53. " మహాదర్శనము " ---యాభై మూడవ భాగము --ధర్మ సంకటము తప్పినది
53. ధర్మ సంకటము తప్పినది
శతపథ బ్రాహ్మణము ముగిసింది. చివరి అధ్యాయములు సంహితలో ఉన్న విధము గానే ఉపనిషత్తు కావలెను. అంతలో దైవాజ్ఞ అయినది. అక్కడికే చాలని , యాజ్ఞవల్క్యుడు అక్కడికే నిలిపివేసినాడు. ఆతనికి తాను కృతకార్యుడనని సంతోషము వచ్చినది. అయితే దానిని ఎవరైనా పెద్దలకు చూపవలెను. అనంతరము బ్రాహ్మణము పరిపూర్ణ మైనందుకు మంగళము చేయవలెను అని అతనికి ఆశ.
ఒక దినము సమయము చూచి తండ్రితో కొడుకు తన ఆశను తెలియపరచినాడు. ఆచార్యుడు, " నేను చూడవచ్చు. కానీ నేను పాత వేద, బ్రాహ్మణములకు అలవాటైన వాడిని. కాబట్టి నాకు మొదటినుండీ చివరి వరకూ దోషములే కనబడితే అతిశయమేమీ కాదు. కాబట్టి ఉద్ధాలకులకు చూపించు. వారయితే వేద, బ్రాహ్మణములను సమన్వయము చేసి చూడగలరు. అదీకాక, కొడుకు రాసినాడు , అబ్బ ఒప్పుకున్నాడు అను అపఖ్యాతికి మనమెందుకు గురి కావలెను ? చూడు యాజ్ఞవల్క్యా , లోకము ఎప్పుడూ చిన్నతనమును ఇతరులకు ఆపాదించుటకు ప్రయత్నిస్తుందే తప్ప వారి గొప్ప తనమును చూడదు. దాని వల్ల కూడా నేను చెప్పినదే సరియైనది. నువ్వు నీ గ్రంధములను వారికి చూపించు " అన్నాడు.
కొడుకుకు కూడా తండ్రి చెపుతున్నది సరైనదే అనిపించినది. " నాకు కూడా అక్కడికి వెళ్ళవలెను అనిపించు చుండినది. అయితే వెళ్ళుట ఏ దినము ? " అని అడిగినాడు.
" రేపటి పూర్వాహ్ణములో మహారాజుగారు వచ్చెదరు. వారు వచ్చినా ఎంతసేపుంటారు ? మధ్యాహ్నము భోజనానంతరము బయలుదేరు. వెళ్ళునపుడు వెంట అగ్నులను తీసుకొని ఉండు. వేద బ్రాహ్మణ పారాయణము చేయునపుడు అగ్నిహోత్రము లేకుండా ఎందుకుండ వలెను ? "
" అయితే వెళ్ళి సిద్ధము చేయమని చెప్పి వస్తాను " అని యాజ్ఞవల్క్యుడు లోపలికి వెళ్ళినాడు.
అతడు అటుతిరిగి వెళ్ళగనే " ఆచార్యా " అని పిలుస్తూ భార్గవుడు వచ్చినాడు.
కుశల ప్రశ్నలు అయిన కొంత సేపటికి భార్గవుడన్నాడు: " ఆచార్యా , నేనెందుకు వచ్చినాను అని అడుగలేదే ? రేపు మహారాజువారి సవారి ఇక్కడికి రావలసి ఉంది అని తెలుసు కదా ? అయితే వారికదేదో రాచకార్యమని నగరాంతరమునకు వెళ్ళవలసి వచ్చి వెళ్ళిపోయినారు. వారి ప్రతినిధిగా నేను వచ్చి మీకూ , మీ పుత్రుడికీ సమాచారము నిచ్చి వివరించి చెప్పవలెనని అనుమతి అయినది. "
" నేనేమిటి , మీతో చేరినవాడనే కదా , కాబట్టి నాకు సమాధానము చెప్పనక్కర లేదు. ఇక , యాజ్ఞవల్క్యుడు. వాడు ఎంతైనా మీకన్నా చిన్నవాడు. మీరు సమాధానము చెప్పితే చెప్పవచ్చు , లేకున్న లేదు. "
" ఆచార్యా , అతడు మీ కొడుకు , కాబట్టి మీకు అలాగ తాత్సారము. అయితే బయటి వారి కన్నులలో ఆతడు ఎంత గొప్పవాడో తెలుసా ? ఆమె ? ఆ వాచక్నువు కూతురు గార్గి , ఆమెకు పగలు పుట్టినది పడదు. రాత్రి పుట్టినది రోత. అంతటి ఆమె మీ కొడుకు విషయములో ఎంత గౌరవము చూపిస్తుందో తెలుసా ? అదీగాక , మహారాజావారు ఒక సంవత్సరము నుండీ యాజ్ఞవల్క్యుని దర్శనార్థము రావలెనని అంటున్నారు. తీరా అనుకొని ధృవీకరించి కూడా రేపు వచ్చుటకు కాదని ఎంత వ్యథ పడినారో తెలుసా ? ఆతనికి కోపము రాకుండా సమాధానము చేసి రావలెనని నాతో పూర్తి ఒక ముహూర్త కాలము మాట్లాడి చెప్పి పంపినారు. నాకు అదేమీ అతిశయము అనిపించలేదు. ఇప్పటి కాలములో ఎవరయ్యా ఒక వేదమును , ఒక బ్రాహ్మణమును , ఒక ఉపనిషత్తునూ సృష్టి చేసినవారు ? మీరు వెయ్యి చెప్పండి , ఆ దినము బుడిలులు చెప్పినది నేను మరచిపోలేను. "
ఆచార్యుడు కొడుకు కీర్తి విని పొంగిపోయినాడు. భార్గవుడు ప్రబలులైన విద్వాంసులనే రాజాశ్రయము నుండీ వంకలు చెప్పి స్వస్తి పలికించి వారికి చుక్కలు చూపించేవాడు , ఇంతగా పొగడుచున్నాడన్న తరువాత , ఇంకేమి చెప్పవలెను ?
ఆ సంతోషములో ఆచార్యుని అహంకారము ఎగసిపడింది. " స్వామీ , పురోహితులవారూ , మరువకండి , నేను తండ్రినీ తాతలనూ మించు కొడుకు కావలెనని తపస్సు చేసినవాడను " అన్నాడు.
భార్గవుడు ఓహ్హొహ్హో అని నవ్వేసినాడు. " కాదయ్యా , నీ కొడుకు యొక్క సంహితోపనిషత్తును ( ఈశావాస్యోపనిషత్తుకు ఈ పేరు కూడా కలదు ) ప్రపంచములోని వారంతా పొగడుచున్నారు. మీరు ఏ రోజైనా దానిని చూచినారా ? చెప్పండి. నువ్వో ? అంటారేమో ? మాకు ఈ జన్మలో రాజభవనము గుదిబండగా మారి చేయవలసిన ఎన్నో పనులు మిగిలిపోయినాయి. మీరు చెప్పండి. "
" ఏమిటి మీరు చెప్పండి ? కొడుకు వద్ద కూర్చొని శాంతి పాఠము చెప్పవలెనా ? నేను ఎన్నో దినములు దానిని గురించే ఆలోచించినాను. మీదగ్గర ఉన్నమాట చెపుతాను. నేను , " నేను తండ్రిని " అన్న అహంకారమును వదలి , ఉపనిషత్తు చెప్పమని వెళ్లవలెనా ? కొన్ని దినములాగండి. వాడు కూడా ఒక ఆశ్రమమును కట్టుకొని శిష్య సంపత్తుతో వర్ధిల్లుతాడు. అప్పుడు వాడు శిష్యులకు బోధించునపుడు నేనూ నాభార్యా కూర్చొని వింటాము. "
" నాకు ఎంత కుతూహలమో తెలుసా ? ఆ దినము వైశంపాయనులకు యాజ్ఞవల్క్యుని సన్నిధి వలన కలిగిన ఉపకారమును విన్న ఘడియ నుండీ అన్నీ వదలి ఆతని శిష్యుడను కావలెననిపిస్తున్నది . కానీ నాకు అవకాశమే లేదు. కావలసినది కానివ్వండి . మీ దంపతులు ఆ ఉపనిషత్తు వినునపుడు నన్ను కూడా రానివ్వండి.... ఏమిటీ , నేను వచ్చి ఇంత సేపయినది , యాజ్ఞవల్క్యుడు రానేలేదే ..వెళ్ళి కనులు మూసుకొని కూర్చున్నాడో ఏమో ? "
" అదీ సంభవమే. ఉండండి, కాత్యాయనిని అడుగుదాము." అని ఆచార్యుడు కేకవేసి కాత్యాయనిని పిలచినాడు. యాజ్ఞవల్క్యుడే " ఏమిటి తండ్రిగారూ , ఆమె ఎక్కడో చెరువు దగ్గర బట్టలు ఉతుకుచుండ వలెను " అని వచ్చినాడు.
భార్గవుడు , " రావయ్యా , మాకు కావలసినది నువ్వు. కాత్యాయనితో నిన్ను పిలిపిద్దామని ఆమెను పిలిచినాము " అన్నాడు.
యాజ్ఞవల్క్యుడు వినయముతో లోపలికి వచ్చినాడు. భార్గవుని సూచనతో ఆచార్యుడు కొడుకుకు తప్పిపోయిన రాజాగమన విషయమును చెప్పినాడు.
యాజ్ఞవల్క్యుడు భారము దిగినట్టు నిట్టూర్చి , " మంచిదైనది. వారు వచ్చి , ఏదీ బ్రాహ్మణము చూపించు అంటే , నేను ధర్మ సంకటములో చిక్కుకునేవాడిని. వారికి చూపించాలని నేనే వచ్చేవాడిని , కానీ మొదట పెద్దవారెవరైనా ఒకరికి చూపించి ఆ తరువాతనే దానిని ప్రకటించ వలెనన్న నా సంకల్పము వ్యర్థమయ్యెడిది. "
" అలాగయితే రాకుండినదే క్షేమమయినది కదా ? "
" భార్గవుల వారూ , ఏమి చెప్పేది ? ప్రపంచము ఈశ్వరునిది. వాడి పరముగా దేవతలు దీనిని ఏలుచున్నపుడు జరిగేదంతా మంచికే కదా ? "
" అలాగయితే నీకు అసంతృప్తి ఏమీ లేదు అంటావా ? "
" అదేమిటి అలాగ గుచ్చి గుచ్చి అడుగుతున్నారు ? "
" నీ కీర్తి దేశమంతా వ్యాపించి , దాని ప్రతిఛ్చాయ రాజ భవనమును కూడా ఆవరించినది. మహారాజుల దృష్టిలో నువ్వొక మేరు పర్వతము అంతటి పెద్దవాడివి. కాబట్టి నీకు అసంతృప్తి కలుగ కుండునట్లు చూచుకొని చెప్పిరావలెనని నాకు ఆజ్ఞ అయినది. అందుకే ఇంతగా అడిగినది. "
యాజ్ఞవల్క్యుడు ’ అటులేమి ? ’ అని నవ్వినాడు. " నా మాట కూడా కొంచము వినండి . వారు యువరాజుగా ఉన్నపుడు వారిని నేను చూచి మొరటుగా , ’ అగ్ని రహస్యమును నువ్వు చెప్పేదేమిటి ? నేను వినేదేమిటి ? యజ్ఞేశ్వరునే అడుగుటకు అవకాశమున్నపుడు ఇంకొకరి దగ్గర నేర్చుకోవలెనా ? అని వచ్చేసినందుకు వారికి నాపైన కోపమేమో ? అనుకున్నాను. ’ మేము వస్తాము ’ అని వారు వర్తమానము పంపించినపుడు ఎక్కడ ఆమాట ఎత్తుతారో అను శంక ఉండినది. ఇప్పుడు ఆ శంక కూడా తొలగింది . ధర్మ సంకటమూ తప్పింది . ఇంకొకసారి వారు వచ్చేటట్టయితే అది మా గురుకులములో కావలెను. అది కొంచము చూచుకోండి . " అన్నాడు.
" అయితే ఎప్పుడయ్యా, గురుకులపు ప్రారంభోత్సవము ? "
" నన్ను హాస్యము చేస్తున్నారు . ఇప్పుడు మా తండ్రిగారు ఏమైనా ఇస్తే ఉంటుంది , లేకుంటే లేదు. ఇలాగున్నపుడు , గురుకులపు ఆరంభము ఎప్పుడు అంటే ఖచ్చితముగా చెప్పుట ఎలాగ ? "
" నీకేమిటయ్యా , దేవతల అనుగ్రహము సంపాదించినవాడివి. నువ్వు సంకల్పిస్తే చాలు ధనము ఎక్కడి నుండో అదే వస్తుంది . మావలె నువ్వు చివరిదాకా శ్రమ పడ నవసరము లేదు. "
" మీ నోటి చలవ వలన అలాగే కావలెను. నాకు కూడా గురుకులపు సంకల్పము మీదమీదగా కలుగుతున్నది. ఈ నవీన వేద బ్రాహ్మణోపనిషత్తులను అనేకానేక శిష్యులకు నేర్పవలెను అనిపిస్తున్నది. దీనిని ఇచ్చినవారికి, దీనిని వినియోగించుట ఎలాగో తెలీదా ? నాకెందుకు ? అనికూడా నేను మనోదమనము చేస్తున్నాను. "
" సరే , రేపటి ప్రయాణము శుభమగుగాక. వెళ్ళి రా. నేను కూడా వెళ్ళి వస్తాను. రాజదర్శనము తప్పిందని అసంతృప్తి ఏమీ లేదు కదా ? "
" అది తప్పినదెక్కడ ? అయితే , కేవలము యాజ్ఞవల్క్యునికి బదులుగా , వారు కులపతి యాజ్ఞవల్క్యుడిని చూస్తారు, అంతే ! " అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
వారిద్దరికీ అతడి గంభీరమైననూ స్థిర విశ్వాసపూర్ణమైన భావము ముచ్చట గొలిపింది. ఉదాత్తమైననూ , వినయముతో పలికిన ఆమాటను వారు బలు మెచ్చుకున్నారు. ఒకరు మనసులోనే తథాస్తు అన్నారు. ఇంకొకరు ప్రకటముగా ఘోషించునట్లు తథాస్తు తథాస్తు అని రెండుసార్లు అని , వీడ్కొన్నారు.
ఇక్కడ ఉద్ధాలకుల ఆశ్రమములో ఆలాపినీ దేవికి అతిసార చిహ్నములు కనిపించినాయి . వైద్యులు ఆమెకు ద్రవాహారము తప్ప ఘనాహారము ఇవ్వవద్దని చెప్పినారు. వారిని ఒక విశాలమైన గదిలో పడుకోబెట్టినారు. మైత్రేయి ఆమె శుశ్రూషలో ఉంది. ఉద్ధాలకులు పదే పదే వచ్చి చూచుకొని వెళుతున్నారు. ఆశ్రమవాసులందరికీ ఏదో దిగులు. ఆమె మాత్రము ఘడియ ఘడియకూ వ్యాధి ఎక్కువవుతున్ననూ నిశ్శంకగా పడుకొని ఉన్నది. అప్పుడప్పుడు ఎవరినో నిరీక్షిస్తున్నట్టు వాకిలి వైపు చూస్తుంది. తన మనో దౌర్బల్యమును చూచి తానే నవ్వువట్లు , ఎవరూ రానిది చూచి సన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకుంటుంది .
ఉద్ధాలకులు అది రెండు మూడు సార్లు చూచినారు . " నువ్వు ఎవరినో నిరీక్షిస్తున్నట్టుంది . ఎవరికైనా రమ్మని కబురు పంపవలెనా ? " అని అడిగినారు.
" అదేమంత పెద్ద విషయము కాదు . ఒంటి మీద స్పృహ ఉన్నపుడే యాజ్ఞవల్క్యుని ఒకసారి చూడవలెనని ఒక ఆశ. అయితే , దానికోసము అతడికి కబురు పంపించ వలసినంత బలంగా లేదా ఆశ. "
" దానికేమిటి , ఇప్పుడు మనిషిని పంపిస్తే ఉదయానికల్లా వచ్చేస్తాడు. సరే , ఇంకేమి ఆశ ఉంది నీకు ? "
" మీరు నవ్వనంటే చెబుతాను "
" లేదు , ఖచ్చితంగా నవ్వను "
" ఈ మైత్రేయి ఇలాగ పెళ్ళీ పెటాకులూ లేకుండా ఉండుటకు నేనే కారణము అనవచ్చును. నేను పోతే దీని గతి ఏమి ? అన్న ఆలోచన వచ్చింది . ఉత్తర క్షణమే దానిని కాపాడుటకు దాని భాగ్యము లేదా అనిపించినది . ఆ యోచన వదలి శాంత చిత్తురాల నయినాను. "
" నా గురించిన ఆలోచన లేదా నీకు ? "
" నాకు బాగా తెలుసు . నేను పోగానే మీరిక ఆశ్రమములో ఉండరు. వానప్రస్థులై హిమాలయముల వైపుకు వెళతారు. "
" ఈ ఆశ్రమము ? "
" ఔను. దీని తలరాతను నిర్ణయించుటకు నాకూ అధికారము నిచ్చినారు . అయ్యేదవుతుంది అనవచ్చు . కానీ నిర్ణయించడము మానవ ధర్మము. ఆ వేళకు యాజ్ఞవల్క్యుడొస్తే అతడిని ఇక్కడ మీ స్థానములో ఉంచవచ్చును. దైవానుగ్రహ సంపన్నుడు , విద్యావంతుడు , అనుష్ఠానపరుడు , నియమ నిష్ఠలున్నవాడు , అన్నిటికన్నా మిన్నగా ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తును పొందినవాడు . మీరేమాలోచిస్తున్నారో ? "
" నా ఆలోచనే నీ నోటిద్వారా వింటున్నపుడు నేనింకేమి చెప్పేది ? ఊ అంటానంతే ! "
" సంధ్యాకర్మలన్నీ అయినాయా ? "
" అన్నీ ముగించుకొని నీ పక్కన కూర్చొని రక్షోఘ్న మంత్రములు పారాయణము చేద్దామని వచ్చినాను. "
" రక్షోఘ్న మంత్రములు ఇక నాకెందుకు ? ఏమీ వద్దు. మీరు ఒక్క క్షణము నా పక్కన కూర్చుంటే చాలు. "
అంతలో ఎవరో పరుగెత్తి వచ్చి , " యాజ్ఞవల్క్యులు వస్తున్నారు " అని ఒగరుస్తూ చెప్పినారు .
ఆలాపిని , " ఆ ? యాజ్ఞవల్క్యుడొస్తున్నాడా ? " అన్నది . ఉద్ధాలకులు , ’ ఒక్కడేనా ? ’ అన్నారు.
’ ఊ ’ అని ఆలాపినికి చెప్పి , ’ కాదు , పత్నీ సమేతముగా వస్తున్నారు ’ అన్నారా వచ్చినవారు .
" మంచిదైంది .వెళ్ళి పిలుచుకు వస్తాను " అని చెప్పి ఉద్ధాలకులు లేచి వెళ్ళినారు . ఇంకొక క్షణములోనే యాజ్ఞవల్క్య దంపతులతో పాటూ వచ్చినారు .
యాజ్ఞవల్క్యుడు వచ్చి నేరుగా వెళ్ళి ఆలాపినికి నమస్కారము చేసి కొడుకు కన్నా ఎక్కువగా పక్కన వచ్చి కూర్చున్నాడు . ఆమె కూడా అదే విశ్వాసముతో , ’ వచ్చినావా , రా రా. ఈ దినము చూచి రేపటిరోజు నీకు కబురు పంపవలెనని అనుకున్నాము " అన్నది .
కాత్యాయని తాళపత్ర గ్రంధమును పట్టుకొన్నది , అలాగే ఆమెకు నమస్కారము చేసి , మైత్రేయి పక్కన కూర్చొని , " ఏమక్కా , బాగున్నారా ? " అన్నది .
ఆలాపినికి ఒక ఆలోచన వచ్చింది . : ధర్మ కర్మ సంయోగము చేత ఈమె మాట నిజమయితే ? అప్పుడు కూడా వీరిద్దరూ ఇలాగే విశ్వాసముతో ఉండునట్లైతే ? "
ఉత్తర క్షణమే మనసు సమాహితమై ఈశ్వరుని చిత్తానుసారము , వారి భాగ్యానుసారము అవుతుంది . నా ఆశీర్వాదము కావలసి ఉంటే , అది కావలసినంత ఉంది " అని నిలకడగా అయింది .
యాజ్ఞవల్క్యుడు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళి సంధ్యా కర్మలు ముగించుకొని వచ్చు వేళకు ఆలాపినికి రోగము ఉల్బణమైపోయింది . ఆమెకు రోగము అంత ప్రబలముగా నున్ననూ మనసు ప్రసన్నముగా ఉంది . యాజ్ఞవల్క్య దంపతులు మైత్రేయితో పాటు ఉపచారములు చేయుటకు అక్కడే ఉన్నారు . దేవరాత దంపతులను పిలుచుకు వచ్చుటకు బండి వెనుతిరిగింది .
మరుసటి దినము ఉద్ధాలక దంపతుల సన్నిధానములో బ్రాహ్మణ పారాయణమైనది . ఆ వేళకు దేవరాత దంపతులు వచ్చినారు . ఆ దంపతులు యాజ్ఞవల్క్యుడు పారాయణము చేసిన బ్రాహ్మణమునూ ఉపనిషత్తునూ విని సంతోషపడినారు . ఆలాపిని , " సంహిత చివరలో వచ్చిన ’ ఈశావాస్యమిదం సర్వ ’ అనుదానికీ , ఈ బ్రాహ్మణము చివరలో వచ్చిన అశ్వపు వర్ణనకూ సమన్వయము చేస్తే ? " అన్నారు .
ఉద్ధాలకులు ’ గుమ్ముగా కాచిన పాలకు చక్కెరా తేనే కలిపినట్లవుతుంది " అన్నారు .
Janardhana Sharma