31, మార్చి 2022, గురువారం

పాదాభివందనం

 * పాదాభివందనం :-  "భారతీయ  సాంప్రదాయము"

"జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు, మనకంటే పెద్ద వారి పాదాలకు చేసే నమస్కారమే "పాదాభివందనం".


అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః !

చత్వారితస్యవర్ధంతే ఆయుర్విధ్యా యశోబలం !!


అంటే వయసువల్ల కాని , విద్యవల్ల కాని అధికులైనవారికి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తే , మనకి ఆయువు, విద్య, కీర్తి, బలం, ఐశ్వార్యాభివృద్ధి లభిస్తాయని మనుధర్మశాస్త్రంలో మనువు చెప్పిన మాట ఇది.


'నమస్కారం' మన సంస్కారానికి చక్కని పురస్కారం. ఇక యోగభ్యాసంలో మొదటి భంగిమ "నమస్తే." వినయానికి ప్రతీక నమస్తే. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడం మంచిది. 'నమస్తే ' భార్య భర్తల ఆదర్శ దాంపత్యానికి కూడా ప్రతీకగా నిలిచే విధంగా "పాణిగ్రహణం " చేయిస్తున్నాము. దీనినే "కరచాలనం" అని కొందరంటారు."కరచాలనం" ఒక విధమైన నమస్కార పద్ధతి. కరచాలనం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాకపోయినా, అతి సులువుగా, సౌకర్యాంతంగా చేసే నమస్కారంగా, మన జీవితంలో భాగమయిపోయింది. అయితే, పెద్దలకు, గురువులకు "ఏకహస్తాభివందనం" చెయ్యకూడదని హితవచనం. 


ఇటువంటి వారికి కరచాలనం చేసే సంధర్భం వచ్చినపుడు, వారి చేతులను , మన రెండు చేతులలోకి తీసుకొని, నమస్కరించడం ఉత్తమం. అయితే, అసలు శరీరంలో ఏ ఇతర అవయవాలకీ కాకుండా కేవలం పాదాలకు మాత్రమే ఎందుకు నమస్కరించాలి? అన్న విషయానికి వస్తే, యోగులలోను, మహాత్ములలోను, మన మంచిని కోరే పెద్దలలోను అభివృద్ధిని కోరే సద్గుణం ఉంటుంది. 


అటువంటి సాత్వికాభివృద్ధి యొక్క భావనాశక్తి, వారి శరీరంలో ప్రవహించి, వారి అరచేతులలోనూ, పాదాలలోను నిలిచి ఉంటుంది. అందుకే వారి పాదాలకు నమస్కరిస్తే, 

తమ అరచేయిని మన శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తే , వారి సాత్విక శక్తి మనలో ప్రవేశించి, మనకు ప్రతిస్పందన కలుగుతుంది. ఇది అనుభవించిన వారికి తెలుస్తుంది.!

బంధువు

 🌸🕉️ *సుభాషితమ్* 🕉️🌸


శ్లో.

*ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే శత్రునిగ్రహే౹*

*రాజద్వారే శ్మశానే చ య స్తిష్ఠతి స బాన్ధవః॥*


తా.

ఉత్సవాల సమయంలోను, *కష్టాలు వచ్చినప్పుడు, దుర్భిక్షంలోను*, శత్రువులతో విరోధం వచ్చినప్పుడూ, రాజద్వారంలోను 

(రాజగౌరవం పొందుతున్నప్పుడు)

*శ్మశానంలోను ఎవడు విడవకుండా ఉంటాడో వాడే*

*బంధువు*.... అట్లు కానివారు నిజమైన బంధువులు కారని అర్థం...

అప్రియవాక్యం

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

---------------------------------------------


శ్లోకం:

*అప్రియముక్తాః పురుషాః ప్రయతస్తే ద్విగుణమప్రియం వక్తుమ్।*

*తస్మాదవాచ్యమప్రియమన్యప్రియవాక్యకామేనll*

               ~సుభాషితరత్నావళి


తాత్పర్యం:

"ఎవరి విషయంలోనైనా అప్రియవాక్యం పలికితే వాళ్లు రెట్టింపు అప్రియంగా ఉండే పరుషవాక్యం పలుకుతారు. అందుచేత ఇతరుల తనతో ప్రియవాక్యాలు పలకాలని కోరుకునేవాడు తానెప్పుడూ అప్రియం పలకకూడదు".