1, సెప్టెంబర్ 2022, గురువారం

అహం సర్వస్య ప్రభవ

 15.3,15.4


న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా I

అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢేన చిత్వా II


తత: పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తిన్తి భూయ: I

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత: ప్రవృత్తి: ప్రసృతా పురాణీ II


*ప్రతి పదార్థం*


రూపమ్ - రూపము; అస్య - ఈ వృక్షముకు; ఇహ - ఈ ప్రపంచములో; తథా - కూడ; న,ఉపలభ్యతే - తెలియబడదు; న,అన్తః - అంతము కనబడదు; న,చ,ఆదిః - మొదలు కూడ కనబడదు; న,చ,సంప్రతిష్ఠా - మూలము కూడ కనబడదు; అశ్వత్థవృక్షమును; ఏనమ్ - ఈ; సు-విరూఢ-మూలమ్ - మిక్కిలి ధృఢముగా వేళ్ళుగలదానిని; అసంగ-శస్త్రేణ - అనాసక్తి అను ఆయుధముచే; ధృఢేన - బలమైన; ఛిత్త్వా - ఛేదించి; తతః - తరువాత; పదమ్ - స్థితి; తత్ - అట్టి; పరిమార్గితవ్యమ్ - అన్వేషించబడవలెను; యస్మిన్ - దేనిని; గతాః - పొందినవారు; న,నివర్తన్తి - నెనుకకురారో;  భూయః - తిరిగి; తమ్,ఏవ,చ - ఆతడినే; చ - కూడ; ఆద్యమ్ - ఆదియైన; పురుషమ్ - పరమపురుషుని; ప్రపద్యే - శరణు వేడుదును; యతః - ఎవని నుండి; ప్రవృత్తిః - ఆరంభమై; ప్రసృతా - వ్యాపించినదో; పురాణీ - అతి పురాతనమైన.


*అనువాదము*


ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తు నందు చూడబడదు. దాని ఆదినిగాని, అంతమునుగాని లేదా మూలమునుగాని ఎవ్వరును అవగతము చేసికొనజాలరు. కాని మానవుడు ధృఢనిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వ్రేళ్ళు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్యపదమును అన్వేషించి, అనాదికాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యెనో మరియు ఎవని నుండి సర్వము వ్యాప్తినొందెనో అట్టి దేవాదిదేవుని అచ్చట శరణుపొందవలెను.


*భాష్యము*


ఈ అశ్వత్థవృక్షపు యథార్థరూపము ఈ భౌతిక జగత్తు నందు తెలియబడదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. వ్రేళ్ళు ఊర్ధ్వముగా నుండుటచే ఈ నిజమైన వృక్షపు వ్యాప్తిక్రిందుగా నుండును. అట్టి వృక్షము యొక్క భౌతిక విస్తారము నందు బద్ధుడైనపుడు మానవుడు అది ఎంతవరకు వ్యాపించి యున్నదనెడి విషయమును గాని దాని మొదలును గాని గాంచలేడు. అయినప్పటికిని, మానవుడు ఈ వృక్షకారణమును కనుగొనియే తీరవలెను. “నేను నా ఫలానా తండ్రి పుత్రుడను. నా తండ్రి ఫలానా వారి పుత్రుడు. నాతండ్రి యొక్క తండ్రి ఫలానా వారి పుత్రుడు.” ఈ విధముగా పరిశోధించుచు పోయినచో చివరకు అతడు గర్భోదకశాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును. బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియును. చివరకు బ్రహ్మదేవునికి ఆదియైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన కార్యము సమాప్తమగును. దేవాదిదేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానము గల వ్యక్తుల సాంగత్యమున ప్రతియొక్కరు దేవాదిదేవుని రూపమైన ఈ సంసారవృక్షపు మూలాధారములను అన్వేషింపవలెను. అప్పుడు అట్టి అవగాహనచే మానవుడు క్రమముగా యథార్థతత్త్వపు విపరీత ప్రతిబింబము పట్ల అనాసక్తుడై, జ్ఞానముచే బంధమును ఛేదించి యథార్థవృక్షము నందు ప్రతిష్ఠితుడగును. 


ఈ సందర్భమున ‘అసంగ’ అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా, ఇంద్రియ భోగములందు ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై అధికారము వహింపవలెనను భావన మిక్కిలి బలమైనది. కనుక ప్రామాణిక గ్రంథముల ననుసరించి ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి చర్చించుట ద్వారా మానవుడు అనాసక్తిని అభ్యసింపవలెను. వాస్తవముగా జ్ఞానవంతులైన వ్యక్తుల నుండి శ్రవణము చేయవలెను. భక్తుల సాంగత్యమున చేయబడు అట్టి ఆధ్యాత్మిక చర్చలకు ఫలితముగ అతడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి ఎరుగగలుగును. అప్పుడు అతని ప్రథమ కర్తవ్యము భగవానుని శరణుపొందుటయే. దేనిని చేరిన పిమ్మట మానవుడు ఈ విపరీత ప్రతిబింబమైన సంసార వృక్షమునకు తిరిగిరాడో ఆ ప్రదేశము యొక్క వర్ణన కూడ ఈ శ్లోకమునందు తెలుపబడినది. ఎవని నుండి సమస్తము ఉద్భవించినదో అట్టి ఆది మూలము దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుడే. అట్టి భగవానుని కృపను పొందుటకు శరణాగతియే మార్గము. శ్రవణ కీర్తినాదిపద్ధతులతో చేయబడు భక్తియుక్త సేవకు ఫలితమిదియే. ఈ భౌతిక జగత్తు వ్యాప్తికి భగవానుడే కారణము. భగవానుడే స్వయముగా “అహం సర్వస్య ప్రభవ:” – “నేనే సర్వమునకు మూలాధారము” అని ఇదివరకే వివరించి యున్నాడు(భ.గీ. 10.8). కనుకనే భౌతిక జీవితమనెడి అత్యంత ధృఢమైన ఈ సంసార వృక్షపుబంధము నుండి విడివడుటకు మానవుడు శ్రీకృష్ణభగవానుని శరణుపొందవలెను. అట్లు అతనికి శరణు పొందినంతనే మానవుడు అప్రయత్నముగనే ఈ భౌతిక జీవితము నుండి విముక్తుడగును.

కామెంట్‌లు లేవు: