16, మే 2023, మంగళవారం

నిత్యాన్నదాతా

 ||శ్లోll

నిత్యాన్నదాతా నిరతాగ్నిహోత్రీ వేదాంతవిణ్మాస సహస్ర జీవీ॥

పరోపకారీచ పతివ్రతాచ షట్ జీవ లోకే మమ వందనీయాః॥



భావము:-

పేదవారికి నిత్యము అన్నదానము చేయువాఁడును; నిత్యాగ్నిహోత్రియు; వేదాంత వేత్తయు; సహస్ర చంద్ర దర్శనము చేసినవయో వృద్ధుఁడు; పరోపకార పరాయణుఁడు; మహా పతివ్రత; ఈ ఆరుగురూ నాకు వందనీయులు.||{వీరిని చూసినంతనే పాపరాశి దగ్ధమౌను... సదా వందనీయులు}

రుద్రం విశిష్ఠత

 🌹రుద్రం విశిష్ఠత  🌹


శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.


రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.


నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |

నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||


నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.


🌹 నమకం విశిష్టత : 🌹


నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.


🌻 అనువాకం – 1:

తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి,  జబ్బులనుండి కాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం చేస్తుంది.


🌻 అనువాకం – 2 :

ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.


🌻 అనువాకం – 3:

ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.


🌻 అనువాకం – 4:

ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:


🌻 అనువాకం – 5:

ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింప బడడం మరియు మోక్షప్రదానం.


🌻 అనువాకం – 6:

ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.


🌻 అనువాకం – 7:

నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.


🌻 అనువాకం – 8:

ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.


🌻 అనువాకం –9:

ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం,  మంచి సహచారి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.


🌻 అనువాకం – 10:

ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వ వలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.


🌻 అనువాకం – 11:

ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని  తమ సంతాన సౌఖ్యం కోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.


🌹 చమకం విశిష్టత: 🌹


నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని  తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది.


జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని  ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే..

🌹 🌹 🌹 🌹 🌹🌹🌹

🙏.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కరావలంబ స్తోత్రం*

 *కరావలంబ స్తోత్రం*


హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మబంధో 

శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||


దేవాదిదేవ సుత దేవగణాధినాథ

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద 

దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ 

శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

చాపాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే 

శ్రీకుండలీశ ధర తుండ శిఖీంద్రవాహ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||


దేవాదిదేవ రథమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్ 

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||


హారాది రత్న మణియుక్త కిరీటహార

కేయూర కుండలలసత్కవచాభిరామ 

హే వీర తారక జయామర బృందవంద్య

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||


పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః 

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||


శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా

కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్ 

శిక్త్వా తు మామవ కళాధర కాంతికాంత్యా

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

వైశాఖ పురాణం - 20 వ అధ్యాయము

 : _*🚩వైశాఖ పురాణం - 20 వ అధ్యాయము🚩*_


🕉🌷🌹🕉️🌷🌹🕉️🌷🌹🕉️


*పాంచాలరాజు రాజ్యప్రాప్తి*


🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా ! వినుము.   శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.


పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు , గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము , కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.


వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. *"నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి , ఇంద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి ? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా ! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.


రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను ? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా ! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు , బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.


బాలురను , మృగములను , పక్షులను , బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.


నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు ఇద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు , యెండకు , దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.


అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.


నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతఃకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి , ధృష్టకేతువు , ధృష్టద్యుమ్నుడు , విజయుడు , చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.


రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.


*వైశాఖ పురాణంలోని ఇరవై అధ్యాయం సంపూర్ణం*


            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷వైశాఖ పురాణం - 21 వ అధ్యాయము🚩*_


🕉🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷


*పాంచాలరాజు సాయుజ్యము*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.


పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి  నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు , గంధ పుష్పాదులు , పుష్పమాలలు , ధూపములు , అమృతప్రాయములగు నివేదనలు , తన శరీరము , తన ధనము , తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.


నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |

యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1

ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |

అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2

సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |

తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3

తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |

దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4

ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |

భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5

భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |

నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6

తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |

స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7

వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |

తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8

తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |

నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9

ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |

యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10

నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |

తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11

త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |

సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12

నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |

లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13

పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |

కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14

పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |

తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15

సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |

సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16

సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |

యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17

ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |

అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18

అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |

భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19

ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |

సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20

భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |

నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21

ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |

స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22

కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |

దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23

హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |

న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24

త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25

అని స్తుతించెను.


పాంచాలరాజు చేసిన ఈ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా ! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు / శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే.


*1 .  స్వామీ ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.*


*2 . తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా ! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు , రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.*


*3. స్వామీ ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.*


*4. తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.*


*5. స్వామీ ! గర్వము - భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము / పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.*


*6. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.*


*7. ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.*


*8. ధర్మార్థకామమోక్షములను , స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.*


*9. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని , సూర్యుడు , చంద్రుడు , నక్షత్రములు , భూమి , నీరు , ఆకాశము , వాయువు , మాట , మనస్సు మున్నగువానిని సేవింపలేదు.*


*10. నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.*


*11. స్వామీ ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు  లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.*


*12. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.*


*13. స్వామీ ! ఎచటను సుఖనిద్రలేదు , శుభములేదు , సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.*


*14. నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని ఇచ్చుటలేదు.*


*15. స్వామీ ! ప్రభూ ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.*


*16. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.*


*17. ప్రభూ ! ఈ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.*


*18. స్వామీ ! అచ్యుతా ! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.*


*19. కావున రాజ్యము , పుత్రులు మున్నగు వానిని ధనమును , అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.*


*20. జగన్నాధా ! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు , భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.*


*21. ప్రభూ ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందముల యందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.*


*22. నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక ! స్వామీ ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు , నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.*


*23. నీ కథలను వినుటయందే నాకు కామము , కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.*


*24. నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.*


*25. ప్రభూ ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.*


ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘ గంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని , ముక్తిని ఇత్తును. ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు , కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. వైశాఖవ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ , జరా , మృత్యు , వ్యాధి , భయములను , సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.


వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు , సాంఖ్యయోగములకు , యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.


పాంచాలమహారాజా ! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు , పౌత్రులు , బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.


*వైశాఖ పురాణంలోని ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 61*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 61*


సింహళవాసుల్లో ఒకడు నవ్వి "విశేషమే గురుదేవా ! మగధసేనాధిపతుల్లో ముఖ్యులైన బలబద్ర, బాగురాయణులు ఇప్పటికీ మహానందుల వారి భక్తులే... నంద వారసుడు బ్రతికే వున్నాడని తెలిస్తే చాలు, సైనిక పటాలంలో చీలిక తెచ్చి అధికభాగాన్ని చంద్రగుప్తుల వారికి అనుకూలంగా మార్చి వేస్తారు" అని చెప్పాడు సిద్ధార్థకుడు. 


చాణక్యుడు నొసలు చిట్లించి "సరి. సరి. ఇందులో అనుకున్నంత విశేషమేముంది ? నిపుణకా ! నీ దగ్గర సమాచారం ఏమిటి ?" అడిగాడు. 


నిపుణకుడు నమస్కరించి "ఒకప్పుడు పాంచాలాధీశుడు పురుషోత్తముడితో నందులు సంవత్సరానికి రెండు లక్షల సువర్ణములు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలెగ్జాండర్ దండయాత్ర అనంతరం బలహీనపడిన పురుషోత్తముడు తన సైనిక బలగాన్ని వృద్ధి చేసుకోవడానికి నందులు రెండు లక్షల బదులు ఏటేటా అయిదు లక్షల సువర్ణాలు చెల్లించాలని వార్త పంపించాడు" అని చెప్పాడు. 


"నందులు అంగీకరించారా ?" ఆతృతగా ప్రశ్నించాడు చాణుక్యుడు. 


నిపుణకుడు నవ్వి "లేదు. నందసోదరడు, కోశాధికారి అయినా ధర్మనందుడు లోభికదా నందుల మంత్రి ఒకరిని లోబర్చుకుని 'అలెగ్జాండర్ చేతిలో పరాజితుడైన పురుషోత్తముడికి పూర్వపు ఒప్పందాన్ని పాటించి రెండు లక్షలు కూడా ఇవ్వనవసరం లేదనీ, ఇప్పుడు బలహీనుడైన పురుషోత్తముడు మగధను కన్నెత్తి చూడలేడని' చెప్పించాను" అన్నాడు. 


"ఆ మాట నచ్చి, డబ్బు ఆదా అయినందుకు ఆనందించిన నందులు 'నీకు ఒక్కకాసు కూడా ఇవ్వము. నీ చేతనైంది చేసుకో' అని వర్తమానం పంపించి ఉంటారు. అవునా?" అడిగాడు చాణక్యుడు.


నిపుణుడు తల ఊపి "అంతా తమరు వూహించినట్లే జరిగింది" అని చెప్పాడు. 


చాణక్యుడు నవ్వి "భేష్ ! నువ్వురా చాణక్యుడి శిష్యుడివంటే...." అని మెచ్చుకున్నాడు. 


"అయ్యో ! అదేమిటి స్వామీ ! ఇప్పుడే పాంచాల భూపతి మగధపై దండెత్తి వస్తే....?" ఆదుర్ధాగా ప్రశ్నించాడు చంద్రగుప్తుడు. 


చాణక్యుడు నవ్వి "అవును. పాంచాల ప్రభువు నందుపై దండయాత్రకి సర్వం సిద్ధం చేస్తాడు. కానీ .... నిన్ను మగధాధీశుని చెయ్యడానికి సహాయంగా వస్తాడు. నువ్వు చక్రవర్తివయ్యాక ఒకప్పుడు నందులు అతనితో ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు నీ సార్వభౌమత్యాన్ని అంగీకరిస్తూ ఏటేటా కప్పం చెల్లించేలా నీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆ ప్రభువు" అని చెప్పాడు గంభీరంగా. చంద్రగుప్తుని వదనం పూర్ణచంద్రబింబంలా వికసించింది. 


చాణక్యుడు అదోలా మొదటి శిష్యుని చూస్తూ "సిద్ధార్థకా ! నిపుణకుడి తంత్రం విన్నావా... అదిరా చాకచక్యం అంటే...." అని కవ్వించాడు. 


సిద్ధార్థకుడు మొహం మార్చుకొని "నేనూ చూపించానులెండి, నిపుణకుడి పాటి చాకచక్యం.... మహాపద్మనందుడికి ఇచ్చిన మాటకోసం నందులను రాక్షసుడు భరిస్తున్నాడనీ, నిజానికి బ్రాహ్మణద్వేషులైన నందులను అధికారపీఠాన్నించి దించి వెయ్యడానికి అదనుకోసం రాక్షసుడు ఎదురుచూస్తున్నాడని, బ్రాహ్మణ సంతర్పణల పేరిట బోలెడంత ధనాన్ని నందుల చేత ఖర్చు చేయిస్తూ వారిని బ్రాహ్మణ ద్వేషులుగా రాక్షసుడే ప్రచారం చేయిస్తున్నాడనీ... ధర్మశాలలో చాణక్యగురుదేవులకు జరిగిన అవమానం, ఒక పథకం ప్రకారం - నందులను బ్రాహ్మణ ద్వేషులుగా బహిరంగంగా నిరూపించడానికి రాక్షసుడే - జరిపించాడనే అనుమానాన్ని నందుల్లో రేకెత్తించి, నందులకీ రాక్షసునికీ మధ్య విభేదాలకు అంకురార్పణ చేసి మరీ... తమ దర్శనార్థం వచ్చానులెండి" అని చెప్పాడు. 


"శభాష్ ....! ఇదిరా చాకచక్యమంటే... అనుకోకుండా జరిగిన సంఘటనలను సైతం 'అనుకూలంగా' మార్చగలవాడే అసలైన చారుడు. ఈ ఏడుపు ముందే ఏడ్చావు కావేం ?" అన్నాడు చాణక్యుడు మెచ్చుకుంటూ. 


సిద్ధార్థకుడు బింకంగా "ఏదీ, తమరు నన్ను పూర్తిగా ఏడవనిస్తే గదా...." అని నవ్వాడు. 


చాణక్యుడు వాత్సల్యంగా అతని భుజం తట్టి "ఇక అక్కడ జరగాల్సిందంతా 'ఇందుశర్మ' నడిపిస్తాడు. మీరు ప్రచ్ఛన్న వేషాల్లో పాటలీపుత్రంలో సంచరిస్తూ అతడి నాటకానికి అనుకూలంగా మీ పాత్రలు మార్చుకుంటూ కథను రక్తి కట్టించండి" అని చెప్పాడు శిష్యులను వెళ్లిపోవచ్చన్నట్లు సూచిస్తూ. 


"చిత్తం. మీ దర్శన భాగ్యం ఏడాది కాలం తర్వాత ఈనాడు లభించింది. ఈ ఏడాదికాలంలో తమరొక ఇంటి వారయ్యారని విన్నాం. ఆ విశేషాలు మాకూ కాస్త వినిపిస్తే, ఆ సంతోషాన్ని మేమూ...." నసిగాడు నిపుణకుడు. 


(ఇంకా ఉంది)...


 *సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

హనుమజ్జయంతి ప్రత్యేకం - 5/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  5/11 

         (ఈ నెల 14వతేదీ హనుమజ్జయంతి) 

         

V. హనుమ - ఆచార్యుడు 


   "భగవంతుని పొందాలి"  అనే ఆర్తి జీవునిలో కలిగినపుడు, భగవానుడే ఆచార్యుని ఎంచి, జీవుని వద్దకు పంపుతాడు. 

    ఆచార్యుడు వేద సంపన్నుడు, భగవదనుభవము పొందినవాడు కావలెను. 

   "శ్రోత్రియమ్ బ్రహ్మనిష్ఠమ్" అని ఆచార్యుని అర్హతగా చెబుతుంది శ్రుతి. 


అ) శ్రోత్రియుడు (వేద సంపన్నుడు) 

    వేద పండితుడవడానికి సరియైన శిక్షణ - ధారణ - ప్రయోగము అనేవి ప్రధానం. 


    హనుమ మొదటగా రామలక్ష్మణులను కలసి మాటలాడినప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమను గూర్చి ప్రశంసించిన విషయం అతిగొప్పది. 

    హనుమ ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను అధ్యయనము చేసిన పరిపూర్ణుడని, 

    మూడు వేదాలకి సంబంధించి వరుసగా "వినీతః, ధారిణః, విదుషః" అనే మూడు విశేషణాలతో పొగడబడ్డాడు. 


(i) వినీతః 


    ఋగ్వేదమున ప్రతివర్ణానికీ స్వరముంటుంది. గురువు వద్ద ఎంతో శిక్షణ పొందినగానీ దానిని సరిగా చదువలేరు. అందుకని హనుమను "ఋగ్వేద వినీతుడు" అన్నాడు రాముడు. 

   'వినీతుడు' అంటే 'శిక్షితుడు" (Trained). 


(ii) ధారిణః 


    యజుర్వేదంలో ఒక అనువాకంలో వాక్యము మరొక అనువాకంలో కనబడుతూంటుంది. అవి కలియకుండ ధారణ అవుసరం. 

    అందుచే "యజుర్వేద ధారిణః" అన్నాడు. 

   "ధారణ" అంటే జ్ఞాపకశక్తి (Memory). 


(iii) విదుషః 


    సామవేదము గాన ప్రధానము. 

    గానములో మార్పులు చేయు జ్ఞానము "విదుషత్వము". 

    అది కలవాడని హనుమను శ్రీరాముడు "సామవేద విదుషః" అని గుర్తించాడు. 

   "విదుషిత్వము" అంటే సరియైన ప్రయోగము (Proper practical application). 


    కాబట్టి హనుమ త్రయీ అని, మూడుగా నున్న వేదాలకు సంబంధించి, 


* శిక్షణ పొందినవాడు,  

* జ్ఞప్తియందుంచుకొనేవాడు,  

* ప్రయోగించువాడు అని 

      మెచ్చుకోబడి శ్రోత్రియుడయ్యాడు. 


ఆ) బ్రహ్మనిష్ఠుడు (భగవదనుభవము పొందినవాడు) 


    వేదాధ్యయన జ్ఞానముతో అభ్యాసము చేయుచూ, భగవత్తత్త్వము అనుభవించుట బ్రహ్మనిష్ఠ. 


    రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఆసీనులను చేసి, సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళాడు హనుమ. 

    తద్వారా, పరమాత్మతో ప్రత్యక్ష అనుభూతి పొందినవాడై, బ్రహ్మనిష్ఠుడయ్యాడు. 


    పరమాత్మ 

  - వేదజ్ఞానపరాయణుడైన హనుమను గుర్తించి, 

  - తాను హనుమకు పరమాత్మానుభూతి కూడా కలిగించి ఆచార్యుని చేశాడు. 


ఆచార్యుడు - జీవుడు 


   "లంక" అనే దేహంలో, 

   "సీత" అనే జీవుని, 

   "రావణుడు" అనే ఇంద్రియాలు బంధించి యుంచితే, 

    ఆ "సీత" అనే జీవుడు 

        "రాముడు" అనే పరమాత్మను పొందాలని ధ్యానిస్తున్నప్పుడు, 

   "హనుమ" అనే ఆచార్యునితో అక్కడకు, 

  

   "అంగుళీయకము"తోపాటు తన సందేశాన్ని భగవంతుడైన శ్రీరాముడు పంపాడు. 


మనకి మార్గదర్శకం 


    మనం కూడా ఆ సందేశం పొందాలి. 


    సరియైన విషయమై 

  - శిక్షణ(Training), 

  - జ్ఞప్తి(Memory), 

  - జీవితంలో ఆచరణ (Application/Interpretation), అనే మూడిటితో శ్రోత్రియునిగా తయారుచేసి, తద్వారా, 

      సాధనలో అనుభూతితో బ్రహ్మనిష్ఠునిగానూ చేసి, 

      మనలను తావలెనే మార్చి అనుగ్రహిస్తాడు హనుమ. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

స్వామివారి హాస్యచతురత

 స్వామివారి హాస్యచతురత


పరమాచార్య స్వామివారి సల్లాపము, హాస్యచతురత చాలా హుందాగా ఎవరిని బాధపెట్టకుండా ఉంటుంది. మహాస్వామివారు నన్ను చెల్లం (ప్రియమైన), కిత్తువాయ్(నత్తి ఉన్నవాడు), రిక్షా ఓట్టి (రిక్షా లాగేవాడు) అని పిలిచేవారు.


మిరాజ్ నగరానికి దగ్గర్లోని వినాయక దేవాలయంలో మకాం చేస్తున్నాము. తరువాత మేము ఉండబోయే చోటుకు వెళ్లి, అక్కడ ఉండడానికి వసతులని చూసిరమ్మని స్వామివారి ఆజ్ఞ.


వారి ఆదేశానుసారం పని ముగించి, వినాయక దేవాలయం లోపలకు వెళ్ళాను. స్నానం చేసిన తరువాత శ్రీకంఠన్ మామను కలిశాను.


“రాత్రి నుండి స్వామివారు పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. పాలు, పళ్ళు ఏమీ తీసుకోవడం లేదు. స్వామివారిని ఒప్పించడానికి మేము ఎంతగానో వేడుకున్నాము, కాని ఫలితం లేదు. నువ్వు చిన్న పిల్లాడివి. నువ్వు వెళ్లి అడిగితె, బహుశా పరమాచార్య స్వామివారు అంగీకరించవచ్చు” అని నాకు చెప్పారు.


పరమాచార్య స్వామివారికి వందనం చేసి, పనిపై నేను వెళ్ళిన చోట అక్కడి భక్తులు ఇచ్చిన పళ్ళను స్వామివారికి సమర్పించాను. 


“నువ్వు భోజనం చేశావా?”


లేదన్నాను.


“వెళ్లి నీ భోజనం ముగించి తరువాత రా”


శ్రీకంఠన్ మామ నాకు చెప్పిన విషయాన్ని ప్రస్తావించడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. “పెరియవా భిక్ష స్వీకరించిన తరువాత నేను భోజనం చేస్తాను”.


మహాస్వామివారు తినమని ఒత్తిడి చేసిన తరువాత అక్కడి నుండి వెళ్తూ, “నేను తరువాత భోజనం చేస్తాను” అని అన్నాను. అయిదు నిముషాల తరువాత స్వామివారి నుండి పిలుపు. నేను స్వామి వారి వద్దకు వెళ్లాను.


స్వామి వారు ఎదురుగా ఉన్న పళ్ళ నుండి రకానికి ఒక పండు తీయమని చెప్పారు. తీసి స్వామివారికి ఇచ్చాను. ప్రతి పండుని స్వామివారే కోసి సగం పండును నాకు ఇచ్చి రుచి ఎలా ఉందో చెప్పమన్నారు. వగరుగా లేని పళ్ళ సగాన్ని స్వామివారు స్వీకరిస్తారు అనుకుని వాటిని తీసుకుని తిన్నాను.

ప్రతి పండు యొక్క రుచిని అడిగారు స్వామివారు. నేను చెప్పాను.


“ఇప్పుడు నీ ఆకలి తీరిందా?” అన్నారు స్వామివారు.


ఎంతటి సహజమైన మాటలు. ‘చూడు నిన్ను ఎలా మోసగించానో’ అన్న అతిశయం లేకుండా!! నాకు ఏడుపు వచ్చింది. మా అమ్మే గుర్తుకు వచ్చింది. నేను ఆకలికి తాళలేను అని వేళ కాని వెల నాకు అన్నం - రసం వండిపెట్టేది. గొంతు గాద్గదికమైంది. శ్రీకంఠన్ మామ బాధను స్వామివారికి తెలిపాను. 

“నిన్న ఆదివారం. కాని నేను పాలు పళ్ళు తీసుకున్నాను. దానికి ప్రాయశ్చిత్తంగానే, ఈరోజు భిక్ష లేకుండా ఉన్నాను. ఈరోజు ప్రదోషం కదా, ప్రదోష పూజ ముగించిన తరువాత నేను భిక్ష చేస్తాను”


నాకు ప్రాముఖ్యతను ఇచ్చి స్వామివారు సమాధానం ఇచ్చినందుకు నేను గర్వ పడాలా? లేక చిన్న దోషం కోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నందుకు నేను కరిగిపోవాలా? నాకు అర్థం కావడం లేదు.


ఆదివారం రాత్రి ఉపవాసం పాటించాలన్నది శాస్త్రవిధి. అందుకే శ్రీమఠంలో ఆదివారం సూర్యాస్థమయానికి ముందే ఏమైనా స్వీకరించడం పరిపాటి. ఆదివారం రాత్రి వంటింటిలో పని చెయ్యడం ఉండదు. అందుకనే స్వామివారు నన్ను ఇలా ఆదేశించారు.


కులకర్ణి అనే భక్తుడు స్వామివారు ముందు ఒక చేతి గడియారాన్ని ఉంచాడు. దాన్ని ఒకసారి చూసి, “ఇది ఎందుకు?” అని అడిగారు స్వామివారు.


“మేకు కైంకర్య చేసే వారికి ఎవరికైనా ఇస్తారని తీసుకుని వచ్చాను. స్వామివారు దీంతో ఇష్టమైనది చెయ్యవచ్చు”


స్వామివారు ఆ వాచీని చేతిలో తీసుకుని దాన్ని అటు ఇటు తిప్పి చూశారు. తరువాత నన్ను పిలిచి దాన్ని నా చేతికి కట్టుకోమన్నారు. “ఇది ఎప్పుడూ నీ చేతికి ఉండాలి. నేను ఎప్పుడు సమయం అడిగినా, నువ్వు చెప్పాలి” అని ఆదేశించారు.

ఆ చేతివాచీ ఇప్పటికీ నావద్ద ఉంది. అదొక గొప్ప ఐశ్వర్యంగా దాన్ని కపాడుకుంటున్నాను.


“ఒక వంద లేదా వందాయాభై బంగారు కాసులను తయారుచేసి, వెంటనే ఒక సేసాలో నావద్దకు తీసుకునిరా” అని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. ఒక్క నిముషం పాటు నాకు ఏమీ అర్థం కాలేదు. తరువాత, స్వామివారు చెప్పిన విషయం అర్థమై, అక్కడి నుండి కదిలి బయటకు వచ్చాను.


స్వామివారి దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. స్వామివారు నాతో చెప్పిన మాటలు ఖచ్చితంగా వీరందరూ వినే ఉంటారు. కొద్దిమందికి నమ్మకంగా ఉంది, “వంద, వందాయాభై బంగారు కాసులు అంటే, నాకు కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు కాసులు దొరుకుతాయి. వాటిని నేను పూజలో ఉంచుకుంటాను . . .”


అందరూ నన్ను చుట్టుముట్టారు. “నాకోసం రెండు మూడు కాసులు” అని నన్ను అభ్యర్థించారు. “ఆహా!” అని అక్కడినుండి వెళ్ళిపోయాను.


పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వేదపండితులు, శాస్త్రాధ్యయనం చేసినవారు వస్తుంటారు. వారిని తగిన విధంగా గౌరవించదలచి వారిని తగు రీతిన సన్మానిస్తుంటారు.


అక్కడి నుండి నేను వేగంగా వెళ్ళిపోతుండగా మైలాపూరుకు చెందిన ఒక మహా పండితుడు నన్ను మర్యాదగా పిలిచి, “నువ్వు నాకోసం ఒక పడి పన్నెండు బంగారు కాసులు ఇవ్వాలి” అని చెప్పాడు. “సరే”


అసలు పరమాచార్య స్వామివారు చెప్పింది కేరళలో విరివిగా లభించే పొడవైన అరటిపళ్ళను గుండ్రంగా తరిగి వేయించి తీసుకుని రమ్మని. ఒక గంట తరువాత వాటిని సిద్ధం చేసి, మైలాపూర్ పండితుడు నన్ను అడిగిన విషయం స్వామివారికి చెప్పగా, “అతణ్ణి పిలువు” అన్నారు స్వామివారు. ఆ పండితుడు లోపలకు వచ్చారు.


“రెండు చేతులూ చాపు” ఆ పండితుడు లోపల చాలా సంతోషపడుతూ అత్యంత వినయంగా చేతులు చాచాడు. పరమాచార్య స్వామివారు చేతినిండుగా వాటిని తీసుకుని అతని దోసిలిలోకి వేశారు. ఆ పండితునికి ఏమీ అర్థం కాలేదు. కాని పరమాచార్య స్వామివారిని ఎలా అడగడం? ఏమని అడగాలి?


వాటిని తీసుకుని బయటకు వస్తూ, “నాకు పెరియవా ఎందుకు చిప్స్ ఇచ్చారు?” అని పండితుడు నన్ను అడిగాడు.


“మీరు అడిగినదే కదా!”


“నేనా? నేనేదుకు వారిని చిప్స్ అడగాలి? ఎప్పుడు అడిగాను?”


“గంట క్రితం మీరు నన్ను అడిగారు; నేను అదే స్వామివారికి తెలిపాను”


“కాని నా చెవులకు బంగారు కాసులు అన్నట్టుగా వినబడిందే”


“అది ఇదే. పరమాచార్య స్వామివారు అర్దోక్తిగా అన్నది ఇదే”


ఆ పండితునికి ఎంతో నిరాశ. “పెరియవా ఇచ్చిన ప్రసాదం” అని తమాయించుకున్నాడు.


--- ఇందువాసన్, వలాజపెట్టై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఆశాపాశానికి బద్ధుడవుతున్నాడు.*

 *శ్లో||అంగం గళితం ఫలితం ముండం౹*

*దశన విహీనం జాతం తుండం ౹*

*వృద్ధో యాతి గృహీత్వా దండం  ౹*

*త దపి న ముంచ త్యాశా పిండమ్ ౹౹* 

                             

*భా|| మానవుడు తన జీవితం క్షణికమని , సిరిసంపదలు చంచలములని తెలిసికూడా ఆశాపాశానికి బద్ధుడవుతున్నాడు.*

*అవయవాలు చిక్కి శల్యమై శిథిలమై పోతున్నాయి.  తల పెరుగు బుట్ట అవుతున్నది, పళ్ళు క్రమ క్రమంగా ఊడి పోతున్నాయి, నోరు పట్టుతప్పి తినలేని పరిస్థితిలో ఉన్నది.  ముసలితనం మీదపడి మూడవ కాలులా  కఱ్ఱ చేతిని అలంకరించింది.*


*అయినా మనిషికి  "ఆశ" చావడం లేదు. భార్యాబిడ్డలపై మమకారం తగ్గడం లేదు. ధన కనక రాసులపై మోజు వీడడం లేదు. ప్లాట్లు, ఫ్లాట్లు ఇక  చాలు అనే తృప్తి కలగడం లేదు.  ఇంకా ఏదో సాధించాలనే తపన ఎక్కువవుతున్నది. అదేపనిగా ఆశాప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు.*


*మోక్షసాధనకై  "రామ" , "కృష్ణ" అనే భగవన్నామాన్ని మనసారా ఒక్క నిమిషంపాటు  గానం చేసే తీరిక , కోరిక , ఓపిక  మనిషికి కనబడడం లేదు.*


*ఆశ అంత బలీయమైనది.  సమర్థవంతమైనది. మేధాసంపన్నులను కూడా కాలు జారి బోర్లా పడవేయగల మహత్తర శక్తి "ఆశ" కున్నది... తస్మాత్ జాగ్రత్త సుమా! .‌🙏🏻*


 *🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*