ని ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చాయి. అగ్రహారాలను ఏర్పాటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఈ శాఖీయులు మొదట గోదావరీ పరీవాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. గోదావరి నదిమీద ఆనకట్ట లేని సమయంలో ప్రబలిన కరవుకు తట్టుకోలేక, వాళ్లలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చారన్నది చరిత్ర కథనం. కృష్ణరాయపురం (‘కన్యాశుల్కం’లో దీని ప్రసక్తి ఉంది), అజ్జాడ (హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు స్వస్థలం), కలవరాయి, లోగిశ (కావ్యకంఠ గణపతిముని పుట్టిన ఊరు), సుంకి, చాకరాపల్లి, చల్లపేట... ఇవన్నీ ద్రావిడ బ్రాహ్మణ అగ్రహారాలు. వీటితోపాటు వెలనాటి బ్రాహ్మణుల అగ్రహారాలు- వెంగాపురం, కుసుమూరు, నందబలగ, శివరాంపురం మొదలైనవి కొన్ని ఉన్నాయి. ఈ రెండు రకాలైన అగ్రహారాలనీ కలిపి ‘నందాపురం పట్టీ’ పేరుతో పిలుస్తారు. ఈ ఆగ్రహారికుల మాటతీరు ఒకలా ఉంటుంది. వీళ్ల దగ్గర వివిధ వృత్తుల్లో కుదురుకున్న ఇతరుల మాటతీరు మరోలా ఉంటుంది. కాలక్రమంలో అగ్రహారాలు పోయినా, ఆ రెండు వర్గాల భాషలో మాత్రం ఆ తేడాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఎక్కువ అనే పదానికి అగ్రహారపు పలుకుబడి ‘లావు’. దాన్నే ఇతర గ్రామీణులేమో ‘వింత’ అంటారు. కొంచెం- కాస్త (అ.ప), కసింత (గ్రా); ఇటువైపు- ఇసుంటా (అ.ప), ఇటింకా (గ్రా); వచ్చేసెయ్- ఒచ్చీ, వళపచ్చీ (అ.ప), ఎలిపొచ్చీ (గ్రా); గోళీలు- గొట్టికాయలు (అ.ప), అల్లికాయలు (గ్రా); తొందరగా- వేరంగా (అ.ప), బేగి (గ్రా); అత్యాశ- కాప్యానం, కాపీనం (అ.ప), కాపేనం (గ్రా); సంతృప్తి చెందు- ఆటిపారు (అ.ప), గీటెక్కు (గ్రా); వేళాకోళం- సరసాలు (అ.ప), ఇగటాలు (గ్రా)... ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మాటలు వినపడుతుంటాయి.
అక్కడ అలా... ఇక్కడ ఇలా!
సాగతీతగానీ, తెగవేతగానీ లేకుండా పూర్తి పదాన్ని ఉచ్చరించడం ఈ జిల్లా ప్రత్యేకత. అంతేకాదు పదోచ్చారణ స్పష్టంగా ఉంటుంది. గ్రామీణభాషలో ‘ము’ వర్ణకాంత ప్రయోగాలు ఎక్కువ. ఉదాహరణకు ‘చేద్దాము’- సేతుము; చూద్దాము- సూతము; విందాము- విందము, ఉందాము- ఉందుము లాంటివి. ఇక ఒకే జిల్లా అయినప్పటికీ, కొన్ని మాటల్లో విజయనగరం ప్రాంత గ్రామ్యానికి, పార్వతీపురం ప్రాంత గ్రామ్యానికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీనికి కారణం నాడు విజయనగరం తెలుగు రాజుల పాలనలో ఉంటే, పార్వతీపురం కళింగ రాజుల ఏలుబడిలో ఉండేది. దీంతో ఆయా భాషల ప్రభావం స్థానికుల మాటల మీద పడింది.
పశువులను పార్వతీపురం ప్రాంతంలో ‘సొమ్ములు’ అంటారు. అదే విజయనగరం వాళ్లయితే ‘పసరాలు’ అని పిలుస్తారు. అమ్మాయి, అబ్బాయిలను పార్వతీపురం వాళ్లు ‘గుంట’, ‘గుంటడు’గా వ్యవహరిస్తారు. విజయనగరం ప్రాంతవాసులేమో ‘పిల్ల’, ‘పిల్లడు’గానే ఉచ్చరిస్తారు. అలాగే... గోతులు- గుమ్ములు (పా), గాతలు (వి); నేను- నాను (పా), నీను (వి); ఉంచడం- ఇడ్డం (పా), ఎట్టడం (వి); పలకకుండా- పల్లక (పా), ఒల్లక (వి); కారం- నొర్ర (పా), వర్ర (వి)... లాంటి భేదాలెన్నో కనిపిస్తాయి. ఈ పదాలన్నీ విజయనగరం తెలుగుకు ఓ ప్రత్యేకతను సమకూర్చాయి.
ఒకే పదానికి రెండు మూడు అర్థాలున్న పదాలూ ఉన్నాయి ఇక్కడ. గుంట- ఆడపిల్ల, రోలు; గూద- తిండియావ, కడుపు; కొర్రు- ఏ పనికైనా అడ్డుపుల్ల వేయడం, మేకు, కొండశిఖరం; పెడ- అరటి అత్తం, ఒకపక్క; జెల్ల- ఓ రకం చేప, లెంపకాయ; కొత్తెం- అరటిపువ్వు చివరి భాగం, తలవెనక భాగంలో కొట్టే చిన్నదెబ్బ... ఇలాంటివి ఎన్నో! ఎన్నెన్నో!! అలాగే, పంచదారను ‘చీనీ’ అని, ముల్లంగిని ‘సొత్తికూర’ అని పిలుస్తారు.
అందరిదీ అదే బాట
ఈ ప్రాంతంలో పండితులు చాలామందే ప్రవర్ధిల్లారు. సంప్రదాయ సాహిత్యం నుంచి కాల్పనిక సాహిత్యం వరకూ అన్ని రకాల ప్రక్రియలకీ ఆలవాలమైంది ఈ నేల. ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలు వెలువడినా, ఈ ప్రాంత భాషకి ప్రాధాన్యమివ్వడం మరవలేదు ఏ సాహిత్యకారుడున్నూ. ఆదిభట్ల అయితే ‘సీమపలుకు వహి’ అనే పేరుతో అచ్చతెలుగు మాటలకూర్పుతో ఓ నిఘంటువునే రూపొందించారు. అందులో కనిపించే విజయనగరం మాటల్లో కొన్ని... అచ్చిక బుచ్చిక (కలుపుగోలుతనం), ఆరిగం (మట్టి కుంపటి), ఇమ్ము (పదిలం), ఈండ్రపడు (మొరాయించు), ఉరిడి (కుమ్మరిపురుగు), ఆసడ్డ (నిర్లక్ష్యం). ఇక గురజాడ అయితే ‘కన్యాశుల్కం’ సంభాషణల రూపంలో విజయనగరం తెలుగుకు చెరగని ఖ్యాతిని తెచ్చిపెట్టారు.
ఈ ప్రాంతంలో ప్రజాసాహిత్యమూ ప్రబలంగానే వచ్చింది. దానికి కారణం రైతాంగ సాయుధ పోరాటానికి నెలవుకావడమే. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని భూషణం, వంగపండు తదితరులు ప్రజలభాషలో రచనలు చేశారు. వాళ్ల పాటల్లో వినిపించే ఈ ప్రాంత గ్రామ్య పదాలు కొన్ని... పొవ్వాకు (పొగాకు), టకురు (ముదురు), ఉమ్మిరి (ముమ్మరం), ఎక్కిడి తొక్కిడి (పుష్కలం), ఎమకల (తెల్లవారుజామున), కవుకులు (ఇబ్బందులు), ఒగ్గేసి (వదిలేసి). గ్రామీణుల మాటల్లో దొర్లే ఇలాంటి పదాలకు సాహితీ పట్టం కట్టిన కవులు ఇక్కడ చాలామందే ఉన్నారు.
ఇలా ప్రాచీనకాలం నుంచి నేటివరకూ అనేక రూపాంతరాలు చెందుతూ... అటు పండితులను, ఇటు జానపదులను ఒకే బాటలో నడుపుతూ... తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది విజయనగరం తెలుగు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తన మట్టిమాటలకే తొలి ప్రాధాన్యమిచ్చే ప్రాంతమిది.
(అయ్యగారి శ్రీనివాసరావు, విజయనగరం)