2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

*అమ్మ కొంగుచాటు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷శ్రీమతి శశికళ ఓలేటి గారి కథనం🌷*

                *అమ్మ కొంగుచాటు!* 

                       🌷🌷🌷                                         


“ అమ్మకూ నాకూ మధ్య అడివంత దూరం! అడివయితే పరవాలేదు అఖాతం కాకుండా ఉంటే చాలు!”… అనుకుంటూ…దట్టమయిన చెట్లు చీకట్లు పరుస్తూంటే, అడివి గుండా నెమ్మదిగా డ్రయివ్ చేస్తున్నాడు భాస్కర్. 


“ అమ్మతో ఆ విషయం ఎలా ప్రస్థావించాలో ఏమిటో? అమ్మ ఎలా తీసుకుంటుందో. నన్ను అసహ్యించుకుంటుందేమో. ఇన్నాళ్ళూ తన బాధ్యతలు ఏదీ పంచుకోకుండా, దేశాంతరాలు ఉద్యోగనిమిత్తం పారిపోయి, ఇప్పుడు హఠాత్తుగా ఊడిపడి… ఇల్లూ, పొలం అమ్మేసి నా దగ్గరకు వచ్చేయి… అంటే…ఒప్పుకుంటుందా? లేక తను పెంచిన కొడుకేనా ఈ వంచకుడు… అనుకుంటూ నిరసిస్తుందా?”…అతని తలపులు అతన్ని సతమతం చేస్తుంటే, ఎదురుగా వస్తున్న అడవి దున్నను ఇంచుమించు గుద్దేయబోయాడు. హఠాత్తుగా వేసిన బ్రేకు… కారుని మూడొండల అరవై డిగ్రీలు తిప్పి, పక్కనున్న గెడ్డ లోకి తోసేసింది. 


       కారు కదిలే పరిస్థితి లేకపోవడంతో, ముఖ్యమయిన వస్తువులు తీసుకుని, అడవిదారిని నడవసాగాడు భాస్కర్. ఆకాశం మేఘాచ్ఛాదితమై ఉంది. అలసిన ప్రాణానికి సాంత్వనిస్తూ చల్లగాలి  తగులుతోంది. దారిలో మర్రిచెట్టు కింద చిన్న గూడులో “కడిమితల్లి రాయి”…పసుపుకుంకాలతో, అడివిపూలతో కలకలలాడుతోంది. ఎంత చిరపరిచితమైన పరిసరాలు ఇవన్నీ. అమ్మకొంగు పట్టుకుని బాల్యమంతా తారాడిన నెలవులు. కడిమితల్లి రాయి తనూ, అమ్మే కదా మోసుకుంటూ తెచ్చి అక్కడ పెట్టింది. 


బడికి వెళ్ళాలంటే అడవి దాటాలి… “ఒంటరిగా. భయం వేస్తోందమ్మా… “…అంటే కడిమి చెట్టు కిందుండే రాయిని తెచ్చి అక్కడ పెట్టి… “ ఈమె కదంబవన వాసిని. నిన్ను సదా రక్షిస్తూ నీతోనే ఉంటుంది!”…అంది అమ్మ. ఒకరోజు ఇలాంటి వానలోనే దారి తప్పినపుడు “ కడిమి తల్లీ!” అని పిలుస్తూ ఏడుస్తున్నాడు తను. ఇంతలో ఓ చెట్టు కింద తలదాచుకున్న ఒక అమ్మాయి, చెంచెత తన చెయ్యి పట్టుకుని ఇంటిదాకా తెచ్చి వదిలింది. అమ్మకు చెప్తే… “ అమ్మవారే కాపాడింది!”… అంటూ ఊరంతా చెప్పడం, కడిమితల్లి రాయి దేవతగా పూజింప బడడం మొదలయ్యింది అక్కడ. 


          “అయినా వేరే దేవతలేలా? అమ్మే పెద్ద దేవతామూర్తి. ఎంత సహనం, ఎంత శాంతం. సాటివారంటే ఎంత ప్రేమ. చిన్నవయసులో పెళ్ళి, పెద్దపెద్ద బాధ్యతలు మోస్తూ, నాన్న కోపాన్ని సహిస్తూ, చాలా ఏళ్ళు గొడ్రాలిగా ముద్రపడి, లేకలేక పుట్టిన తనను అపురూపంగా పెంచుకుంటూ…అలాంటి అమ్మను అనాధలా ఇన్నేళ్ళూ వదిలేసి, ఇప్పుడు తన స్వార్ధ ప్రయోజనం కోసం వెళ్తున్నాడు తను”… మనసంతా సిగ్గుతో ముడుచుకుపోయింది. సన్నగా చినుకులు మొదలవ్వడంతో నడక వడి పెంచాడు భాస్కర్. 


“ఎండొచ్చినా, వానొచ్చినా తన పెద్ద పవిటను ముందుకు లాగి, గొడుగులా పట్టి, తనకు ఆచ్ఛాదన నిచ్చేది అమ్మ. తను చిన్నపిల్లలా మారిపోయి ఎన్ని ఆటలాడేది. ఎన్ని పాటలు పాడేది. అమ్మ అంతరంగం అడివిలా చాలా లోతుగా, చిక్కగా రహస్యాలన్నీ దాచుకున్నట్టే ఉండేది. ఇంట్లో కన్నా ఎక్కువ పొలంలో, అడివిలో ఎందుకు ఆడించేదో మెల్లగా అర్ధమయ్యే వయసు వచ్చింది తనకు. రోజంతా బాధ్యతలు పట్టకుండా తాగుడులో గడిపే తండ్రి, అతని వ్యసనాలకు కరిగిపోతున్న ఇంటిపరువు, ఆస్తిబరువూ… తన కంట పడకూడదనే ఆమె తాపత్రయం అర్ధమవుతూ ఉండేది.”


      “తనను అమ్మ నుండి దూరం చేసిన రోజు తనకు ఇంకా గుర్తుంది. బాల్యచాపల్యం కొద్దీ నాన్న తాగి వదిలేసిన సీసాలోని ద్రావకం తను తాగాడు. అది చూసిన అమ్మ మొట్టమొదటి సారి తన మీద చెయ్యి చేసుకుంది. అలాగే చేతిలో చెయ్యి వేయించుకుంది…. జీవితంలో దాని మొహం చూడకూడదని. తన కోసం నాన్న ముందు గొంతు విప్పింది. బాబాయింటికి పట్నం పంపేసింది చదువులకు. ఒక హాస్టలు నుండి మరో హాస్టలుకు మారుతూ తన చదువంతా బయట ఊళ్ళలోనే. సెలవలకు అమ్మమ్మ ఇంట్లో అమ్మను చూడ్డమే”


తండ్రిగా తనకు ఏ జ్ఞాపకాలూ మిగల్చని తండ్రి తనకు ఒకే బాధ్యత నప్పచెప్పాడు. ఆయనకు కొరివి పెట్టడం. ఆయనతో అన్నేళ్ళ పాటూ సహజీవనం చేసిన ఆ మరోస్త్రీకి కూడా ఎంతో కొంత అప్పచెప్పి… మర్యాదగా సాగనంపిన తల్లి సంస్కారానికి దణ్ణం పెట్టాలో , లేక అన్నేళ్ళూ పడ్డ మనోవేదనకు చలించిపోవాలో కూడా అర్ధం కాలేదు తనకి. ఏదయితేనేం తండ్రితో ఉన్న ఋుణానుబంధం తీరిపోయింది. ఒక విధంగా ఊరితో కూడా. 


అమ్మ మాత్రం స్వయంగా పొలం పనులు చేసుకుంటూ, నాన్న పోగొట్టిన భూమినంతా తిరిగి సాధించుకుంది. ఇల్లు నిలబెట్టుకుంది… దేనిలోనూ తన కష్టం, ప్రమేయం లేకుండానే. 


        చదువవుతూనే, గల్ఫ్ లో ఉద్యోగం, దానికి ముందు స్నేహితుని చెల్లెలు కవితతో కులాంతర వివాహం అన్నీ కలలోలాగా జరిగిపోయాయి. కలల్లో బతికే కవితకు… కష్టాన్ని నమ్ముకున్న అమ్మకూ జత కుదరకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు, కానీ తననూ, అమ్మనూ విడగొట్టేంత విద్వేషం కవితలో ఎందుకో ఇప్పటికీ జవాబు లేని ప్రశ్న. మనవల కోసం తపించే అమ్మకు వాళ్ళు లీలగా గుర్తంతే. అంతలా ఎడం పెట్టింది కవిత అమ్మనుండి. ఈ రోజు స్వదేశంలో స్థిరపడుతూ… అమ్మ, ఆమె ఆస్తులు కావలసి వచ్చాయి కవితకు. “కలవాలి అమ్మను, మాట్లాడాలి మనసు తీరా… ఆస్తి కోసం కాదు…ఆత్మీయత కోసం. అందుకే తన ఈ ప్రయాణం”…..


   ఆలోచనల్లో పడి  పక్కనే ఏదో మోటర్ సైకిల్ ఆగడం గమనించనే లేదు భాస్కర్ . “ ఎవరింటికి అబ్బాయిగారూ? ఊళ్ళోకి వెళ్తున్నా. దిగపెట్టమంటారా?”… ఆపద్బాంధవుడిలా అడిగాడు అతనెవరో. ఇంటి దాకా దింపే వాడే…. వర్షం ముసురులా మారకపోతే. ఊరు పట్టణంలా మారిపోయి చాలా రోజులే అయిపోయినట్టుంది, గుర్తుపట్టనంతగా మారిపోయాయి వీధులన్నీ. చిన్న డాబా దగ్గర ఆపి, వాన తగ్గాకా వెళ్దామని ఆపాడతను. ఇలా మహాలక్ష్మిగారి అబ్బాయిని అని చెప్పాడో లేదో…అక్కడ ఉన్నవాళ్ళంతా గుమికూడిపోయారు. ఎవరి నోట విన్నా తల్లి గుణగణాలూ, ఉపకారాలూ, మంచిమాటలే. కడుపు నిండిపోయింది భాస్కర్ కు. వాళ్ళిచ్చిన వేడి టీ తాగుతూ… తల్లికి ఫోన్ చేసాడు. అమ్మ కదా…” వానలో తడుస్తూ రాకు నాన్నా. కారు పంపుతాను.”… అంటూ జాగ్రత్తలు. ఆమె గొంతులో సంభ్రమాశ్చర్యాలు దాచినా దాగడం లేదు. 


       మరో పదినిమిషాలు గడిచాయి. డాబా ముందు కారాగిన శబ్దం. “కారులోండి చీకట్లో గొడుగు వేసుకుని వడివడిగా వస్తోంది ఎవరదీ… అమ్మే కదా.” ఒక్క ఉదుటున బయటకు పరిగెట్టాడు. గొడుగు పట్టిన అమ్మను పట్టుకుని కొడుకు…ఇరువురూ ప్రేమ కోసం తపిస్తున్న దాహార్తుల్లా. దారంతా మాటల్లేవు. తల నుండి కారుతున్న నీళ్ళతో కన్నీరు కలిసిపోతోంది. 


      ఇంటికి చేరగానే… ఎదురుగా తండ్రి… నిలువెత్తు పటంలో. అప్రయత్నంగా నమస్కరించాడు. “బహుశా ఈ జన్మసంస్కారమే ఈ దేశంలో బాంధవ్యాలను గట్టిగా పట్టి ఉంచిందేమో! “. 


తల్లికి సాయంగా ఉంటున్న రైతు కుటుంబం వచ్చి పలకరించారు. తల తుడుచుకుంటూ…వాళ్ళతో మాట్లాడుతుంటే.. తల్లి కొంగు పట్టుకుని వ్రేలాడుతూ… అచ్చం చిన్నప్పటి తనలాగే నాలుగేళ్ళ పిల్లాడు, పెద్దపెద్ద కళ్ళతో, బూరి బుగ్గలతో, ఉంగరాల జుట్టేసుకుని… తన కేసే ఉత్సుకతతో చూస్తూ. 


“ పెద్దనాన్న!”… అంటూ ముందుకు తోసింది తల్లి. అప్రయత్నంగా చేతులు చాపాడు భాస్కర్. అంతే పరుగుల్న వచ్చి, చంకనెక్కాడు వాడు. 


       “ రోహిత్” ట వాడి పేరు. రాత్రంతా కురుస్తున్న వానతో పాటూ సాగిన తల్లీకొడుకుల కబుర్లధారలో ఎన్నో విషయాలు దొర్లాయి. రోహిత్ తల్లీతండ్రీ పొలంలో పనిచేస్తూ…పిడుగుపాటుతో చనిపోవడంతో రోహిత్ తన ఒడి చేరాడని,  న్యాయబద్ధంగా దత్తత చేసుకుని, రెండేళ్ళ నుండి తనే పెంచుతున్నట్టు చెప్పింది తల్లి. తన బిడ్డలు పొందవలసిన నాయనమ్మ ప్రేమ ఒక అనాధకు దక్కడం… భాస్కర్ లో చిన్న అసహనాన్ని కలిగించినా, అది క్షణికం మాత్రమే. అతనికి తన తల్లి మనసు తెలుసు. ఆమె ఏనాడూ తనకు దక్కని బంధాల గురించి వగచే మనిషి కాదు. తను కావలసిన వారినే బంధాలుగా మార్చుకునే మనిషి. జీవితంలో ఎలాంటి అసంతృప్తీ, పితూరీలు లేని మనిషి. 


      రెండు రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలని వచ్చిన భాస్కర్…వారం రోజులు ఉండిపోయాడు. చేజార్చుకున్న తల్లి ప్రేమ మళ్ళీ ఇన్నాళ్ళకు సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు అతను. తల్లి కష్టించి, పెద్దది చేసిన పొలం చూసొచ్చాడు. ఫార్మ్ హౌస్ లో పౌల్టరీ, ఆవుల్నీ చూసి ఆశ్చర్యపోయాడు. పెద్ద చదువుసంధ్యలు లేకపోయినా, ఎలాంటి మగదక్షత లేకుండా తెలివితేటలతో, శ్రమతో ఆమె పెంచిన ఆ చిన్న సామ్రాజ్యం చూసాకా, రోహిత్ తో, అక్కడి రైతుల కుటుంబాలతో ఆమె పెంచుకున్న అనుబంధం చూసాకా…తల్లితో ఆస్తులు అమ్మించి, తనతో రమ్మని పిలవాలన్న ఆలోచనకు పూర్తిగా స్వస్థి చెప్పేసాడు భాస్కర్. తనకు శక్తి ఉంటే… కనీసం సమీపభవిష్యత్తులో నయినా తన పిల్లలను తన తల్లికి దగ్గర చెయ్యాలి అన్న ఆలోచన ఒక్కటే అతని మనసులో! 


    ఉరుమూ మెరుపూ లేకుండా ఊడిపడ్డ కొడుకు రాక యాదృచ్ఛికం కాదని ఆ అమ్మకు తెలీదా! బయట పడతాడేమో అని ఎదురు చూస్తోంది. కానీ ఎంత కాదన్నా ఆమె పెంపకం కదా. తల్లిని బాధపెట్టే ఏ మాటా అతని నోటంట రావడం లేదు. అతని ప్రయాణానికి ముందురోజు…కొడుక్కి అన్ని వివరాలూ చెప్పడం మొదలుపెట్టింది. ఎంత సంపాదించి పెట్టింది, అతని పిల్లలకు ఏం ఇవ్వబోతోంది .. రోహిత్ బాధ్యత, తనను నమ్ముకున్న కుటుంబాల సంక్షేమం.. వంటివి తల్లి చెప్తుంటే మౌనంగా వింటున్నాడు. 


“ నా మనవల కోసం పొదుపు చేసిన అరవై లక్షలున్నాయి భాస్కర్. వాళ్ళ పెద్దచదువుల కోసం ఇప్పుడే వాడుకో. మామయ్య నాకు తన అవసరార్ధం అమ్మిన విలువైన షేర్లు ఉన్నాయి. అవి అమ్ముకుని…ఏ ఇంటి మీదయినా పెట్టుకో! మిగిలినవి నా చివర వరకూ ఉంటాయి. ఈ వూరు విడిచి, నీ దగ్గరకు రమ్మనమని నువ్వు అడగచ్చు. కానీ ఊరితో, భూమితో, రోహిత్ తో నా అనుబంధం ఇప్పట్లో తెంపుకునేది కాదు. అమ్మగా ప్రస్థుతం నేను ఇంతే చెయ్యగలను నీకు. విదేశాల్లో సంపాదించింది ఇక్కడ వ్యాపారాల్లో పెట్టి నష్టపోయావని తెలిసింది. ఎప్పటికీ ఈ ఇంటి తలుపులు నీకోసం తెరుచుకునే ఉంటాయి. నువ్వెప్పుడూ నా గారాల కన్నయ్యవే. అమ్మకొంగు పట్టుకుని నువ్వెంత రక్షణ పొందావో, నీ చిట్టిచేయి పట్టుకుని ఈ అమ్మ కూడా అంత ఆసరా పొందింది నీ బాల్యంలో!”…కొడుక్కి చెప్పుకుంటుంటే ఆమె చెంపల మీంచి కన్నీరు జారిపోతోంది. 


          తల్లి అన్నీ తెలుసుకుంటోంది, తనను వదిలేయలేదన్న విషయం అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ‘అమ్మకొంగు చివరనే నేను ఎప్పుడూ’ అన్న నిశ్చింత అతని పరాజయాల్ని మరిపింప చేసింది. 


      “ నువ్వు రావద్దమ్మా నా దగ్గరకు. ఆమె ఉన్న ఇంట్లో నువ్వు ఒక్క క్షణం ఉండలేవు. నీకు గౌరవం లేని చోట నిన్ను ఉండనియ్యను. నేనే వస్తాను నీ దగ్గరకు. నీ మనవలు వస్తారు.నీ చెయ్యి ఎప్పుడూ అంతెత్తులో ఉండాలిసిందే. నేనే వస్తా నీ దగ్గరకు.!”…కన్నీళ్ళతో పలవరిస్తున్నట్టు చెప్తున్నాడు భాస్కర్. 


శశికళ ఓలేటి.

వక్రములను తొలగించే గణపతి

 వక్రతుండ నామార్ధం


గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.


పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క ప్రస్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.


ఓం వక్రతుండాయ నమః


వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా

ఓం గం గణపతయే నమః

గురు మూర్తియే

 జయజయ శంకర  హరహర  శంకర


     ఛాందోగ్య  ఉపనిషత్తులోని  మూడు  నాలుగవ  అధ్యాయములలో  మధువిద్య, సంవర్గవిద్య  అని రెండువిద్య  లున్నవి. తత్త్వమసి  వాక్యము  ఛాందోగ్యములోనిదే.

    శ్వేతకేతువుకు, అతని  తండ్రి  గురువును అయిన  ఉద్దాలక  ఆరుణి- తత్త్వమసి  యని  తొమ్మిదిమార్లు  ఉపదేశము చేశాడు - తత్  అనగా  పరమాత్మ యగు  బ్రహ్మము. త్వం  అనగా  జీవాత్మ - అసి అనగా వున్నావు.

    నీవు  బ్రహ్మముగా  నున్నావు - అని దీని అర్థం. సాధనలుచేసి  ఎన్నడో  భావికాలమున  నీవు  బ్రహ్మ అవుతావని కాదు. ఇప్పుడూ  ఎప్పుడూ  నీవు  బ్రహ్మమే - అని  తండ్రి  శ్వేతకేతువుకు  బోధిస్తాడు.

       ఐనచో  సాధనలు  ఎందుకు? బ్రహ్మగా  మనమున్నా  మనకు  బ్రహ్మనిష్ఠలేదు. వున్నచో  మనలను  ఆవరించుకొనివున్న  కామక్రోధాదుల మాట ఏమి? సంతత  బ్రహ్మనిష్ఠులమై  యున్నచో  నిస్తరంగ సముద్రంలాగా  వుంటాము కదా ! అట్లు  ఒకస్థితి వున్నదని  కూడా  తెలియని  స్థితిలో  కదా మనమున్నాము?

      బృహదారణ్యకములోని  " చెలది  పురుగు తన దేహమునుండి  వెలువడు  తంతువులచే  గూడును అల్లినట్లు, అగ్ని నుండి  విస్ఫులింగములు  వెలికి వచ్చినట్లు, బ్రహ్మ  నుండి సమస్త  ప్రపంచము  నిర్ణయించుచున్నది" అను  మంత్రమును  భగవత్పాదులవారు  వివరించునపుడు  భిల్లుని కథ చెప్పి ' ఆదర్శ  సంప్రదాయవిద  ఆఖ్యాయికాం సంప్రచక్షతే' - సంప్రదాయ విదులు  చెప్పిన కథ అని  వ్రాసినారు.

      ఈ  కధలోని  భిల్లుడు  రాజుగా మారలేదు. అతడు ఎప్పుడూ  రాజకుమారుడే. కాని  భిల్లుల  సాంగత్యము వల్ల  తన్ను  భిల్లుడని అనుకున్నాడు. మంత్రి  ఉద్భోధవల్ల  తాను భిల్లుడు కాదనీ, రాజకుమారుడనీ గ్రహించాడు. అజ్ఞానస్థితిలో  భిల్లుడనియా, జ్ఞానము  కలిగిన  పిదప తాను రాజకుమారుడని తెలుసుకొన్నాడు.

      మన  స్థితికూడ  ఈ భిల్లుని వంటిదే. మనమందరమూ  జీవాత్మలు  అన్న భావనలో  సంసారులముగా  ఉన్నాము. వాస్తవంగా  మనము  పరమాత్మలమే. మన స్వరూపాన్ని  మనకు బోధించి  దానిని  అనుభవములోనికి  తెచ్చుకొనుటకై  వలసిన  సాధనాంగములను  నేర్పి, మన కర్మావశేషమును  నిర్మూలించుటకు  తన  తపస్సును వ్యయంచేసి మనలను  ఉద్ధరించు అవ్యాజకరుణామూర్తి  ఎవరు?

     మన  గురు మూర్తియే!