22, అక్టోబర్ 2024, మంగళవారం

విద్యావ్యవస్థ

 ఒకే పద్యంలో విద్యావ్యవస్థ :

- మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు.


 సృష్టిలో ప్రతి ప్రకృతి శక్తిని దేవతగా భావించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టత . ఒక్క ప్రకృతి శక్తులనే కాదు మన జీవితంలో అత్యవసరమైన ధనం మన దృష్టిలో వట్టి రూపాయి కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి .

 అలాగే జ్ఞానాన్నిచ్చే విద్య కేవలం చదువు కాదు . సాక్షాత్తూ సరస్వతీ దేవి.అటువంటి 

 సరస్వతిని బమ్మెర పోతన భాగవతంలో విశేషంగా ప్రార్థించాడు.

 ఆ పద్యం భారతీయ విద్యా వ్యవస్థను మొత్తం ప్రతిబింబిస్తుంది.


" 1 ) క్షోణి తలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత , 

2) శ్రోణికి , చంచరీక చయ సుందర వేణికి , రక్షితామర ,

 3 ) శ్రేణికి తోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ ,

4 ) వాణికి , అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ " 


 ఈ పద్యంలో చివరి పాదంలో సరస్వతీదేవి చేతుల్లో జపమాల ( అక్ష దామం ) , చిలుక( శుకము ) , పద్మం( వారిజము ) , పుస్తకం ఉంటాయని వర్ణించాడు.

 మనం ఇప్పుడు చూస్తున్న సరస్వతి చేతుల్లో జపమాల, పుస్తకం ఉండి మరో రెండు చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది.

 పోతన ఈ మూర్తినే వర్ణించి ఉంటే వీణ ఎందుకు వదిలేస్తాడు. పైగా చేతుల్లో లేని పద్మాన్ని , చిలుకను చేతుల్లోనే ఉన్నట్లుగా ' రమ్య పాణికిన్ ' అని ఎందుకు వర్ణిస్తాడు ? 

 అంటే మనం చూస్తున్న సరస్వతీ మూర్తి వేరనీ , పోతన వర్ణించిన మూర్తి వేరని అర్థమవుతుంది గదా ! 

అయితే వీణ లేకుండా అక్షదామ శుక వారిజ పుస్తకాలు చతుర్భుజాలలో ధరించిన ఈ మూర్తి ఎవరు ? 

ఇదే దృష్టితో వేదవిద్య లోనూ , సంస్కృత సాహిత్యంలోనూ నిష్ణాతులైన పెద్దలతో ఆలోచిస్తే పోతన వర్ణించింది శారదా మూర్తి అనీ , ఆవిడ వైదిక విద్యలకు అధిదేవత అనీ , మనం చూస్తున్న సరస్వతీ మూర్తి లౌకిక విద్యలకు అధి దేవత అని వారి అభిప్రాయం చెప్పారు. 

 ఈ వాదానికి శృంగేరి శారదా పీఠం వారు ప్రకటించిన శారదామూర్తిని చూస్తే ఆవిడ చేతుల్లో ఈ నాలుగు ఉండటం వీణ లేకపోవడం కనిపిస్తుంది .

మొత్తం మీద పోతన ప్రార్థించిన' వాణి లలితా దేవి యొక్క జ్ఞాన స్వరూపం గా భావించే శారదా దేవి అని బోధపడుతుంది .

మొత్తంమీద కొండని త్రవ్వి ఎలుకను కాదు 'పలుకు చిలుక' ను పట్ట గలిగాం.

 ఇక - ఇప్పుడు -అసలీ నాలుగు వస్తువులు శారదా దేవి చేతుల్లో ఎందుకు ఉంటాయి ? వాటి పరమార్థం ఏమిటి ? అని ఆలోచిస్తే భారతీయ విద్యా లక్ష్యాలన్నీ బోధపడతాయి .

భారతీయ జీవన విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీ పురుషులు ఎవరైనా ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించడమే జీవిత లక్ష్యం గా భావిస్తారు .

విద్య ద్వారా ఈ చతుర్విధ పురుషార్థాలు సాధించడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు.

విద్య ద్వారా ఈ చతుర్విధ పురుషార్ధాలు సాధించడమే లక్ష్యమని ఆ నాలుగు ప్రతీకలు సూచిస్తున్నాయి.

 అమ్మవారి చేతిల్లో ఉండే పుస్తకం ధర్మానికి ప్రతీక . పుస్తకం ద్వారానే మనకు అన్ని ధర్మాలు తెలుస్తాయి .

 పద్మం అర్థానికి ప్రతీక. పద్మం నుండే నుండే లక్ష్మీదేవి జన్మించింది. పద్మం అనేది సంస్కృతం లో డబ్బులు లెక్క పెట్టే సంఖ్య కూడాను చిలుక కామ పురుషార్ధానికి ప్రతీక. మన్మధుని వాహనం చిలుకే కదా ! 

 జపమాల మోక్షానికి ప్రతీక. జపతపాల ద్వారానే కదాసిద్ధి పొందేది.

 విద్య ద్వారా ఈ నాలుగు పురుషార్థాలు సాధించాలని , అప్పుడే మనిషికి భవ బంధాల నుండి విముక్తి అని తెలియ చేయడం కోసమే విద్యా దేవత తన చేతుల్లో ఆ నాలుగు వస్తువులను ధరించిందని గ్రహించవచ్చు. " సావిద్యా విముక్తయే ' అని కదా ఆర్యోక్తి.

 మనిషి ధర్మంగా జీవించాలి .

మంచి వృత్తులు చేపట్టాలి. ఆ ధర్మం ద్వారా అర్థం సంపాదించాలి.

 సముచితమైన కామనలు (కోరికలు తీర్చుకోవాలి .

 ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి . ఇదే మానవ జీవిత లక్ష్యం అని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తుంది.

 అందుకే పోతన అమ్మవారి స్వరూపాన్ని ఆ విధంగా వర్ణించాడు .

 ఇది తెలుగు పద్యం పరమార్థం. మనవాళ్లు 

 ఈ విషయం ఇంతటితో వదిలేయలేదు .

ఒకటో తరగతి తెలుగు వాచకం మొదటి పుటలోఅమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అదే నాలుగు పదాలతో ధర్మార్థ కామ మోక్షాలనే సూచించారు .

 అమ్మ ధర్మానికి ప్రతీక. పుస్తకం కంటే ముందుగా అమ్మ నుండే మనం అన్ని ధర్మాలు తెలుసుకుంటాము. ఆవు అర్థానికి ప్రతీక . వెనకటి రోజుల్లో ' పంచగవ ధనం ' అని గోవులను క్రయవిక్రయాలలో డబ్బుగా వాడేవారు . 

 ఇల్లు కామ పురుషార్ధానికి ప్రతీక .సమస్త కామనలకు మూలం సంసారం . ఆ సంసారానికి నిలయం ఇల్లు. 

 ఇక ఈశ్వరుడు మొత్తానికి ప్రతీక అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా ! 

ఇప్పుడు లౌకికవాదం పుణ్యమా అని ఈశ్వరుని తీసేసి 'ఈగ'ని పెట్టారు .

అందుకే విద్యార్థుల్లో ఈశ్వరారాధన బుద్ధి పోయి ఈగలు తోలుకుంటూ కూర్చునే బుద్ధి బయల్దేరింది. తెలుగు మాధ్యమంలో ఇంత సార్థకమైన విద్య సాగుతుంటే ఇంగ్లీష్ మీడియంలో దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది పరిస్థితి .

' ఏ ఫర్ ఆపిల్ అనేది మొదటి పదం . అంటే ముందు తిండి గురించి చెబుతున్నామన్న మాట. ' బి ఫర్ ఆర్ బ్యాట్ . అంటే క్రికెట్ ఆట చాలా ముఖ్యం అని చెబుతున్నాం.

 తరువాత' సి ఫర్ క్యాట్ ' , డి ఫర్ డాగ్ ' అని నేర్పుతున్నాం. అంటే పిల్లిలా కపటత్వాన్ని, కుక్కలా బానిసత్వాన్ని నేర్పుతున్నాం. పవిత్రంగా జీవిత లక్ష్యాన్ని చేర్చే పురుషార్ధాలెక్కడ ?  

  సింహాలు పులుల వంటి వీరులు గా తయారవవలసిన విద్యార్థులకి దీన హీన జంతువుల పరిచయంతో విద్యాభ్యాసం ప్రారంభిస్తే భవిష్యద్భారతం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ! ఆ పైన ఏ విద్య నేర్పాలో నిర్ణయించుకోండి .

స్వస్తి .


(పై వ్యాసం సీ ఎస్ ఆర్ శర్మ కళాశాల వజ్రోత్సవ సంచిక నుండి గ్రహీతము )


సేకరణ: ఎం వి ఎస్ శాస్త్రి

కామెంట్‌లు లేవు: