జయజయ శంకర హరహర శంకర
ఛాందోగ్య ఉపనిషత్తులోని మూడు నాలుగవ అధ్యాయములలో మధువిద్య, సంవర్గవిద్య అని రెండువిద్య లున్నవి. తత్త్వమసి వాక్యము ఛాందోగ్యములోనిదే.
శ్వేతకేతువుకు, అతని తండ్రి గురువును అయిన ఉద్దాలక ఆరుణి- తత్త్వమసి యని తొమ్మిదిమార్లు ఉపదేశము చేశాడు - తత్ అనగా పరమాత్మ యగు బ్రహ్మము. త్వం అనగా జీవాత్మ - అసి అనగా వున్నావు.
నీవు బ్రహ్మముగా నున్నావు - అని దీని అర్థం. సాధనలుచేసి ఎన్నడో భావికాలమున నీవు బ్రహ్మ అవుతావని కాదు. ఇప్పుడూ ఎప్పుడూ నీవు బ్రహ్మమే - అని తండ్రి శ్వేతకేతువుకు బోధిస్తాడు.
ఐనచో సాధనలు ఎందుకు? బ్రహ్మగా మనమున్నా మనకు బ్రహ్మనిష్ఠలేదు. వున్నచో మనలను ఆవరించుకొనివున్న కామక్రోధాదుల మాట ఏమి? సంతత బ్రహ్మనిష్ఠులమై యున్నచో నిస్తరంగ సముద్రంలాగా వుంటాము కదా ! అట్లు ఒకస్థితి వున్నదని కూడా తెలియని స్థితిలో కదా మనమున్నాము?
బృహదారణ్యకములోని " చెలది పురుగు తన దేహమునుండి వెలువడు తంతువులచే గూడును అల్లినట్లు, అగ్ని నుండి విస్ఫులింగములు వెలికి వచ్చినట్లు, బ్రహ్మ నుండి సమస్త ప్రపంచము నిర్ణయించుచున్నది" అను మంత్రమును భగవత్పాదులవారు వివరించునపుడు భిల్లుని కథ చెప్పి ' ఆదర్శ సంప్రదాయవిద ఆఖ్యాయికాం సంప్రచక్షతే' - సంప్రదాయ విదులు చెప్పిన కథ అని వ్రాసినారు.
ఈ కధలోని భిల్లుడు రాజుగా మారలేదు. అతడు ఎప్పుడూ రాజకుమారుడే. కాని భిల్లుల సాంగత్యము వల్ల తన్ను భిల్లుడని అనుకున్నాడు. మంత్రి ఉద్భోధవల్ల తాను భిల్లుడు కాదనీ, రాజకుమారుడనీ గ్రహించాడు. అజ్ఞానస్థితిలో భిల్లుడనియా, జ్ఞానము కలిగిన పిదప తాను రాజకుమారుడని తెలుసుకొన్నాడు.
మన స్థితికూడ ఈ భిల్లుని వంటిదే. మనమందరమూ జీవాత్మలు అన్న భావనలో సంసారులముగా ఉన్నాము. వాస్తవంగా మనము పరమాత్మలమే. మన స్వరూపాన్ని మనకు బోధించి దానిని అనుభవములోనికి తెచ్చుకొనుటకై వలసిన సాధనాంగములను నేర్పి, మన కర్మావశేషమును నిర్మూలించుటకు తన తపస్సును వ్యయంచేసి మనలను ఉద్ధరించు అవ్యాజకరుణామూర్తి ఎవరు?
మన గురు మూర్తియే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి